S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజధాని

అప్పుడెప్పుడో ఒక పుస్తకం గురించి సమీక్ష రాయవలసి వచ్చింది. రాశాను. వరుసగా చాలా పుస్తకాలకే సమీక్షలు రాశాను. ఇప్పుడు గుర్తు వచ్చిన ఈ పుస్తకం మరీ బాగుందని బహుశా మా అబ్బాయికి ఇచ్చినట్టున్నాను. అది అమెరికాలో ఉంటే, నేను ఇంట్లో వెతికితే దొరకదు. ఇంట్లో పోయిన సూదిని ఆవిడెవరో బజారులో లైటు కింద వెతికిందట! అదేమిటని అడిగితే, ఇంట్లో మరి లైటు లేదు గదా అన్నదట! ఇంతకూ ఆ పుస్తకం ఒక భారతీయ పాత్రికేయుడు పాకిస్తాన్ వెళ్లి అక్కడెదురయిన రకరకాల అనుభవాలను వర్ణించింది. అందులో తీపికన్నా చేదే ఎక్కువ కనిపించిందని నా అనుమానం. అయినా, చెప్పిన తీరు, అక్కడి పరిస్థితులు చాలా బాగనిపించాయి. తప్పకుండా ఆ మాటే రాసి ఉంటాను. ఇప్పుడిక మరో పుస్తకం ముందుకు వచ్చింది. దాని పేరు ‘దిల్లీ బై హార్ట్’. రచయిత రజా రూమీ (చాలారోజుల తరువాత చాపచుట్ట గురించి చెప్పుకునే సందర్భం వచ్చింది. పేరులోని మొదటి మాటలో జా మీద చాప చుట్ట ఉండాలి. అంటే ఆ అక్షరాన్ని ఇంగ్లీషు ‘జెడ్’ ధ్వనితో పలకాలని అర్థం.) రజా నిజానికి రచయిత కాదు. అతను మొట్టమొదటి మాటతోనే రచయిత కావాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది అని తన మనసును బయటపెడతాడు. ఈ పుస్తకం అనుకుంటే వచ్చింది కాదంటాడు. పుస్తకం గురించి పథకం వేసిందీ లేదంటాడు. రచయిత కావడానికి చేసిన మొదటి ప్రయత్నం ఇది అంటాడు.
నన్ను ఈ పుస్తకం గురించి సమీక్ష రాయమని ఎవరూ అడగలేదు. సమీక్ష రాయాలన్న ఉద్దేశం నాకు అసలే లేదు. నిజంగా ఈ వ్యాసం రాసే సమయానికి నేను ఆ పుస్తకం చదవనే లేదు. ముందు మాట మాత్రమే చదివాను. ఎందుకో నాకు రజాలో నేనున్నట్టు అనిపించింది. నేను రచయితను అవునో కాదో నాకు తెలియదు. ఇప్పటివరకూ ఒక పొడుగాటి రచనను చేసింది లేదు. నేను సైన్స్ రాశాను. అదంతా ఇంచుమించు అనువాదమని నాకు ఒక గట్టి నమ్మకం. అది నాకే కాదు, పెద్దలకు చాలామందికి ఉన్నట్టుంది. అందుకే సైన్స్ రచయితలను రచయితలుగా గుర్తించరు. ఈ రకంగా నేను చాలానే చేశాను. అయినా సరే రచయితను కాదు. రజా ముందు మాట చదివిన తరువాత నేను మాత్రం ఒక సుదీర్ఘ రచన ఎందుకు చేయకూడదన్న ఆలోచన బలంగా పుట్టింది. రజా పుస్తకం రాశాడు. ప్రచురణకర్త అంగీకారం తెలిపింది. ఆమె అమ్మాయి అన్న అర్థం వచ్చే వాక్యం రజా మొదటి పేరాలోనే రాస్తాడు. పుస్తకం వేస్తానని ఆమె అనే వరకు తన పుస్తకం ఎలాగుంది అన్న ప్రశ్న అతని మెదడులో నిలబడి ఉంది. నిజానికి అది బాగుందన్న భావన లేదని కూడా అక్కడ బయటపడుతుంది. నేను కథలు, నవలలు రాయనని ఒకానొక సందర్భంలో ఎందుకో నిర్ణయించుకున్నాను.
నాకు కథ రాయడం చేతవుతుందని నచ్చజెప్పుకోవడానికి ఒకటి రెండు కథలు రాశాను. మాట వరసకు అన్నానుగానీ కొంచెం ఎక్కువే రాశాను. అవి ఒకటి రెండు పత్రికల్లో అచ్చయినయి కూడా. కొంతమంది మెచ్చుకున్నారు కూడా. ప్రముఖ విమర్శకులు విహారిగారు నా కొన్ని కథలను చదివారు. వరుసగా తెలుగు కథకులను గురించి ఆయన వెలువరించిన మూడవ పుస్తకంలో నా గురించి కూడా చిరు వ్యాసం ఒకటి ఉంది. అంటే కనీసం చరిత్రలో నేను కథా రచయితగా నిలబడిపోయినట్టే లెక్క.
ఇక రాజధానికి తిరిగి వస్తే, ఈ రజా అన్న పాకిస్తానీ అబ్బాయి తాను కూడా సకాయంగా రాజధాని నగరం దిల్లీకి వచ్చాడు. అక్కడ తనకు కలిగిన అనుభవాలను గురించి పుస్తకంగా రాశాడు. ‘రాజధాని నగరంలో వీధివీధి నీదే నాదే’ అంటూ కమలహాసన్‌గారు అదేదో సినిమాలో పాట పాడటం గుర్తుంది. అక్కడ అన్ని వీధులూ మనవే. కానీ, అన్నీ భయపెడతాయి. అది నా అనుభవం. రజా తన ఉద్యోగరీత్యా దిల్లీకి వచ్చాడు. వచ్చేనాటికి అతనికి ఆ నగరం గురించి కొన్ని విచిత్రమయిన అవగాహనలు ఉన్నాయి. అందుకు కారణాలు ఉన్నాయి. భారతదేశం 1947లో రెండుగా విడిపోయింది. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. తనకు పాఠ్యపుస్తకాలలో అందిన జాతీయతా భావం కారణంగా భారతదేశాన్ని గురించిన అవగాహనలు చిత్రంగా ఉన్నాయంటాడు ఆ యువకుడు. చిత్రంకన్నా, మరింత బలమయిన మాటనే అతను అక్కడ వాడాడు. తాను పెరిగిన వాతావరణం దిల్లీ పట్ల ఏవగింపు కలిగించేది అని అతను బాహాటంగా చెపుతాడు. పైగా, భారతదేశం కలుగజేసుకుని పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే మరొక దేశానికి రూపం పోయడం గురించి కూడా అతను సూచనప్రాయంగా చెపుతాడు. పాకిస్తాన్‌ను ఖండాలు చేశారు అనే అర్థం వచ్చే మాట వాడతాడు. డిస్ మెంబర్డ్ అంటే శరీరంలోని ఓ చేతినో, కాలినో నరికేసిన దృశ్యం నా కళ్ల ముందు మెదులుతుంది.
అయినాసరే, తనకు మరెక్కడో తారసపడిన భారతీయ మిత్రుల కారణంగా ఈ దేశం గురించిన తన భావచిత్రం కొంత మానవతను సంపాదించుకున్నదని అతను చెప్పేస్తాడు. నాకిదంతా పుస్తకం చదవకుండానే ఎందుకో తీవ్రంగా నచ్చింది. రచయితలోని సూటిదనం సూదిలాగ నన్ను గుచ్చుకున్నది.
నేను కూడా ఉద్యోగరీత్యా కొంతకాలం దిల్లీలో గడపవలసి వచ్చింది. ఆ కొంతకాలంలోనే అక్కడ నాకు ఒక దీర్ఘ రచన చేయడానికి సరిపడేంత అనుభవం ఎదురయింది. ఈ అనుభవం అన్నది ఒక అనుభవం కాదు, మంచి, చెడు కలగలిసిన బోలెడన్ని అనుభవాల సమాహారం. బజారులో నా ముఖంలోకి పామును చూపెట్టి డబ్బులు గుంజుకున్న కుర్రవాడు గుర్తున్నాడు. తాను ఆఫీసుకు రాకున్నా, నా కోసం లంచ్ పంపించిన సూర్యప్రకాశ్ కూడా గుర్తున్నాడు. నేను మొట్టమొదటే చెప్పాను. దిల్లీ భయపెడుతుందని. అక్కడ ఎవరికీ ఎవరూ పట్టరు. అందరూ తమ పద్ధతిలో వెళ్లిపోతూంటారు. బొంబాయిలో కూడా ఇదే పద్ధతి ఉంటుందని అంటారు కానీ, అక్కడ తీరు వేరని నా అనుభవం చెపుతుంది. బొంబాయి మొత్తం వ్యాపారధోరణి. దిల్లీలో వ్యాపార ధోరణి లేదనడానికి లేదుగానీ, ఎందుకో అక్కడ ప్రశాంతత కనిపించదు. స్నేహభావం కొరవడినట్టు అనిపిస్తుంది. దిల్లీ గురించి రాయాలని అనుకున్నాను.
ఒకప్పుడు ఏదో పత్రికలో రాజధాని లేఖ అని శీర్షిక వచ్చేది. పేరున్న పాత్రికేయులు వెంకటనారాయణ గారు ఆ శీర్షికను నడిపించారని నా అనుమానం. దిల్లీ బతుకులను గురించి అందులో ఏమయినా చదివానో లేదో గుర్తులేదు. కానీ, అదే పద్ధతిలో రాయాలని నాకు అనిపించేది. ఆలోచనతో ఆగిపోయినట్టున్నాను. ఆ ప్రయత్నం చేయలేదు.
రజా రూమీ పని కోసమే దిల్లీకి వచ్చాడు. రకరకాల వారితో మాట్లాడవలసిన అవసరం కూడా అతనికి ఏర్పడింది! నగరం పట్ల నాకు కలిగినట్టే అతనికి కూడా ఒక విచిత్రమయిన భావం ఏర్పడింది. చెపితే అందరూ ఆలోచనలో పడతారేమో! దేశ రాజధాని నగరంలో పర్యాటకులు చూడడానికి ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ లేవు. గుడులు, గోపురాలు అంతకన్నా లేవు. ఉన్న ఒక్క బిర్లామందిర్ ప్రాచీన దేవాలయం కాదు. ప్రయత్నించి అందరూ లోటస్ టెంపుల్ చూచి వస్తారు. అది గుడికానే కాదు. ఇంకొంచెం గమనించిన వారికి దిల్లీ నగరం నిండా సమాధులు ఉన్నాయన్న సంగతి సులభంగానే అర్థమవుతుంది. హజ్రత్ నిజాముద్దీన్ అన్నది మన దృష్టిలో హైదరాబాద్‌లో నాంపల్లిలాగ అక్కడి రెండవ రైల్వేస్టేషన్ మాత్రమే! కానీ, ఆస్థిపరులకు నిజాముద్దీన్ ఔలియా సమాధి మహత్తరమైన క్షేత్రం. అసలు దిల్లీ నగరానికే రెండవ మక్కా అని పేరుందంటే మీరంతా ముక్కున వేలు వేసుకుంటారేమో! కనుకనే రజా రమీకి ఆ ఊరు మరీ ఆకర్షణీయంగా కనిపించింది. అతనికి రచన చేయడానికి అక్కడ బలమయిన ప్రేరణ దొరికింది.
నాకు రచన చేయడానికి గుడీ, గోపురం అవసరం లేదు. మనుషులుంటే చాలు. సిటీ బస్సులో నా బ్యాగ్‌లోని పర్సు కొట్టేసిన అమ్మాయితో నా నవల మొదలుపెడతాను. నేను ఆ అందగత్తె చేతిని బలంగా పట్టుకుని ఇస్తావా ఛస్తావా అని భయపెట్టాను. ఆమె పరుసు కింద పడేసింది. ఆ పని నాకంట పడకుండా చేసింది. ఆమెకు తోడుగా వచ్చిన మరో దొంగ అమ్మాయి ఇదుగో నీ పర్సు పడి ఉంటే మమ్మల్ని అంటావేమిటి? అంటూ తప్పించుకు పారిపోయింది. ఇది నా దీర్ఘ రచన ప్రారంభానికి తప్పకుండా మంచి ఎత్తుగడ అవుతుందని నా నమ్మకం.
గడిచిన కొద్ది సంవత్సరాలలో దిల్లీ బాగా మారిందంటాడు రజా. మనుషులు, స్థలాలూ మారాయంటాడు. తన రచన ఒక అయిదారు సంవత్సరాల క్రిందటి పరిస్థితి మీద ఆధారపడింది అంటాడు. నేను నిజానికి దిల్లీలో గడిపి పదిహేను సంవత్సరాలు దాటినట్టుంది. అంత మాత్రాన నగరం రచనకు పనికిరాకుండా పోలేదు. అమాయకత్వం కాకపోతే, మరీ సమకాలీన పరిస్థితులను రాయాలని ఎవరన్నారు గనుక? ఈ రజాకు రూమీ అన్నది రెండవ పేరు. నాకు వౌలానా జలాలుద్దీన్ రూమీ అంటే వల్లమాలిన గౌరవం. ఆయన పేరు పెట్టుకున్న రజా రూమీ నా చేత ఏం చేయిస్తాడో చూడాలి.

కె.బి. గోపాలం