S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘గమ్యం’ చేరాలంటే...

మీరు ఏమి సాధించ దలచుకున్నారో ముందుగా మీరు ఒక ఊహా చిత్రాన్ని రూపొందించుకోవాలి. చాలామంది విజయం సాధించడం అంటే ఇతరులు ఏమి సాధించారో అది సాధించాలనుకుంటారు. లేదా ఇతరులు ఏది సాధించలేకపోయారో దానిని సాధించాలనుకుంటారు. అసలు తమకు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో చాలామందికి స్పష్టమైన అభిప్రాయం ఉండదు.
ముందుగా మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. ఆ తరువాత దాని సాధన కోసం ప్రణాళికలు రూపొందించుకో గల్గుతారు. మీ నిర్ణయాలు మీ జీవన విధానాన్ని అదుపుచేస్తూ లక్ష్యం వైపు కేంద్రీకరింపజేస్తాయి.
తమకు గల బలాలు, బలహీనతలు తమకు తాముగా గుర్తించుకోలేరు చాలామంది. చిన్నతనంలో తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో విధించే ఆంక్షల వలన అనేక మంది ఆ చట్రం నుండి బయటపడలేక తమ ఆలోచనలను వికసింప జేసుకోలేరు.
తెలుసుకోవాలనుకునే వారికి బోలెడంత ప్రతిభ గలవారు, వివేకం గురించి బోధించగలవారు అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే, చివరకు శత్రువులు కూడా మీ ప్రతిభను మెరుగుపరచుకుంటే మీకు సహాయకారిగా ఉంటారు.
ఇతరులను గౌరవిస్తూ వారి సలహాలను స్వీకరిస్తూ వారిని అభినందించగల ధోరణి అలవరుచుకుంటే మీ ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది.
వినడం అలవరచుకోవాలి
మీరు అడగకపోయినా కొంతమంది మీకు సలహా ఇవ్వడానికి తయారవుతూ ఉంటారు. మీరు చేసే పని, మీ గురించి సలహాలు గుప్పిస్తూ ఉంటారు. ఆ సలహాలు ఒక్కొక్కప్పుడు మీరు అడిగి చెప్పించుకునే సలహాలకన్నా విలువైనవిగా ఉంటాయి. అందుకే అనుకూల దృక్పథంతో ఉండి మరిన్ని మార్గదర్శక విధానాలు వారి వద్ద పొందాలి. ఒక్కొక్కప్పుడు ఈ సలహాలు మనసును బాధపెట్టేవిగా ఉంటాయి. విలువైనవిగా ఉండవు పైగా ఇరుకులో పడేసేవిగా ఉంటాయి.
ఇటువంటి వ్యతిరేక సలహాలు విని కృంగిపోవడం, నిరుత్సాహం చెందడం జరుగుతుంది. అయితే వీటిని జాగ్రత్తగా మదింపు చేసుకుని అనుకూలంగా మలచుకో గల్గితే మనసు లక్ష్యం మరువదు.
పలువురు మీ గురించి ఒకే రకమైన వ్యతిరేక ధోరణితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీ గురించి మీరు ఆలోచించుకుని పయనిస్తున్న మార్గంపై దృష్టిని నిలిపి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలి.
సంపద
ఒకసారి వచ్చిన ఐడియా వెంటనే రికార్డు చేసుకోవాలి. దానిని నమోదు చేసుకోకపోతే జీవితంలో మళ్లీ అదే రూపంలో ఆ ఐడియా రాదు. ఒకటి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సమర్థులయిన నాయకులందరూ పుస్తక పాఠకులే. కొత్త విషయాలు నేర్చుకోవడం వలన మనిషికి విశే్లషణా సామర్థ్యం పెరుగుతుంది.
ఒకప్పుడు మనిషి సంపద అతని వద్ద గల బంగారు నిల్వలను బట్టి అంచనా వేసేవారు. కాని ఇప్పుడు మనిషికున్న విజ్ఞానాన్నిబట్టి అతడిని సంపన్నుడిగా గుర్తిస్తున్నారు.
మనిషికిగల సాంకేతిక నిపుణత కన్నా అతని సంభాషణా చాతుర్యం, రచనా శక్తి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. మనుషుల మధ్య సరైన భావ ప్రసార సౌకర్యం లేలక వ్యవస్థ అవస్థలలో చిక్కుకుంటూ ఉంటుంది.
విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినరు. రాజకీయ నాయకులు పన్నుకట్టేవారి మాటలు వినరు. సరఫరా చేసేవారు వాడకందారుల మాటలు వినరు. ఫలితంగా ఉద్యోగులు - యాజమాన్యాల నడుమ సరియైన అవగాహన ఉండదు. ఇలా మార్కెటింగ్, ఎకౌంటింగ్ నడుమ, అమ్మకాలు - సేవలు మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది.
భావ ప్రసార నైపుణ్యాలు, అంటే సంభాషించడం, భావాలను రాతలో అందించడం వంటివి అనేక విషయాలపై స్పష్టతను ఏర్పరుస్తాయి.
ఒక్కొక్కప్పుడు విజయానికి పరాజయానికి తేడా చేసే పని కచ్చితంగా సరిగా చేయడానికి, సరిగా చేయడానికి మధ్యగల తేడాగానే ఉంటుంది.
చేసే పని నాణ్యంగా ఉంటేనే విజేతలవుతారు. పనిలో తప్పులు చేయడం, దృష్టి పని మీద నిలపక పోవడం వలన పని నాణ్యత దెబ్బతిని అపజయం పాలవుతారు. విజయ సాధనలో ‘రిస్కు’ ఒక ముఖ్యమైన అంశం. ‘రిస్క్’ తీసుకోవడానికి వెనుకాడేవారు పరాజితులుగా మిగిలిపోతారు. పరాజితులకు - విజేతలకు మధ్య ‘రిస్క్’ వంతెన ఉంటుంది. వంతెన దాటితే విజేతలవుతారు.
జవాబుదారీగా ఉండాలి
మనం తీసుకునే నిర్ణయాలకు, పనులకు జవాబుదారీగా ఉండాలి. ఎప్పుడు రాజీపడాలి ఎప్పుడు పోరాడాలి మనిషికి తెలిసి ఉండాలి. ప్రపంచం మిమ్మల్ని నిజాయితీపరునిగా, బాధ్యతగల వ్యక్తిగా గుర్తించేటట్లు ప్రవర్తించాలి. నైతిక విలువలు పాటించినపుడే మీ ఆత్మవిశ్వాసం మీకు ఆయుధంగా పనిచేసి ముందుకు అడుగు వేయగల్గుతారు.
మీరు ఇష్టపడే పనిని ఎన్నుకుని చేస్తే ఏ రోజునా మీరు పని చేస్తున్నందుకు అలసిపోరు. పని ఇష్టంతో నిమిత్తం లేకుండా చేయాల్సినపుడు, ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు తోటి ఉద్యోగులతో సన్నిహితంగా ఉండి ఆటవిడుపుగా కొంత సమయం వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడం అలవరచుకోవాలి.
సృజనాత్మక శక్తి.. మేథాశక్తి, సృజనాత్మక శక్తి ఒకదానికొకటి భిన్నమైనవి. మన బుద్ధి కుశలతలో ఎంత శాతం మనకు అందుబాటులో ఉందో మనకు తెలియదు. పరిసరాల అంశాలు ఒక్కొక్కప్పుడు ప్రేరేపించి అంతర్గతంగా మనలో ఉండే ప్రతిభను బహిర్గతం చేస్తాయి. ఆవేశం ఇందులో ముఖ్య భూమికగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు సాంఘిక సమస్యలు కూడా మనిషిలోని సృజనాత్మకతను వెలికితీయడానికి తోడ్పడతాయి.

-సి.వి.సర్వేశ్వరశర్మ