S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తంబురా శ్రుతితోనే నాదానుభూతి (అమృతవర్షిణి)

రామచంద్రుని గుణగణాలు, మహిమలు వర్ణించటం, తాను జీవితంలో పడిన కష్టాల్ని రాముడికి నివేదించడం, వీలు చిక్కినప్పుడల్లా తనని తాను నిందించుకుంటూ మనసుకి హెచ్చరికలు చేస్తూ మనస్ఫూర్తిగా పాడుకోవటం త్యాగరాజు దినచర్య. మనసు ఆవేదనతో నిండినప్పుడూ... పాటే, ఆనందంతో నిండినప్పుడూ... పాటే. అలా ఆయన గానం చేస్తున్నప్పుడు సాక్షిగా వున్నది ఒక్క తంబురాయే.
ఆ శ్రుతి మాధుర్యంలో తనను తాను మరచిపోయి ఆనందలోకాల్లో విహరించే మనసుకు లౌకిక ప్రపంచంతో సంబంధం ఉండే అవకాశమే లేదు.
ఆయన హృదయాన్నించి వెలువడిన క్షోభ, బహిర్గతమవగానే దానికి అత్యంత సన్నిహిత ప్రతినిధులైన పద స్వరగతులు సరిగ్గా ఆయన అందుబాటులోకి వచ్చి చక్కగా అమరి ఆయన స్వంతమై, ఇతరుల హృదయాల్లోకి సూటిగా ప్రవేశించే సామర్థ్యం కలిగి ఆయన చెప్పుచేతల్లో మెలిగాయనేది వారి కీర్తనల్లో కనిపిస్తుంది.
ప్రక్క వాద్యాలు లేవు. మైకులు లేవు. శహభాష్ అనే శ్రోతలు అసలు లేరు. ఆ నాద సముద్రంలో మునకలు వేసే గురువుగారి గానానికి ముగ్ధులైన శిష్యులూ, వీరిద్దరినీ అనుసంధానించిన ‘తంబురా’. ఆ దృశ్యాన్ని ఊహించి చూడండి. శుద్ధమైన సుస్వరంతో, రాముడికి త్యాగరాజు చేసిన స్వరార్చన అది.
ఈ తాదాత్మ్య స్థితి విద్వాంసులకు రావాలి. అప్పుడే అది నిజమైన సంగీతం. నాలుగు తీగెలతో, స్వయంభూ ధ్వనులతో సుస్వరంతో నిండిన తంబురా శ్రుతి ఎక్కడ? స్విచ్ వేస్తే మ్రోగే ఎలక్ట్రానిక్ డబ్బా నాదం ఎక్కడ? తేడా లేదూ? త్యాగయ్యనూ, గోవింద మరార్‌నూ కలిపింది ఈ తంబురా నాదమే అంటే ఆశ్చర్యం లేదు.
ఎక్కడి వాడు ఈ గోవింద మరార్? త్యాగరాజ విరచితమైన పంచరత్న కీర్తనలకు బీజం వేసినదీ గోవిందమరార్ - ఈయన ఎందుకు అంత చరిత్ర ప్రసిద్ధుడయ్యాడు? విష్ణు ధర్మోత్తర పురాణంలో ఓ కథ ఉంది. ఒక మహారాజు, ఓ యోగితో మాట్లాడుతూ విగ్రహాలు ఎలా తయారుచేయాలి? అని అడిగాడు. అప్పుడు యోగి చెప్పాడు. ‘చిత్ర’లేఖనం తెలియకపోతే విగ్రహాలు తయారుచేయగల సామర్థ్యం తెలియదు.
రాజు: అయితే నాకు చిత్రలేఖనం నేర్పండి.
యోగి: చిత్రలేఖనం తెలియాలంటే నృత్యం గురించి తెలియాలి.
రాజు: అయితే ఆ నృత్య విద్య చెప్పండి.
యోగి: ఈ (నృత్యం) నాట్యం తెలియాలంటే సంగీత వాద్యాలు వాయించటంలో జ్ఞానం తెలియాలి.
రాజు: అయితే వాద్యాలు ఎలా వాయించాలో నేర్పండి.
యోగి: వాద్య సంగీత జ్ఞానం రావాలంటే గాత్ర ధర్మం తెలియాలి.
- దీన్నిబట్టి గాత్ర సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆలోచించండి. ‘ఐదు ఘన రాగాలలో ఆణిముత్యాల్లాంటి పంచరత్న కీర్తనలను సంగీత లోకానికి అందించిన మహనీయుడు త్యాగరాజు. వాటిలో మకుటాయమానంగా భాసిల్లే ‘శ్రీ రాగ పంచరత్న’ కీర్తన వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఈ కృతిలో ‘రామ సాక్షాత్కార’ సుఖాన్ని అనుభవించిన సాక్షుల్ని ముందు పేర్కొనటం జరిగింది. పతితపావనుడైన రాముణ్ణి నిజమైన భక్తి మార్గముతో, పాడుకుంటూ స్వరరాగ లయాది మర్మాలు తెలుసుకుని, వారి గుణగానంతో కంఠాన్ని నింపుతూ చరితార్థులైన వారిని త్యాగయ్య గారు ఈ కీర్తనలో ఉదహరించారు. ఈ ప్రశంసకు పాత్రమైనవాడు గోవింద మరార్.
19వ శతాబ్దంలో ‘గోవింద మరార్’ ట్రావన్కూర్‌లో ఉండేవాడు. ఈయన గొప్ప మేధావి. ఒక చేతితో తంబురా శ్రుతి చేసుకుంటూ మరో చేత్తో కంజిరా వాయించుకుంటూ పాడేవాడు. విశేషమేమంటే ఈయన తంబురాకు 7 తీగెలుండేవి. అంటే సారణి 3 తీగలు, 3 తీగలు పంచమ శృతిలోనూ, ఒక తీగ ముద్ర శృతిలోనూ ఉండి తంబురా మీటుతున్నంతసేపూ నాదం నిండిపోయేది. ఆ తంబురాకు చివర విజయకేతనం ఒకటి ఉండేది.
ఆరు కాలాల్లోనూ పల్లవి పాడటం ఈయనకున్న అద్వితీయమైన ప్రతిభ. అంటే సాధారణంగా విలోమంలో కీర్తన పాడేటట్లుగా ఈయన మొదటి కాలం ఉంటుంది. ఇటువంటి పల్లవి గానం ఎంతో విశేషమైన లయ జ్ఞానం ఉంటే తప్ప సాధ్యం కాదు. దురిత కాలంలో విశేషమైన వేగంతో బాటు, అతి విలంబ కాలంలో పాడగలిగే నేర్పు వున్న వారికే ఇది సాధ్యం.
ఇంతటి అపురూపమైన లయజ్ఞాన సంపన్నుడైన గోవింద మరార్‌కు త్యాగయ్యను దర్శించాలనే కోరిక కలిగింది. త్రివేండ్రం, రాజభవనంలో ఉద్యోగి అయిన ‘నల్ల తంబి మొదలియార్’ సహాయంతో తిరువయ్యూర్ బయలుదేరి వెళ్లాడు గోవింద మరార్. చూడండి. ఎటువంటి సన్నివేశమో? సుప్రసిద్ధులైన షేక్స్‌స్పియర్, మిల్టన్, లేదా డాంటే, కాళిదాసులు ఒకరికొకరు కలుసుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి? సరిగ్గా అటువంటి సన్నివేశమే జరిగింది. స్వామితిరువాళ్ ఆస్థానంలోని ప్రముఖ వయొలిన్ విద్వాంసుడైన ‘వడివేలు’ కూడా ఈ సమావేశంలో ఉండటం విశేషం.
త్యాగయ్యకు ఆంతరంగిక స్నేహితుడైన అన్నాచ్చి రాయర్ ఆధ్వర్యంలో గోవింద మరార్‌కు ఆహ్వానం లభించింది. తిరువయ్యార్‌లో గోవింద మరార్‌కు చక్కని వసతిని ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి 8 గంటలకు సమావేశం ఏర్పాటైంది. త్యాగయ్య తన శిష్య పరివారంతో తన కుటీరంలో ఆసీనుడై ఉన్నాడు. శిష్యులు పాడటం ప్రారంభించారు. గోవింద మరార్‌ను రమ్మని ఆహ్వానించిన నల్లతంబి మొదలియార్, వడివేలు, త్యాగయ్యను కలిసి అభివాదం చేసి గోవింద మరార్‌ను కూర్చోమని చెప్పి, నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు. సాధారణంగా అంతరంగ ప్రబోధమైతేనేగాని త్యాగయ్య పదిమందిలోనూ పాడటానికి ఉద్యమించడు. త్యాగయ్యను పాడమనే ధైర్యం ఎవరికీ ఉండదు. పక్కనే వున్న గోవిందమరార్ లేచి త్యాగయ్యను గానం చేయమని కోరాడు. అంతే చుట్టూ వున్న శిష్యులతోపాటు, అక్కడకు వచ్చిన జనం విస్తుపోయారు. త్యాగయ్యను పాడమని అడిగే ధైర్యం ఎవరికుంటుంది? అంతా నిశ్శబ్దం - ఎవరి నోటా మాట లేదు. ‘ఎవరీ పెద్దమనిషి? 79 ఏళ్ల వృద్ధుడనైన నన్ను పాడమని అడుగుతున్నాడు?’ అక్కడే నక్కినక్కి చూస్తున్న వడివేలును చూచాడు త్యాగయ్య. మీరు అనుమతిస్తే ఇతను పాడతాడు’ అన్నాడు వడివేలు. ‘ఈతగాడు పాడతాడా? సరే! పాడమను’ - త్యాగయ్య ఆజ్ఞ అయింది. అంతే శిష్యులలోనూ, అక్కడకు విచ్చేసిన పురజనులలోనూ, కుటీరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. శుద్ధమైన తంబురా నాదం.. ఆనందం వెల్లివిరిసిన కళ్లతో గోవింద మరార్ గానం ఆరంభమైంది. రాగమాలిక ప్రారంభించాడు. మొదటి రాగంలో ‘తోడి’ తర్వాత రాగం అసావేరి. అటు తర్వాత కీరవాణి. ఆ తర్వాత పంతువరాళి, ఒకదాని తరువాత మరోటి మహా ప్రవాహంలా సాగిపోతున్నాయి. ఊహించని సంగతులు, అద్భుతమైన గమకాలు, తళుక్కుమనే సంచారాలు, రాగభావాన్ని చిందించే అపురూపమైన, విశేషమైన ప్రయోగాలలో నిండిపోయిన ఆ రాగమాలిక, భిన్నభిన్న సోయగాల్ని చిందిస్తూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసేస్తోంది.
‘చందన చర్చిత నీలకళేబర’ అనే జయదేవుని అష్టపది పల్లవిని, అతి విలంబలయలో ప్రారంభించాడు మరార్. దట్టమైన అరణ్యంలో వేటాడే వేటగానిలా లయబద్ధంగా సాగుతోంది పల్లవి.
మంత్రముగ్ధులైన శ్రోతలు... నోట మాట లేదు. అర్ధనిమీలిత నేత్రాలతో మరి కొంతమందికి శరీర స్పృహ కూడా లేదు. మరి కొందరు తాదాత్మ్య స్థితిలో ఉండిపోయారు. నాదమయమైన ఆ గానానికి పరవశులై సమాధి స్థితిలో ఉండిపోయారు, ఆనంద బాష్పాలు రాలుస్తూ మరి కొందరు అచేతనులై అలాగే ఉండిపోయారు.
‘ఆహా! ఏమి గానం! నా రాముడికి నాద నైవేద్యాన్ని అందించిన మహా గాయకుడివి నువ్వు. నాయనా నాదరూపుడైన ఆ గోవిందునికంటే అధికుడవు నాయనా! నీ పేరు గోవింద మరార్ కాదు. ఇక నుండి నువ్వు గోవింద స్వామివి.’ గోవింద మరార్‌కు నోట మాట రాలేదు. సాక్షాత్తు నాదలోలుడైన త్యాగయ్య స్వయంగా ఎదురుగా ఉండి తనను అభినందిస్తూ ఉంటే, గోవింద మరార్ ఆనంద పారవశ్యంలో మునిగిపోడా? తన జన్మ ధన్యమైనదని ఉప్పొంగిపోయాడు. సద్గురు త్యాగరాజు ఆశీస్సులు పొందిన గోవింద మరార్, గోవింద దాస్‌గా ప్రసిద్ధి పొందాడు. ఆయన కొన్ని వర్ణములకు రూపకల్పన చేశాడు. త్యాగయ్యకు స్ఫూర్తినిచ్చినవీ గోవిందస్వామి వర్ణాలు. ఎంతో ప్రసిద్ధములు. గోవిందస్వామి అద్భుతమైన ప్రజ్ఞా విశేషాలు త్యాగయ్యను కదిలించి వేశాయి. అపుడే ఆయన నోట నుండి పాట రూపంలో వెలువడ్డాయి ఈ మాటలు - ఈ పృథ్వి మీద సంగీతం వున్నన్నాళ్లూ, త్యాగయ్య పేరు చిరస్థాయిగా ఉంటుంది. గోవింద స్వామి లాంటి మహనీయులు పుడుతూనే ఉంటారు. కేవలం నాలుగు తీగల తంబూరాను శ్రుతిశుద్ధంగా చేయటమే పెద్ద పని. ఈవేళ సంగీత కచేరీలలో అరుదుగా కనిపించే వాద్యం తంబురా.
శ్రుతిశుద్ధంగా, తంబురాకి వున్న నాలుగు తీగలను ఓపికగా శ్రుతిచేయటం.. శ్రుతిజ్ఞానం సంపూర్ణంగా వున్న వ్యక్తికే సాధ్యం. ఒకవేళ కమ్మని నాదం వచ్చేలా శ్రుతి చేయగలిగినా, శ్రుతి భేదం లేకుండా మీటగలిగే వారెంతమంది? ఆలోచించండి. ఘన సన్మానాలూ, గోల్డ్‌మెడల్స్ సంపాదించి రేడియో ఆడిషన్‌లో, తంబురా శ్రుతితో కలిపి పాడలేక తంబురాను చూడగానే కళ్లు తిరిగి నిర్ఘాంతపోయి, సెలెక్టు కాని గాయకులెందరో ఉన్నారు.
నిజమైన నాదానుభూతి పొందాలంటే తంబురా శ్రుతి ఒక్కటే శరణ్యం. దీనికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. విద్వాంసులూ, విద్యార్థులూ ఇది గ్రహిస్తే చాలు. నిత్యశుద్ధుడై, ప్రశాంత స్వరూపుడై, శుద్ధ జ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకార, ఉపాసన చేసిన త్యాగయ్య, గోవింద స్వామి మనకు ఆదర్శం.
*

- మల్లాది సూరిబాబు 9052765490