S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాకు గర్వమే

చాలా కాలం నాటి మాట. ఏదో ఒక పత్రిక చదువుతున్నాను. పర్యావరణం గురించి వ్యాసం కనిపించింది. అప్పట్లో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడడం, రాయడం ఒక పద్ధతి. పర్యావరణాన్ని మనం రక్షించేది ఏమిటి? పాడు చేయకుండా ఉంటే చాలు అన్న పద్ధతిలో నేనూ రాశాను అప్పట్లోనే. వ్యాసం ఎత్తుగడ బాగుంది. ఆలోచన కూడా బాగుంది. చదువుతూ పోతే సంగతి మొత్తం ఏదో తెలిసిన వ్యవహారం లాగ కనిపించింది. సగం వ్యాసం చదివేసరికి ఇది నా వ్యాసం, ఇవి నా మాటలు అని అభిప్రాయం గట్టి పడింది. వెతికి వ్యాసాన్ని బయటకు తెచ్చాను. అక్షరం పొల్లు పోకుండా నా వ్యాసాన్ని వాడుకున్నారు. పేరు మాత్రం మరెవరిదో ఉంది. ఆ పత్రికకు ఉత్తరం రాసి ఏకేద్దాము అనుకున్నాను. అనుకరణ అంటే అన్నిటికన్నా గొప్ప పొగడ్త అని ఒక మాట ఉంది. ఏకంగా నా వ్యాసానే్న వాడుకుంటే, అంతకంటే మంచి పొగడ్త ఏం ఉంటుందిలే అనిపించి ఉండాలి. ఉత్తరం రాయలేదు. ఏకనూ లేదు.
అక్కడ సీన్ కట్ అవుతుంది. మొన్నటి డిసెంబర్‌లో తరువాతి అంకం తెర లేస్తుంది. జంట నగరాలలో హైదరాబాదు పుస్తకాల పండుగ. నా పుస్తకాలు అచ్చు వేయించి అమ్ముతున్న సంస్థ స్టాల్‌లో మూడు రోజులు నేనే కూచుని, అందరినీ పిలిచి, మాట్లాడి, నా పుస్తకాలు అమ్ముకున్నాను. తెలిసిన వాళ్లు, తెలియని వాళ్లు చాలామంది కలిశారు. మెచ్చుకున్నారు. పుస్తకాలు కొన్నారు. ఒకరిద్దరు మాత్రం తమకు గల ప్రత్యేక కారణాల వల్ల నన్ను దూషించిన మాట కూడా నిజమే! పొగడితే పొంగేది లేదు. తిడితే కుంగేది లేదు. మన పాలసీ మనకు ఉండనే ఉంది. గత సంవత్సరం రచయితలు, రచయితలు తామే స్వయంగా పుస్తకాలు అమ్ముకుంటున్నారని పత్రికలు, టీవీలు గోల చేశాయి. నన్ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అది నేను ఆశించలేదు. నాకు కావలసింది పాఠకుల అభిప్రాయాలు. అవి నాకు అవసరానికి ఎక్కువగానే అందాయి. చివరినాడు అనుకుంటాను, తెలుగు దినపత్రిక ఒక దాంట్లో, నా ఇటీవలి పుస్తకాలలో ఒక దాని కవర్‌ఫొటో కనిపించింది. ఈ సంవత్సరం అంటే 2016లో నా పుస్తకాలు పెద్ద సంఖ్యలో బజారులోకి వచ్చినయి గనుక, ఒక పుస్తకం అని రాశాను. దాని పేరు ఖలిల్ జిబ్రాన్ రచనలు. నన్ను ఎవరూ అడగలేదు, నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు, మరి ఈ ప్రచారం ఏమిటి? అన్న ప్రశ్నతో ఆ ముక్క చదివాను. ఈసారి ప్రదర్శనలో ఈ పుస్తకం బాగా ప్రజాదరణ పొందింది. బాగా అమ్ముడవుతున్నది. అది ఫలానా స్టాల్‌లో దొరుకుతుంది, అని మరొక స్టాల్ పేరు రాసి ఉంది, అందులో. అంటే ‘నేరం నాది కాదు’ అని అర్థం! నాకు నిజంగా గర్వం వచ్చేసింది! మీరు క్షమించకున్నా ఫరవాలేదు. ఆ పుస్తకం అంత బాగా పాఠకులను ఆకట్టుకుంటుంది, అని నేను అనుకోలేదు. జిబ్రాన్ అంటే నాకు దిక్కుమాలిన అభిమానం కనుక ఆ పుస్తకం వేయించాను.
ఈ మధ్యన బయటకి వచ్చిన నా పుస్తకాలన్నీ ఈ దారిలోనే ఉన్నాయి. నేను చాలా ఇష్టపడిన రచయితల్లో షెర్లక్ హోమ్స్ నవలలు రాసిన కానన్ డాయ్‌ల్ ఒకరు. అలాగే డ్యూమా నవల నన్ను కుదిపింది. ఇక ఖలిల్ జిబ్రాన్ వెనుక కొంత కథ ఉంది.
పది పనె్నండేళ్ల క్రితం వరకు నాకు జిబ్రాన్ పేరు కూడా తెలియదు. కాళన్న అనువదించిన ‘ప్రవక్త’ గురించి విన్నాను. ఇవాళటికీ దాన్ని చదవలేదు. ఖలిల్ జిబ్రాన్ ఇంగ్లీషును కాళోజీ సమంగా అర్థం చేసుకోలేక పోయారన్న వ్యాఖ్య విన్నాను. ఒకచోట వెల్ అనే మాటను ఆయన అమాయకంగా ‘బావి’ అని అనువదించారని జోకులు కూడా విన్నాను. ఇక అక్కడ ఇక్కడ అందిన ముక్కలు ఆంగ్లంలో చదువుతున్నాను. నా కొడుకు అప్పుడు ఇంజనియరింగ్ చదువుతున్నాడు. వాడు నన్ను అడగనవసరం లేకుండా, నా చాలా కొద్ది సంపాదనలో కొంత తనకు నేరుగా అందే ఏర్పాటు ఒకటి చేశాను. ఒక తండ్రిగా నేను చేసిన మంచి పనులలో అది ఒకటి అనుకున్నాను. నా కొడుకు ఆర్థికంగా స్వతంత్రుడు. వాడు మనసుగల మనిషి. మనసెరిగిన మనిషి. నా పుట్టిన దినానికి ఖలిల్ జిబ్రాన్ రచనల సర్వస్వం కొని తెచ్చి బహుమతిగా ఇచ్చాడు. నా సంతోషానికి అంతు లేదు. కొడుకంటే అట్లుండాలి. బహుమతి అంటే అట్లుండాలి. ఇక రచనలను బాగా చదివాను. కాళోజీ అనే కాళన్న ‘గోపయ్యా!’ అని ప్రేమగా పిలిచిన అన్నగారు. ఆయన రాసిన ప్రాఫెట్‌ను వదిలి, రెండవ మూడవ పుస్తకాలను తెలుగులో రాసుకున్నాను. వాటిని పుస్తకంగా వేయించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పట్లో నేను ఇంటర్‌నెట్‌లో ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేసుకున్నాను. చేతనయిన పద్ధతిలో ఈ అనువాదాలను టైప్ చేసుకుని, వీలు వెంట, విడతల ప్రకారం నా సైట్‌లో చేరుస్తూ పోయాను. చాలా మంది చదివినట్లు నాకు తెలుసు. కానీ ఎవరూ నాకు ఆ సంగతి చెప్పలేదు నేరుగా! ఇక్కడ మళ్లీ తెర పడుతుంది.
తరువాతి అంకం గడచిన ఏడాదిలో మొదలవుతుంది. ఒక పెద్దాయనకు జిబ్రాన్ మీద వల్లమాలిన అభిమానమట. అనువాదాలు చేయించి పుస్తకాలు వేయించే ఏర్పాటు చేస్తున్నారట. ఈ సంగతి తెలిసినప్పుడు మాట వరుసకు నేను చేసిపెట్టుకున్న అనువాదాల సంగతి బయటపెట్టాను. ఒక మిత్రుడు నా జబ్బ పుచ్చుకుని ఆ పెద్దాయన ముందుకు లాక్కుపోయాడు. ఆయన మంచి మనిషిలాగే ఉన్నాడు. అనుమానం లేదు. నేను రాసిన భాగాలు చదివి, ఇందులో ఒకటి మరొకరు రాశారు, అది వేస్తున్నాము అన్నారు. మీ పుస్తకం కూడా వేద్దాము అన్నారు. ఆ తరువాత ఏం జరిగిందీ ఇక్కడ అనవసరం. ఈలోగా నేను నాలుగు, అయిదు పుస్తకాలు కూడా అనువదించాను. ఆ పనిలో నేను పొందిన ఆనందం అంత ఇంత కాదు. అందుకే మొత్తానికి నాలుగు పుస్తకాలు కలిపి అచ్చు వేయించాను. తరువాతి కథ తెలిసిందే!
నాకు గర్వం అని మీరు అనుకుంటే, నాకు ఎంత మాత్రం అభ్యంతరం లేదు.
రచనకు ప్రయోజనాలు అంటూ ఈ మధ్యన ఒక పుస్తకం దొరికింది. వెనకట బిఎస్సీ చదువుతూ ఉండగా, సాహిత్య ప్రయోజనాలు అనే ఉపన్యాసం, మమ్మటాచార్యుని శ్లోకం ఆధారంగా చేసి, కాలేజీ తెలుగు సమితికి కన్వీనర్ అయ్యాను. అప్పట్లో నా ప్రపంచం పక్కా క్లాసికల్ వాతావరణం నడుమ తిరిగింది. రానురాను, ప్రపంచం పెరిగింది. నేను కూడా కొంత తెలుసుకున్నానేమోనన్న అనుమానం మిగిలింది. అయినా కొత్త ఆలోచన ఎదురయితే, కళ్లు మనసు విప్పుకుని అందుకునే తీరు సాగుతున్నది. సాహిత్యానికి, అంటే రచయితగా ఒకరు పుట్టించిన సాహిత్యానికి ప్రయోజనాలను చెపుతూ మొట్టమొదట ఈ పుస్తకంలో ‘గుర్తింపు’ అని గుర్తించి రాశారు. అందరూ మెచ్చుకోవడం ఒక రకమయిన గుర్తింపు. రచనను చదువుతుంటే, ఇది ఫలానా వారి శైలిలో ఉంది, మాటల తీరు అట్లాగే ఉంది అనిపించడం అది అంతకన్నా గుర్తింపు! ఆ తరువాత రచనలో ఒక అసాధారణమయిన, ఆశ్చర్యకరమయిన పద్ధతిలో రచన ఉంది అనిపించాలట! పాఠకుడిని రచన కట్టి పడేయాలట. నా పుస్తకాలలో రచనలలో ఈ లక్షణం ఎప్పుడు వస్తుందో మరి! ఇక మూడవ లక్షణంగా పాఠకుడిని రచన ఒక కుదుపు, షాక్‌కు గురి చేయాలట. నిజం చెపుతున్నాను. నేను సర్వవిధాలుగా ఈ ప్రయత్నంలోనే రాశాను. ఇక ముందు రాస్తాను. ఏదో తెలిసిపోయిన సంగతి గురించి మనం మళ్లీ ఒకసారి చెప్పడం దండగ!
అన్నిటికన్నా రచన అటు పాఠకునికీ, ఇటు రచయితకూ తెలివి పంచేదిగా ఉండాలి అంటాడు ఈ పుస్తకం రాసిన విశే్లషకుడు. అందుకేనేమో, కథలు, కవితలకన్నా, సైన్సు, సారస్వతం గురించి ఎక్కువగా రాసే ప్రయత్నంలో నేను ముందుకు కదులుతున్నాను. నా అనువాదాల విషయంలో కూడా ఇదే దారి వెంట నడుస్తున్నాను. పాఠక మిత్రులు ఆశీర్వదిస్తే, అభినందిస్తే, అవునంటే, చేతయినంత కాలం నా కృషిని కొనసాగిస్తాను. ఈ మాటలు మాత్రం సవినయంగా తలవంచి చెపుతున్నాను.

కె. బి. గోపాలం