ఈ వారం స్పెషల్
జనం మెచ్చిన రాణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాచరికం అంటే విశాలమైన భవంతుల్లో ఉంటూ విలాసవంతమైన జీవితం గడపడం కాదు.. సాదాసీదా ప్రజలకు సైతం అండగా నిలవడమే రాజకుటుంబం పరమావధి.. సొంత జాతికే కాదు, యావత్ మానవ జాతికి సేవలందించడంలోనే జన్మకు సార్థకత.. ఇలాంటి ఆలోచనలతో విలక్షణ వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా ఉన్నందునే ఆ మహారాణి కొత్త చరిత్ర సృష్టించారు.
బ్రిటిష్ సామ్రాజ్యంలో 64 ఏళ్లుగా రాణివాసంలో కొనసాగుతూ అరుదైన ఘనతను సాధించిన క్వీన్ ఎలిజబెత్-2 తాజాగా 90వ పడిలో ప్రవేశించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 1953లో రాజకుటుంబంలో పగ్గాలను చేపట్టిన ఆమె యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు కూడా రాణిగా కొనసాగుతూ కామనె్వల్త్ సంస్థకు అధినేత్రిగా కొనసాగుతున్నారు. బ్రిటన్ వాసులకు అసాధారణ సేవలందిస్తూనే దేశంలో ఎన్నో సున్నిత పరిణామాలకు సాక్షీభూతంగా నిలిచారు. రాచరికం భేషజాలను పక్కనపెట్టి మానవాళి క్షేమానికి ఆమె చేస్తున్న కృషిని ప్రపంచదేశాలన్నీ వేనోళ్ల శ్లాఘిస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ విస్తరిస్తున్నందున రాజకుటుంబాలు జనం ముంగిటకు చేరాలని నమ్ముతూ అందుకు తగ్గట్టుగా కృషి చేస్తున్న బ్రిటన్ రాణి సేవలు నేడు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఎలిజబెత్-2 రాణివాసం చేపట్టి అరవై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2012 జూన్‌లో వేడుకలు నిర్వహించగా, ఇపుడు ఆమె 90వ జన్మదినాన్ని బ్రిటన్‌లో కోలాహలంగా జరుపుకుంటున్నారు.
రెండు పుట్టినరోజులు..!
ప్రపంచంలో ఎవరైనా ఏడాదిలో ఒక్కసారే పుట్టినరోజు జరుపుకుంటారు. ఇందుకు భిన్నంగా తమ రాణిగారి జన్మదినాన్ని ఏటా రెండుసార్లు జరుపుకోవడం బ్రిటన్ సామ్రాజ్యంలో ఆనవాయితీగా వస్తోంది. క్వీన్ ఎలిజబెత్ పుట్టినరోజుకు గుర్తుగా ఏటా ఏప్రిల్ 21న జన్మదిన వేడుకల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్‌లో లండన్‌తో పాటు అనేక నగరాల్లో జన్మదిన సంబరాలు మిన్నంటాయి. రాజమందిరాన్ని వీడి, వీధుల్లో తన కోసం నిరీక్షిస్తున్న వారిని రాణిగారు ఆప్యాయంగా పలకరించి వారు ప్రేమతో ఇచ్చిన పుష్పగుచ్ఛాలను స్వీకరించారు. ఆమె సేవలను కొనియాడుతూ బ్రిటన్ ప్రధాని కామెరాన్ పార్లమెంటులో ప్రసంగించారు. ఇక- మే, జూన్ నెలల్లో మూడేసి రోజుల పాటు ఆమె పుట్టినరోజు సంబరాలను కోలాహలంగా జరుపుకుంటారు. బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా జాతీయ స్థాయిలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేసవి తాపం తగ్గి, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభమైనపుడు రాణిగారి పట్ల గౌరవ భావంతో బ్రిటన్ ప్రజలు ఆమె జన్మదిన వేడుకలను ఇలా నిర్వహిస్తారు.
27 ఏడేళ్ల ప్రాయంలో బాధ్యతలు..
క్వీన్ ఎలిజబెత్-2గా ప్రపంచానికి తెలిసిన ప్రస్తుత బ్రిటన్ రాణి అసలు పేరు ఎలిజబెత్ అలెగ్జాండ్రియా మేరీ. లండన్‌లో ఏప్రిల్ 21, 1926న ప్రిన్స్ ఆల్బ్రెట్ (కింగ్ జార్జి-ని), ఎలిజబెత్ బొవెస్ లిన్ దంపతులకు జన్మించారు. తన చెల్లెలు మార్గరెట్‌తో పాటు ఎలిజబెత్ రాజమందిరంలోనే ట్యూటర్ల వద్ద ఫ్రెంచ్, గణితం, చరిత్ర పాఠాలను నేర్చుకున్నారు. నృత్యం, గాత్రం, ఇతర కళల్లోనూ తర్ఫీదు పొందారు. ఎలిజబెత్ పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే ఆమె తాత జార్జి- 1936లో మరణించాక రాచకుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె తండ్రి జార్జి-ని బ్రిటన్ సామ్రాజ్యపు పగ్గాలు చేపట్టారు. ఎడిన్‌బర్గ్ సేనాధిపతి ఫిలిప్ వౌంట్‌బాటన్‌తో ఆమెకు 1947లో వివాహం జరిగింది. 1952 ఫిబ్రవరి 6న ఆమెను రాణిగా నిర్ణయించినప్పటికీ, 1953 జూన్ 2న ఎలిజబెత్ అధికారికంగా కిరీటాన్ని ధరించి రాణివాసంలోకి అడుగుపెట్టారు.
రెండో ప్రపంచ యుద్ధంలో సేవలు..
1939లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎలిజబెత్ తన చెల్లెలు మార్గరెట్‌తో కలిసి లండన్ బయట విండ్సర్ కేజిల్‌లో ఉండేవారు. యుద్ధం వల్ల కష్టాల పాలైన పిల్లల క్షేమం కోసం ఆమె ఎంతగానో పరితపించేవారు. కుటుంబాలకు దూరమై, నీడ లేకుండా రోజులు గడుపుతున్న బాలలకు అంతా అండగా నిలవాలని 14 ఏళ్ల ప్రాయంలో ఆమె రేడియోలో ప్రసంగాలు చేసేవారు. ‘యుద్ధం ముగిశాక అంతా క్షేమంగా ఉంటాం.. దేవుడే మనల్ని చూసుకుంటాడు.. మనకు విజయాన్ని, శాంతిని చేకూరుస్తాడు..’ అని ఆమె ఎంతోమందికి ధైర్యం చెప్పేవారు. జనంలోకి వచ్చి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని పరితపిస్తూ ఆమె తల్లిదండ్రులతో పాటు సైనికులను కలిసేందుకు వెళుతుండేవారు. యుద్ధరంగంలో సైనికులు చేసే వీరోచిత సేవలు ఆమె హృదయ ఫలకంపై చెరగని ముద్ర వేశాయి. 1945లో యుద్ధరంగంలో సేవలందించేందుకు ఆమె డ్రైవింగ్, వాహనాల మరమ్మతులు వంటి అంశాల్లో శిక్షణ పొందారు. 1952 ఫిబ్రవరి 6న తండ్రి కింగ్ జార్జి-ని మరణించాక ఆమెను బ్రిటన్ సామ్రాజ్యపు వారసురాలిగా ప్రకటించారు. తండ్రి మరణించినపుడు భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలిసి ఎలిజబెత్ కీన్యా పర్యటనలో ఉన్నారు. 1953 జూన్ 2న ఆమె అధికారికంగా రాణివాసం చేపట్టారు. బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా ఆ ఉత్సవాన్ని వివిధ దేశాల ప్రజలు వీక్షించేలా టెలివిజన్‌లో ప్రసారం చేశారు.
పాలనలో జోక్యం లేకుండా..
బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణి అయినప్పటికీ ఎలిజబెత్ ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ఏనాడూ ప్రయత్నించలేదు. బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం రాచరిక వ్యవస్థకు అధిపతిగా ఉంటూ దేశప్రతిష్ఠను ఇనుమడింపజేశారు. రాజకీయ వ్యవహారాలకు ఆమె ఎప్పుడూ దూరంగా ఉండేవారు. రాజకీయ కోణంలో ఏనాడూ తన మనోభావాలను బహిర్గతం చేసేవారు కాదు. తన సుదీర్ఘ రాణివాసంలో ఇప్పటివరకూ 12 మంది ప్రధానమంత్రులతో ఆమె సత్సంబంధాలను కొనసాగించారు. విన్‌స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్, టోనీ బ్లేర్, డేవిడ్ కామెరాన్ వంటి ప్రధానమంత్రులతో ఎలాంటి విభేదాలు లేకుండా ఉంటూ రాణివాసానికి వనె్న తెచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక కూడా బ్రిటన్ శక్తిమంతంగానే ఉన్నప్పటికీ, 1950- 1960 ప్రాంతంలో ఆ సామ్రాజ్యం నుంచి కొన్ని దేశాలు స్వాతంత్య్రాన్ని పొందాయి. ఈ దేశాల శ్రేయస్సు కోసం కామనె్వల్త్ సంస్థ అధినేత్రిగా బ్రిటన్ రాణి ఎంతో కృషి చేశారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆమె అనేక దేశాల్లో పర్యటించారు. 1965లో జర్మనీ సందర్శించారు. అయిదు దశాబ్దాల కాలంలో జర్మనీ వెళ్లిన తొలి బ్రిటిష్ అధిపతిగా రికార్డు సృష్టించారు. కామనె్వల్త్ దేశాల సదస్సుల్లో పాల్గొనేందుకు ఆమె 1970- 1980 ప్రాంతంలో అనేక దేశాల్లో పర్యటించారు. 1976లో 200వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అమెరికా ప్రభుత్వం నిర్వహించినపుడు ఆమె వాషింగ్టన్‌ను సందర్శించారు. 1979లో కెనడాలోని మాంట్రియల్‌లో సమ్మర్ ఒలింపిక్స్‌ను ఆమె ప్రారంభించారు. ఇలా వివిధ సందర్భాల్లో కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, యుఎఇ, ఒమన్ వంటి అనేక దేశాల్లో పర్యటించారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటి విషయాలను చూసుకుంటూనే, విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ అనేక దేశాలను సందర్శించారు.
ఎనె్నన్నో ఒడిదుడుకులు..
బ్రిటిష్ రాచరిక వ్యవస్థకు అధిపతిగా ఉన్నప్పటికీ ఎలిజబెత్ తన జీవనయానంలో పలు సమస్యలను, సవాళ్లను చవిచూశారు. రాజకుటుంబంలోని వ్యక్తులను హతమారుస్తామంటూ వచ్చిన బెదిరింపులను సైతం ఆమె ఎదుర్కొన్నారు. 1979లో తన భర్త ఫిలిప్‌కు బంధువైన లార్డ్ వౌంట్‌బాటన్ ఉగ్రవాదుల దాడిలో మరణించడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. వౌంట్ బాటన్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు ఐర్లండ్‌లో బోటులో వెళ్తుండగా ఉగ్రవాదులు బాంబుదాడి చేశారు.
ఆ దాడిలో వౌంట్‌బాటన్‌తో పాటు ముగ్గురు మరణించారు. ఉత్తర ఐర్లండ్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బాంబుదాడి చేసినట్లు అప్పట్లో ఐఆర్‌ఎ (ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ) ప్రకటించింది. ఇక, 1981లో తన జన్మదినం సందర్భంగా మిలటరీ పరేడ్‌కు ఆమె హాజరైనపుడు జనంలో నుంచి ఓ ఆగంతకుడు ఆమెపై ఆకస్మికంగా తుపాకీ పేల్చేందుకు ప్రయత్నించాడు. అయితే, అదృష్టవశాత్తూ ఆ తుపాకీలో తూటాలు లేకపోవడంతో ఆమె ప్రాణగండం నుంచి బయటపడ్డారు. తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్, డయానా పెళ్లి చేసుకోవడం నుంచి 1992లో విడాకులు పొందేవరకూ పత్రికల్లో ప్రముఖంగా వార్తలు రావడం కూడా ఎలిజబెత్ మనసును కలవరపరిచాయి. 1997లో డయానా కారు ప్రమాదంలో మరణించడంతో బ్రిటన్‌తో పాటు దేశదేశాల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. డయానా మరణించినపడు రాణి తన కుమారుడు ప్రిన్స్ చార్లెస్, డయానా పిల్లలు విలియం, హేరీలతో స్కాట్లండ్‌లో ఉన్నారు. డయానా మరణానికి రాచకుటుంబమే కారణమన్న విమర్శలు రావడంతో ఎలిజబెత్ కొన్ని రోజుల పాటు వౌనం వహించాల్సి వచ్చింది. డయానా మరణించిన వారం తర్వాత బ్రిటన్ రాణి అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
సంబరం.. విషాదం..
రాణివాసంలో ప్రవేశించి ఏభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2002లో దేశవ్యాప్తంగా సంబరాలు జరపడం ఎలిజబెత్‌ను సంతోషపరిచినా, అదే ఏడాది ఆమె రెండు విషాద సంఘటనలు ఎదుర్కొన్నారు. 2002 ఫిబ్రవరిలోఆమె సోదరి మార్గరెట్ గుండెపోటుతో మరణించగా, కొన్ని వారాల వ్యవధిలోనే 101 ఏళ్ల వయసులో తల్లి ఈ లోకం నుంచి నిష్క్రమించింది. ఇలాంటి కష్టనష్టాలను ఎన్నింటినో ఎదుర్కొన్నప్పటికీ ఆమె తన కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. తన పిల్లలకు, మనవలకు, మునిమనవలకు ధైర్యం చెబుతూ మార్గదర్శకంగా ఉన్నారు. రాచరికంలో ఉండే పలు సంప్రదాయాలను సైతం ఆమె వదులుకుని జనం మధ్యలో తిరిగేందుకు ఇష్టపడుతుంటారు. రాచకుటుంబానికి ఖర్చుల నిమిత్తం బ్రిటన్ ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తున్నప్పటికీ, వాటిని ఇష్టానుసారం ఖర్చు చేసేందుకు ఆమె సుముఖత చూపరు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదని ఖర్చులను తగ్గించుకోవాలని ఆమె భావిస్తుంటారు. 90 ఏళ్ల జీవనయానంలో ఎదురైన కష్టనష్టాలను ఆమె సమానంగానే చూస్తారు. గత ఏడాది తన మనవడు విలియం, కాటే దంపతులకు రెండో కుమారుడు జన్మించగా- తనకు అయిదో మునిమనవడు దొరికాడని ఎలజబెత్ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలను పంచుకున్నారు.
కుస్తీ పోటీలంటే ఇష్టం..
సస్పెన్స్ నవలలు చదవడం, పజిల్స్ నింపడం, టీవీలో వచ్చే కుస్తీ పోటీలను తిలకించడం అంటే బ్రిటన్ రాణికి ఎంతో సరదా. గుర్రప్పందాలకు స్వయంగా హాజరు కావడం కూడా తనకెంతో ఇష్టమని చెబుతుంటారు. ప్రపంచాన్ని చుట్టేసి రావాలని మోజుపడే ఆమె ఇప్పటికి 117 దేశాల్లో పర్యటించారు. కళలు, ప్రజాసేవ వంటి విషయాలపై తన అంతరంగాన్ని తరచూ ఆవిష్కరించే ఆమె కొన్ని అంశాల్లో మాత్రం గుంభనంగా ఉంటారు. తన రాణివాసంలో 12 మంది ప్రధానమంత్రులను చూసినా- ‘ఎవరి పాలన బాగుంద’ని ప్రశిస్తే ఆమె వౌనం వహిస్తారు. తన వారసులెవరన్న విషయాన్ని కూడా ఆమె బహిర్గతం చేయరు. చట్టబద్ధంగా కొనసాగుతున్న బ్రిటన్ సామ్రాజ్యంలో అన్నీ పద్ధతి ప్రకారమే జరుగుతాయని అంటారు. *
రంగుల హంగులుండాలి..!
రంగుల మేళవింపుతో కాంతులీనే ఆధునిక దుస్తులంటే ఎలిజబెత్‌కు మహా ఇష్టం. యవ్వనంలోనే కాదు.. ఇప్పటికీ ఆమె రంగురంగుల దుస్తులంటే మనసు పడుతుంటారు. ‘రంగుల్లేని దుస్తులు వేసుకుంటే ననె్నవరు గుర్తుపడతారు?’ అంటూ ఆమె చిలిపిగా అంటుంటారు. అందుకే తన గదిలో ఎటుచూసినా ఆకట్టుకునే దుస్తులు ఉండాల్సిందే. రోజుకు కనీసం అయిదుసార్లయినా దుస్తులను మార్చే ఆమె కాలానుగుణంగా తన అభిరుచులనూ మార్చుకుంటారు. శిరోజాలను అందంగా అలంకరించుకోవడం, పలురకాల టోపీలను, విభిన్నమైన పాదరక్షలను ధరించడం ఆమెకు అలవాటు. ‘దుస్తుల ఎంపికలో ఆమెకున్న నైపుణ్యం అపారం.. అలంకరణకు సంబంధించి ఆమెకు కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు..’- అని రాణిగారి వద్ద 21 ఏళ్లుగా ‘డ్రెస్సర్’గా పనిచేస్తున్న ఏంజెలా కెల్లీ చెబుతుంటారు.
శునకాల పెంపకం హాబీ
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2కు శునకాల పెంపకం హాబీ. వాటిని పెంచడం, వాటితో తిరగడం, ఆడుకోవడం అంటే చాలాఇష్టం. నిజానికి ఓ సరికొత్త డాగ్ బ్రీడ్‌ను ఆమె సృష్టించారని చెప్పాలి. సోదరి మార్గరెట్‌కు చెందిన డాషుండ్ పిప్‌కిన్ శునకం, కోర్గిస్ అనే మరో జాతి శునకంతో కలవడంతో పుట్టిన పిల్లలకు ’దోర్గి’ అని పేరుపెట్టారు. ఇది సరికొత్త జాతిగా అవతరించింది. ఇప్పుడు రాణివాసంలో ఆ జాతికి చెందిన ఎనిమది శునకాలు ఉన్నాయి. వాటిపేర్లు టుకల్, పికిల్స్, చిప్పెర్, పైపర్, హాలిస్, బ్రాండీ, సైపర్, బెర్రి.
ఎనిమిదేళ్లు ఇబ్బందులు..
తన జీవితంలో 90 దశకం అత్యంత బాధాకరమైన సమయంగా ఆమె చెబుతారు. రాణిగా పేరుప్రతిష్టలున్నా.. ఆ సమయంలో కాస్త మసకబారాయి. కోడలు డయానా మరణం, ప్రిన్స్ తెరచాటు వ్యవహారాలు, విడాకులు, ఇతర వివాదాలు ఆమెను వెంటాడాయి. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆమె ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత మళ్లీ ఆమె ప్రభ కొనసాగింది.
రాణివాసంలోకి మన ‘కోహినూర్’!
బ్రిటన్ రాణిగారి కిరీటంలో పొదిగిన అత్యంత విలువైన వజ్రం- మన ‘కోహినూర్’. దీని కోసం బ్రిటన్, భారత ప్రభుత్వాల మధ్య దశాబ్దాల తరబడి వివాదం కొనసాగుతూనే ఉంది. భారత్ నుంచి బ్రిటన్ వెళ్లిన ఆ వజ్రాన్ని తిరిగి స్వదేశానికి రప్పించడం సాధ్యమేనా? అలనాడు విక్టోరియా మహారాణికి కానుకగా కోహినూర్‌ను సమర్పించగా, ఇపుడు ఎలిజబెత్-2 హయాంలోనూ వివాదం రాజుకుంటోంది. ప్రస్తుతం లండన్ టవర్‌లో భద్రంగా ఉన్న కోహినూర్‌ను వదులుకోవడానికి బ్రిటన్ ప్రభుత్వం సుముఖంగా లేదు. అప్పట్లో పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్‌తో కుదిరిన ‘లాహోర్ ఒప్పందం’లో భాగంగా కోహినూర్ తమ వద్దకు ‘బహుమతి’ రూపంలో చేరిందని ఇప్పటి బ్రిటన్ పాలకుల వాదన. 1851లో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రంజిత్ సింగ్ కుమారుడైన దులీప్ సింగ్ కోహినూర్‌ను విక్టోరియా మహారాణికి అందజేశారు. దీన్ని తాము ‘కొల్లగొట్టుకు పోలేదు’, ‘అధికారికంగా దోచుకుపోలేదు’ అని బ్రిటన్ తెగేసి చెబుతోంది. ఆ మధ్య బ్రిటన్ ప్రధాని కామెరూన్ కూడా ‘ఇలా ఇచ్చేస్తూపోతే బ్రిటన్ మ్యూజియం ఖాళీ అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత బ్రిటన్ రాణి మాత్రం ఏనాడూ కోహినూర్‌పై ఎలాంటి ప్రస్తావనా తేలేదు.
ఆగంతకునితో...
ఆమె నివాసం ఉండే బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జొరబడటం ఎవరివల్లా కాదని అంతా అనుకుంటారు. కానీ అక్కడ భద్రత డొల్ల అని ఒక సంఘటన నిరూపించింది. 1982లో ఓ కెనడియన్ ఏకంగా ఆమె బెడ్‌రూమ్‌లోకి జొరబడ్డాడు. హఠాత్తుగా ఎవరో తెలియని వ్యక్తి లోపలికి వచ్చేసినా రాణి కలవరపాటుకు గురవలేదు. రక్షణ సిబ్బందిని పిలిచేలోగా.. అంటే దాదాపు పది నిమిషాలపాటు అతడితో ఏదో ఒకటి ఆమె మాట్లాడుతూ ధైర్యంగా గడిపారు. ఈలోగా భద్రతా సిబ్బంది వచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
బహుమానాలు
ప్రపంచం నుంచి ఆమెకు వేలాది బహుమానాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పటికి ఆమె అందుకున్నవాటిలో రెండు తాబేలు పిల్లలు, ఏడేళ్ల ‘జుంబో’ అనే ఏనుగు ప్రత్యేకమైనవి. ఆమెవద్ద పోటీలకు తర్ఫీదు పొందిన 200 రేసింగ్ పావురాలు ఉన్నాయి.