అక్షరాలోచన

మళ్లీ జన్మిస్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ జన్మిస్తే
నేనిలా ఉండకపోవచ్చు.
ఇంతకన్న మెరుగ్గా
చురుగ్గా
మరింత మనిషిగా
చైతన్యపూరిత నవస్రోతస్వినిగా

అర్థమయ్యే లోపల్నే
జీవితం ముగిసిపోతుంది.
లోకాన్ని
అధ్యయనం చెయ్యకుండానే
కాలం కరిగిపోతుంది.

ఇంత అద్భుతమైన ప్రపంచం
ప్రహేళికా తుల్యమైన
సృష్టి వాటిక
అంతర్ బహిర్ జగత్తుల మధ్య
సమన్వయం సాధించడానికి
కొత్త కన్ను మొలిచే లోపల్నే
ఉన్న కళ్లు మూతబడతాయి.

వయస్సు ఇసుకలా రాలిపోతుంది
మోహం మంచులా జారిపోతుంది
షష్టాశ్వాలు
శరవేగాన్ని ఆపేశాయి.

సంజాయిషీ కాదు
నిరాశ అసలే లేదు
అనే్వషణకు
సారాంశం తెలిసే లోపల్నే
దూరం తరిగిపోతుంది
కొండలెక్కి దిగకముందే
కాళ్లు అరిగిపోతాయి.

ఇంతవరకు ఏం చేశానని
నిలదీయకండి
మళ్లీ తిరిగొస్తే
ఏం లాభం అని
పెదవి విరువకండి.

జీవితమంటే
వేలాది అనుభవాల
సమాహారమనుకున్నాను.
ఒక్క అనుభూతితో
ఒక మహోజ్వల సూర్యకాంతి
ఆవిర్భవిస్తుందని మరిచిపోయాను.

వాగ్దానం చేస్తున్నాను
మళ్లీ జన్మిస్తే
నేనిలా వుండనే వుండను
చేసిన తప్పును మళ్లీ చేయని
మానవుడిగా ఆవిర్భవిస్తాను.

-డా.ఎన్.గోపి