నమ్మండి! ఇది నిజం!!

క్రూర సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జపాన్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితం సమురాయ్‌లు, అంటే యుద్ధ వీరులు ఉండేవారు. వారి ప్రవర్తన ఎంతో క్రూరంగా ఉండేది. వారి క్రూరత్వంలోని కొన్ని పార్శ్వాలు ఇవి.
తమిషిగిరి, అంటే ప్రయోగాత్మకంగా నరకడం అని అర్థం. తమ కొత్త కత్తి ఎంత పదునుగా ఉందో తెలుసుకోడానికి వారు కొనబోయే ముందు దాన్ని శిక్ష అనుభవించే ఖైదీల మీద ప్రయోగించేవారు. ఆ కత్తివేటుకి చేసిన నేరం స్థాయినిబట్టి ఖైదీ తన శరీరంలోని ఓ భాగాన్ని కోల్పోయేవాడు. ఒకోసారి ఖైదీని ఒకే వేటుతో అడ్డంగా నరికేవారు. ఒకోసారి సమురాయ్ తరఫున అతని మనిషి ఈ పని చేసేవాడు.
సంగోకు చక్రవర్తి కాలంలో సుజిగిరిని ప్రాక్టీస్ చేసేవారు. దాని అర్థం చౌరస్తాలో హత్యగా చెప్పుకోవచ్చు. సమురాయ్‌లు కొత్త కత్తిని కొన్నా, కొత్త రకంగా మనిషిని చంపడం కనుగొన్నా వారు రాత్రిళ్లు ఆ కొత్త ఖడ్గాన్ని లేదా టెక్నిక్‌ని చౌరస్తాలో వేచి ఉండి ఒంటరిగా వచ్చే మొదటి వ్యక్తి మీద ప్రయోగించేవారు. ఇది సాంకేతికంగా చట్టవిరుద్ధమే ఐనా ఈ దుశ్చర్యలకి పాల్పడ్డ సమురాయ్‌లని రక్షక భటులు బంధించేవారు కారు. చౌరస్తాలో ఒక్కడే ఉన్నప్పుడు చంపి పారిపోతే సాక్షులు ఎక్కడ నించి వస్తారు? ఒకవేళ పట్టుబడ్డా రాజుని రక్షించే వారుగా తమకి గల హక్కుని వినియోగించుకుని చంపామని చెప్పేవారు.
సమురాయ్‌లకి ఆ రోజుల్లో ఓ ప్రాథమిక హక్కు ఉండేది. దీన్ని కిరి సూతేగొమెన్ అని జపనీస్ భాషలో అంటారు. నిమ్న వర్గానికి చెందిన వారు తమని అవమానిస్తే వారిని చంపే హక్కు సమురాయ్‌లకి ఉండేది. ఇలా తోటి సమురాయ్‌లని కూడా చంపచ్చు. సమురాయ్‌లకి చక్రవర్తి ఆ హోదాని ఇచ్చేవాడు. ఐతే ఇందుకు రెండు నియమాలు ఉండేవి.
1.అవమానించిన వ్యక్తిని తక్షణం చంపాలి.
2.అవమానించాడు అనేందుకు ఓ సాక్షి ఉండాలి.
సమురాయ్ సేవకుడు సాక్షిగా ఉండచ్చు. వారు ఎప్పుడూ సమురాయ్ తరఫునే సాక్ష్యం చెప్తారు కాబట్టి సమురాయ్‌లు తాము చంపదలచుకున్న ఎవరినైనా ఈ నెపంతో చంపి శిక్ష నించి తప్పించుకునేవారు. ప్రతీ సమురాయ్‌కి ఇది ఓ భత్యంగా లభించేది. అందువల్ల ప్రజలకి సమురాయ్‌లు అంటే భయం ఉండేది.
ఆ రోజుల్లో సమురాయ్‌కి భార్య అవడం హోదాకి చిహ్నంగా ఉండేది. ధనవంతుల కూతుళ్లు వీరిని చేసుకోడానికి ఆసక్తిని చూపేవారు. సాధారణ యువతులు సమురాయ్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటే భారీ కట్నాన్ని ఇచ్చుకోవాల్సి వచ్చేది. సమురాయ్ భార్యలు అతనికి అత్యంత విధేయతగా ఉండాలి. ఏ సమయంలోనూ రతిని నిరాకరించకూడదు. ఎందుకంటే సమురాయ్‌లకి అక్రమ సంబంధాలు ఉండకూడదనే నియమం ఉండేది.
సమురాయ్‌లు ధనస్సుని చక్కగా ఉపయోగించే శిక్షణని తరచు తీసుకునేవారు. దీన్ని ఇనుగో ఉమోనో అని పిలుస్తారు. వాళ్లు గుర్రాల మీద కుక్కల వెంట పడి బాణాలతో కొట్టేవారు. బాణాలకి బట్ట చుట్టడంవల్ల అవి తగిలేవి కాని వాటిని చంపేవి కావు. అందువల్ల వేటకి కుక్కలని కొనాల్సిన అవసరం ఉండేది కాదు. వదిలిన ప్రతీ బాణం కుక్కలకి తగిలి తీరాలి.
సమురాయ్‌లలో రోనిన్స్, అంటే స్వచ్ఛందంగా డబ్బుకి పనిచేసే పద్ధతి కూడా ఉండేది. ఐతే ఇతనికి సమాజంలో ఏ మాత్రం గౌరవం ఉండేది కాదు. కారణం వారు నేరస్థులకి బాడీగార్డులుగా పనిచేస్తూ, అమాయకులని చంపేవారు. పై అధికారులు లేని మరో సమురాయ్‌లని కబూకిమోనో అంటారు. వీరు ఆడవారిలా వస్తధ్రారణ చేసేవారు. వీధి రౌడీల్లా భోజనం చేసిన చోట డబ్బు చెల్లించకుండా, సరదాకి వీధిలోని మనుషులను కొట్టి ఆనందించేవారు.
సమురాయ్‌లు సెపుకూ అంటే ఆత్మహత్య కూడా చేసుకోవాల్సి వచ్చేది. యుద్ధంలో పట్టుపడ్డప్పుడు లేదా తన రాజుకి ద్రోహం చేసి అది బయట పడినప్పుడు తన శత్రువుకి తనని చంపే ఆనందాన్ని ఇవ్వకుండా వారి ముందు మోకాళ్ల మీద కూర్చుని, ఓ చిన్న కత్తితో కడుపుని గుండ్రంగా కోసుకుని మరణించేవారు. ఆ సమయంలో బాధని వ్యక్తం చేయని సమురాయ్ గొప్పవాడిగా ప్రసిద్ధి చెందేవాడు. సెపుకూ మొదలవగానే నమ్మకస్థుడైన సహచరుడు అతని మెడని తెగ్గొట్టి ఎక్కువ బాధపడకుండా మరణించేలా చేసేవాడు. సెపుకూ జరగగానే ఆ సమురాయ్ భార్య జిగాయ్, అంటే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె రెండు కాళ్లని కట్టుకుని మెడని కోసుకుని మరణించేది.
సమురాయ్ ఖడ్గాన్ని కటానా అంటారు. బంగారంలో రాళ్లు పొదిగి చేసే వీటి బరువు కిలో నించి కిలో మీద మూడు వందల గ్రాముల దాకా ఉండి, రెండడుగులు లేదా కొద్దిగా ఎక్కువ పొడవుతో ఒంపు తిరిగి ఉండేది. రెండు చేతులతో పట్టుకోడానికి వీలుగా రెండు పిడులు ఉండేవి. క్రీ.శ.1392-1573 దాకా వీటిని అధికంగా తయారుచేశారు.
సమురాయ్‌లు శారీరక బలం కలిగి ఉండేవారు. కత్తి యుద్ధంలో అత్యంత నిపుణులు. ఎగిరే ఓ ఈగ రెక్కని కూడా తమ ఖడ్గంతో ఖండించగలిగే వారు అని ప్రతీతి. వారి శిక్షణలో భాగంగా ఈగలు ముసిరిన గదిలో ఈ శిక్షణని ఇచ్చేవారు.
సమురాయ్ శిక్షణని చిన్న పిల్లలుగా ఉండగానే తీసుకుంటారు. వారికి శిక్షణ ఇచ్చే గురువు వారితో స్వలింగ సంపర్కాన్ని జరిపేవాడు. ఇది వారి అనుమతితోనే చేయాలనే నిబంధన ఉన్నా, అనుమతించకపోతే శిక్షణ ఇచ్చే గురువు దొరకడు. వీరు ప్రజలకన్నా తాము ఓ మెట్టు పైన ఉన్నామనే భావనలో ఉండేవారు. వారి ప్రవర్తన కూడా అహంకారపూరితంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో జపనీస్ సైనికులు కూడా క్రూరంగా ప్రవర్తించడానికి కారణం వారు సమురాయ్‌లని అనుకరించడమే.

పద్మజ