నమ్మండి! ఇది నిజం!!

నమ్మండి ఇది నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యంత అందమైన జంతువు ఏది?
అత్యంత ఖరీదైన జంతువు ఏది?
అత్యంత అరుదైన జంతువు ఏది?
ఈ మూడు ప్రశ్నలకు జవాబు ఒకటే. పాండా.
కేవలం చైనాలో మాత్రమే పుట్టి పెరిగే పాండా ఎలుగుబంటి జాతికి చెందినది. క్రిస్టియానిటీ ప్రచారం కోసం చైనాకి వెళ్లిన ఫ్రెంచ్ మిషనరీ ఆర్మండ్ డేవిడ్ మొదటిసారిగా పాండా గురించి ప్రపంచానికి తెలిపాడు. పాండా తెలుపు, నలుపు రంగుల్లో చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. శాస్తజ్ఞ్రుల అంచనా ప్రకారం ఈ జంతువుకి ఆ రంగులు ముప్పై లక్షల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి.
95 నించి 160 రోజుల గర్భధారణ తర్వాత పాండాకి కానుపు వస్తుంది. అడవుల్లో పిల్ల జీవించి పెద్దదయ్యే అవకాశాలు ఏభై శాతం మాత్రమే. సాధారణంగా తల్లి పాండా పుట్టిన రెండు పిల్లల్లో బలమైన పిల్ల విషయంలోనే శ్రద్ధ తీసుకుని బలహీనమైన దాన్ని పట్టించుకోదు. దాంతో అది మరణిస్తుంది. పుట్టినప్పుడు పాండా పింక్ రంగులో ఉంటుంది. బరువు సగటున వంద నించి రెండు వందల గ్రాములు మాత్రమే ఉండి, ఏడంగుళాల పొడవు ఉంటుంది. దానికి కళ్లు కనపడవు. పళ్లు కూడా ఉండవు. కొన్ని వారాల తర్వాత దాని చర్మం బూడిద రంగుకి, నెల తర్వాత నలుపు-తెలుపుకి మారుతుంది. ఆరో నెల రాగానే ఇవి చెట్లని ఎక్కడం నేర్చుకుని చెట్ల మీదే నిద్రపోతాయి. క్రమంగా బొచ్చు ఏర్పడి ఏడాదికల్లా దాని బరువు నలభై ఐదు కిలోలకి చేరుతుంది. పెద్దదయ్యాక మగ పాండా 115 నించి 160 కిలోల దాకా, అదే ఆడ పాండా అయితే 70-100 కిలోల దాకా బరువు ఉంటాయి. తోకతో కలిపి ఇవి నాలుగు నించి ఆరడుగుల పొడవు ఉంటాయి.
75వ రోజు నించి అవి పాకడం ఆరంభిస్తాయి. ఆరో నెల దాకా తల్లి పాలతో జీవించి, అప్పటి నించి వెదురు మొక్కలని కూడా తింటూ సంవత్సరం దాకా తల్లి పాలని వదలవు. ఇవి మూడేళ్ల దాకా తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఇలా జీవిత కాలంలో ఓ ఆడ పాండా 5-8 పిల్లల్ని పెంచుతుంది. 4వ ఏట నించి 20వ ఏట దాకా ఇవి పిల్లల్ని పెడతాయి. మార్చి నించి మే నెల దాకా మేటింగ్ సీజన్. ఇవి అడవుల్లో సగటున ఇరవై ఏళ్లు, మానవ రక్షణలో ముప్పై ఏళ్లు జీవిస్తాయి.
ఒకో పాండా సగటున రోజుకి 9 నించి 14 కిలోల వెదురు ముక్కలని తింటుంది. ఇది సమయమంతా ఆహారపు వేట, తినడం, నిద్ర పోవడానికే కేటాయిస్తుంది. దీని పంజాకి ఐదు వేళ్లు కాక, తినేప్పుడు వెదురు మొక్కని పట్టుకోడానికి అనువుగా ఓ అదనపు బొటనవేలు కూడా ఉంటుంది.
చైనీస్ భాషలో దీనికి ఇరవై దాకా పేర్లు ఉన్నాయి. ఎక్కువ మంది వాడే పేరు డాక్సియాంగ్ మావో.
జూల కోసం అమెరికా ఒకో పాండాకి సంవత్సరానికి పది లక్షల డాలర్లని చెల్లించి చైనా నించి వాటిని అద్దెకి తీసుకుంటుంది. పాండాలన్నీ చైనాకి చెందినవే. ఈ విధంగా ప్రపంచంలోని అన్ని పాండాలకి చైనానే యజమాని. చైనా పాండాలని అమ్మదు. కేవలం అద్దెకి ఇస్తుంది.
పొలాలు, పరిశ్రమల కోసం అడవులని నరకడంతో వీటి సంఖ్య బాగా తగ్గి, ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 1600 పాండాలు మాత్రమే ఉన్నాయని అంచనా. ఇంకో అంచనా ప్రకారం 2000 నించి 3000 దాకా ఉన్నాయని. వాటిలో 300 ప్రపంచంలోని వివిధ జూలలో, రీసెర్చ్ సెంటర్లలో, బ్రీడింగ్ సెంటర్లలో ఉన్నాయి.
బంధింపబడ్డ పాండాలకి జత కట్టడంలో ఆసక్తి పోతుంది కాబట్టి మగ పాండాలకి వయాగ్రా మాత్రలు ఇవ్వడం, రతి జరుపుతున్న పాండాల వీడియోలని చూపించడం ద్వారా అవి జత కట్టేందుకు పురికొల్పుతున్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా కూడా వీటి సంతతిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కొంత విజయాన్ని సాధించారు కూడా. ప్రపంచంలో మొదటిసారిగా 23 జులై 2009లో స్విజువాన్‌లోని 11 ఏళ్ల యుయు అనే ఆడ జెయింట్ పాండాకి కృత్రిమ పద్ధతిలో గర్భధారణ ద్వారా ఓ పిల్ల పుట్టింది.
ఇవి చలికాలంలో మిగిలిన ఎలుగుబంట్లలా దీర్ఘనిద్ర పోవు. సగటున 28 పాండాలు కలిసి ఓ బృందం ఏర్పడుతాయి. పాండా శాస్ర్తియ నామం - ఐలురోపోడా - మెలనోలూకా. దానర్థం పిల్లికాళ్ల తెలుపు, నలుపు జంతువు అని. కాని ఇది సరైన వర్ణన కాదనే చెప్పాలి.
చైనాలో 1940ల నించి పాండాల సంరక్షణ ఆరంభమైంది. 1963లో ఊలాంగ్ నేషనల్ నేచర్ రిజర్వ్ అనే చోట 22 లక్షల 84 వేల 489 ఎకరాల విస్తీర్ణంలో పాండాల సంరక్షణ కేంద్రాన్ని ఆరంభించారు. ఇది ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడింది. ఇందులో ఏడు నేచర్ రిజర్వ్‌లు, తొమ్మిది సీనిక్ పార్క్‌లు ఏర్పరిచారు. ఇక్కడ 150 జైంట్ పాండాలు జీవిస్తున్నాయి. స్వేచ్ఛగా తిరిగే పాండాలలో ముప్పై శాతం ఈ రిజర్వ్‌లోనే ఉన్నాయి.
మధ్య చైనాలోని స్విజువాన్ ప్రావిన్స్ పర్వత ప్రాంతంలో జైంట్ పాండా శాంక్చురీ కూడా ఉంది. స్విజువాన్ అడవుల్లో కూడా పాండాలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి.
2007లో చైనా రక్షణలో 239 పాండాలు, బయటి దేశాల్లో 27 మాత్రమే ఉండేవి. 2014కల్లా బయటి దేశాల్లో వాటి సంఖ్య 49కి పెరిగింది. 13 దేశాల్లోని 18 జూలలో ఇవి ఉన్నాయి.

-పద్మజ