ఈ వారం స్పెషల్

వేగం... ఖేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితమంటే లెక్కలేదు... ప్రాణాలంటే భయం లేదు... ఏమవుతుందిలేనన్న నిర్లక్ష్యం... చట్టాలపై చిన్నచూపు... చలానా తప్ప ఇంకేం చేయగలరన్న ధీమా... వెరసి ఒళ్లు తెలియని వేగం... ఫలితం - ఒకటి లేదా అంతకుమించి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం!

భద్రతా ప్రమాణాలు పాటించాలన్న స్పృహ ఉండదు... మన వేగం ప్రాణాంతకం కాకూడదన్న ఆలోచన ఉండదు...
ఎవరో తరుముకొస్తున్నట్లుగా... కొంపలేవో మునిగిపోతున్నట్లుగా... తనను మించినవారు ఇంకెవరూ లేరన్నట్లుగా... వాయువుతోనో, కాంతితోనో పోటీపడుతున్నట్లుగా... పిచ్చివాడి చేతిలో స్టీరింగులా...

ఏమిటా తొందర? ఏమిటా వేగం? ఎవరిని ఉద్ధరించడానికి? ఏమి సాధించడానికి? ప్రాణాల్ని బలిగొనే ఈ ‘వేగం’ ఎవరి కోసం?

- ప్రమాదం జరిగిన ప్రతిసారీ
ఎదురవుతున్న ప్రశ్నలే.
- గతంలోనూ, వర్తమానంలోనూ,
భవిష్యత్తులోనూ ఎప్పటికీ ఇవి శేషప్రశ్నలే.

ఎన్నో విజయాలను సొంతం చేసుకుని పూలదండలతో అభినందనలు అందుకోవాల్సిన వయసులో ఫొటోలకు దండలు పడుతున్నాయ. క్షేమంగా ఇంటికి రావాల్సిన వాడు శ్మశానానికి పయనమవుతున్నాడు. స్వయంకృతంతో కొందరు, ఇతరుల నిర్లక్ష్యంతో మరికొందరు విగతజీవులై పోతున్నారు. బయటికెళ్లినవారు తిరిగొస్తారో రారో తెలీదు. ఖరీదైన వాహనం కొనిచ్చి ముచ్చట తీరిస్తే... చివరికి అది ప్రాణాలు మింగేసి గర్భశోకం మిగులుస్తోంది. మన రహదారులకు, ఖరీదైన కార్లకు పొంతన కుదరదని తెలిసినా వాటిని పిల్లల చేతికి అందివ్వడం ఆత్మహత్యా సదృశ్యం కాక మరేమిటి? నలభై యాభై మంది ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఆరుగంటలు ప్రయాణం చేయాల్సిన దూరాన్ని కేవలం నాలుగు గంటల్లోనే చేరితే వచ్చే లాభం ఏమిటి? మద్యం మత్తులో ఒళ్లు తెలియని వేగంతో జరిగే అనర్థానికి ఎవరు బాధ్యులు?
నేటి ఆధునిక యుగంలో కాలంతో పరుగులు పెట్టాలి. వేగాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచనల్లోనూ, తన వృత్తిలోనూ వేగాన్ని ప్రదర్శించాలి. లేకపోతే వెనకబడిపోవడం ఖాయమే. దీన్ని ఎవరూ కాదనలేరు. వేగం ఎక్కడ అవసరం, ఎక్కడ అనవసరం అనే విచక్షణ ఉండాలి. ప్రాణాలు తీసే వేగం, చూసేవారి నరాలు తెగిపోయే వేగం ఎప్పటికీ ప్రమాదకరమే.
వేగం - వెన్నంటి ఉండే ఆగర్భ శత్రువు. ఇంకా చెప్పాలంటే వెంటాడే మృత్యువు. వేగం పెరిగినకొద్దీ మృత్యువుకు దగ్గరవుతున్నట్లే. పగలైనా, రాత్రయినా - ఎప్పుడూ ప్రాణాంతకమే. వాహనం నడిపేవారికి, వాహనంలో ఉన్నవారికి, పాదచారులకూ, ఫుట్‌పాత్‌పైన పడుకునే నిర్భాగ్యులకూ, రోడ్డు ప్రక్కన పూరిగుడిసెలో అలసి సొలసి నిద్రించే నిరుపేద కూలీ బతుకులకు ప్రాణసంకటమే. వాహనం నడిపేవాడు ఒక్కడు అజాగ్రత్తగా వుంటే ఎన్నో ప్రాణాలకు మృత్యువు పొంచివున్నట్టే. మరెందరికో గర్భశోకం గుమ్మం దాకా వచ్చినట్టే. వాహన వేగానికి మద్యం మత్తు తోడైనా, నిద్ర లేమి జత కలిసినా, నరనరాన నిర్లక్ష్యం పేరుకుపోయినా - మృత్యువు తిష్టవేసినట్లే.
మద్యం కిక్కెక్కిస్తుంది. ఖరీదైన వాహనం కవ్విస్తూంటుంది. స్నేహితుల పొగడ్తలు ఎక్కడలేని బలాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఎక్కడలేని అతి విశ్వాసం తోడవుతుంది. ఖాళీగా వున్న రహదారి ఆహ్వానిస్తూంటుంది. ఇంకేముంది... ఎన్నో ప్రమాదాలకు నిలయమైన ఆ రహదారి సైతం బెంబేలెత్తేలా ఆ వాహనం దూసుకుపోతూంటుంది. వాయువుతో పోటీపడేలా... కాంతి వేగాన్ని సవాలు చేసేలా రెప్పపాటులోనే వేగాన్ని పుంజుకుంటుంది. స్పీడోమీటర్ రెండొందలు దాటి ముందుకు వెళ్లాలా వద్దా అన్నట్లు ఊగిసలాడుతూంటుంది. ఏదీ అడ్డు రానంతవరకూ, అదుపు తప్పనంతవరకూ కొన్ని ప్రాణాలు సురక్షితమే. కానీ అనుకోని ఉపద్రవం ఎదురైనా, వేగాన్ని అదుపు చేయలేని చిన్నపాటి పరిస్థితి ఎదురైనా ప్రాణాలు గాలిలో కలిసినట్టే. తనతో పాటు ఉన్నవారు, దురదృష్టంకొద్దీ రహదారిపై ఆ సమయంలో వెళ్లేవారూ ఈ వేగానికి బలికావలసిందే.
కుమారుడు కోరుకున్నాడనో, సంపన్నులమని చాటుకోటానికో తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీరుస్తారు. అడిగితే కొందరు, అడక్కుండానే మరికొందరు వారికి ఖరీదైన వాహనాలు చేతిలో పెడతారు. స్టేటస్ సింబల్‌గా మారిన ఈ సంస్కృతి ప్రాణాల్నే బలితీసుకుంటోంది. ఎంత సంపన్నుడైనా పోయిన ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేడు. తెలిసి తెలిసి కొని తెచ్చుకుంటున్న ఉపద్రవాలకు కళ్లెం పడేదెన్నడు? మృత్యుబాట పట్టిస్తున్న వేగానికి ముకుతాడు పడేదెన్నడు?
ఏ వాహనమూ మృత్యుశకటం కాదు. ప్రాణాలు తీయడానికే ఏ వాహనమూ తయారుకాదు. చోదకుడి విపరీత ప్రవర్తన, నిర్లక్ష్యం, ఎక్కడ పడితే అక్కడ దొరికే మద్యం, ప్రమాద సూచికలు కొరవడిన రహదారులు - ఇలాంటి అనేకానేక కారణాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తప్పతాగి నడిపే లారీ డ్రైవర్, ప్రయోగాలు చేసే లారీ క్లీనర్, నిద్ర కరువైన బస్ డ్రైవర్, లెక్కకుమించి ప్రయాణికులను ఎక్కించుకున్న ఆటోడ్రైవర్... ట్రిపుల్ రైడింగ్‌తో వేగంగా దూసుకుపోయే టూవీలర్ చోదకుడు... ఒకరనేమిటి ప్రాణాలు హరించే దుర్ఘటనలకు ఇలాంటివారంతా బాధ్యులే.
హీరోయిజం ఎవరి కోసం?!
స్నేహితుల పొగడ్తల కోసం, తన ప్రత్యేకతను ప్రదర్శించడం కోసం, ఆర్థిక స్తోమత, ఏమీ కాదులే అన్న నిర్లక్ష్యం, ఏమైనా జరిగితే అమ్మానాన్న చూసుకుంటారులే అన్న ధీమా - ఇలాంటివెన్నో అనర్థాలకు కారణమవుతున్నాయ. జరిమానాలు పడినా, తల్లిదండ్రులు మందలిస్తున్నా, అప్పుడప్పుడు జరిగే దుర్ఘటనలు కళ్లకు కడుతున్నా, ఎందరో విగతజీవులవుతున్నా - ఇవేవీ తలకెక్కకపోవడం వల్లే ముగింపు ఎప్పుడూ విషాదంగానే ముగుస్తోంది. స్నేహితుల ముందు హీరోయిజాన్ని ప్రదర్శించాలంటే ఇంకెన్నో మార్గాలున్నాయి. జీవితంలో స్థిరపడేలా ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని, ఆ దిశగా కష్టపడి విజయ తీరాలకు చేరుకుని హీరో అనిపించుకోవచ్చు. స్నేహితులకీ, బంధువర్గంలోనివారికీ, తన తర్వాతి తరం వారికి మార్గదర్శకంగా ఉండేలా, పదిమందీ మెచ్చుకునేలా, యువతరానికి నవతరం హీరోగా నిలబడవచ్చు. ఇలా తనకు నచ్చిన రంగంలో నిలదొక్కుకుని, తనకున్న సంపదతో వ్యాపారాన్ని వృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకు అనువైన ఆలోచనలు, అవకాశాలు ఇప్పుడందరికీ చేరువగానే ఉన్నాయి. వీటన్నిటినీ పక్కకుపెట్టి కేవలం మెహర్బానీ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కన్నవారినీ, అయినవారినీ శోక సముద్రంలోకి నెట్టేయడం దేనికి సంకేతం? చట్టాన్ని గౌరవించడం, తప్పు జరిగితే జరిమానాలు కట్టడం, భద్రతా ప్రమాణాలు పాటించడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వంటివాటిని ధరించడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను నియంత్రించుకోవడం, ఓవర్‌టేకింగ్‌లకు స్వస్తి చెప్పడం, సామాజిక స్పృహను అలవర్చుకోవడం... వీటి గురించి ఎవరు చెప్పాలి? ఎదిగిన పిల్లలకు ఆమాత్రం అవగాహన లేకపోవడం క్షమించరాని నేరం కాదా? తన ప్రాణం పోయినా, ఇతరుల ప్రాణాలు తీసేందుకు కారకులైనా ఆ తప్పును సరిదిద్దుకోగలమా? విచక్షణ మనిషిని ఆలోచింపజేస్తుంది. అదుపులో ఉంచుతుంది. గతంలో జరిగిన ఘటనలతో అప్రమత్తం కావటమే కాదు, తను ఉన్న స్థితిపై స్పృహ ఉండటం, ఆలోచనలను నియంత్రించుకోవడం వంటి అనేకానేక వాటివల్ల విచక్షణ అలవడుతుంది. ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవాలి. పెద్దల సూచనలను చెవికెక్కించుకోవాలి. గుండెపోటు వచ్చి విలవిల్లాడుతున్నా చివరి క్షణంలో బస్సును నిలిపివేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్లూ ఉన్నారు. ప్రాణాల విలువ తెలిసిన అలాంటివారి నుంచి స్ఫూర్తి పొందేవారు ఎందరు?
పెరిగిపోతున్న ఖరీదైన కార్లు
ఖరీదైన కార్ల వాడకం స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అమ్మకాలు పెరుగుతున్నకొద్దీ వీటి తయారీకి సంస్థలు పోటీపడుతున్నాయి. గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించాలంటే రహదారులు అనుకూలంగా ఉండాలి. అందుకు సంబంధించి ప్రమాణాలూ ఉండాలి. అవసరమైనప్పుడు అదుపు చేయగలగాలి. కానీ మన దేశంలోని రహదారులు అందుకు అనువుగా ఉన్నాయా లేదా అనే ఆలోచన శూన్యం.

ఖరీదైన కార్లు ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి నెలా 250కి పైగా అమ్ముడవుతున్నాయంటే వాటిపై మోజు ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. విదేశాల్లో తయారైన ఖరీదైన బైక్‌లు, కార్లు గంటకు 200, 250, 295 కి.మీ ప్రయాణిస్తాయి. 80 కి.మీ వేగంతో వెళ్లాల్సిన చోట 200 కి.మీ వేగంతో వెళితే జరిగే అనర్థం ఊహకందనిదేమీ కాదు.
ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు
దేశవ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. దేశంలో ఎక్కడో ఒకచోట నిమిషానికో ఘోర రోడ్డు ప్రమాదం జరుగుతోంది. వీటిల్లో ప్రతి గంటకు 16మంది చొప్పున దుర్మరణం చెందుతున్నారు. ఢిల్లీలో అయితే రోజుకు ఐదుగురు చొప్పున మరణిస్తుండగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రతి గంటకు ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాద మృతుల్లో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉంది. రోజుకు 1214 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా అందులో ద్విచక్ర వాహనాల వాటా 25 శాతం. రోజుకు సగటున దేశంలో 377 మరణాలు కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే చోటుచేసుకుంటున్నాయి. ఇది జుంబోజెట్ విమాన ప్రమాద మృతులతో సమానం. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 16మంది చిన్నారులు రోడ్డు ప్రమాదాలు బలితీసుకుంటున్నాయి. మద్యం తాగి వాహనం నడపటం వల్ల జరిగే ప్రమాదాల సంఖ్యే ఎక్కువ.
ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఖరీదైన బైక్‌లు, కార్ల ముచ్చట ఎందరో ప్రముఖుల పిల్లలను బలిగొంది. బాబూమోహన్ కుమారుడు పవన్‌కుమార్, కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి, క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ - వీరంతా ఖరీదైన బైక్‌ల వేగానికి బలైపోయినవారే. తాజాగా ఏపి మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, పారిశ్రామికవేత్త కుమారుడు రాజా రవీంద్ర ఖరీదైన కారు వేగానికి అసువులు బాసినవారే. ఎన్ని దుర్ఘటనలు జరిగినా, ఎందరో తల్లులకు గర్భశోకాన్ని మిగిల్చినా ఎప్పటికప్పుడు చర్వితచరణమే.
స్వీయ నియంత్రణే ప్రత్యామ్నాయం
రోడ్డు ప్రమాదాలు తగ్గాలన్నా, మరణాల రేటు కుదించాలన్నా వేగాన్ని నియంత్రించుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రతి చోదకుడికీ స్వీయ నియంత్రణ అవసరం. ఇది ఒకరు చెపితే వచ్చేది కాదు. ప్రాణాలతో చెలగాటం ఎప్పటికీ ప్రమాదమే. దుర్ఘటన జరిగిపోయన తర్వాత పశ్చాత్తాపపడి లాభం లేదు. ప్రమాదాలకు కేవలం ప్రభుత్వ శాఖల్నో, పోలీసు వ్యవస్థనో బాధ్యుల్ని చేయడం తగదు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గుర్తెరగాలి. ఒక చిన్న తప్పు పెను ప్రమాదానికి దారితీయవచ్చు. అలాంటి వాటికి అవకాశం లేకుండా స్వీయ నియంత్రణే సరైన మార్గం.
- ఎస్. మోహన్‌రావు

నెత్తురోడుతోన్న రహదారులు

దేశవ్యాప్త సగటు కంటే తెలంగాణలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. రవాణా శాఖ, పోలీస్ శాఖ, రోడ్డు భద్రతపై ఎన్ని జాగరూకతలు వహించిన, ట్రాఫిక్ నిబంధనలు విధించినా ప్రమాదాలు తగ్గడం లేదు. ఇటీవల కేంద్ర రోడ్డు భద్రతా మండలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 29 మంది మరణిస్తుండగా, తెలంగాణలో ఈ సంఖ్య 34గా నమోదై జాతీయ సగటు కంటే 5 శాతం ఎక్కువగా రికార్డవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా భాగం హైదరాబాద్ పరిసరాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణవ్యాప్తంగా 214 ప్రమాదాల జోన్లుగా గుర్తించారు. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్‌ల వద్ద తగు సూచికల బోర్డులు, ప్రమాదాలు జరగే స్పాట్‌ల సమీపంలో అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేందుకు ఆసుపత్రులు, వాహన సదుపాయాలు లేకపోవడం వల్ల మరిన్ని మరణాలు పెరుగుతున్నాయి. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పట్టణాలకు తరలించే లోపు ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.
గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే.. 2014లో 23,456 ప్రమాదాలు జరుగగా, 7,908 మంది మృతి చెందారు. 2015లో 24,396 ప్రమాదాలు సంభవించగా, 8,297 మంది మరణించారు. 2016లో 21,252 ప్రమాదాలు జరిగాయి. 7,110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది (మే 10వ తేదీ నాటికి) సుమారుగా 13,872 ప్రమాదాలు జరుగగా, 4,248 మంది మృతి చెందారు. 15,800 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు.
అదేవిధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కావడంతో ఔటర్ రింగ్‌రోడ్డు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పివి నరసింహారావు హైవే ఎక్స్‌ప్రెస్ రహదారులు, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐదు పోలీస్ జోన్ పరిధిలో నిరుడు జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో మొత్తం 2,578 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నార్త్‌జోన్‌లో 613, వెస్ట్‌జోన్‌లో 597, ఈస్ట్‌జోన్‌లో 517, సౌత్‌జోన్‌లో 354, సెంట్రల్ జోన్‌లో 497 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా 2017 మే, 10వ తేదీ నాటికి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నార్త్‌జోన్‌లో 192, ఈస్ట్‌జోన్‌లో 206, వెస్ట్‌జోన్‌లో 180, సౌత్‌జోన్‌లో 172, సెంట్రల్ జోన్‌లో 186 ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన.. భద్రత చర్యలు పాటించకపోవడం.. మద్యం మత్తు... ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయ. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కనీసం రోజుకు 20 నుంచి 30 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో అతివేగం, ఆటో, సెవెన్ సీటర్, టిప్పర్ వంటి వాహనాల్లో సామర్థానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మాదాపూర్‌లో ఓ ఆటో డ్రైవర్ ఓవర్ లోడ్‌తో ప్రయాణికులను తీసుకెళ్తుండగా ఓ మహిళ ఆటో ఎక్కబోయింది. ఓ చేతితో ఆటో సైడ్ రాడ్‌ను పట్టుకుంది. మరో చేతితో పట్టుకునే సమయానికి ఆటో డ్రైవర్ అతివేగంతో వెళ్లాడు. కనీసం కిలోమీటర్ మేరకు ఆటో మహిళను లాక్కెళ్లింది. పివి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ కారు అతివేగంతో పల్టీకొట్టగా జరిగిన సంఘటన స్థానికులను కలచివేసింది. అదేవిధంగా ఓ రంగారెడ్డి జిల్లాలో ఓ స్టీరింగ్ అటో బోల్తాపడి నలుగురు మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ఓ చిన్నారి, మరో ఇద్దరి ప్రాణాలను బలిగొన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ రహదారిపై బైక్ రేసింగ్‌లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ర్యాష్ డ్రైవింగ్‌లో ఓ మాజీ సైనికుడిని ఢీ కొట్టగా మృతి చెందిన సంఘటన, ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ వాహనాలు సైతం అధిక లోడ్‌తో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ర్యాష్ డ్రైవింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి కౌనె్సలింగ్‌తోపాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఫిట్‌నెస్, లోడ్ సామర్థ్యం వంటి వాటి తనిఖీలు చేపడుతున్నా..కాలం చెల్లిన వాహనాలతోనే యజమానులు కాలం గడిపేస్తున్నారు.
ప్రమాదాలకు నిలయంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డు
ఔటర్ రింగ్‌రోడ్డుపై గత మూడేళ్లలో జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే.. 2014లో మొత్తం 75 ప్రమాదాలు జరుగగా వీటిలో ఘోర రోడ్డు ప్రమాదాలు 37, సాధారణ ప్రమాదాలు 38, కాగా 43 మంది మృతి చెందగా, 73 మంది గాయపడ్డారు. 2015లో 84 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిలో ఘోర ప్రమాదాలు 41 కాగా, 43 సాధారణ ప్రమాదాలున్నాయి. ఈ ప్రమాదాల్లో 49 మంది మృతి చెందగా, 81 మంది గాయపడ్డారు. 2016లో 85 ప్రమాదాలు జరగ్గా 36 ఘోర రోడ్డు ప్రమాదాలు, 49 సాధారణ ప్రమాదాలు. వీటిల్లో 40 మంది మృతి చెందగా, 78 మంది గాయపడ్డారు.
-సయ్యద్ గౌస్ పాషా

మృతుల్లో యువకులే ఎక్కువ

ఆంధ్రధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మితిమీరిన వేగమేనని నిపుణులు తేల్చేశారు. చేతిలో ఖరీదైన కారు.. కవ్వించే వేగం.. ఇంకేముంది ప్రయాణం పైలోకానికే దారితీస్తోంది. పరుగులు తీసే ప్రయాణం అదుపుతప్పి ఘోర ప్రమాదాలకు కారణమవుతోంది. వెరసి ప్రాణాల్ని బలితీసుకుంటోంది. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరికీ ఆందోళన తప్పడం లేదు.. డ్రైవింగ్ చేసేవారికి సరదాగానే ఉండవచ్చుగాని, వారి కుటుంబసభ్యులకు మాత్రం కడుపుకోత మిగులుతోంది. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం వాహన చోదకులేనని గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. రహదారుల ఆకృతి లోపాలు కారణాలవుతున్నాయి. రోడ్డు ప్రమాదాల సగటులో దేశం రెండోస్ధానంలో ఉండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. రోడ్డు ప్రమాదాల కారణంగా గత ఏడాది ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 7836మంది అంటే సగటున రోజుకు 41మంది మరణిస్తున్నారు. ఈ సంఖ్య ఏటికేడు పెరుగుతున్నందున మృతుల్లో సగం మంది యువకులే కారణం కావడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జరిగిన రహదారి ప్రమాదాల్లో కృష్ణాజిల్లా నందిగామ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన, అదేవిధంగా చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద చోటు చేసుకున్న లారీ ప్రమాద ఘటనలో పదుల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ తప్పు డ్రైవర్‌దేనని స్పష్టమైంది. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్లే అంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకోవాల్సి వచ్చింది. అతివేగం తర్వాత మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలకు మరో కారణంగా స్పష్టమవుతోంది. చనిపోతున్న వారిలో యువతే సింహభాగంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 18-30 మధ్య వయస్కులు 2398 మంది మరణించారు. వీరి మరణాలు తల్లిదండ్రులకు తీరని క్షోభగా మిగులుతోంది. దీంతో కళ్ళు తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు శ్రీకారం చుట్టింది. పోలీసు, రవాణాశాఖ, ఆర్ అండ్ బి, నేషనల్ హైవేస్ తదితర శాఖలతో ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసి అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది సుమారు 24వేల పైగా ప్రమాదాలు జరుగుతుంటే ఏడాదికి ఎనిమిది వేల మంది మృత్యువాత పడుతున్నట్లు రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు స్వయంగా ప్రకటించారు. ఏపిలో సగటున రోజుకు 70 ప్రమాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఆఖరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సంతృప్తి పడాల్సిన అవసరం లేదు. నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. దీనిలో భాగంగా ప్రభుత్వం ఇటీవల జరిపిన సర్వేలో రోడ్డుప్రమాదాలు కారణాలు కనుగొన్నారు. రోడ్లు సరిగా లేకపోవడంతోపాటు, తాగి వాహనాలు డ్రైవ్ చేయడం, మితిమీరిన వేగంతో వెళ్లడమే. వీటిని నియంత్రించేందుకుగాను టెక్నాలజీని వినియోగించుకుంటూ ఓ ప్రత్యేక అప్లికేషన్ తయారు చేశారు. ఈ యాప్ ద్వారా డ్రైవింగ్ చేసే వారిని అప్రమత్తం చేయడం, టోల్‌గేట్ల వద్ద బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి మద్యం తాగిన డ్రైవర్లను గుర్తించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సుమారు 1130 ప్రమాద ప్రేరిత ప్రదేశాలను (బ్లాక్‌స్పాట్స్) గుర్తించారు. అదేవిధంగా మలుపులు కూడా ప్రమాదాలకు హేతువులుగా గుర్తించారు. దీంతో ప్రతి 100 మీటర్లకు రహదారి వెంబడి తొమ్మిది అడుగుల ఎత్తులో అప్రమత్తం బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రం మొత్తం మీద ఈ బ్లాక్‌స్పాట్ల వద్ద ఎనిమిదివేల బోర్డు వచ్చే రెండు మాసాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు డిజిపి ఇటీవల ప్రకటించారు.
-సురేంద్రకుమార్ పోతిపోగు

- ఎస్. మోహన్‌రావు