అక్షరాలోచన

గ్రంథాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయంకి వెళ్లడమంటే
దేవుళ్లందరూ ఒక్కచోటే కొలువై ఉన్న
కోవెలకు వెళ్లడమే!
ప్రతీ గ్రంథంలోనూ దైవాన్ని దర్శించి
పరమాత్మతో సంభాషించడమే

ఆ దేవాలయంలో జీవిత చరిత్రలను పఠిస్తుంటే
వ్యక్తిత్వ విలువలు ఉరకలు వేస్తూ
మాలిన్యపు మనస్తత్వాలను శుభ్రంచేసి
మనిషిని ‘మనీషి’గా మారుస్తాయ్

శతక పద్యాలను పాడుతుంటే
నీతి పరిమళాలు గుబాళిస్తూ
దుర్గంధపు దుర్గుణాలు భూస్థాపితమై
తోటి వారికి సాయపడమంటాయ్

ఆశు కవిత్వాన్ని చదువుతుంటే
చతురతలు కట్టలు తెంచుకొని
హాస్యం ఆనంద ఝరులై
బరువైన హృదయాలు దూదిపింజలై పోతాయ్

గేయ కవిత్వాన్ని ఆలపిస్తుంటే
సరిగమలు సరిగంగ ప్రవాహాలై
పదాల పదనిసలు పన్నీరుజల్లై
మలిన మనసులు పరిశుద్ధమవుతాయ్

విభిన్న కథలను పఠిస్తుంటే
మానవీయ సంబంధాలు అవగతమై
మమతానురాగాలు నవనీతాలై
బంధాలు గట్టిపడి పీట ముడులవుతాయ్

వచన కవితలు చదువుతుంటే
పదం పదం మబ్బుల గుబ్బలై
బీడువారిన జీవితంలో వర్షం కురిసి
మోడువారిన ఆశలు చిగురిస్తాయ్

పత్రికలను పఠిస్తుంటే
విశ్వాన్ని విహంగంలా చుట్టినట్లై
అందరూ బాగుండాలి
అందులో నేనుండాలని
వాక్యోపదేశాలతో కర్తవ్యబోధ చేస్తాయ్

శాస్త్ర గ్రంథాలను చదువుతుంటే
శాస్తజ్ఞ్రుల ఆవిష్కరణల లోగుట్టు తెలిసి
అజ్ఞాన తిమిరాలు పటాపంచలై
విజ్ఞాన వెలుగులు విరబూస్తూంటాయ్

అందుకే ప్రతీ గ్రామంలో
కోవెలలాంటి గ్రంథాలయాన్ని నిర్మిద్దాం
గ్రంథాలనే దేవుళ్లను ప్రతిష్టిద్దాం
పఠనంతో ప్రతి పుటలో దైవాన్ని దర్శిద్దాం
జన్మాలను తరింపజేసుకుందాం.
*

-పెంకి విజయకుమార్ 9553392949