అమృత వర్షిణి

గత వైభవ చిహ్నం ఆకాశవాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవస్థలకు గుర్తింపు లభించేది ఎప్పుడైనా, ఎక్కడైనా అందులో పనిచేసే వ్యక్తుల వల్లే. ప్రభుత్వాధీనంలో కొన్ని బ్రహ్మ పదార్థంలా కనిపించే సంస్థలుంటాయి. ఎవరెవరు డైరెక్టర్లో, ఎవరికి మరెవరు సహాయకులో తెలియదు.
కానీ మిగతా వాటితోబాటు, వారు కూడా సకల సౌకర్యాలూ అనుభవిస్తూనే ఉంటారు. కానీ ప్రజల కోసం, ప్రజల మధ్య వుండే కొన్ని ప్రచార మాధ్యమాలున్నాయి. ప్రసార మాధ్యమాలున్నాయి. అందులో పనిచేసే వ్యక్తులకు జవాబుదారీతనం సహజంగానే ఉంటుంది. వుండాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడనుకోవడానికి వీలుండదు. ప్రచార ప్రసార వ్యవస్థలలో ‘సృజనాత్మకత’ బ్రహ్మపదార్థంలా కనిపిస్తుంది. కానీ ఇదే ఓ ప్రత్యేకమైన అర్హత.
ఇది లేని ప్రసారాలకు వ్యక్తిత్వం, గుర్తింపులంటూ వుండవు. సృజనాత్మకత అంటూ లేకుండా, వినకేం చేస్తారనే ధైర్యంతో చేసే కార్యక్రమాల వల్ల ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలు.. పశువుల్లో గర్భకోశ వ్యాధులు, నివారణ చికిత్స.. అసంఘటిత కార్మికుల సమస్యలు - పరిష్కారాలు, వరిలో దోమపోటు, నివారణ.. పశువుల్లో గాలికుంటు వ్యాధి - నివారణ, వర్షాకాలంలో సాధారణంగా వచ్చే వ్యాధులు - చికిత్స.. వినియోగదారుల సమస్యలు - పరిష్కారాలు లాటివన్నీ ఉపయోగపడేవే కావచ్చు. ఐనా అందరూ, ఆసక్తిగా అన్ని పనులూ మానేసి రేడియో ముందే కూర్చుని శ్రద్ధగా వింటారనుకోవడానికి వీలులేదు. వినాలనిపించేలా చెప్పగలిగే నేర్పుంటేనే సంబంధం లేని ఏ విషయమైనా శ్రోతలు వింటారు. ఏం మాట్లాడుతున్నారు? అన్నది ప్రధానం కాదు. ఎంత ఆకర్షణగా చెబుతున్నారనే దాని మీదే ప్రసార వ్యవస్థ నడుస్తుంది. పేజీల కొద్దీ రాసేసి మైకు ముందు చదివేస్తే వినేదెవరు? విజయవాడ రేడియో కేంద్రం నుండి ఎన్నో దశాబ్దాలుగా ప్రసారమయ్యే కార్యక్రమం ‘కార్మికుల కార్యక్రమం’. మధ్యాహ్నం తెలుగు వార్తలైన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు ఒక వాద్య బృంద సంగీతం 30 సెకన్లపాటు వినిపిస్తుంది. దీనికి రూపకల్పన కొన్ని దశాబ్దాల క్రితం ఈ వేళ సినీ సంగీత దర్శకుడైన మాధవపెద్ది సురేష్, సర్రాజు (ప్రసన్నకుమార్) కలిసి రూపొందించారు. ఈ క్షణం వరకూ అదే కొనసాగుతోంది.
కార్మికుల కార్యక్రమం అనగానే ఏ వ్యవసాయ కార్మికులకు సంబంధించినవో, గని కార్మికుల కోసమో, నేత పనివారికో సంబంధించే వుంటాయి. రేడియో సెట్ల ముందు అందరూ శ్రద్ధగా వినకపోయినా మధ్య మధ్యలో వినిపించే సినిమా పాటల కోసమే చాతక పక్షుల్లా వినేవారు.
హరికథ గానంలో ప్రసిద్ధుడై, జానపద గీతాలు రక్తిగా పాడగలిగిన ప్రయాగ నరసింహశాస్ర్తీ ఆ రోజుల్లో అన్ని విషయాలపై సమగ్రంగా మాట్లాడగలిగే ప్రజ్ఞా సామర్థ్యాలున్న వ్యక్తి. రేడియోలో ప్రొడ్యూసర్. వారానికోసారి ‘వినోదాల వీరయ్య’ అనే కార్యక్రమంలో కార్మికులకు సంబంధించిన ఎనె్నన్నో విషయాలను ఆకర్షణీయంగా మలిచి తన వాక్చాతుర్యంతో మధ్యమధ్యలో ఖుషీ ఖుషీగా నాలుగు పాటలు తాను పాడుతూ, అప్పటికప్పుడు కనిపించిన కళాకారులను స్టూడియోలోకి పిలిచి, వారిచేత పాడించేసి, అరగంట కార్యక్రమం అర నిమిషంలో అయిపోయిందా - అనిపించేలా నిర్వహించటం నా ప్రత్యక్ష అనుభవం.
‘వినోదాల వీరయ్య’ పేరు చెప్పి జటిలంగా వుండి, వినే ఆసక్తిలేని విషయాలను చాకచక్యంగా చెప్పే శాస్ర్తీగారికి ఆ రోజుల్లో ఎంతో పేరు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వఠెం సత్యనారాయణ, శ్రీమతి రతన్ ప్రసాద్‌లు ఎనౌన్సర్లుగా పనిచేస్తూ, ‘ఏకాంబరం, చిన్నక్క’లుగా అవతారాలెత్తి శ్రోతలకు విసుగు తెప్పించకుండా, మధ్యమధ్యలో రెండు సినిమా పాటలను జతచేసి, ఆ కార్యక్రమం శ్రద్ధగా వినేలా చేసిన ఘనులు. వీరిద్దర్నీ అనుసంధానం చేస్తూ జీడిగుంట రామచంద్రమూర్తి ‘బాలయ్య’గా ఎనె్నన్నో విషయాలు మాట్లాడేవారు. శ్రోతలు అత్యంత ఆసక్తిగా వింటూండేవారు.
ఆ రోజుల్లో ఆకాశవాణి కేంద్రం సందర్శించేవారు ఈ ముగ్గుర్నీ చూడకుండా వెళ్లేవారు కాదంటే, వీరికున్న పాపులారిటీ ఎంతో అర్థమవుతుంది. కేవలం వాక్కు వల్ల పది మంది నోళ్లల్లోనూ తిరిగిన ఆనాటి రేడియో కళాకారులకు సినీ నటులకున్నంత క్రేజ్ వుండేదంటే అతిశయోక్తి కాదు.
వెనుకటి తరంలో పద్య నాటకానికి ప్రాణం పోసి కీర్తి గడించిన పౌరాణిక నాటక రంగస్థల నటుడు కపిలవాయి రామనాథశాస్ర్తీ మేనల్లుడుగా, కైకాల సత్యనారాయణ (సినీ నటుడు) సహాధ్యాయిగా, పెండ్యాల నాగేశ్వర్రావుకు బావమరదిగా సుపరిచితుడైన వఠెం సత్యనారాయణ 1964లో హైదరాబాద్ రేడియో కేంద్రంలో ఒక అనౌన్సర్‌గా చేరి, ‘ఏకాంబరం’గా కార్మికుల కార్యక్రమాన్ని అసంఖ్యాక శ్రోతలు ఆసక్తిగా వినేలా చేసిన మాటల మాంత్రికుడు. ‘హల్లో ఏకాంబరం’ అంటూ పలకరిస్తూ ఓ మధ్యతరగతి విరుపుతో సునిశితమైన విషయాలను, సున్నితమైన వినోదంతో జతగూర్చి, నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు వాకిళ్లల్లో ‘చిన్నక్క’గా నిలిచిన ‘రతన్‌ప్రసాద్’ మంచి నటి. సంగీత సాహిత్యాభిరుచి కలిగి పాట, మాట రెండూ అలవోకగా అలవాటైన అరుదైన కళాకారిణి. ఆ రోజుల్లో పెద్దబాబుగా ఉషశ్రీ ‘కృష్ణయ్య’గా తురగా కృష్ణమోహన్, రతన్ ప్రసాద్ రమణక్కలుగా ‘కార్మికుల కార్యక్రమాన్ని’ అత్యంత ఆసక్తితో నిర్వహించటం నేనెరుగుదును.
రేడియో కేంద్రంలో వీరి వృత్తులు వేరు. కాని అంతర్గతంగా వీరిలో సహజంగా వున్న అభిరుచుల కారణంగా వీరి ప్రజ్ఞా పాటవాలను ఆకాశవాణి చక్కగా వినియోగించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఈ కళాకారులు సఫలీకృతులయ్యారు.
* * *
నాకు తెలిసినంత వరకూ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమా లన్నింటికీ బాధ్యత వహించేవారు రెండు రకాలుగా వుంటారు. ఒకరు కార్యక్రమ నిర్వాహకులు, రెండవ వారు సాంకేతిక పరమైన విషయాలను చూసే ఇంజనీరింగ్ అధికారులు - అంతా తెర వెనుక వుండేవారే.
శ్రోతలతో ప్రత్యక్ష పరిచయం కాగలవారు, అందులోని కళాకారులే (స్టాప్ ఆర్టిస్టులు) నేను రేడియోను విడిచి 18 ఏళ్లైంది. ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎఫ్‌ఎం స్టేషన్లు, మరెన్నో ప్రైవేటు ఎంఎఫ్ కేంద్రాలు ఆవిర్భవించాయి. శ్రోతల అభిరుచులు మారాయి. రేడియో ప్రసార భారతి అయ్యింది. పాతకాలంలో ఆలిండియా రేడియోకుండే వైభవం తగ్గింది. వినే ఓపిక లేదు. సమస్తం కంటికి కనిపించేస్తున్నాయి. అన్నీ కరతలామలకం అయిపోయి, చూడవలసిన వాటి కంటే, చూడకూడనివి, బాహాటంగా దర్శించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. రేడియో అవసరం గణనీయంగా తగ్గింది. వారం వారం రేడియో కార్యక్రమాల తీరుతెన్నులపై, ఆర్‌ఎం చల్లా (చల్లా రాధాకృష్ణమూర్తి) రాజమండ్రి నుండి ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమంపై తనదైన శైలిలో విశే్లషిస్తూ దోషాలను నిర్భయంగా ఎత్తిచూపేవాడు. ఇప్పుడా అవసరం లేదు. పత్రికలలో, రేడియో కార్యక్రమాల వివరాలు ప్రచురింపబడేవి. ఆకాశవాణి ప్రసారమైన ప్రముఖుల ప్రసంగాల నుండి కొన్ని భాగాలను ప్రచురిస్తూ కళాకారుల ముఖచిత్రాలతో ఎంతో ఆకర్షణీయంగా ‘వాణి’ అనే పత్రిక వెలువడేది. ఇప్పుడా వైభవం కాస్తా మరుగైంది. టీవీ ఛానళ్లతో పోటీ పడగల సత్తా కలిగిన మేధావులు ఈ వేళ రేడియోలో ఎందరున్నారు? ఒకరో, ఇద్దరో వున్నా, వారికి దన్నుగా ఆర్థిక వనరులు లేవు. దూరదర్శన్ కేంద్రాల పరిస్థితి కూడా దీనికి భిన్నం కాదు.
కోట్లాది రూపాయలు విలువైన స్థిర చరాస్తులు కలిగిన ఈ ప్రసార మాధ్యమాల పరిస్థితి ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్నట్లుండి ప్రసార వ్యవస్థల ఉనికే ప్రశ్నార్థకమై కూర్చుంది. మార్పు కోసం వేచి చూడాలి.

- మల్లాది సూరిబాబు 90527 65490