అమృత వర్షిణి

అక్కడ గానం చేస్తే కైవల్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర పుణ్యక్షేత్ర దర్శనం చేసినప్పుడల్లా ఆయా దేవతలపై ప్రముఖ వాగ్గేయకారులు అజరామరమైన కీర్తనలు ఒకటో రెండో గర్భగుడిలో ఓ ప్రక్కగా నిలబడి పాడుకుని బయటకు రావటం నాకో అలవాటు. సుందర శిల్ప కళతో విరాజిల్లే దక్షిణాదిలోని దేవాలయాల్లో బాగా పురాతనమైనవీ, ఎతె్తైనవీ, ఎంతో విశాలమైనవీ ఉన్నాయి.
వాటిలో కొన్ని స్వయంభూ దేవాలయాలున్నాయి. ఆ దేవాలయాల్లోని అర్చకులకు కూడా అక్కడున్న సంగీత వాతావరణం వల్ల సహజంగానే సంగీతాసక్తి కనిపిస్తుంది. అలాంటి పుణ్య క్షేత్రాలను చూడగానే, వాగ్గేయకారుల కీర్తనలు గుర్తుకు వస్తాయి. పాడకుండా ఏ విద్వాంసుడైనా బయటకు రాగలడా? నా పాట విని ఒక్కొక్కసారి దూరం నుంచి నన్ను గమనించే అర్చకులు కాస్త దగ్గరగా రమ్మని కూర్చుని పాడమని కోరటం కద్దు. దర్శనీయ పుణ్యతీర్థాలలో కాశీ క్షేత్రానికున్న విశిష్టతను వర్ణించటం ఎవరి తరం? మీకు తెలిసే ఉంటుంది. ఆ మధ్య వారణాసి క్షేత్రంలో పునరుద్ధరణలో భాగంగా త్రవ్వకాలు చేపట్టినప్పుడు సుమారు పాతిక నలభై దేవాలయాలు, మరికొన్ని శివలింగాలు బయటపడినట్లు చెప్పారు.
ఇప్పటికీ అక్కడున్న భక్తులు భూమి అడుగు భాగంలో ఎవరెవరో ప్రతిష్ఠించిన శివలింగాలున్నాయంటారు. ఓసారి కాలభైరవ దర్శనమవ్వగానే దానికి సమాంతరంగా సమీపంలోనే వున్న ‘మహా మృత్యుంజయ స్వామి’ దర్శనం చేసుకుని, గట్టు మీద కూర్చుని, నిష్ఠగా జపం చేసే వారిని గమనిస్తున్నాను. వారికి వచ్చేపోయే భక్తుల మీద దృష్టి ఏ మాత్రం లేదు. రుద్రాక్ష మాల తిప్పుతూ ధ్యాన నిమగ్నులై నిశ్చలంగా జపం చేస్తూ కనిపించారు. అక్కడ వాతావరణం ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాస్త ఆలయం లోపలకు వెళ్లి ప్రశాంతమైన ప్రదేశంలో పాడుకుంటున్నాను. ఇరవై నిమిషాల సేపు శ్రద్ధగా నా ప్రక్కనే కూర్చుని నా పాట విన్న సంగీత రసికుడొకాయన, నాతో బయటకు వస్తూ ‘ఇక్కడ ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర సహిత చక్రలింగ క్షేత్రం చూడలేదా?’ అనగానే ఆశ్చర్యపోయి, చూపించమని కోరాను. ఈ సంఘటన 2009లో జరిగింది. అప్పటికి చాలాసార్లు కాశీ వెళ్లాం కానీ ముత్తుస్వామి దీక్షితార్ ప్రతిష్ట సంగతి తెలియదు.
* * *
సంగీత త్రిమూర్తుల్లో ముత్తుస్వామి దీక్షితులు చిన్నవాడు. కాశీ క్షేత్రానికీ దీక్షితుల వారికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది.
దీక్షితుల వారి తండ్రి రామస్వామి దీక్షితులకు మంత్రోపదేశం చేసిన యోగి చిదంబర నాథ యోగి. దీక్షితుల వారి కుటుంబంలోని వారంతా సంగీత సాహిత్య కోవిదులవడంతో చిదంబర నాథయోగి కోరికపై దీక్షితులు వారిని రామస్వామి దీక్షితులు వారణాసికి పంపాడు.
సద్గురువును సేవిస్తూ దీక్షితుల వారు ఐదారేళ్లు కాశీలోనే గడిపారు. మహా దివ్య మంత్ర శాస్త్ర విషయాలన్నీ వొంటబట్టించుకున్నాడు. శక్తి ఉపాసన, శ్రీవిద్యా షోడశాష్టరీ మంత్రోపదేశం పొంది అఖండ సిద్ధులను కైవసం చేసుకున్నారు ముత్తుస్వామి దీక్షితులు.
దీక్షితుల వారి ఉపాసనకు మెచ్చిన చిదంబర నాథయోగి, ఓరోజు శిష్యుణ్ణి ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ‘నాయనా! ఇనే్నళ్లూ ఎంతో నిష్టగా సంగీత రహస్యాలతోబాటు మంత్రజప సాధన, ధ్యాన సాధనపై పట్టు సాధించావు. ఇంక తమిళదేశం వెళ్లు. తిరుత్తణిలోని స్కంధుణ్ణి ఉపాసించు. ఆయన కృప వల్ల పరిపూర్ణ సంగీత సాహిత్య విద్యాకోవిదుడవై సంగీత లోకానికి ఆరాధ్యుడవౌతావని ఆశీర్వదించారు.
గురువుని విడిచి వెళ్లటానికి ఒకవైపు ఇష్టం లేదు. ‘స్వామీ! మీరనుగ్రహిస్తే మరి కొంతకాలం మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను’ అన్నారు దీక్షితులు.
‘చాలు నాయనా! నువ్వు పొందవలసిన మంత్ర సిద్ధులన్నీ పొందావు. మరికొన్ని రోజుల్లో ఈ యిహలోక జీవితానికి ఇంక నేను స్వస్తి చెప్పాలి’ అంటూ, ‘రేపుదయం గంగాస్నానం చేసి అర్ఘ్యం వదలటానికి గంగాజలం చేతిలో వుంచుకోగానే నువ్వు మనసులో సంకల్పించినది ఉత్తర క్షణంలో జరుగుతుంది. అదే మంత్రసిద్ధికి గుర్తు’ అనగానే దీక్షితులు వారు మనసులో ‘వీణ’ను తలుచుకుని గంగాజలాన్ని దోసిలిలోకి తీసుకున్నారు. వీణ కనిపించింది. మరుక్షణంలో కాలికి ‘వీణ’ తగిలింది. సంభ్రమాశ్చర్యాలతో గురువుకు చూపించారు.
వీణ కుండ మీద ‘శ్రీరామ్’ అని రాసి ఉంది. దీక్షితుల వారి ఆనందానికి అవధులు లేవు. గబగబా నడుస్తూ వెళ్లి గురువు పాదాలపై బడ్డాడు. సకల విద్యాపారంగతుడైన దీక్షితుల వారు చిదంబర నాథయోగి కరుణా కటాక్ష సిద్ధితో సిద్ధ సంకల్పుడైయ్యాడు. గురు కటాక్షం, గురుకృపకు అర్థం ఇదే.
‘నాయనా! ఈ వీణ పవిత్రమైన గంగామాత వరప్రసాదం. వాగ్గేయకారుడవై, వైణికుడవై సంగీతలోకంలో ఉజ్వలంగా ప్రకాశించగలవ’ని చెప్పిన కొద్ది రోజులకు చిదంబర నాథయోగి జీవసమాధి పొందారు. ముద్దుస్వామి దీక్షితుల వారు వారణాసిలోని శంకరమఠానికి సమీపంలోని హనుమాన్ ఘాట్‌లో ఆ చిదంబర నాథయోగి జీవసమాధిపై శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. శ్రీచక్ర లింగేశ్వరుడుగా పూజలందుకున్న పరమశివుడు, దీక్షితులకు దిశా నిర్దేశం చేశాడు.
తిరుత్తణి సుబ్రహ్మణ్యుడు వృద్ధుని వేషంలో కనిపించి దీక్షితుల వారి నోట్లో కలకండ వేయటంతో ‘శ్రీనాథాది గురుగుహో జయతి జయతి, శ్రీ చిదానంద నాదోహమితి సంతంతం, హృదిభజామి’ అనే మాయామాళవ గౌళ కృతితో అఖండ సంగీత గానానికి శ్రీకారం చుట్టాడు. మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్ర పారంగతుడై, వాగ్గేయకారుడై సంగీత లోకంలో చిరయశస్సు సంపాదించాడు. 1936 సంవత్సరంలో కంచి పరమాచార్యులు ‘శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి’ హనుమాన్ ఘాట్‌లో శిథిలావస్థలో వున్న స్థలాన్ని చూసి ‘ఇది దీక్షితుల వారి గురువు చిదంబరనాథ యోగి జీవసమాధి శ్రీచక్రం కూడా ప్రతిష్ట చేసి ఉందని గురించి చెప్పేంతవరకూ లోకానికి తెలియకపోవటం విశేషం. త్యాగరాజు, శ్యామాశాస్త్రుల వారి రచనల కంటే భిన్నంగా ఉంటాయి. దీక్షితులవారి కృతులు. సంగీత త్రిమూర్తులలో చిన్నవాడు కావటం వల్ల త్యాగరాజు, శ్యామశాస్త్రుల వారు ప్రత్యేక ఆదరణ చూపించేవారట.
క్షేత్ర పర్యటన చేస్తూ ప్రతీ క్షేత్రంలోనూ ఆయా దేవతలపై కృతులు రచించారు. రాగదేవతలను ఆవిష్కరిస్తూ సాగిన దీక్షితుల వారి కృతులు భక్తితో, ఉపాసనతో నిష్టగా పాడుకోవాల్సినవి. సమర్పణ బుద్ధితో పాడే సమర్థులైన గాయకులకు ఇష్ట కామ్యార్థ సిద్ధి నివ్వగలవీ, శక్తివంతమైనవీ ఈ కృతులు. మ్రొక్కుబడిగా వేడుకగా ఒక్కసారి పాడితే చాలదు. మంత్రంలా మననం చేసుకుంటూ అంతర్ముఖులై గానం చేసేవారికి చేసినంత ఫలం. వారణాసి క్షేత్రాన్ని దర్శించి, దీక్షితుల వారు ప్రతిష్టించిన శ్రీచక్ర లింగేశ్వరుడి సన్నిధిలో ఆ మహానుభావుడి కృతులు విద్వాంసులు పాడితే చాలు. ఆ మహా వాగ్గేయకారునికి అదే పెద్ద నివాళి.

- మల్లాది సూరిబాబు 90527 65490