అమృత వర్షిణి

చిటికెలో బ్రహ్మాండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూటి కొఱకే కోటి విద్యలు. అందులో సంగీతమొకటి. బ్రతుకుతెరువు కోసమే సంగీతాన్ని ఆశ్రయించిన కళాకారులకు సాధారణంగా సంగీతం మానసిక శాంతి నివ్వలేకపోవచ్చు. ప్రతిభ ప్రకృతిని పరవశింపచేసేందుకు ఉపయోగపడక పోవచ్చు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేక పోవచ్చు. కానీ హాయిగా జీవితం సాగిపోతుందనటానికి నిదర్శనంగా చెప్పుకోదగిన, మీకు తెలిసిన సంగీత దర్శకుల్ని గుర్తు చేస్తాను.
1970 ప్రాంతంలో విజయవాడ పున్నమ్మతోట ఇంగ్లీషు క్లబ్‌లో రేడియో కేంద్రమున్న రోజుల్లో అనౌన్సర్‌గా నేను వినిపించే సినిమా పాటల్లో, ప్రత్యేకంగా ఇద్దరు సంగీత దర్శకులు చేసిన పాటలు పనికట్టుకుని వినిపించేవాణ్ణి. ఆనందంతో వారిని మనసులోనే స్మరించేవాణ్ణి. ఒకరు జి.రామనాథన్, మరొకరు ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు. చక్కని భావుకులు ఇద్దరూ. ఇద్దరూ మేధావులే. ముఖ్యంగా కాలక్షేపం కోసం వినే సినిమా పాటలకు, సంగీత గౌరవాన్ని కల్పించిన ఘనులు ఈ ఇద్దరూ. ఈ తరం వారికి బాగా పరిచయమున్న పెద్దపెద్ద సంగీత దర్శకులను తయారుచేసిన అనుభవజ్ఞులైన వారిలో వీరు అత్యంత ప్రముఖులు.
ముఖే ముఖే సరస్వతి! సంగీత గంగలో మునకలు వేసే ఎవరిని సరస్వతి పునీతుల్ని చేస్తుందో ఎవరికెఱుక? చెప్పలేం.
మీరెంతగా వాదించినా ఒకటి నిజం. కళామతల్లి కళాసేవ చేస్తానంటే కాదనేవాడెవడు? కాసులు రాలవు. అందుకే సినిమా ఓ వ్యాపారం. అనుమానం లేదు. దాని కోసం పెట్టుబడి పెట్టేవారికి లాభం తెచ్చేది సాంకేతిక నిపుణులు. దీనికి అన్నింటితోబాటు సంగీతం కూడా ఒక ముఖ్యమైన భాగం. స్వయంశక్తితో విజయాన్ని అందివ్వగలవారి కోసమే వెదుకుతారు తప్ప పైరవీలతోనో, సిఫార్సులతోనో ఈ రంగంలో వచ్చి నిలదొక్కుకుందామంటే కుదిరే పని కాదు. ఒక్క చిటికెలో విజయం సాధించగలగటం తేలికైన విషయం కాదు. పట్టిందల్లా అందరికీ బంగారమవ్వదు. యోగ్యత ఒక్కటే కాదు. యోగం కూడా కలిసి రావాలి.
అలా కలిసొచ్చిన సంగీత దర్శకుడు జి.రామనాథన్. సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేసి డొక్కశుద్ధి కలిగిన నేపథ్య గాయనీ గాయులతో నిఖార్సైన పాటలు పాడించిన ఘనత ఆయనదే. వింటే వింటారు. లేకపోతే లేదు. కానీ పాడితే పాట ఇలాగే పాడాలి. శ్రోతల స్థాయికి సంగీతం పడిపోకూడదనే సిద్ధాంతాన్ని పట్టుకున్న రామనాథన్ చేసిన పాటలన్నీ హిట్టే.
ఒక్కసారి 1950-60 మధ్య కాలంలోని సినిమాలు అప్పటి క్వాలిటీ సాంకేతిక నైపుణ్యం గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ వేళ ఉన్న సాంకేతిక నైపుణ్యం అప్పుడు లేదు. మల్టీ ట్రాక్ సిస్టం లేని రోజుల్లో అటు సంగీత దర్శకులు, ఇటు నేపథ్య గాయకులు వాద్య బృందం పడిన శ్రమకు విలువకట్టలేము. రోజతా అలసిపోయేవారు. వారికి లభించిన పారితోషికాల కంటే వారు పడ్డ శ్రమయే ఎక్కువ. ఎవరి వల్ల ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా మళ్లీ వ్యవహారం మొదటికొచ్చేది.
అర్ధరాత్రైనా, అపరాత్రైనా, పాలో నీళ్లో తాగి పాడిన పాటే మళ్లీ ఉత్సాహం తెచ్చుకుని పాడి స్టూడియోల్లో నుండి ఓకే అనగానే ఊపిరి పీల్చుకుని మరీ బయటకు వచ్చేవారు.
ఆ తరం పాటలన్నీ అలా ఎన్నిసార్లు పాడినా, పాడించినా, వాద్య బృందానికి గానీ, గాయకులకు గానీ విసుగనిపించక పోవటానికి ఒకే కారణం, ఆ పాటల్లో నిండిన రాగ సౌందర్యం భావంతో పాడగలిగిన సాహిత్యం రెండూ కలిసిన మెలొడీ - కేవలం మంచి సంప్రదాయ సంగీతం బాగా వినటం వల్ల ఏర్పడిన అభిరుచి తప్ప తగినంత సంగీత నేపథ్యమంటూ ఏమీ లేకపోయినా పది కాలాలపాటు గుర్తుండిపోయేలా పాటలు కట్టి, జనం నోళ్లలో శాశ్వతమై నిలిచిపోయిన జి.రామనాథన్ తమిళనాటలో బాగా పేరున్న పెద్ద సంగీత దర్శకుడు (1940-1963). ప్రముఖ తమిళ హీరో ఎం.జి.రామచంద్రన్‌కు ఇష్టమై నేటి సినీ సంగీత దర్శకులకు ఆదర్శంగా నిలిచిన రామనాథన్ ప్రజ్ఞా పాండిత్యాలకు ఆనాటి తరం జోహారులర్పించింది. ఆనాటి నేపథ్య గాయకుడు, నటుడు, నిర్మాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌తో అజరామరమైన పాటలు పాడించి, యావత్ సంగీత రసికులకు వీనులవిందు చేశాడు, రామనాథన్. కర్ణాటక సంగీతాన్ని జన బాహుళ్యం బాగా వినేలా ఆయన పాటలలుండటం విశేషం. తన 18వ ఏట నుండీ హార్మోనియం వాయించటం తెలిసిన కారణంగా తమిళ నాటకాల్లో నటించేవాడు, పాటలు కూడా కట్టేవాడు. శుభ్రంగా హార్మోనియం వాయించేవాడు.
హార్మోనియం వాయించే వారికి ఐడియాలు ఎక్కువగా వస్తాయంటారు. ఘంటసాల, టి.ఎం. సౌందరరాజన్, ఎ.ఎం.రాజా, శీర్కాళి గోవింద రాజన్, తిరుచ్చి లోకనాథన్, ఎం.ఎల్. వసంతకుమారి, ఎస్.వరలక్ష్మి, భానుమతి, జిక్కి, పి.బి.శ్రీనివాస్, లీల, సుశీల, బాలసరస్వతి, ఎస్.జానకి మొదలైన ప్రముఖులంతా రామనాథన్ పాటలు పాడినవారే.
సినీ సంగీతమంటే చులకనగా చూసే వారికి కనువిప్పు కల్గిస్తూ కర్ణాటక సంగీతం పట్ల ఒకవైపు అభిరుచిని కలిగిస్తూ, సినిమా పాటలకు శాస్ర్తియ సంగీత గౌరవాన్నిచ్చిన రామనాథన్, మన తెలుగు సినిమాలకు కూడా పని చేయటం విశేషం. కార్తవరాయని కథ, విజయగౌరి, వీరఖడ్గం, వరుడు కావాలి, వీర ప్రతాప్, వీర పాండ్య కట్ట బ్రహ్మన మొదలైనవెన్నో ఉన్నాయి. పి.యు. చిన్నప్ప, దండపాణి దేశికర్, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎన్.సి.వసంత కోకిలం, టి.ఆర్.మహాలింగం, టి.ఆర్.రాజకుమారి, చిత్తూరు వి.నాగయ్య, ఎన్.ఎస్.కృష్ణన్, భానుమతి, టి.ఏ.మధురం, జె.పి.చంద్రబాబు (తమిళ హాస్యనటుడు) మొదలైన సింగింగ్ స్టార్స్ చేత పాటలు పాడించిన ఘనత రామనాథన్‌ది.
నాకనిపిస్తుంది. రోజూ ఓ పాతికో, నలభయ్యో సినిమా పాటలు వినిపిస్తూండేవాణ్ణి. వింటూండేవాణ్ణి. కేవలం మూడున్నర నిమిషాల వ్యవధిలో ఒక్కసారి వినగానే ఆహా! అద్భుతమనిపించేలా పాటలు కట్టి శభాష్ అనిపించుకోవటం ఆషామాషీ వ్యవహారం కాదనేది నిర్వివాదాంశం. ఈ విషయంలో సినిమా సంగీత నిర్వహణ అసిధారా వ్రతమే. కర్ణాటక సంగీత కచేరీలు కనీసం రెండు మూడు గంటలు పాడగా పాడగా లభించే తృప్తి, ఆనందం మూడు నిమిషాల్లో కలిగించడానికి సంగీత దర్శకులు పడే శ్రమ ఎంతటిదో ఊహించవచ్చు. (ఎస్) సుబ్బురాయులు (ఎం) మునుస్వామి సుబ్బయ్య నాయుడు (1914 - 1979) సినిమా పాటలకు సంగీత గౌరవాన్నిచ్చి పాటలు కట్టడంలో మరో ప్రముఖుడు. తమిళనాడులోని కడయ నల్లూర్‌లో పుట్టాడు. సంగీతయ్య అని ముద్దుగా పిలిచేవారు. ఎంజిఆర్‌కు అత్యంత ప్రియమైన సంగీత దర్శకుడు.
ఉత్తర హిందూ స్థానంలో ఓపీ నయ్యర్‌కు అప్పట్లో ఎంత క్రేజ్ ఉండేదో, తమిళంలో ఈ సుబ్బయ్య నాయుడుకు అంత క్రేజ్ ఉంది.
తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో పాటలు చేశాడు. ఆనాటి సంగీత దర్శకులు నేలవిడిచి సాము చేయలేదు. సుబ్బయ్య నాయుడి వంటి వారంతా సంగీతానికి గౌరవమిస్తూనే వారి ఉనికిని కాపాడుకుంటూ పేరు తెచ్చుకున్నారు. ఏదేదో అల్లరి చేసి బ్రహ్మాండమనిపించుకునే అత్యుత్సాహం వుండేది కాదు.
విద్వాంసులు సినిమా రంగంలో అడుగుపెట్టేలా ప్రయత్నించిన ఆనాటి సినీ సంగీత దర్శకుల ధైర్యాన్ని మనం అభినందించాలి. అటువంటి ప్రయత్నం మన సినిమా రంగంలో కూడా జరిగింది. కారైకురిచ్చి అరుణాచలం పెద్ద నాదస్వర విద్వాంసుడు.
ఎస్.జానకి చేత ‘నీ లీల పాడెద దేవా’ అనే పాట పాడించి, ఆమెకు సహకారంగా, చిత్రంలోని సన్నివేశానికి తగినట్లుగా హీరో అయిన నాదస్వర విద్వాంసుణ్ణి ప్రతిబింబిస్తూ అరుణాచలంతో నాదస్వరం వాయింపచేయటం ఒక రికార్డు. చేసేది సినిమా పాటలైనా శాస్ర్తియ సంగీత విలువలు కాపాడాలనే లక్ష్యం బలంగా ఉన్న ఆనాటి వెనకటి తరం సంగీత దర్శకులలో సుబ్బయ్య నాయుడొకరు. పక్షిరాజా ఫిలిమ్స్, మెర్క్యురీ ఫిలిమ్స్, జూపిటర్ పిక్చర్స్, మోడరన్ థియేటర్స్ వంటి పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు, వీరి చేత అద్భుతమైన పాటలు చేయించుకున్నారు. ఆ చిత్రాలన్నీ విజయవంతమవ్వటం విశేషం. కర్ణాటక సంగీతంలో రాధ జయలక్ష్మి ద్వయం అప్పట్లో స్టార్ సింగర్లు. వీరిలో జయలక్ష్మి ఘంటసాలతో పక్షిరాజా వారి ‘విమల’ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. సుబ్బయ్య నాయుడు చేసిన పాటలన్నీ విలువలతో కూడినవే. ఎన్ని పాటలని ఉదహరించగలను? ‘కన్నుల్లో నీ బొమ్మ చూడు.. కన్నుల బెళుకే కలువలురా’ వినే ఉంటారు. ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలనిపించేలా ఉండే ఈలాటి పాటలు సుబ్బయ్య నాయుడి సంగీతాభిరుచి తెలియజేస్తే ఆ పాటల్ని, తన కమ్మని కంఠంతో రసవత్తరంగా గానం చేసిన ఘంటసాలకు జోహార్లనటంలో ఆశ్చర్యమేముంది? వీరి కోవకే చెందిన మరో దర్శకుడు.. సి.ఆర్.సుబ్బరామన్. అతి తక్కువ కాలమే బ్రతికినా, ఆ ఉన్న స్వల్ప కాలంలో తన ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించి వెళ్లిపోయాడు. లైలా మజ్ను దేవదాసు చాలవా? కె.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాథన్, రామ్మూర్తి లాంటి ఎందరో సంగీత దర్శకులకు మార్గదర్శకులై నిలిచి చక్కని సంగీతాభిరుచి కలిగి, సంప్రదాయ సంగీతానికి గౌరవాభిమానాలిచ్చి, ఆణిముత్యాల్లాంటి గీతాలను తయారుచేసిన ఇటువంటి సంగీత దర్శకులు తెలుగు సినిమాకు మళ్లీ వస్తారనుకోవటం అత్యాశే. సారవంతమైన మాటలు, రణగొణ ధ్వనులు లేని సంగీతమంటే తెలిసి, విలువలున్న సంగీత దర్శకుల అవసరం తెలుగు సినిమాకు ఈ వేళ ఉందో లేదో కాలమే తేలుస్తుంది. అంతవరకూ వీరినీ, వీరి పాటలనూ గుర్తుకు తెచ్చుకుని ఆనందించగలగటమే మనకు చేతనైన పని.
*చిత్రాలు.. ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు
*జి.రామనాథన్

- మల్లాది సూరిబాబు 90527 65490, 91827 18656