రాష్ట్రీయం
అందుబాటులోకి వైఎస్సార్ టెలిమెడిసిన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్రంలో కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ టెలీమెడిసిన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సోమవారం ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా టోల్ ఫ్రీ నెంబర్ - 14410ని అందుబాటులోకి తెచ్చారు. ఈ నెల 11 నాటికి 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. టెలీమెడిసిన్ ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ మూడు షిప్టుల్లో ఆరోగ్య సేవలు అందిస్తారు. టెలీమెడిసిన్ ఉద్దేశం.. కోవిడ్-19 కేసులను గుర్తించడం, ఐసోలేట్ చేయడం, పరీక్షించడం, క్వారంటైన్‌కు పంపించడం. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు ఇస్తారు. ఇది మూడంచెలుగా పనిచేస్తుంది. మొదటి దశలో 14410కు మిస్డ్‌కాల్ ఇస్తే ఆ సిస్టమ్ మొబైల్ నెంబర్‌ను, ఇతర వివరాలు నమోదు చేస్తుంది. ఆ తరువాత ఎగ్జిక్యూటివ్ సంబంధిత రోగికి ఫోన్ చేసి వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాలు, తదితర వివరాలు తెలుసుకుంటారు. రోగికి గుర్తింపు సంఖ్య ఇస్తారు. రెండో దశలో రోగి వివరాలన్నీ టెలీమెడిసిన్ వ్యవస్థకు అనుసంధానమైన వైద్యులందరికీ కనిపిస్తాయి. వైద్య బృందంలో ఒకరు కాల్‌ను స్వీకరించి ఓపీ సేవలు అందిస్తారు. రోగికి నిర్వహించాల్సిన పరీక్షలు, మందులను తెలియచేస్తారు. వ్యాధి లక్షణాల ఆధారంగా కోవిడ్-19 అనుమానిత కేసులను గుర్తిస్తారు. అవసరమైతే వీడియో కన్సల్టేషన్ కూడా ఉంటుంది. అవసరమైతే వీరిని ఎక్కడకు పంపాలన్న దానిపై వైద్యులు నిర్ణయం తీసుకుని తరలిస్తారు. మూడో దశలో అనుమానిత కేసుల జాబితాకు రూపకల్పన చేస్తారు. ఈ జాబితాలను జిల్లా అధికారులకు పంపుతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్క్రిప్షన్లు పంపుతారు. ప్రతి రోగికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా ఇంటికే పంపిస్తారు. నాన్-కోవిడ్ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.