తెలంగాణ

బడికి దూరం.. బతుకు భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 21: ఆదివాసీల అమ్మభాషకు గ్రహణం పట్టింది. పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా గిరిజన గూడేల్లో డ్రాపౌట్లు ఏటికేడు పెరుగుతున్నాయి. బడికి దూరమై బతుకుభారమై గిరిపుత్రులు పశువుల కాపర్లుగా మారుతున్నారు. తెలంగాణలో అమ్మభాష ద్వారా గిరిజనులకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు మూలనపడింది. పాలకుల అలసత్వం గిరికూనలకు శాపంగా పరిణమించింది. అదిలాబాదులో గోండుభారతి, వరంగల్‌లో బంజారా భారతి, ఖమ్మంలో కోయభారతి పేరిట ప్రారంభించిన పాఠశాలలన్నీ మూతపడ్డాయి. దీంతో గిరిబిడ్డలు చదువుకు దూరవౌతున్నారు.
2004లో శ్రీకారం...
ఆదివాసీల సాధికారతకు అంబేద్కర్ సూచించిన మూడు ముఖ్యమైన ఆయుధాలు విద్య, పోరాటం, సంఘం. ఆదివాసీలు తమ గురించి, తాము నివసించే సంఘం గురించీ తెలుసుకునేట్లు చేస్తుంది విద్య. సంఘం గురించే కాదు సంఘంలోని వివక్ష గురించి కూడా అవగాహన ఏర్పడేది విద్య ద్వారానే. తమ పట్ల ఈ వ్యవస్థ చేసిన అన్యాయాన్ని ఆదివాసీలు అర్ధం చేసుకోగల్గితే వాళ్లు దానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధపడతారు. తద్వారా చైతన్యవంతులై సంఘటితం అవుతారని అంబేద్కర్ ఆకాంక్ష. చైతన్యశీలతకు మూలమైన విద్య, అక్షరాస్యత ఆదివాసీల్లో కన్పిస్తుంది. అందుకే వారి అమ్మభాషలోనే పాఠాలు బోధించడం ద్వారా వారికి చదువుల తల్లిని దగ్గర చేయాలనే సంకల్పంతో 2004లో పైలట్ ప్రాజెక్టు కింద సర్కారు ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు ఐటిడిఏ పరిధిలో గోండు, కొలామిలకు గోండు భారతి, వరంగల్ జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో బంజారాలకు బంజారభారతి, ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటిడిఏ పరిధిలో కోయలకు కోయభారతి పేరిట పాఠశాలలు ప్రారంభించారు. గోండుభారతిని 325, బంజారాభారతిని 750, కోయభారతిని 250 పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. ఆ తెగలకు చెందిన ఉపాధ్యాయులనే నియమించి, కొన్ని చోట్ల వాలంటీర్లను పెట్టి సర్వశిక్షాభియాన్ తరువాత రాజీవ్ విద్యామిషన్‌ల ద్వారా పాఠ్యపుస్తకాలు ప్రచురించి గిరిపుత్రులకు అందజేశారు. చక్కగా నడిచాయి. డ్రాపౌట్లు కూడా తగ్గాయి.
ఇదే సమయంలో నిఘంటువులను కూడా ఆయా తెగలకు చెందిన భాషా పదాలతో తయారు చేసి ముద్రణ కోసం రాజీవ్ విద్యామిషన్‌కు సమర్పించారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా రూ.35లక్షలు ఖర్చు చేశారు. కీలకమైన ఈ తరుణంలో అకస్మాత్తుగా బడ్జెట్‌ను నిలిపివేశారు. దీంతో కోయతెగకు చెందిన 9, 550, బంజారాలకు చెందిన 12వేలు, గోండు, కొలామిలకు చెందిన 4, 585 మంది పిల్లల భవితవ్యం అంధకారంగా మారింది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అమ్మభాషలో పాఠాలు చెప్పడంతో 2013 విద్యాసంవత్సరం వరకు గిరిపుత్రులు ఉత్సాహంగా బడికి వచ్చారు. 2013-14 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం బడ్జెట్ నిలిపివేసి, పుస్తకాల ముద్రణ ఆపేసి, నిఘంటువులను మూలనపడేసి రాజీవ్ విద్యామిషన్ గిరిపుత్రుల ఆశలపై నీళ్లు చల్లింది. ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం ఐటిడిఏ పిఓలు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు ఎన్ని లేఖలు రాసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. అర్ధంతరంగా పైలట్ ప్రాజెక్టును నిలిపివేయడంతో గిరిజనుల్లో డ్రాపౌట్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. అదిలాబాద్ జిల్లాలో 1 నుంచి 5వ తరగతి లోపు పిల్లల్లో అబ్బాయిలు 11.79శాతం, అమ్మాయిలు 12.07శాతం డ్రాపౌట్లుగా నమోదయ్యారు. వరంగల్ జిల్లాలో అబ్బాయిలు 16.97శాతం, అమ్మాయిలు 15.05శాతం, ఖమ్మం జిల్లాలో అబ్బాయిలు 5.25శాతం, అమ్మాయిలు 4.68శాతం నమోదయ్యారు. ఇవన్నీ 2014-15 విద్యాసంవత్సరంలో రాజీవ్‌విద్యామిషన్(సర్వశిక్షాభియాన్) వెల్లడించిన గణాంకాలే. అదిలాబాద్ నుంచి 2110, ఖమ్మం నుంచి 1740 మంది పిల్లలు బడిబయట ఉన్నారు. ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి ఈ గణాంకాలే నిదర్శనం.
వారు మెచ్చారు.. అమలు చేస్తున్నారు
2004లో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద అమ్మభాషలో గిరిజన పిల్లలకు పాఠాలు బోధించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలలను వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు పరిశీలించి మెచ్చుకున్నారు. బంగ్లాదేశ్, వియత్నాం, యుకె, కెనడాల నుంచి బృందాలు వచ్చాయి. ఇక్కడ అమ్మభాషలో పాఠాల తీరును నిశితంగా పరిశీలించాయి. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ప్రాంతంలో ఆ దేశం తమ గిరిజనులకు వారి మాతృభాషలోనే పాఠశాలలు నిర్వహిస్తోంది. కానీ మన పాలకులు మాత్రం అర్ధంతరంగా వదిలేసి చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా గిరిజనుల పిల్లలు బాలకార్మికులుగా, పశువుల కాపర్లుగా మారకుండా ఉండాలంటే ప్రభుత్వం పక్కా కార్యాచరణతో కూడిన ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి. పైలట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలి. గిరిజనులు అమ్మభాషను బతికించాలి.