కృష్ణ

విహారయాత్ర విషాదాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 1: విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్‌కు వచ్చిన ఐదుగురు యువకుల్లో ఇద్దరిని సముద్రం మింగేసింది. మిగిలిన ముగ్గురిని స్థానికంగా ఉన్న మత్స్యకారులు రక్షించటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుడివాడ మండలం బిళ్ళపాడుకు చెందిన తోట జయ సాయికుమార్(19), రైలుపేటకు చెందిన గూడపాటి జయ సందీప్(18), మందపాడుకు చెందిన తలుపుల రత్నాకర్(18), కొడాలి సాయి మహేష్(17), పసుపులేటి సాయి పృధ్వి(18) గుడివాడలో ఇంటర్మీడియట్ క్లాస్‌మెట్స్. వీరంతా ఆదివారం సరదాగా మంగినపూడి బీచ్‌కు వచ్చారు. బీచ్ తీరంలో వాలీబాల్, తదితర క్రీడలు ఆడిన తర్వాత స్నానం చేద్దామని సముద్రంలోకి దిగారు. సముద్రంలో థర్మాకోల్ షీట్లతో ఆటలాడుతుండగా అలల ఉద్ధృతికి ఉక్కిరిబిక్కిరయ్యారు. దీన్ని గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. రత్నాకర్, సాయి మహేష్, పసుపులేటి సాయి పృధ్విలను రక్షించారు. సాయికుమార్, జయ సందీప్‌లను మాత్రం కాపాడలేకపోయారు. వీరిద్దరి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో సాయిబాబా, బందరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి, తహశీల్దార్ నారదముని హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లారు. పరిస్థితిని సమీక్షించి మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలను విస్తృతం చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా సాయికుమార్, జయ సందీప్‌ల ఆచూకీ లభించలేదు. సాయికుమార్ పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుతుండగా, జయ సందీప్ నూజివీడు సారథి ఇంజనీరింగ్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్నాడు. వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలుకా ఎస్‌ఐ మధు వివరించారు.