అమృత వర్షిణి

ఘంటసాల... ఓ ‘పాట’శాల (అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్ర్తియ సంగీతమంటే మనకేదో అర్థంకాని బ్రహ్మ పదార్థమని కొందరి అభిప్రాయం. సంగీతాన్ని విచ్చలవిడిగా వదలకుండా, ఆ కళకు పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచి పెట్టారు. ఈ నియమాలు పాటిస్తూ పాడితే అది శాస్ర్తియ సంగీతం. అలాగే లలిత సంగీతంలోనూ కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటించాలి. ఇందులో శాస్ర్తియ సంగీతం కంటే కొంత స్వేచ్ఛ ఉంటుంది. అదే ఈ రెంటికీ వున్న తేడా - సామాజిక స్పృహతో తీసిన సినిమాలకు గౌరవం, శాస్త్ర నియమాలు తెలిసి, వాటి ఆధారంతో చేసే సంగీత కల్పనకు శాశ్వతత్వం ఉంటుంది. ‘గాలిగా పాడితే గాల్లోనే కలిసిపోతుంది’ మంచి సినిమాలు, మంచి కథ, అందమైన నటీనటులు, వీటన్నిటితోబాటు, మంచి మధురమైన కంఠం కలిగిన నేపథ్య గానం, ఆ సినిమాని ఉన్నత శిఖరం మీద కూర్చోపెట్తాయి. చాలామంది కట్టుదిట్టంగా సంగీతాభ్యాసం చేస్తారు. కాని ఉత్తమ గాయకులు కాలేరు. దేశంలో పాడగలిగే వారెంతమంది లేరు?
నాభి నుండి సంగీత నాదాన్ని గొంతు నిండా పలికిస్తూ, ఆ నాద సౌఖ్యాన్ని ముందు తాను బాగా అనుభవిస్తూ, చక్కని రవ్వ పలుకులతో పాటకు జీవాన్ని నింపి, భావంతో తిన్నగా వినేవారి హృదయాలకు చేరవేయగలిగిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు- అంటే ఆశ్చర్యపడక్కర్లేదు.
సంగీతం ఎనే్నళ్లు నేర్చుకున్నాం? అనేది కాదు ప్రధానం. ఎలా పాడి మెప్పించగలం? అనేదే ముఖ్యం. మాధుర్యం వున్న గాయకులకు, పాడే తీరు తెలియదు. బాగా పాడి మెప్పించగలవారికి, మాధుర్యం ఉండకపోవచ్చు. చెప్పాలంటే గాయక దోషాలు కలిగిన వారు అనేక మంది ఉంటారు. బాగా పాడగలిగినంత మాత్రాన వినగలిగేలా ఉంటుందని ఎలా అనుకుంటాం. కొందరు పాడతారు. అన్నీ ఉంటాయి. కానీ మూడు నిమిషాలకు మించి వినలేం. ‘స్వీయ లోపమ్మెరుగుటే పెద్ద విద్య’ అన్నారు. ‘ఎక్కడ లోపం ఉందో తనకు తాను తెలుసుకో గలిగినవాడే’ అసలైన గాయకుడు - అవకాశం అనేది కేవలం ఒక ఆధారం మాత్రమే. అదెంతో కాలం నిలబడదు. సర్వ ప్రజా రంజకమైన గాత్రం ఉండీ కూడా, సంగీతాన్ని ఒక తపస్సులా భావించి, పాడుకున్న గాయకుడు ఘంటసాల.
1904-35 ప్రాంతాల్లో ప్రసిద్ధ రంగస్థల నటుడు కపిలవాయి రామనాథ శాస్ర్తీకి అప్పట్లో జనంలో విపరీతమైన మోజు. ఆయన రికార్డులు బ్లాక్‌లో అమ్మేవారు. కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా మంతెన ఈయన స్వగ్రామం. ఆయన నాటకం ఏ ఊళ్లో వున్నా, జనం తండోపతండాలుగా వచ్చేవారు. కష్టపడి (రూ.20) టిక్కెట్లు కొని, నాటకాలు చూసేవారు. ఆయన పద్యాలు చదవడంలో ‘టాప్’. ఆయన తర్వాత మళ్లీ అలాంటి పరిశుద్ధమైన నాదం, మూడు స్థాయిల్లోనూ అలవోకగా (గాత్రాన్ని బిగించకుండా) సునాయాసంగా పాడటంలోనూ ఘంటసాల టాప్’ అని మెచ్చుకున్న సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర్రావు. పెండ్యాల స్వరపరచిన ‘సిరికా కొలను చిన్నది’ అనే సంగీత రూపకం విజయవాడ రేడియో కేంద్రం నుండి కొన్ని దశాబ్దాల క్రితం ప్రసారమైంది. ఆ రికార్డింగ్ నిర్వహణలో నేనూ వున్నాను. వేటూరి సుందరరామమూర్తికి ఈ రూపకంతోనే సినిమా రంగానికి ప్రవేశం లభించింది. ఈ కార్యక్రమం ప్రసారమవటానికి కారకుడు బాలాంత్రపు రజనీకాంతరావు. అదే ‘రజని’ మన ఘంటసాలను రేడియో ఆడిషన్‌లో ఎంపిక చేసి, మధుర గాయకుడిగా తీర్చిదిద్ది రేడియో సంగీత రూపకాలకు కథానాయకుణ్ణి చేశారు. పద్యం ఎలా పాడాలో తెలిసిన పెండ్యాలకు దైతా గోపాలం గురువు. దైతా గోపాలం ప్రఖ్యాత రంగస్థల నటుడు. పద్యగానంలోని మెళకువలు బాగా తెలిసిన ఘంటసాల పాన ‘కుంతీ కుమారి’ పద్యాలు, నేను నా చిన్నతనంలో మొదటిసారి విన్నాను. ‘కంటి వెంట నీరు వచ్చేది - ఆ కంఠంలో ‘ఏం మాయో?’ మా అమ్మ, నాన్న రేడియోలో ఆ పద్యాలు వింటూ ఎంతో ఆనందించేవారు - విన్న రోజు రోజంతా ఏదో దిగులు. అలా తన గానంతో కట్టిపడేసిన గాయకుడు ఘంటసాల. రంగస్థల నాటక ధోరణిలో కొన్నాళ్లు పాడుతూ, ఆ తర్వాత తన శైలిని మార్చి రమ్యంగా, మాధుర్యాన్ని నింపుతూ, భావంతో పాడే విధానం కరతలామలకం చేసుకున్నాడు.
తొలిసారి ఘంటసాల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన రజని మాట్లాడుతూ- ‘లకుమాదేవి, వెలుగు వెల్లువ, నాగకన్యక, కినె్నరసాని మొదలైన సంగీత రూపకాలలో ఘంటసాల పాడేవాడు. రేడియో కోసం సముద్రాల రాసిన ‘దీపావళి’ నాటకం, ఓగిరాల సంగీత నిర్వహణలో, వేదాంతం రాఘవయ్య సహకారంతో ప్రసారమయింది మద్రాసు కేంద్రం నుంచి.
ఇందులో ఘంటసాల, భానుమతి పాడారు. ‘కినె్నరసాని’ విశ్వనాథ వారి రచన. సంగీతం ఘంటసాల. ఆ తరువాత తెలుగులో ‘లైలామజ్ను’ చిత్రం రాకముందే 1947లో రేడియో వారు, ‘లైలా మజ్ను’ నాటకం ప్రసారం చేశారు. అందులో ఘంటసాల ‘మజ్నూ’ పాత్ర వేశాడు. అందులో ‘గుడారమెత్తి వేశారు, ఎందు చూచిన గాని నీవు’ అనే పాటలు పాడుతూ ఘంటసాల చూపించిన గానఫణితి, కొత్త పుంతలు తొక్కి, సినిమా పాటల్లో నేపథ్య గానాన్ని సుస్థిరం చేసింది’ అన్నారు.
రజని - గత నెలలో అంటే జనవరి 29వ తేదీ నాటికి ‘రజనీ’కి 102 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆయనను కలిసి మాట్లాడే అదృష్టం కలిగింది. ఆయన మన మధ్య ఉండటం ఒక సుకృతం. పద్యాలను రాగవరుసలలో పాడే శక్తి మన తెలుగు వారికి పుట్టుకతోనే అబ్బిన గుణం.
ముందు పురాణ ఫక్కీ, ఆ తరువాత రంగస్థల ఫక్కీ, ఇలాటి ధోరణులలో ఘంటసాల పాడటం మనకు తెలుసు. ఆయన పాడే శ్లోకాలకు, పద్యాలకూ ఒక నిర్దిష్టమైన ‘లయ’ ఉంటుంది. ముందుగానే సిద్ధం చేసుకున్న స్వర సంచారాలతో నిండిన మాటలన్నీ గంభీరంగా ఒదిగి ఉంటాయి. రాగరసంతో భావం కలిసిపోయి వినిపిస్తాయి ఆ పద్యాలన్నీ. వీటికి భిన్నంగా ఆయన పాడినవి ‘కరుణశ్రీ’ పద్యాలు. కరుణశ్రీ కుంతికుమారి పద్యాలకు ప్రాణ ప్రతిష్ట చేసి, మన కళ్లెదురుగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే బాలకర్ణుని పేటిక, ఆ సమయంలో కుంతిలోని ఆవేదన, బాధ వినేవారి హృదయాల్ని తాకుతూ ఆనందబాష్పాలతో తడిసి ముద్దయ్యేలా పాడేసిన గాయకుడు ఘంటసాల. అలాగే జాషువా ‘పాపాయి’ పద్యాలు కూడాను. పాతికేళ్ల క్రితం ఓసారి నర్సరావుపేటలో కరుణశ్రీని కలిసి మాట్లాడుతూ కుంతీకుమారి గురించి ప్రస్తావించాను. మచిలీపట్నంలో మహావాది వెంకటప్పయ్య శాస్ర్తీ ‘ఈ కుంతీకుమారి పద్యాలు అద్భుతంగా పాడి ప్రసిద్ధం చేశాడనీ, తనదైన శైలిలో ఈ పద్యాలకు ప్రాణ ప్రతిష్ట చేసి, మళ్లీమళ్లీ వినేలా చేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల’ అని చెప్పారు.
సంగీతానికి స్వరం ఆధారం. స్వరం వేరు. స్వర స్థానం వేరు. అనుస్వరంతో పాడటం తెలిస్తే, అనుకరించే ప్రయత్నం చేయరు. అనుస్వరాన్ని అందరూ గుర్తించలేరు. ఘంటసాలలా పాడతారు చాలామంది. కాని ఘంటసాల కంఠాన్ని ఆశ్రయించి కూర్చున్న ‘అనుస్వరం’ ఉనికిని అందరూ పట్టుకోలేరు. దీన్ని విడమరచి చెప్పటం బాగా సంగీత జ్ఞానం తెలిసిన సద్గురువులైన కొందరికే సాధ్యం. ‘శంభో’ అని కంఠం విప్పి ధారాళంగా నాదాన్ని నింపి పాడిన గాయకులు మనకు ఇద్దరున్నారు. ఒకరు ఆధిభట్ల నారాయణదాసు. ఈయన హరికథా పితామహుడు.
మరొకరు ఘంటసాల గురువు పట్రాయిని సీతారామశాస్ర్తీ. ‘నేల మీద తివాచీ’ పరిచినట్లుగా ఉండేది నాదం. రకరకాల డిజైన్లతో అలంకరించిన తివాచీ లాంటిది గానం. ఆయా గీతాలకు తగినట్లుగా నాదరూపమైన వ్యాఖ్య ఇవ్వటం అనుకరిస్తే వచ్చే ప్రజ్ఞ వల్ల సిద్ధించేది కాదు. సాధ్యం కూడా కాదు. ఉచ్ఛారణ, కంఠస్వరంలో నాదాన్ని పట్టి, పట్టువిడుపులతో సమాన స్థాయిల్లో ప్రతి మాటకూ తగినంతగా ఆ నాదాన్ని సరిపెట్టగలగడం గాయకులకు తెలిసి ఉండాలి. లేదా అనుభవంతో తెలుసుకోవాలి. ‘శంభో’ అని నాదాన్ని పూరించి పాడటంలోని మర్మం ఇదే. సంత పాకల్లో నిలబడి హరికథా గానాన్ని ఉపక్రమిస్తూ ‘శంభో’ అంటే, ఎక్కడో దూరంగా రైల్వేస్టేషన్‌లో ఉన్నవారికి ఖంగుమని వినిపించేది నారాయణదాసు గారి గొంతు’ అనేవారు మా తండ్రిగారు.
మళ్లీ అటువంటి నాద విద్యారహస్యం తెలిసిన గాయకుడు ఘంటసాల. ఎనే్నళ్లు గడిచినా, ఆ పాటల్ని గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? ఆదిభట్ల నారాయణదాసు గారు విజయనగరం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలోనే ఉన్న ఘంటసాలకు ఈ నాద విద్యా విషయాలు తెలియకుండా ఎందుకుంటాయి? తెలుసుకోవాలనే కోరిక కల్గిన వారికి తప్పకుండా తెలుస్తాయి. లేనివారు గ్రూపు ఫోటోలో ఒకరుగా మిగిలిపోతారు. అంతే తేడా. భావంతో బాగా పాడాలనుకునేవారు గొంతు చించుకుని పాడవలసిన పని లేదు. ఇప్పుడు మనం ఆ దౌర్భాగ్య స్థితిలోనే వింటున్నాం. కొందరు గాయకులు తమ కంఠాన్ని శృతిలో మేళవించి పాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఘంటసాల గొంతులోనే ‘శృతి’ ఉందంటారు నాగయ్య.
1970-2000 మధ్య నేను విజయవాడ ఆకాశవాణిలో వివిధభారతిలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కలిపి, పాతిక, నలభై పాటలు ప్రసారమయ్యేవి.
పాటలు వినిపిస్తూ వుండేవాణ్ణి. దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు మెరుపులతో ఆకాశం నిండిపోయి, వర్షం పడకుండా ఉంటే ఎలా ఉంటుంది. అలాగే ఉండేది మనస్సు. పాట వివరాలు చెబుతూ ఎన్ని పాటలు వినిపిస్తున్నా, ఏమో! ఎందుకో? తృప్తి ఉండేది కాదు.
ఓ నాలుగు పాటలైన తర్వాత ఒక్కసారి ఘంటసాల పాట వదలగానే కుంభవృష్టిగా వాన కురిసి వెలిసినట్లుగా ఉండేది, వినే చెవులకు. అప్పుడే కాదు - ఇప్పుడూ అంతే.
సాధారణంగా కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన గాత్రాలకు స్వరాలను గమక యుక్తంగా, బరువుగా పాడాలి. అలా అలవాటైన గాత్రాలకు, గమకాలను చాలా తక్కువగా ఉపయోగిస్తూ పాడటం కష్టం. గమకం ఉంటూ సంగీత మర్యాద పాటిస్తూ, రక్తిగా సినిమా పాటలు పాడిన గాయకుడు ఘంటసాల.
ఆయన సంగీతానికి గౌరవం ఇచ్చిన నిర్మాతలు, దర్శకులే ఉండేవారు ఆ రోజుల్లో. ప్రేక్షకులకు, సంగీత రసికులకూ కమ్మని పాటలు పాడి, సినిమా సంగీత గౌరవాన్ని ఇనుమడింపచేసి వినేవారికి ఉత్తమ సంగీతాభిరుచి కల్గించి వెళ్లిపోయాడు. ఓ రోజు మద్రాసు కేంద్రంలో నిలయ విద్వాంసులంతా విశ్రాంతిగా కూర్చునే గదిలో వోలేటిగారూ, నేనూ కూర్చుని ఉన్నాం. ఎదురుగా ప్రఖ్యాత వయొలిన్ విద్వాంసుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్ కూడా ఉన్నారు. దూరంగా స్పీకర్‌లోంచి చల్లగా, లలితంగా ఓ తమిళ గీతం వినబడుతోంది. అందరి దృష్టి ఆ పాట మీదకు వెళ్లిపోయింది. ఆ పాట పాడినది ఘంటసాల.
రాగేశ్వరి రాగంలో ఆయనే స్వరపరచుకుని పాడారు. ‘అదిదా పాటై’ (రొంబ సుఖమిరుక్కు) పాటంటే అది. ఎంత సుఖంగా ఉందో చూడండి అన్నారు ఎంఎస్‌జి.
ఆ పాట కోసం విజయవాడ లైబ్రరీలో వెదికి మళ్లీ విన్నాను. బడేగులామలీఖాన్ ప్రభావంతో తయారైన పాటది. స్వరస్థానాలు శుద్ధంగా నిలుపుతూ, రాగభావాన్ని ప్రస్ఫుటంగా, గమకశుద్ధంగా పలికించటం వల్ల ఆయన పాట సంగీత విద్వాంసులను సైతం ఆకర్షించింది. రాగం పాడినా, పద్యం ఆలపించినా ఆయన పాటలో ‘అకారమే’ వినిపిస్తుంది. మరే రకమైన వికారాలూ వినిపించవు, కనిపించవు.
‘‘సంగీతం కోసమే సంగీతం నేర్చుకోవాలనే లక్ష్యం నెరవేరి, సినిమా పాటలు పాడేందుకు దోహదం చేసింది. పదిమందీ విని మెచ్చుకునేలా పాడాలనే ధ్యేయం నెరవేరింది. ఘంటసాల వంటి జీవ స్వరం కలిగిన గాయకులు చాలా అరుదు’’ అన్నారు సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి. సాధారణంగా వృత్తికీ, ప్రవృత్తికీ ఎప్పుడూ సంఘర్షణ సహజం. ఆ వృత్తిలో వుండటంతో ఇష్టం వున్నా లేకపోయినా అల్లరి చిల్లరి పాటలు పాడిన సందర్భాలు లేకపోలేదు. తాను మాత్రమే విధిగా పాడవలసినవి పాడి, ఇతర గాయకులకు కూడా అవకాశమిచ్చి పాడించిన సహృదయుడు. రసజ్ఞత లేని వారికి పాడవలసి వచ్చిన స్థితి ఎదురైనప్పుడు ఎంతో నిర్వేదంతో
‘‘లోక మోహనకర గానవిద్యనకటా!
వికటంబులపాలుచేసి జీవనమును ఋత్తువా!
దురిత భారంబు నెత్తినీ మోసి మూర్ఖుడా!’’ అని ఆయన గురువు పట్రాయిని సీతారామశాస్ర్తీ పద్యాన్ని తలుచుకునేవాడు. ఆర్. సుదర్శనం, గోవర్ధన్, ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు, టి.జి.లింగప్ప, సి.ఆర్.సుబ్బరామన్, సాలూరి రాజేశ్వరరావు, సుసర్ల, పెండ్యాల, మాస్టర్ వేణు వంటి సంగీత దర్శకుల ఊహాచిత్రాలకు, సంగీత రూపాన్నిచ్చి ఆ ‘కీర్తి’ని సొంతం చేసుకున్న గాయకుడు ఘంటసాల. ఆ రోజుల్లో రికార్డింగ్ సౌకర్యాలు లేవు. పొరబాటు ఎవరిదైనప్పటికీ, మళ్లీ మళ్ళీ పాడవలసి వచ్చేది. ఓపిక తెచ్చుకుని ఓర్పుతో నేర్పుగా, మూడ్‌లో పాడటం తమాషా కాదు - మూడున్నర నిమిషాల వ్యవధిలో ఆణిముత్యాల్లాంటి పాటలు పాడేసి, రసికుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఘంటసాల వంటి గాయకుణ్ణి ఆ బ్రహ్మ మళ్లీ సృష్టిస్తాడా?

- మల్లాది సూరిబాబు 9052765490