అమృత వర్షిణి

అక్కడ కార్లు కనపడవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కార్ల వాడకం లగ్జరీ. కానీ నేడది అనివార్యం. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్ని దశాబ్దాల క్రితం నాటికి నేటికీ వాహనాల పెరుగుదలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఒక వైపు పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా కార్ల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.. కాస్త ఆర్థికంగా పట్టు చిక్కిన ప్రతి కుటుంబం నేడు కారు వాడకం వైపే మొగ్గు చూపుతోంది. కారు వాడకం అంటే అదో స్టేటస్ సింబల్ మరి. కానీ మనం అన్నింట్లోనూ ఆదర్శం అనుకుని, అనుకరించే పాశ్చాత్య దేశాల్లోని కొన్ని నగరాల్లో అసలు కారన్నదే కనిపించదంటే నమ్ముతారా? ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నూటికి నూరుపాళ్ల నిజం. నెదర్లాండ్స్‌లోని గీతూర్న్ టౌన్, మిచిగాన్‌లోని మకినాక్ ఐలాండ్, గ్రీస్‌లోని హైడ్రా సిటీ, ఫైర్ ఐలాండ్, బ్రెజిల్‌లోని పకీటా, ఇటలీలోని వెనిస్, జర్మనీలోని వాబన్ వంటి నగరాల్లో మనకు ఒక్క కారు కూడా కనిపించదు. ఆ వివరాలేమిటో చూద్దాం.
మకినాక్ ఐలాండ్
మిచిగాన్‌లోని మకినాక్ ఐలాండ్‌లో కూడా మనకి కార్లు కనిపించవు. ఈ ప్రాంతం జనసంఖ్య అయిదు వందలు. అయితే సమ్మర్‌లో మాత్రం జనాభా పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు టూరిస్టులు అందమైన మకినాక్ ఐలాండ్‌ని వీక్షించేందుకు ఎక్కువగా వస్తారు. అయితే వారు కూడా కార్లను వాడకూడదు. ఈ నిషిద్ధం ఇక్కడ 1895 నుండి కొనసాగుతోంది. ఇక్కడ కార్ల వాడకం లేదనే మాటే గానీ, ఇతరత్రా అన్ని సదుపాయాలు ఉన్నాయి. టూరిస్టుల కోసం పెద్దపెద్ద హోటళ్లు, రిసార్టులు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ నివసించే వారు బయటికి వెళ్లాలంటే మహా అయితే మోటారు బైకులు, లేదంటే గుర్రపు బగ్గీలు వాడుతారు. అక్కడికి వెళితే టూరిస్టులు అవే వాడాలి సుమా.
హైడ్రా
గ్రీస్‌లోని హైడ్రా నగరంలో కూడా మనకి ఒక్క కారు కూడా కనిపించదు. ఇదొక సౌందర్యం ఉట్టిపడే ప్రదేశం. సరోనిక్, అల్గోనిక్ సముద్ర జలాలకు మధ్యలో ఉండే ప్రాంతమే హైడ్రా. క్లాసిక్ గ్రీక్ టౌన్‌గా ఖ్యాతి గడించిన హైడ్రా చుట్టుపక్కల పర్వతాలు నిండి ఉంటాయి. ఆ పర్వతాల మీద తెల్లని సుందర హర్మ్యాలు కనువిందు చేస్తుంటాయి. ఆ కొండల మీద నుండి స్వచ్ఛమైన నీలి సముద్రం కనుచూపు మేర వరకు కనిపిస్తూ నయనానందం కలిగిస్తుంది. టూరిస్టులు ఈ అందాలను చూడడానికే ఇక్కడికి ఏటా విచ్చేస్తూ ఉంటారు. ఎక్కువగా పర్వతాలు, ఎగుడుదిగుడు రహదారులు ఉండడం వల్లే ఇక్కడ కార్లను వాడరు. ప్రయాణం కోసం గుర్రాలు, గుర్రబ్బళ్లను వాడతారు.
ఫైర్ ఐలాండ్
ఇదొక చిన్నపాటి దీవి. దీని విస్తీర్ణం 31 మైళ్లు. అందమైన ఈ దీవిలో స్థానికులు, ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎవరూ కార్లు వాడరు. ఫైర్ ఐలాండ్‌కి ఈ పేరు రావడానికి కారణం ఇక్కడ వెనకటి కాలంలో పైరేట్లు పెద్దపెద్ద మంటలు వెలిగించి, దోపిడీలకు పాల్పడేవారని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు.
పకీటా
బ్రెజిల్‌లోని పకీటాలో కార్లు వాడరు. టమోరుూ ఇండియన్ ట్రైబ్స్‌కి ఆవాసం అయిన పకీటా దీవిలో పళ్లు, కూరగాయలు, కలప ఎక్కువగా పండిస్తారు. పురాతన కాలం నాటి రూపురేఖలు, ఆ వాసనలు కోల్పోకుండా వెనకటి నాగరికతతో అలరారే పకీటా దీవిలో మనకి ఒక్క కారు కూడా కనిపించదు.
వెనిస్
ఇటలీలోని వెనిస్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నగరం. అయినా ఇక్కడ మనకి కార్లు కనిపించవు. అద్భుతమైన తటాకాలు, కళ్లు చెదిరే ఆర్కిటెక్చర్‌తో మిరుమిట్లు గొలిపే వెనిస్‌లో 5వ శతాబ్దంలో రోమన్లు, బార్బేరియన్ల మధ్య భీకరపోరాటాలు సాగాయి. ఇలా యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న వెనిస్‌లోకి ఇంకా అనేక జాతులు, తెగల వాళ్లు వచ్చి చేరారు. 118 చిన్నచిన్న దీవులున్న వెనిస్‌లోని అన్ని ప్రాంతాలను కలిపేది అక్కడుండే లెక్కలేనన్ని కెనాల్స్, బ్రిడ్జిలే. ఈ కారణం చేత అక్కడ రోడ్లు కనిపించవు మనకి. అందుకే అక్కడ కార్ల దర్శనం కూడా ఉండదు.
వాబన్
జర్మనీలోని వాబన్‌లో కూడా మనకి కార్లు కనిపించవు. ఎన్విరాన్‌మెంటల్లీ, ఎకనామికల్లీ, సోషల్లీ సస్టైనబుల్ ప్లేస్‌గా అధికారులు వాబన్‌ను తీర్చిదిద్దాలనుకుని దీనిని రూపొందించారు. ఈ ప్రాంతం రూపుదిద్దడానికి నడుం బిగించిన సిటీ కౌన్సిల్ ముందుగానే ఇదొక కాలుష్యరహిత ప్రదేశం కావాలని అభిలషించింది. అలా చేయాలంటే ఇక్కడ వాహనాలు వాడరాదని అనుకున్నారు. పబ్లిక్ పార్కులు, స్కూళ్లు, నివాసగృహాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన అధికారులు వాబన్‌ను కార్‌ఫ్రీ నగరంగా తీర్చిదిద్దారు.

- దుర్గాప్రసాద్ సర్కార్