బాల భూమి
ఉత్తమ పొదుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రామాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో రాము ఐదో తరగతి చదువుతున్నాడు. ఆ రోజు ప్రధానోపాధ్యాయులు ప్రార్థనా సమావేశంలో ‘‘చూడండి పిల్లలూ! మన దేశ రక్షణ కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో, చలిని లెక్క చేయక, సుఖాన్నీ వదిలేసి, అయిన వాళ్లందరికీ దూరంగా ఉంటూ మన దేశాన్ని కాపలా కాస్తున్న మన సైనికులను ముష్కరులు నిర్ధాక్షిణ్యంగా, నిష్కారణంగా హతమార్చారు. వారి ఆత్మ శాంతి కోసం మనం ఒక్క నిముషం వౌనం పాటిద్దాం.’’ అని వౌన ప్రార్థన అందరి చేతా చేయించారు.
‘‘పిల్లలూ! మీరు ఒక పది రోజుల పాటు మీ సొంత ఖర్చులు మానుకుని పొదుపు చేసి ఎంత మొత్తాన్నైతే దాచగలరో దాన్ని మన కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు సహాయార్థం పంపుదాం. ఈ రోజు నుంచీ మీరంతా పొదుపు పాటించి ఆ సొమ్ము ఎంతైనా సరే పది రోజులయ్యాక నాకు అందజేస్తే వారి పేర్లు రాసుకుని మీరిచ్చిన సొమ్మును నేను వారి సహాయ నిధికి పంపుతాను. మీకు పొదుపు గూర్చీ, మన కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు సాయం చేయడం అనే సూత్రాన్ని నేర్పించాలనే ఇలా చేయిస్తున్నాను. అంతే కానీ మనం ఇచ్చే పాతికో పరకో వారికి పెద్దగా ఏమీ ఉపయోగ పడదు. అయినా మన వంతు సాయం అందించడం మన ధర్మం.’’ అని చెప్పారు.
రాము ఒక పేద కుటుంబానికి చెందిన వాడు. వాని అమ్మానాన్న గార్లు కూలి చేసి బతుకుతూ రామూను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. రాము ఆలోచించసాగాడు. ‘ఎలా పొదుపు చేయాలి? ఏ ఖర్చు మానుకోవాలి’ అని తీవ్రంగా ఆలోచించాక మనస్సులో రామూకు ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
ఆ రోజు అమ్మ పాఠశాలకు వచ్చే ముందు తనకు రోజులాగే ఇచ్చిన రెండు రూపాయలు నిక్కరు జేబులో తగిలాయి. రామూ ఉదయం, మధ్యాహ్నం చెరో పూటా ఇంటర్ బెల్లో ఆ రూపాయితో ఏదైనా కొనుక్కు తింటాడు. రామూ ఆ రోజు చిరుతిండి ఏమీ కొనుక్కోక ఆ సొమ్మును పుస్తకాల సంచీకి అమ్మ కుట్టిన రహస్య జేబులో దాచాడు.
అంతా ఇంటర్బెల్లో ఏవేవో కొనుక్కు తింటున్నా రాము మాత్రం అటుకేసి వెళ్లలేదు. అంతా రామూకేసి చూస్తూ నవ్వుకున్నారు. ‘‘తిండికే లేని వాడు మిఠాయిలేం తింటాడురా పాపం’’ అని హేళన కూడా చేశారు.
అలా పది రోజులూ అయ్యాయి. ప్రధానోపాధ్యాయులు ప్రార్థన అయ్యాక ఒక కాయితం మీద పేర్లు రాసుకుంటూ పిల్లలు ఇచ్చిన సొమ్ము రాసుకోసాగారు.
అంతా వంద, వందా యాభై, అలా ఇచ్చి పేర్లు రాయించుకుంటున్నారు. చివరగా రామూ వచ్చాడు. తన దోసిటిలోని ఒక రూపాయి బిళ్లలు 20 ప్రధానోపాధ్యాయుని బల్లపై పోశాడు. ఆయన రామూ వేపు చూసి వాటిని లెక్కించి ‘‘రామూ! ఇరవై రూపాయలు. ఔనా! అంతేనా?’’ అని అడిగారు.
‘‘ఔను మాస్టారూ!’’ అన్నాడు రామూ. తరగతిలో అంతా ఫక్కున నవ్వారు.
ప్రధానోపాధ్యాయులు ‘‘హుష్’’ అని వారిని హెచ్చరించి, ‘‘రామూ ఈ 20 రూపాయలనెలా దాచావు?’’ అని అడిగారు.
‘‘మాస్టారూ! మా అమ్మ రోజూ నాకు రెండు రూపాయలు ఔట్బెల్లో పిప్పరమెంట్లు కొనుక్కోడానికి ఇస్తుంది. ఈ పది రోజులూ నేను ఏమీ కొనకుండా దాచిన 20 రూపాయలు ఇవి.’’ అని చేతులు కట్టుకుని చెప్పాడు.
ప్రధానోపాధ్యాయులు ‘‘పిల్లలూ! మీరంతా ఎలా ఇంతింత సొమ్ము నాకు ఇచ్చారు?’’ అని అడిగారు.
దానికి పిల్లలూ చాలా గర్వంగా ‘‘మా నాన్నగారిని అడిగాము, అమ్మను అడిగాము, మా తాత ఇచ్చారు. అవ్వ ఇచ్చింది’’ అంటూ చెప్పారు.
ప్రధానోపాధ్యాయులు ‘‘బాగుంది. ఐతే రామూ స్వయంగా తాను తినే పిప్పరమెంట్లు కొనుక్కోడం ఆపేసి పొదుపు చేసి, ఎవ్వరినీ అడక్కుండా దాచిన 20 రూపాయలు నిజమైన దానం సొమ్ము. మీరంతా ఇచ్చినది ఎక్కువ సొమ్మైనా అది అరువులా అడిగి తెచ్చినదే కానీ మీరు పొదుపు చేసినది కాదు. రామూ ఇచ్చినదే నిజమైన దానం. అదే ఉత్తమ లక్షణం. ‘గంగిగోవుపాలు గరిటెడైనను చాలు’ అన్నట్లు స్వయంగా పొదుపు చేసి ఇవ్వడంలోని ఆనందం ఇతరులను అడిగి ఇవ్వడంలో లేదని తెలుసుకోండి.’’ అంటూ రామూ భుజం తట్టి అభినందించి చప్పట్లు చరిచారు. అంతా తలలు వంచుకున్నారు.