ఈ వారం స్పెషల్

భూతాపం...మన పాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజధాని చెన్నై జలమయం ఎందుకైంది? గత వంద సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని వర్షం అక్కడ ఎందుకు కురిసింది? ఆరునెలల సగటు వర్షపాతం ఒకటి రెండురోజుల్లో కురవడానికి కారణమేమిటి? వాతావరణంలో అనూహ్య పరిణామాలవల్ల అలా జరిగిపోయింది. ఇలాంటి అనుభవాలు ఇక్కడే కాదు. ప్రపంచం అంతటా తరచూ జరుగుతున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో కాలుష్యానికి కారణమైన కార్లు, లారీలు ఇతర వాహనాలను రోజు విడిచి రోజు (ఆడ్ - ఈవెన్ నెంబర్ సిస్టమ్) నడపాలన్న నిబంధన అమలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అక్కడి గాలిలో కాలుష్యం జనం ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేస్తోందన్న నిజం తెలియనివారు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో బీజింగ్ తరువాత దిల్లీయే నిలబడిందంటే నమ్మకతప్పుతుందా. దీనికి కారణమేంటి?
అంటార్కిటికాలో మంచు ఫలకాలు కరిగిపోయి ధ్రువపు ఎలుగుబంట్లు, పెంగ్విన్ పక్షుల మనుగడకు ప్రమాదం ఏర్పడింది. సముద్రమట్టాలు పెరిగి కొన్ని ప్రాంతాలు కనుమరుగవుతున్నాయి. కాలిఫోర్నియాలో కార్చిచ్చు తరచూ ఎందుకు రగులుతోంది. అన్నింటికీ ఒకటే కారణం. వాతావరణం మారిపోతోంది. భూతాపం పెరిగిపోతోంది.
భూమి వేడెక్కిపోవడమే అన్ని అనర్థాలకు కారణం. భూమి అపరిమితంగా వేడెక్కిపోవడానికి మనమే కారణం. ఆ పాపం మనదే. ఆ నష్టం...కష్టం మనమే భరించాలి. మన తరువాతి తరాలు క్షేమంగా ఉండాలంటే మనం చేసిన తప్పును మనమే సరిదిద్దడం ప్రారంభించాలి. ప్రపంచం ఇప్పుడు దీనిపై దృష్టి పెడుతోంది.
ఎందుకిలా...
భూభాగం రూపం మారిపోతోంది. మనిషి తన అవసరాల కోసం నీటివనరులను ఆక్రమిస్తూ నదులు, సరస్సులు, సముద్రాలను సైతం తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. కాంక్రీటు సామాజ్య్రాన్ని విస్తరిస్తున్నాడు. భూ ఉపరితలంపై ఉన్న జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడంతో నేడు మనిషి ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. అభివృద్ధి పేరిట బొగ్గుపులుసు వాయువును ఉత్పత్తిచేసే బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను విస్తృతంగా వాడటంవల్ల కాలుష్యం పెరిగి భూమి వేడెక్కిపోతోంది. ఫలితంగా వాతావరణం అనూహ్య మార్పులకు లోనవుతోంది. రుతువులు క్రమం తప్పుతున్నాయి. లేకపోతే శీతాకాలం వచ్చి రెండునెలలవుతున్నా వేడి, ఉక్కపోత తగ్గకపోవడమేమిటి?
మనిషి ఆరోగ్యంగా బతకాలంటే స్వచ్ఛమైన గాలి, రక్షిత తాగునీరు, మంచి ఆహారం, భద్రమైన గూడు అవసరం. ఈ నాలుగు అవకాశాలను వాతావరణ మార్పు దెబ్బతీస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, కలుషిత వాతావరణం, జలసంక్షోభం, దుర్భిక్షం, ప్రకృతి విపత్తులు సంభవించి ప్రపంచ ఆర్ధిక సామాజిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సగానికిపైగా అంటే సుమారు 350 కోట్ల మంది సముద్ర తీరానికి 60 కిలోమీటర్లు లోపే జీవిస్తున్నారు. వాతావరణ మార్పుల పర్యవసానంగా ఎక్కువగా నష్టపోతున్నది కూడా వారే. భూతాపం వల్ల సముద్ర మట్టాలు పెరిగి వారి బతుకునావలు తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. మాల్దీవులు, కిరిబతి, మార్షల్ ఐలాండ్స్ వంటి ద్వీపదేశాల్లో కోట్లాది మందికి పునరావాసం కల్పించాల్సి వస్తోంది.
క్రమం తప్పిన రుతువులు
క్రమం తప్పకుండా వచ్చే రుతువుల్లో అనూహ్యమైన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాకాలంలో రావల్సిన వానలు ఎండాకాలంలోనూ, ఎండాకాలంలో వేడి చలికాలంలోనూ కొనసాగుతోంది. మంచుదుప్పటి కప్పుకున్న ప్రకృతికాంత ఇప్పుడు కన్పించడం తగ్గిపోయింది. పచ్చగా కన్పించి రుతురాగాలు పాడే అడవులు అంతర్థానమైపోతున్నాయి. తేమే ఎరుగని ఎడారులు, అందమైన ద్వీపకల్పాలు, సముద్రతీరంలో కన్పించాల్సిన రమణీయ దృశ్యాలు ఇప్పుడు కళావిహీనమైపోయాయి.
సింగపూర్ వంటి ఆర్ధికంగా బలమైన దేశాలు ప్రకృతి దృశ్యాలను సైతం కృత్రిమంగా నిర్మించుకుని ముచ్చటపడే పరిస్థితి దాపురించింది. ప్రకృతిని మనిషి పట్టించుకోకపోవడంతో ప్రకృతి ప్రకోపం మొదలైంది. రోజురోజుకూ విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి ఇపుడు నిప్పుల కుంపటిగామారింది. అగ్నిపర్వతాలు బద్దలుకావడం, కొండచరియలు జారిపడటం,, భూకంపాలు, తుపానులు, వరదలు సాధారణమైపోయాయి. భారీ వర్షాలు, సునామీలు, మంచుతుపాన్లు, వడగళ్ల వానలు, వడగాలులు, వాయుగుండాలు, అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఇదీ సమస్య
పారిశ్రామికీ కరణ పేరుతో బొగ్గు, ఇంధనాల వాడకం ఎక్కువైంది. వాటివల్ల వాతావరణంలొ పేరుకుపోతోంది. ఇది భూతాపానికి ప్రధాన కారణం. చైనా, అమెరికాల్లో ఇది ఎక్కువ. అయితే వాతావరణంలో మార్పులు, వైపరీత్యాలకు ప్రపంచం అంతా నష్టపోతోంది. దీనికి మానవతప్పిదాలూ తోడవుతున్నాయి. ఆధునిక జీవనశైలితో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఫ్రిజ్, కూలర్, ఎసి మిషన్లు, కాలం చెల్లిన వాహనాల వాడకంవల్ల కర్బన వాయువుల ఉత్పత్తి అపరిమితమై భూమి వేడెక్కిపోతోంది. నగరాలను పద్ధతి ప్రకారం నిర్మించుకోకపోవడం, వైపరీత్యాలపై అవగాహన లేమి, ఆపత్కాల నియంత్రణ వ్యవస్థ లేకపోవడం, విపత్తులను ముందస్తు గుర్తింపు ఉపకరణాలు లేకపోవడం, నిధుల లేమి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఎన్నో దుష్ఫలితాలకు దారితీస్తోంది.
మేలుకుంటున్న ప్రపంచం
ఈ క్రమంలో ప్రపంచం అంతా మరో మారు భూతాపం గురించి మాట్లాడుతోంది. 1992లో రియో డిజెనీరోలో నిర్వహించిన ధరిత్రి సదస్సులో వాతావరణంలో మార్పులు, భూతాపంపై వివిధ దేశాలు చర్చించాయి. భూతాపం తగ్గించడానికి కొన్ని నిర్దిష్టచర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ పరిణామాలకు ఎవరెవరు కారణమో వెతికిపట్టాయి. చివరకు పరిస్థితిని చక్కదిద్దడానికి, ఉమ్మడి లక్ష్యాలు, వేర్వేరుస్థాయిలో బాధ్యతలు ఉంటాయని సూత్రీకరించింది. ఆ చారిత్రక బాధ్యత నుండి తప్పించుకోవడానికే 1997 ‘క్యోటో’ వాతావరణ మార్పుల ఒప్పందానికి అమెరికా దూరంగా ఉండిపోయింది. నేటికీ అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలది అదే వైఖరి.
1992 నుండి ఐరాసా ఆధ్వర్యంలో ‘కాప్’ సదస్సులు, పర్యావరణ సదస్సులు జరుగుతున్నాయి. 1995లో బెర్లిన్‌లో పర్యావరణహిత విధానాల అమలుపై వివిధ దేశాల సామర్ధ్యంపై సమీక్ష జరిగింది. 1996 జనీవాలో పర్యావరణ మార్పులపై శాస్ర్తియ నివేదికకు ఆమోదం కూడా లభించింది. చట్టబద్ధంగా కట్టుబడాల్సిన మధ్యకాలిక లక్ష్యాలను గుర్తించారు. 1997లో క్యోటో సదస్సులో కర్బన ఉద్గారాల నియంత్రణపై నిర్ధిష్టకాల నిబంధనలు రూపొందించారు. 1998లో బ్యూనస్ ఎయిర్స్‌లో క్యోటో ప్రోటోకాల్ అమలుకు రెండేళ్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు. 2001లో బాన్ సదస్సులో ఉద్గారాల నియంత్రణ వ్యవస్థల ఏర్పాటులో కొంత ముందడుగు వేశారు. 2002 న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు సాంకేతిక సాయానికి పెద్ద దేశాలు ముందుకువచ్చాయి. 2003లో మిలన్‌లో వర్ధమాన దేశాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2010లో కాన్‌కూన్‌లో జరిగిన సమావేశాల్లో పదివేల కోట్ల డాలర్లతో హరిత నిధిని ఏర్పాటు చేయాలని అంగీకరించారు. ఇలా ఒక్కో సమావేశంలో దేశాల మధ్య సమన్వయాన్ని, పురోగతిని సాధించినా ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. భూతాపం పెరగకుండా ఉండేందుకు తీసుకునే చర్యలకు మించి ముప్పు తెచ్చే పనులు ఎక్కువగా జరగున్నాయి. వాతావరణ మార్పుల అంశం 19 వ శతాబ్దంలోనే ప్రస్తావనకు వచ్చినా, దానిని కట్టడి చేసే అంశంపై మాత్రం అంతర్జాతీయంగా చర్చలు గత పాతిక ముప్పై ఏళ్ల నుండి మాత్రమే నిక్కచ్చిగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకూ గట్టి ఒప్పందం ఒక్కటీ కుదరలేదు. దాంతో ఎవరిదారి వారిదే అన్న చందంగా కొనసాగుతోంది. రియోతో మొదలై క్యోటో సదస్సుతో ఆశలు చిగురించినా అనుకున్న ప్రగతి మాత్రం కానరాలేదు.
ఉష్ణోగ్రత మరింత పెరిగితే...
ఈ శతాబ్ది చివరికి భూమి సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదల పారిశ్రామికీకరణ పూర్వదశకంటే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించి పెరిగితే అడ్డుకోలేని విపత్కర వాతావరణ మార్పులు తప్పవని శాస్తవ్రేత్తలు ఎంతోకాలంగా హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం భూగోళం ఒక డిగ్రీ సెంటిగ్రేడ్ అధికంగా వేడెక్కింది. ఇంత వరకూ చరిత్రలో చూస్తే 2014 అత్యంత వేడిమి చూసిన ఏడాదిగా నమోదైంది. 2015 వచ్చే సరికి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. ఇప్పుడు దానిదే ఆ ఆ స్థానం. ఒక డిగ్రీ పెరుగుదలకే ప్రపంచం అల్లాడిపోతుంటే 21వ శతాబ్దం అంతానికి 4.5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పెరగవచ్చనే అంచనాలు చూస్తుంటే భయం వేస్తోంది. అదే జరిగితే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. గత ఏడాది కేవలం వడదెబ్బకు గురై ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా మరణించారు. ఈ విపత్తులను అడ్డుకోవాలంటే భూతాపం పెరుగుదల 2 డిగ్రీల సెంట్రీగ్రేడ్ మించకుండా చూస్తే కొంతలో కొంత నయం. ఈ విషయాన్ని ప్రపంచానికి శాస్తజ్ఞ్రులు 1975లోనే హెచ్చరించారు. దీనిని అడ్డుకోకుంటే గత 3 లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. భూతాపం రెండు డిగ్రీలు దాటకూడదంటే ఈ భూమీద సృష్టిస్తున్న కర్బన వాయు అవశేషాలన్నీ కూడా ఏటా లక్ష టన్నులు దాటకూడదని ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కార్బన్‌డయాక్సైడ్ అవశేషాలు వాతావరణంలో పోగుపడిపోయాయి. పెట్రోలు, డీజిల్, శిలాజ ఇంధనాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించుకుని కర్బన ఉద్గారాలు పెరగకుండా చూడాలి. ఇంత వరకూ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా కర్బన ఉద్గారాలు సృష్టిస్తున్న దేశాలు చైనా, అమెరికానే. ఆ తర్వాతి స్థానంలోనే మనం ఉన్నాం. మన తర్వాత ఐరోపా యూనియన్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
పుడమి వేడెక్కిపోతోంది
సూర్యరశ్మితో భూమి, ఉపరితల వాతావరణం వేడెక్కిపోతుంది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడంవల్ల ఈ వేడి అపరిమితమవుతోంది. దీనినే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ అంటున్నాం. దీనివల్ల భూమిలోకి సూర్యరశ్మి వచ్చేటపుడు అతినీలలోహిత కిరణాలను అడ్డుకుని సురక్షితమైన కిరణాలను మాత్రమే భూమికి వడగట్టి పంపే ఓజోన్ పొర దెబ్బతింటోంది. సరిగ్గా ఉత్తర ధృవంవద్ద ఓజోన్ పొరకు చిల్లుపడింది. దీంతో ఆ ప్రాంతంలో భూతాపం పెరిగి మంచు కరుగుతోంది.
200 ఏళ్లుగా ఉత్పత్తి అవుతున్న కర్బన వాయువులు వాతావరణంలోనే ఉండిపోయాయి. ప్రస్తుతం మన వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ 400 వరకూ ఉంది. దీనిని పార్ట్సు పర్ మిలియన్ ప్రమాణాల్లో కొలుస్తారు. ప్రతి పదిలక్షల కణాల్లో 400 కణాలు కార్బన్ డయాక్సైడ్ ఉందని అర్ధం. పాతికేళ్ల తర్వాత అది 450కి పెరుగుతుందని అంచనా. ఫలితంగా ఉష్ణోగ్రత భూమి మీద మరో రెండు డిగ్రీలు పెరుగుతుంది. సముద్రాల్లో అరమైలు లోతు వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన తేలియాడే సెన్సార్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ సముద్ర జలాలు 26 సెంటీమీటర్లు నుండి 82 సెంటీమీటర్లు వరకూ ఎత్తుకు పెరుగుతాయి. ఫలితంగా అనేక దీవులు , బంగ్లాదేశ్, నెదర్లాండ్స్,ఫ్రాన్స్, భారత్ సహా అనేక దేశాల్లో తీర ప్రాంతాలు మునిగిపోతాయి.
ఏం జరుగుతోంది..
1990తో పోలిస్తే 2030 నాటికి తమ ఉద్గారాలను 40 శాతం మేర తగ్గించుకుంటామని ఈయు తెలిపింది. 2005 నాటితో పోలిస్తే 2025 నాటికి తమ ఉద్గారాలను 26-28 శాతానికి కుదించుకుంటామని అమెరికా పేర్కొంది. పారిస్ సదస్సుకు ముందు అన్ని దేశాలూ 2030 నాటికి తమ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను ప్రకటించాయి. ప్రపంచ ఉద్గారాల్లో వీటి వాటా 91 శాతం మేర ఉంది. అయితే ఈ హమీల ప్రకారం చూస్తే 2100 నాటికి భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం అవుతుంది. గడచిన పదేళ్లలో భూ ఉపరితలం సరాసరి ఉష్ణోగ్రత 0.85 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. అత్యంత 14 ఉష్ణ సంవత్సరాల్లో 13 గరిష్ట ఉష్ణ సంవత్సరాలు 21వ శతాబ్దంలోనే నమోదయ్యాయి.
2015 నాటికి కర్బన ఉద్గారాలను విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి వాతావరణ మార్పుల వేదిక తన 2011 దర్బన్ వార్షిక సమావేశంలో (కాప్ 17లో) లక్ష్యంగా పెట్టుకుంది. 2016 వస్తున్నా అది నేటికీ నెరవేరలేదు. కర్బన ఉద్గారాల విడుదలలో కోతలకు, భూతాపం పెరుగుదల వల్ల కలుగుతున్న వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఉపశమింపచేసే చర్యలకు ప్రపంచ దేశాలు అన్నీ చట్టపరంగా అంగీకరించాల్సి ఉంటుంది. 150 ఏళ్లుగా విచ్చలవిడిగా, చౌకగా లభించే కర్బన శిలాజ ఇంధనాలను (ముఖ్యంగా రాకాసిబొగ్గు) వాడి భూతాపం పెరుగుదలకు కారణమైనవి అభివృద్ధి చెందిన దేశాలే. అవే నేడు బాధ్యతా సూత్రాన్ని వల్లెవేస్తున్నాయి. కర్బన ఉద్గారాల విడుదలకు కారణమైన బొగ్గు, చమురు, సహజవాయువుల వాడకం మాత్రం మరింత పెరుగుతూనే ఉంది. ప్రత్యామ్నాయ, శాశ్వత ఇంధన వనరుల అభివృద్ధి, ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి కూడా లేదు. పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకునేందుకు, భూతాపాన్ని తగ్గించేందుకు ప్రతిదేశం కంకణబద్ధం అయ్యేలా చేసేందుకు ఐక్యరాజ్యసమితి రెండేళ్లుగా నిరంతర కృషి చేస్తూనే ఉంది. 190 దేశాల భాగస్వామ్యంతో నవంబర్ 30 నుండి డిసెంబర్ 11 వరకూ పారిస్‌లో కాప్-21 సదస్సును నిర్వహించింది. ఈ వేదిక పుడమి భవిత కోసం అనేక అంశాలను చర్చించింది. కాప్ సదస్సు లక్ష్యాలు సుస్పష్టం. అది చేతల్లో ఎంత వరకూ కనిపిస్తుందనేదే ప్రశ్నార్ధకం.
‘కాప్’ సదస్సులు
ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం, ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ సంఘం 1988లో ఏర్పాటైంది. దాంట్లో అనేక దేశాలకు చెందిన వేలాది మంది శాస్తవ్రేత్తలు , సాంకేతిక నిపుణులు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. వీరితో వాతావరణ శాస్త్రం, పర్యావరణ, ఆర్ధిక, వైద్య, సముద్ర శాస్త్రాల రంగాలకు చెందిన శాస్తవ్రేత్తలు పనిచేస్తున్నారు. సైన్స్ చరిత్రలోనే ఐపిసిసి అంతటి విస్తృతమైన శాస్త్ర పరిశోధన లేదని చెప్పవచ్చు. 199 దేశాలు సభ్యత్వం పొందాయి. ఇంత వరకూ ఆరు నివేదికలను విడుదల చేసింది. భూతాపంపై వాతావరణ మార్పులపై ప్రపంచస్థాయి చర్చలకు ఈనివేదికలే ప్రధానం అవుతున్నాయి. 1995 నుండి ప్రతి రెండేళ్లకోమారు సమావేశాలు జరుగుతున్నాయి. వీటినే కాప్ సదస్సులు అని వ్యవహరిస్తున్నారు. 21వ కాప్ సదస్సు పారిస్‌లో ఈ మధ్యే జరిగింది.
వర్ధమాన దేశాల డిమాండ్లు ఏవీ సంపన్నదేశాలకు సమంజసంగా కనిపించవు. అమెరికా సహా సంపన్న దేశాలు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తూ వాతావరణాన్ని శుభ్రం చేసే భారాన్ని మోసేలా ఒప్పించడానికి భారత్, చైనాతో కలిసి కృషి చేయాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలు తమ సంకుచిత, స్వార్ధపూరిత వైఖరిని విడనాడనిదే వాతావరణ మార్పుల విపత్తుకు సమర్ధవంతమైన సమాధానం దొరకదు. రెండు దశాబ్దాలుగా భూతాపంపై చర్చ జరుగుతున్నా, ప్రపంచం అంతా ఏకత్రాటిపైకి వచ్చి నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించనిదే చెప్పుకోదగిన ప్రగతి సాధించలేం.
*

ఆ దేశాలకు వరదముప్పు
నియంత్రణ లేకుండా పెరుగుతున్న భూతాపం కారణంగా భారత్‌తో పాటు ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు వరద ముప్పుతప్పదని టోక్యో పరిశోధకులు తేల్చి చెప్పారు. ఈ శతాబ్ది చివరికి ఈదేశాల్లో వరద ముప్పు 42 శాతం అధికమని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు. అమెరికాకు చెందిన క్లైమేట్ అనే సంస్థ కూడా భారత్‌తోసహా చాలా ఆసియా దేశాలకు ముందున్న ముప్పు గురించి హెచ్చరికలు చేస్తూ వస్తోంది. వాతావరణ కాలుష్యం దీనికి కారణమని చెబుతోంది. భూతాపం మరో నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే ముంబై, కోల్‌కత, చైనాలోని షాంఘై, బంగ్లాదేశ్‌లోని ఖుల్‌నా నగరాలు జలసమాధి అవుతాయని చెప్పింది. గ్రీన్ హౌస్ వాయువులవల్ల భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఆర్కిటిక్, అంటార్కిటిక్‌లలో మంచుకరిగి దిగువకు ప్రవహిస్తోంది. ఫలితంగా చిన్నచిన్న దీవులు, తీర ప్రాంతాలు ఇప్పటికే జలసమాధి అయ్యాయి.

భూతాపం ఇలా తగ్గిస్తాం
పారిస్‌లో నిర్వహించిన కాప్ సదస్సులో ముఖ్యమైనది ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్స్ అనే అంశం. సదస్సులో పాల్గొన్న దేశాలు తమతమ దేశాల్లో కర్బన ఉద్గారాలను ఎంత మేరకు తగ్గించుకుంటాయో చెబుతాయి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 33 శాతం నుండి 35 శాతం వరకూ తగ్గించుకుంటామని భారత్ తెలిపింది. 2005 నాటి స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ఈ అంశాలను నిర్ణయిస్తారు. 2030 నాటికి దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 40 శాతం సౌర, పవనవంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా మాత్రమే జరిగేలా చూడాల్సి ఉంటుంది.

-బి.వి.ప్రసాద్