క్రీడాభూమి

బీసీసీఐ సాధించేదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మొట్టమొదటిసారి తెరపైకి తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ పోలీసులకే దక్కుతుంది. హన్సీ క్రానే నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు 2000 సంవత్సరంలో భారత్ పర్యటనకు వచ్చింది. అప్పుడు, అనుమానాస్పదంగా కనిపించిన బుకీలను గుర్తించి, క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాన్ని ప్రపంచానికి తెలియచేశారు. అదే ఏడాది కింగ్ కమిషన్ ఎదుట క్రానే సాక్ష్యమిస్తూ, మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన మాట వాస్తవమేనని అగీకరించాడు. ఆ సమయంలో అతను కొంత మంది భారత క్రికెటర్ల పేర్లను కూడా ప్రస్తావించడంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కొంతకాలం లేదా జీవితకాలం సస్పెన్షన్‌కు గురైన వారిలో కొంత మంది న్యాయపోరాటాన్ని మధ్యలోనే నిలిపివేస్తే, కొంత మంది కోర్టుల నుంచి నిర్దోషులుగా క్లీన్ చిట్ సంపాదించారు. అయితే, వారంతా అప్పటికే వయసు మీద పడిపోవడంతో, అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా దూరమయ్యారు. ఇలావుంటే, అప్పటి ఫిక్సింగ్ కేసులో అత్యంత కీలక పాత్ర పోషించిన సంజీవ్ చావ్లా అనే బుకీని ఇటీవలే యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి న్యూఢిల్లీ తీసుకొచ్చారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి అతనిని ప్రశ్నించనున్నారు. కింది కోర్టు చావ్లాను పోలీస్ కస్టడీకి ఇవ్వగా, ఈ నిర్ణయాన్ని అతను హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై కోర్టు స్పందన ఎలావున్నా, ఆలోగా ఢిల్లీ పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబడతారన్నది ఉత్కంఠ రేపుతున్నది. ఇంకా ఎంత మంది పేర్లు తెరపైకి వస్తాయోనన్న ఆసక్తి అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇలావుంటే, చావ్లాను ప్రశ్నించే అవకాశం ఇవ్వాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ ఢిల్లీ పోలీసు అధికారులను కోరుతున్నాడు. ఈ అవకాశం అజిత్ సింగ్ బృందానికి లభిస్తుందా అన్నది అనుమానమే. ఒకవేళ చావ్లాను ప్రశ్నించినప్పటికీ, సుమారు రెండు దశాబ్దాల క్రితం నాటి కేసులో ఇప్పుడు బీసీసీఐ సాధించేది ఏమిటనేది ప్రశ్న. మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ చెలనం లేకుండా ఉన్న బీసీసీఐ చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఫిక్సింగ్ కలకలం రేగిన తర్వాత మేలుకుంది. నామాత్రంగా విచారణ పూర్తి చేసి, ఆ సంఘటనకు తెరదించాలని ప్రయత్నించింది. కానీ, ఊహించిన దాని కంటే తీవ్రమైన సమస్య కావడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పలు నాటకీయ పరిణామాల అనంతరం, సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని పాలనాధికారులను నియమించే వరకూ బోర్డు నిర్లప్తత కొనసాగింది. స్పష్టమైన ఆధారాలతో దోషులను కళ్ల ముందు నిలబెట్టినప్పటికీ ఏమీ చేయలేకపోయిన బీసీసీఐ ఇప్పుడు చావ్లా నుంచి సమాచారం సేకరించి, సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుందనిగానీ, ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడుతుందనిగానీ అనుకోవడానికి వీల్లేదు. అప్పటి కేసులో కీలకంగా వ్యవహరించిన వారు ఇప్పటికీ క్రికెట్ రంగంలో చురుగ్గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికే చావ్లాను ప్రశ్నించాలని కోరుతున్నట్టు అజిత్ సింగ్ అంటున్నాడు. ఒకవేళ చావ్లాను విచారించే అవకాశం తమకు ఇవ్వకపోతే, అతని నుంచి సేకరించిన సమాచారాన్నయినా తమకు ఇవ్వాలని కోరుతున్నాడు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే, దానిని తెలుకోవడం ద్వారా భవిష్యత్తులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టవచ్చని అతని వాదన. కానీ, అవకాశం చేతిలో ఉన్నప్పటికీ జార విడిచిన బీసీసీఐ ఇప్పుడు అద్భుతాలు చేస్తుందనుకోవడం పొరపాటేనని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చావ్లాను విచారించే అవకాశాన్ని ఢిల్లీ పోలీసులు బీసీసీఐకి ఇవ్వరని తెలిసిన తర్వాత కూడా అజిత్ సింగ్ అతని నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు అనుమతివ్వాలని కోరడం విమర్శల నుంచి తప్పించుకోవడానికే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా అన్ని రకాల టోర్నీలు, సిరీస్‌లు వాయిదా పడిన నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళన దిశగా అడుగులు వేసి, ఆ సమస్యకైనా పరిష్కారాన్ని కనుగొంటుందో లేదో చూడాలి.