ఈ వారం స్పెషల్

మహాయోగి.. ధర్మమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.....
సద్గురు శివానందమూర్తిగారి ప్రథమ వర్థంతి జూన్ 27
........

అది శ్రీ శివానందమూర్తి సద్గురువుల అమృతోత్సవ సమయం. అంటే -75వ పుట్టినరోజు. వరంగల్‌లో గురుధామ్‌లో వైభవంగా జరుగుతోంది.
ఆ సమయంలో కొడవలూరు సిద్ధులగుట్టలో భాగవత ప్రవచనం పూర్తి చేసుకొని - ఎలాగైనా గురువుగారిని దర్శించాలని వరంగల్ బయల్దేరాను. చేరేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఈ సమయంలో గురుదర్శనం అవుతుందా? దానికి తోడు - బాగా ఆకలి వేస్తోంది. అక్కడ భోజనం దొరుకుతుందా? పైగా - నాలాంటి ఛాందసుడికి తగిన భోజనం లభ్యవౌతుందా? ఈ ఆలోచనలతో చేరాను.
కేవలం గురుధ్యానం దారి పొడుగునా సాగుతూండగా ఆ రాత్రి చేరాను. చిత్రం గురువుగారు ఒక గదిలో ఉన్నారు. సరిగ్గా ప్రాంగణంలో ప్రవేశించేసరికి - గురువుగారి దగ్గర నుండి రమ్మనమని కబురు వచ్చింది.
ఆశ్చర్యంతో లోపలికి వెళ్లాను. ‘ముందు భోంచేయి’ అని, ఒక గదిలో చక్కని భోజనం పెట్టించారు.
తరువాత వారి సమక్షంలో కూర్చున్నాను. గురువుగారిలోని దివ్యత్వం అంతకు మునుపు అనేక సంఘటనల్లో నాకు అనుభవమున్నా, ఆ రోజు మరొకసారి మహాద్భుతంగా అనుభవానికి వచ్చింది.
కరుణార్ద్రమైన గురువుగారి చూపుల నీడ, వారి చిరునవ్వు చల్లదనపు ఛాయలో కూర్చున్నాక - మెత్తగా పలకరించి - ‘ఈ ఉపాధికి 75 ఏళ్లు రావడం విశేషం కాదు. దాన్ని నిమిత్తం చేసుకొని దేశం కోసం, ధర్మం కోసం క్రతువులు నిర్వహించడం జరిగింది’ - అన్న వారి మాట నేటికీ స్ఫురిస్తూనే ఉంటుంది.
నిస్సంగుడైన జీవన్ముక్తుడు, మహా యోగి కేవలం దేశ- ధర్మ క్షేమం కోసం ఉపాధిని స్వీకరించారు. ఆ ఉపాధి ద్వారా తన తపశ్శక్తిని ప్రసరిస్తూ, లోకక్షేమానికై క్రతువులు, సంకల్ప దీక్షలు చేశారు, చేయించారు.
ధర్మరక్షణ చేయడంలో మహాత్ముల ప్రణాళికలు అనేక రకాలుగా ఉంటాయి.

1.్ధర్మ ప్రచారం, 2.అధర్మాన్ని సహేతుకంగా ప్రతిఘటించడం, 3.తపోబలం, దైవబలం వాతావరణంలో నింపి, దుష్టశక్తుల్ని తరిమికొట్టి, పంచభూతులకు శక్తినీ, ధర్మానికి పుష్టినీ అందించడం.
ఈ మూడు తన జీవితంగా గడిపిన మహాయోగి సద్గురువులు.
* సనాతన ధర్మభూమి అయిన భారతావనిలో శాస్త్రాలు, కళలు, కట్టడాలు, పరంపర, నాగరికత, సంస్కృతి... వీటన్నిటి పరిరక్షణ ఆవశ్యక కర్తవ్యం, అపారమైన తప
స్సంపాదిత జ్ఞానంతో ఈ మహత్కార్యాన్ని వారు నిర్వహించిన తీరు అద్వితీయం.
* మన సంస్కృతిపై వచ్చిన అపోహలకు, కువిమర్శకులకు యుక్తితో, శాస్ర్తియమైన తర్కబలంతో రచనల ద్వారా, వచనాల ద్వారా వారిచ్చిన సమాధానాలు ఎన్ని అజ్ఞానపు చీకటి పొరలను పటాపంచలు చేశాయో!
* వౌనంగా - వారు నిరంతరం ఏదో యాగం, ఏదో చోట చేస్తూ, చేయిస్తూ వాతావరణంలో దివ్యశక్తిని ప్రసరింపజేయడం మహాద్భుతం!
ఈ దేశానికి శక్తి, విద్య, సంపద, సమృద్ధిగా లభింపజేయాలని ఆ మూడింటి సమైక్యతత్త్వమైన ‘ఆద్యాలక్ష్మి’ ఆలయాన్ని మంత్ర - తంత్ర శాస్త్ర మర్యాదలతో రమణీయ ఉత్కళ శిల్పాగమ సంప్రదాయ రీతిలో ‘ఆనందవనం’లో నిర్మించారు. ఒక అనితరసాధ్యమైన మహాద్భుత కార్యాన్ని ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రగాఢంగా, ప్రభావవంతంగా చేశారో - అది అనితర సాధ్యం. ఆ ఆలయ నియమాలలోనే నాటి వైదిక ఋషుల ఆదర్శం ద్యోతకవౌతుంది.
ఒక పవిత్ర నియమబద్ధ జీవనం ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియాలంటే - శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, కంచి మహాస్వామి వంటి వారి వలెనే సంచరించిన సద్గురు శివానందమూర్తి గారి జీవితాన్ని తెలుసుకోవాలి.
* * *
వారి నుండి కోపాన్ని నేను రెండు మార్లు చూశాను.
ఒకటి - హైదరాబాద్ వారు వచ్చినప్పుడు, దర్శనానికి వెళ్లాను. అప్పుడు నుదుట విబూది పెట్టారు. ‘విదేశాల్లో ముప్ఫయి పైన హిందూ ఆలయాల్లోంచి శివలింగాలని తీయించారు. శివుని పూజించవద్దని ప్రచారం చేస్తున్నారు. శివ ద్వేషాన్ని చెబుతూ వైష్ణవులు చెలామణి అవుతున్నారు. వాటిని ప్రతిఘటించాలి. భేదభావాల్ని పోగొట్టాలి. సమగ్రంగా సనాతన ధర్మాన్ని సమైక్యతతో సామరస్యంతో నిలపాలి. ఆ పనికి పూనుకో. నీకు భగవంతుడు వేదికనిచ్చాడు. నీకు నా అనుగ్రహముంది’ అని అన్నప్పుడు అధర్మంపట్ల వారికున్న ఆగ్రహం నృసింహ తేజంలా వారి కనులలో కనపడింది.
‘శివ - కేశవా - గణేశ - స్కంద - శక్తి - సూర్యాది భేదాలన్నీ ఒకే తత్వపు బహురూపాలు...’ అంటూ వారు వివరించిన తీరు విశాల సనాతన ధర్మపు ఔన్నత్యానికి సాక్షాత్కారం.
రెండవ ఘట్టం.. హైదరాబాద్‌లోనే. ఆ రోజున కంచి స్వామి వారిని కుట్రతో అరెస్ట్ చేసిన రోజు. అందులో కేవలం మన ధర్మంపై దెబ్బ తీయడమే ప్రధానోద్దేశమని విజ్ఞులకు తెలుస్తోంది. కానీ చాలామంది అది గుర్తించక కనీస స్పృహ లేకుండా ఉన్నారు.
‘గురువుగారూ! ఏమిటిలా జరిగింది?’ అంటూ వణుకుతున్న గొంతుతో ప్రశ్నించాను.
‘ఈ జాతి నిద్రపోతోందనడానికి ఇదో ఉదాహరణ’ అని పలికిన గురువుల కన్నులలో ఆగ్రహ రేఖలు చూసి భయచకితుడ్నయ్యాను. ఈ అధార్మిక ఘట్టాన్ని వారు ఎదుర్కొన్న తీరు, అనేక హిందూ పీఠాధిపతులతో మాట్లాడిన విధానం, తన తపశ్శక్తితో వినూత్న విధానంతో చైతన్యాన్ని కలిగించిన రీతి.. మరువలేనిది.
తన ఆగ్రహం అధర్మంపై! తన ప్రేమ దేశంపై! తన దృష్టి ధర్మంపై! తన జీవితం, శ్వాస దేశం - ధర్మం!
వారు నడుస్తున్న భారతీయ సనాతన ధర్మం! తనకంటూ వ్యక్తిగత జీవితం - స్వార్థం నలుసంత కూడా మిగలని దేశ ధర్మాంకిత జీవనులు!
ఎప్పుడైనా మనస్సు గాడి తప్పితే వారి ధ్యానం తిరిగి సుస్థితిలో నిలబెడుతుంది! వారిని స్మరిస్తూ, వారే స్ఫురిస్తూ సాగుతున్న జీవితంలో అనుభవాలు ఎనె్నన్నో!
దేశానికీ ధర్మానికీ అంకితమై ఎలా శ్రమించాలో, ఏం చేయాలో నేర్పి, స్ఫురింపజేసి, చేయిపట్టి నాడూ నేడూ నడిపిస్తున్నది వారేనని నా విశ్వాసం!
* * *
1998-99 మధ్యకాలంలో చెన్నైలో ఉంటున్నప్పుడు, శ్రీ రాఘవన్ గారి ఇంట్లో ఉదయం 6.30కి వచ్చి గురువుగారిని కలవవచ్చు అని శ్రీ చల్లా విశ్వనాథశాస్ర్తీ గారు చెప్పారు.
అప్పటికింకా నాకు గురుదేవులతో మాట్లాడే అవకాశం దొరకలేదు... వినడం - కొన్ని సభల్లో చూడటం తప్ప. రేపు పొద్దున కలవవచ్చు అనే మాటకి ఆ రాత్రంతా ఉత్సాహంతో నిద్రలేదు. కానీ ఊరుకోకుండా ఒక మిత్రునితో ఈ వార్త చెప్పాను. ‘పొద్దునే మా ఇంటికి రండి. ఇద్దరం కలిసి వెళదాం. నాకు గురువుగారు వ్యక్తిగతంగా సన్నిహితులే’ అని చెప్పారు ఆ మిత్రులు.
కాదనలేక మిత్రుడింటికి 5.30కి చేరుకున్నాను. అప్పటికి నేను వ్రాసిన ‘శివపదం’ సంకీర్తనల పుస్తకంతో. సద్గురువులు శివస్వరూపులు. వారికి ఒకటి - రెండు కీర్తనలు వినిపించాలి - అనే భావంతో ఉన్నాను.
కానీ నా దురదృష్టం ఆ మిత్రుడు తన వ్యక్తిగత పనుల్లో మునిగి, తాత్సారం చేసి 9.30కి బయల్దేరదీశాడు. అంతసేపూ నాలో ఆందోళన పెరుగుతూనే ఉంది. విధిలేక సహించాను.
మొత్తానికి గురువుగారి దగ్గరికి వెళ్లేటప్పటికి - పది గంటలు దాటింది. గురువుగారు ముఖ్య శిష్యులతో భోజనానికి కూర్చున్నారు. చల్లా వారు నన్ను ఆత్మీయంగా మందలించారు. చేసేదేమీ లేక గురువుగారికి నమస్కరించి ఊరుకున్నాను. నా మిత్రుడు మాత్రం - తాను వ్రాసిన రచనలు భోజనం చేస్తున్న గురువుగారి వద్దనే చదువుతూ కూర్చున్నారు. గురువుగారు దీవించారు. నేను- అది అసందర్భం అనిపించి - ఏమీ మాట్లాడకుండా, కేవలం నమస్కరించి, ప్రసాదం తీసుకొని, వౌనంగా నా ‘శివపదాల’తో వెనుదిరిగాను. ఆశాభంగంతో కొన్నాళ్లు బాధపడ్డాను.
కొనే్నళ్ల తరువాత- విశాఖపట్నంలో ఒక సంస్థ వారు ‘శివపదం’ కచేరీ ఏర్పాటు చేశారు. నా వ్యాఖ్యానంతో ప్రసిద్ధ గాయకుల గానం. అంతా ఏర్పాటయ్యాక ఆహ్వాన పత్రం ముద్రించాక నాకు పంపారు. ఆశ్చర్యపోయాను. ‘ముఖ్య అతిథి - సద్గురు శ్రీ శివానందమూర్తిగారు’ అన్న వాక్యం చూసి ఆశ్చర్యం కలిగింది. ‘గురువుగారు వస్తున్నారా?’ అని ప్రశ్నించాను. ‘అవును. కానీ ఒక్క పది నిమిషాలే ఉంటారు అని వారి కార్యదర్శులు చెప్పారు’ అన్నారు నిర్వాహకులు.
‘పోనీ! ఒకటి రెండైనా శివపదాలను శివునికి వినిపించవచ్చు’ అనుకున్నాను.
సభ ప్రారంభమయింది.
గురువుగారు శిష్య బృందంతో వచ్చారు. బృందం చెబుతూనే ఉన్నారు - ‘కొద్దిసేపే ఉంటారు’ అని.
కానీ ప్రారంభం నుండి చివరి వరకు రెండున్నర గంటలు గురువుగారు కూర్చునే ఉన్నారు. దాదాపు 18 పాటలు, వ్యాఖ్యానం విన్నారు. నా ఆనందం భౌతిక సీమలు దాటి, కైలాసానికి చేరుకుంది.
కార్యక్రమం పూర్తవగానే వారి పాదాలపై వాలిపోయాను. రెండు చేతులతో భుజాన్ని పట్టిలేపి ‘తృప్తోస్మి’ అని దీవించారు.
హృదయంలో వౌనాకాంక్షను కూడా గ్రహించి, ఆశించిన దానిని మించి అనుగ్రహించడమంటే ఇంతకంటే మరొక ఉదాహరణతో చెప్పగలమా!
* * *
2005, ఉగాది. విశాఖలో వేదిక్ సేవా ట్రస్ట్ వారి కార్యక్రమం అప్పటికి రెండేళ్ల నుండి ట్రస్ట్ తరఫున శ్రీ చంద్రవౌళిగారు అడుగుతునే ఉన్నారు. నాకు సువర్ణ గండపెండేర సన్మానం చేయాలని, అంగీకరించమని! కానీ నాకు సన్మానమంటే భయం!
అందునా గండపెండేరం అనే మాట మరీ భయపెట్టింది. నేను వద్దంటూనే ఉన్నాను.
కానీ ఒకరోజు ఆనందవనంలో సద్గురు సమక్షంలో ఉండగా శ్రీ చంద్రవౌళిగారు అక్కడికి వచ్చారు, నన్ను ఒప్పుకొనమని గురువు ద్వారా చెప్పించాలని వారి ఉద్దేశం. ‘ఈయన అంగీకరించడం లేదు. మీరైనా చెప్పండి’ అన్నారు గురువుగారితో.
అప్పుడు గురువుగారన్న మాటలు ‘కాదనడం కూడా అహంకారమే నాయనా! ఆశించకుండా, యాచించకుండా వచ్చిన దానిని తిరస్కరించడం ఎందుకు? నువ్వు సనాతన ధర్మం గురించి చెప్పడం వల్ల ఈ సన్మానం. ఇది సమాజానికి ధర్మంపై ఉన్న గౌరవానికి తార్కాణం. కాదనకూడదు’ అన్నారు మందలిస్తూ.
గురువుగారి ఆజ్ఞను ఔదలదాల్చుతూ - నేనొక మాటన్నాను ‘మీ సమక్షంలో, మీ ఆశీర్వాదంతో సభ జరిగితే సంతోషం’. ఇంతే నేనన్నది. గురువుగారు సరే అన్నారు.
ఆ సమయంలో మా నాన్నగారు కూడా ఉన్నారు.
సన్మాన సభలో నాన్నగారు, గురువుగారు ఇద్దరూ ఉండగా, వారు ఆశీర్వదించగా, శ్రీ పి.ఎస్.మూర్తి దంపతులు నాకు గండపెండేరం తొడిగారు.
గురువుగారు ఆ సభలో ‘షణ్ముఖ శర్మంటే నాకు మిత్ర వాత్సల్యం’ అని అన్న మాట నేటికీ నాలో ధ్వనించే మంత్రాశీస్సు. (ఐతే - ఇది స్వోత్కర్షతో కాక, కృపాసంకేతంగా భావించి వ్రాస్తున్న మాటగా గ్రహించవలసినదిగా పాఠకులకు మనవి.)
సభ అయ్యింది.
ఆ తరువాత విన్న కొన్ని వార్తలు నన్ను దిగులుకి గురి చేశాయి.
‘గురువుగారి సమక్షం, ఆశీస్సు’ అని నేనన్న మాటని వక్రీకరించి, ‘గురువుగారు తొడిగితేనే నేను అంగీకరిస్తాను’ అన్నానని ఒక దుష్ప్రచారం జరిగింది.
గురువుల చేత అలాంటి పని చేయించే పాప బుద్ధి ఊహలో కూడా లేని సంప్రదాయవాదిని నేను. నాకే కాదు ట్రస్ట్ నిర్వాహకులకు కూడా ఆ భావం లేదు. కేవలం వారి సన్నిధిలో, నిర్వాహకులు చేసే సన్మానమిది. కార్యక్రమ సరళి అది. కానీ దానిని గ్రహించక ఏ ఒకరిద్దరో తప్పుగా గ్రహించి, తప్పుడు ప్రచారం చేశారు.
ఇది తెలిసి, నేను భయపడ్డాను. వారంతా పొరపడినా ఫరవాలేదు. గురువుగారు అన్యధా భావించకపోతే చాలు అనుకున్నాను. కానీ వారికి ముఖం చూపించడానికి ధైర్యం చాలలేదు.
ఈ అపప్రచారాన్ని గురువుగారు నమ్మారు! అనే శంక! నేనన్న మాట పొరపాటుగా ధ్వనించిందా!
గురువుగారి అంతేవాసులలో ఒకరికి, ఉండబట్టలేక, నా మనఃక్షోభ వివరించాను. అతని ద్వారా - గురువుగారికి తెలిసింది.
‘షణ్ముఖ శర్మను రమ్మను. అతడి మనసు నాకు తెలుసు. అతడేమన్నాడో నాకు స్పష్టంగా తెలుసు, ఇంకెవరి మాటా నేను నమ్మవలసిన అవసరం లేదు’ అని కబురు పంపారు. పరుగు పరుగున వారి పాదాల చెంతకు చేరి నమస్కరించుకున్నాను. ఈ అపప్రచారాల వెనుక అసూయలో, అపోహలో ఏమైనా ఉండవచ్చు గానీ! సర్వజ్ఞులైన గురువులకు సత్యం తప్ప మరేదీ పట్టదని తెలిసింది. మనసు తెలిసిన మహాదేవునికి నమస్సులు.
అయితే ఈ సంఘటన తరువాత సన్మానాలకి మరింత దూరం ఉండాలనే నిశ్చయం బలపడింది. వారి రక్షణ ఉంది కనుక తట్టుకోగలిగానే కానీ, లేని పక్షంలో పెద్ద దెబ్బ మిగిలేది!
కొంతకాలం తరువాత - చేతికి కంకణం తొడుగుతూ ‘నీకు మృత్యుంజయ రక్ష’ అన్న సద్గురువుల వాత్సల్యం నేటికీ నాకు ఊపిరి.
వారు మలచిన జీవితం వారి స్మరణతో, స్ఫురణతో సాగడం కంటె పరమార్థమేముంది!
(మనవి: ఇంతవరకూ గతంలో వ్రాసిన వ్యాసాలలో వ్యక్తిగత అనుభవాలు రాయలేదు. కానీ మిత్రులు, మహాత్ములు ఎం.వి.ఆర్. శాస్ర్తీగారిచ్చిన చనువుతో, ఈ అనుభవాలు చెప్పాల్సిన అవసరముందనిపించి వ్రాయవలసి వచ్చింది.)
*
photo's: గొల్లపూడి రవి

-సామవేదం షణ్ముఖ శర్మ