డైలీ సీరియల్

బలి యాగాలు.. వామనుని పరిశీలన (వామనుడు - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మహోత్సవం తరువాత అక్కడి వచ్చిన వారినందరినీ కూర్చోబెట్టి కపట వటువు విశేషాలను అడిగి తెలుసుకొన్నాడు. ఆ సమయంలో విప్రులు ఎలా ఉన్నారో అడిగి అడిగి మరీ కనుకొన్నాడు. దానాలు ఇవ్వడంలో ఏ ఏ రాజులు మేటి అని ఏమీ తెలియని అమాయకునివలె వారిని అడిగాడు. వారంతా ముక్తకంఠంతో బలి చక్రవర్తినే దానాలు ఇచ్చే మహాదాత, మహోన్నతుడని పొగిడారు.
‘‘ఇకనేమి నేను కూడా ఆ బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లి దానం సంపాదిస్తాను’’ అని వామనుడు తల్లిదండ్రీ అనుమతి కోరాడు. వారిద్దరూ మనోవాంఛాఫలసిద్ధిరస్తు అని దీవించారు.
వామనుడు తన తోటివారితో కలసి బలి దగ్గరకు బయలుదేరి దారిలో నర్మదానదిని దాటాడు. నర్మదానదికి ఉత్తర తీరంలో ఉన్న బలిచక్రవర్తి యాగశాలను దర్శించాడు. యాగశాలల్లోకి అమితోత్సాహంతో అడుగుపెట్టిన వామనుని చూచి అక్కడ వారు విభ్రమంతో ఆశ్చర్య వదనులైనారు. ఇతడో ఏ మహావిష్ణువో, శివుడో, బ్రహ్మయో, సూర్యుడో, లేక అగ్నియో మారువేషంలో ఇటు వచ్చినట్టున్నాడని వయస్సు తారతమ్యం కనిపిస్తూన్నా చేతులెత్తి నమస్కారాలు చేశారు.
అలా నడుస్తూ వెళ్లి హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూశాడు. వారితో మాటామంతి కలిపాడు. యోగవిధులను చెబుతున్న సభాపతులను చూసి వారితో మన్ననలను పొందాడు. అందరూ తనను ఆకర్షించాలన్నట్టు సభ అంతా తానై అయి తిరుగాడాడు. అక్కడున్న వేదపండితులతో వాదోపవాదాలు చేశాడు. కొందరితో కలిసి సామగానం ఆలపించాడు. వేదాలను చదివాడు.
అటూ ఇటూ నడిచి చివరకు రాక్షస చక్రవర్తి దగ్గరకు చేరాడు వామనుడు. గురు అనుగ్రహాన్ని అపారంగా పొందిన యశస్సుతో వెలిగిపోతున్న బలిని చూసి ఇతడేనా రాక్షసరాజు. నిండైనా హృదయం కలవాడు, యజ్ఞాలతోను, పుణ్యకార్యాలతో ప్రీతి చెందేవాడు, ముల్లోకాలను శాసించే అధికారం కలవాడు అని అడిగి నీకు స్వస్తి అని స్వస్తిపలికాడు.
వామనుణ్ణి చూసి ఆనందపులకాంకితుడైన బలి చక్రవర్తి ఇంతకుముందు అనుభవించని ఆనందం ముప్పిరిగొనగా మాటలు రాక చేతలుడిగి నిశే్చష్టుడిలాగా వామనుని ముందు తలవంచాడు. చేతులెత్తి మొక్కాడు. అపుడు వామనుడు ‘‘స్వస్తి! బలి చక్రవర్తి! అఖండ కీర్తిని సంపాదంచిన ఓ బలీ! నీకు శుభమగుగాక! అన్నాడు. జడలు గట్టిన జుట్టూ , దండమూ, గొడుగూ, కమండలమూ దాల్చి అతని భుజానికి వేలాడుతున్న భిక్షాప్రాతతో నిల్చున్న వామనుని చూసి భృగు వంశీయులు గబగబా వచ్చి అతనికి స్వాగతం పలికారు. మంచిమాటలు చెప్పారు. బలిచక్రవర్తి తన గగుర్పాటును అణుచుకుని బిరబిరా వచ్చి పాదాలకు నమస్కరించాడు. అంతలో బలి ఇల్లాలు వింధ్యావళి బంగారు కలశంతో నీరు తెచ్చివ్వగా ఆ నీటిని పోస్తూ వామనుని పాదాలను బలి చక్రవర్తి కడిగాడు. తెల్లని శుభ్రమైన వస్త్రంతో ఆ పాదాలను తుడిచాడు. మంచి ఆసనాన్ని ఇచ్చి కూర్చొండచేశాడు. ‘‘ఓ బ్రాహ్మణోత్తమా! నీ పేరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? నీ వెక్కడి నుంచి వచ్చావు? నీ రాక వల్ల నా వంశం పునీతమైంది. ఓ పుణ్యాత్ముడా నీ రాక వల్ల నా హృదయంలో చెప్పలేని ఆనందాన్ని పొందుతున్నాను. ఇపుడు నేను చేస్తున్న యజ్ఞం చాలాపవిత్రమైంది. ఈ యజ్ఞం చూడడానికే నీవు విచ్చేశావు కదా. ఓ విప్రోత్త్తమా నీకు ఏమేమి కావాలో నన్ను అడుగుము. ఏ విధమైన శంకలేకుండా నీకు ఇచ్ఛ వచ్చినవేమో నన్ను అడుగుము. మేలైన వస్త్రాలా, బంగారు, వెండినాణేలా. పండ్లా పూలా, సంపదలా, గోవులా, గుఱ్ఱాలా, రత్నాలా, రథాలా , మంచి మంచి ఆహారాలా, అగ్రహారాలా, కన్యలా, ఏనుగులా, భవనాలా , పొలాలా భూభాగమేదైనా కావాలన్నా నిస్సంకోచంగా నన్ను అడుగుము ’’అని బలి చక్రవర్తి వామనుని అడిగాడు. బలి చక్రవర్తికి మహాసంతోషం వేస్తోంది. ఈ పొట్టివానికి ఈ చిట్టివానికి నేను దానం కనుక చేస్తే నా కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అసలు ఆయన ఏమీ వద్దు అన్నా సరే ఏదో ఒకటి ఇచ్చి తీరాలి సుమా అనుకున్నాడు. మళ్లీ మళ్లీ ఏంకావాలనుకొంటున్నావు నిర్మొహమాటంగా అడుగు అని మళ్లీ బలి చక్రవర్తి వామనుని అడిగాడు.
కాసేపటికి చిరునవ్వుతో వామనుడు ఇలా అన్నాడు. ఓ మహాపురుషా! బలిచక్రవర్తి! నిజమే నీవు నన్నుకోరుకోమని అంటున్నావు. నేను ఒంటరివాడిని. పైగా ఇక్కడ అక్కడ అనే భేదం లేక ఎక్కడ మంచివారుంటే అక్కడ నేను వారితో కలసి ఉంటుంటాను. మొట్టమొదటిలో నాతో సిరి ఉండేది. ఇపుడు మాత్రం నేను ఒంటరిగానే ఉంటున్నాను. నీ వంశంలో అందరూ మహోన్నత కీర్తిమంతులు ఉన్నారని సంగతి నాకు తెలుసు. నీ వంశంలోని ప్రహ్లాదుడు గొప్ప కీర్తి పొంది ఉన్నాడు కదా.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి