డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను చక్రవర్తి అయిన పాండు రాజు యొక్క కోడలిని. వీరాధివీరులైన పాండవులకు పత్నిని. మహాబలశాలి అయిన దృష్టద్యుమ్నునికి సోదరిని.
అన్నిటికన్నా మిన్న ‘నీకు చెల్లెలిని’.
అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో నా తల వెంట్రుకలను పట్టి ఈడ్చాడు. వలువలొలిచి దారుణంగా అవమానించాడు.
స్ర్తి సహజమైన ఋతుకాలంలో ఏక వస్తన్రై భయంతో కంపిస్తున్న నేను కురు సభలోనికి లాక్కురాబడ్డాను. రాజులందరితో నిండిన సభలో పాపాత్ములైన ధార్తరాష్ట్రులు బిగ్గరగా నవ్వారు. మధుసూదనా! పాండు పుత్రులు, పాంచాల రాజులు, వృష్ణి వంశీయులు జీవించి ఉండగానే ఆ ధృతరాష్ట్ర పుత్రు దాసీభావంతో నన్ను అనుభవించాలని కోరుకొన్నారు. శ్రీకృష్ణా! నేను భీష్మ, ధృతరాష్ట్రులకు ధర్మసమ్మతమైన కోడలిని. అటువంటి నన్ను బలవంతంగా దాసిని చేశారు.
అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాది వృద్ధులు, బంధువులు చూచి ఊరకున్నారు. శరణు వేడిన కాపాడేవారైన ఈ పాండవులు ‘‘నన్ను రక్షించండి’’ అని మొరబెట్టుకున్నా నా ఆక్రందనను ఆలకించలేదు గదా? ఇంక ఈ భీమార్జునుల బలమెందుకు. సోదరులు, కొడుకులు, బంధువులు, దండగా నాకు ఉన్నప్పటికీ, నాకెవ్వరూ లేనివారుగా అయినాను. శత్రువులు బాధిస్తుండగా చూస్తూ ఊరకున్న మహాబలవంతులైన ఈ పాండవులనే నేను నిందిస్తున్నాను.
ఆ సమయంలో దుష్టుడైన కర్ణుడు నన్ను చూచి నవ్వాడు.
శ్రీకృష్ణా! లోకులచేత నిందించబడే దుశ్శాసనుని దుష్టచేష్టకంటే కర్ణుడు నన్ను చూచి నవ్విన నవ్వు నా మనస్సులో భరింప శక్యం గాకుండా మంటవలె మండుతూ సురసుర కాలుస్తూన్నది.
ఆ దుష్ట కౌరవులు భీమసేనుడిని ప్రమాణ కోటి అనే పేరుగల అగాధమైన గంగ మడుగులో త్రోయించారు. విషం తినిపించారు. విష సర్పాల చేత కరిపించారు. పాండవులను తల్లితోపాటు వారణావతంలో లక్క యింటిలో పెట్టి కాల్పింప ప్రయత్నించారు. ఇపుడు మోసపూరితమైన జూదంలో రాజ్యం లాగుకొన్నారు. అన్ని అవమానాలు భరించి పాండవులు శౌర్యం కోల్పోయి ఉన్నారు. ఇక నేను పడిన పరాభవాన్ని ఎలా తొలగించగలరు?’’ అని ద్రౌపది విలపిస్తూ -
కృష్ణా! ఈ విధంగా అనేక కష్టాలను అనుభవిస్తూ, దుఃఖిస్తూ, పూజ్యురాలైన కుంతీదేవికి తోడు కూడా లేకుండా ధౌమ్యుని ముందుంచుకొని వనంలో నివసిస్తున్నాము. సింహ విక్రములైన పాండవులు నీచులైన శత్రువులు నన్ను అవమానిస్తుండగా ఉపేక్షించి ఎలా ఉన్నారు? నేను చింతాగ్నిలో రగిలిపోతున్నాను’’ అని ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ
‘‘కృష్ణా! కేశవా! నీకు నాతోయున్న బంధుత్వం, నా పుట్టుకపై నీకున్న గౌరవం, సఖ్యము, రక్షింపగల సామర్థ్యం ఈ నాలుగు కారణాలచేత నీవు ననె్నప్పుడు రక్షిస్తూ ఉండాలి’’ అని విలపిస్తున్న ద్రౌపదిని చూసి శ్రీకృష్ణుడు-
‘‘యాజ్ఞసేనీ! ద్రౌపదీ! నీవు ఎవరిపట్ల కోపంగా ఉన్నావో, వారంతా అర్జునుని బాణాల దెబ్బలకు నేలకొరుగుతారు. వారి స్ర్తిలు రక్తపు మడుగులలో చచ్చిపడి వున్న తమ భర్తలను చూచి ఈ విధంగా విలపిస్తారు. పాండవుల కొరకు చేయవలసినదంతా చేస్తాను. నీవు దుఃఖించకు.
‘‘చెల్లీ! నీకు నిజంగా నేను మాట ఇస్తున్నాను. నీవు ఈ రాజులకు మహారాజ్ఞిని అవుతావు. ఆకాశం క్రిందపడినా, హిమవత్పర్వతం కరిగిపోయినా, భూమి ముక్కలైనా, సముద్రాలు ఇంకిపోయినా నా మాట వృధా కాదు’’ అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కలుగజేసుకొని తనవైపు ఓరకంటతో చూస్తున్న ద్రౌపదితో-
‘‘వరవర్ణినీ! ఏడవవద్దు. శ్రీకృష్ణవాసుదేవుడు చెప్పినట్లుగానే తప్పక జరుగుతుంది. మరొకలాగా జరుగదు’’ అని అనగా విని ధృష్టద్యుముడు-
‘‘సోదరీ! బలరాకృష్ణులను ఆశ్రయించి మనం యుద్ధంలో అజేయులుగా ఉంటాము. నేను ద్రోణుని చంపుతాను. శిఖండి భీష్మ పితామహుని చంపుతాడు. భీమసేనుడు దుర్యోధనుని చంపుతాడు. అర్జునుడు ‘కర్ణుని’ చంపుతాడు. సహదేవుడు శకునిని చంపుతాడు. నకులుడు మిగతావారిని చంపుతాడు’’ అని ద్రౌపదిని ఊరడించాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము