డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -- 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యయాతి - ఉపాఖ్యానం
===============

ఈ మాటలతో ఆందోళన చెంది శుక్రుడు కచుని పిలిచాడు. అతని కడుపులో ఉన్న కచుడు ఇలా అన్నాడు. ‘‘పూజ్యుడా! నేను నీకు నమస్కరిస్తున్నాను. నన్ను అనుగ్రహించు’’.
శుక్రుడు కచుడు తన ఉదరంలోకి ఎలా వచ్చాడని అతనే్న అడిగాడు.
కచుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాక్షసులు నన్ను చంపి, దహించి పొడిచేసి, మద్యంలో కలిపి మీ చేత త్రాగించారు’’.
శుక్రుడు కుమార్తెతో ఇలా పలికాడు. ‘‘నీకు ఇష్టమైనది చేయాలంటే కచుని బ్రతికించాలి. కాని అతను బ్రతికితే నేను మరణిస్తాను. ఎందుకంటే అతను నా ఉదరాన్ని చీల్చుకొని వస్తాడు. ఇంకొక ఉపాయం లేదు.’’
దేవయాని ఇలా అంది. ‘‘కచుడు నశిస్తే నాకు శాంతి లేదు. అలాగే నీకు హాని జరిగినా నేను బ్రతుకను. అప్పుడు శుక్రాచార్యుడు తనలో ఉన్న కచునితో ఇలా అన్నాడు. ‘‘కుమారా! నీవు నిజంగానే కార్యసిద్ధిని పొందావు. దేవయాని నిన్ను కోరుకుంటున్నది. ఒక్క బ్రాహ్మణుడు తప్ప నా ఉదరం నుండి జీవిస్తూ బయటకు రాలేడు. నీకు ఈ సంజీవినీ విద్య నేర్పుతాను. దాని సహాయంతో నాలో నుండి బయటకు వచ్చి మరల నన్ను బ్రతికించు. ఈ విద్యను పొంది ధర్మబద్ధమైన దృష్టితో మెలుగు’’.
కచుడు గురువు నుండి విద్య పొంది, అతని ఉదరం చీల్చుకొని బయటకు వచ్చాడు. మరల ఆ విద్యతో గురువును బ్రతికించాడు. తర్వాత అతను తన గురువుతో ఇలా అన్నాడు. ‘‘విద్యలేని నా చెవుల్లో ఈ అమృతసంజీవిని విద్యను నింపిన శుక్రాచార్యుని నేను తల్లిలాగా, తండ్రిలాగా భావిస్తాను. అతనికి ఎన్నడూ ద్రోహం తలపెట్టను’’.
శుక్రుడు తాను సురాపానం చేయడం వల్లనే ఇంత అరిష్టం జరిగిందని తలచి, కోపంతో ఇలా అన్నాడు. ‘‘ఇప్పట్నుంచి ఈ లోకంలో ఏ బ్రాహ్మణుడైనా మోహం వల్ల మద్యం త్రాగితే అతను ధర్మం తప్పినవాడు, బ్రహ్మహత్య చేసినవాడూ అవుతాడు. సమస్త లోకాల్లో విప్రధర్మానికి హద్దయిన ఈ మర్యాదను నేను స్థాపిస్తున్నాను. గురువులకు సేవ చేసే శిష్యులు సత్పురుషులు. బ్రాహ్మణులు సమస్త లోకాలు ఈ మాటను గుర్తుంచుకోండి.’’ ఈ విధంగా చెప్పి తపోనిధి అయిన శుక్రుడు దానవులను పిలిచి ఇలా చెప్పాడు. ‘‘మీరు మీ దానవ చేష్టలు చేస్తున్నారు. కచుడు విద్యాసిద్ధి పొందాడు. నాతో సమానమైన శక్తి కలవాడు అయ్యాడు. అతడు సత్పురుషుడు, బ్రాహ్మణుడు, నాతోనే ఉంటాడు’’.
దానవులు భయపడి తమ నివాసాలకు వెళ్లిపోయారు. కచుడు గురువును సేవిస్తూ వెయ్యి సంవత్సరాలు శుక్రుని దగ్గర ఉండి తిరిగి స్వర్గానికి వెళ్లదలచాడు.
కచుడు గురువు అనుమతితో దేవలోకానికి బయలుదేరే సమయంలో దేవయాని అతనితో ఇలా అన్నది. ‘‘వంశం చేత, విద్య చేత, తపస్సు చేత, ప్రవర్తన చేత ఇంద్రయనిగ్రహం చేత ప్రకాశిస్తున్నావు. నా తండ్రిలాగే బృహస్పతి కూడా గౌరవింపదగిన వాడు. కనుక నేను చెప్పే ఈ విషయం గ్రహించు. నీవు విద్యావ్రతంలో దీక్షతో ఉన్న సమయంలో నేను నీ పట్ల ఎంత శ్రద్ధ చూపానో గ్రహించు. విద్యా సమాస్తి అయినది కనుక నన్ను యధావిధిగా పాణిగ్రహణం చెయ్యి’’.
అప్పుడు కచుడిలా సమాధానం చెప్పాడు. ‘‘నీ తండ్రి నీకు పూజ్యుడు అయినట్లే నాకూ పూజ్యుడు. మాన్యుడు. అలాగే నీవు కూడా పూజింపదగినదానవు. భద్రా! నీవు గురువుకు ప్రాణసమానురాలవు. ధర్మప్రకారం గురు పుత్రి అయిన నీవు నాకు సోదరివి. కనుక నీవు ఈ విధంగా మాట్లాడ కూడదు’’
దేవయాని ఇలా బదులు చెప్పింది. ‘‘నీవు నా తండ్రి గురు పుత్రునికి పుత్రుడవు. నా తండ్రికి పుత్రుడవు కావు. కనుక నీవు నాకు పూజ్యుడవు. రాక్షసులు నిన్ను మాటిమాటికీ చంపుతూ ఉంటే నేను నా తండ్రి ద్వారా మరల మరల బ్రతికించాను. నా ప్రేమను, స్నేహాన్ని అర్థం చేసుకో. ఏ దోషం లేని నన్ను నీవు ఇలా విడిచిపెట్టకూడదు’’.
కచుడు మరల ఇలా అన్నాడు ‘‘కల్యాణీ! నేను చేయకూడని కార్యంలో నీవు నన్ను నియోగిస్తున్నావు. శశుక్రుని గర్భంలో నువ్వున్నట్లే నేనూ ఉన్నాను. నీవు నాకు సోదరివి. నేను సెలవు అడుగుతున్నాను. నేను వెళుతున్నాను’’.
కోపంతో దేవయాని ఇలా అన్నది. ‘‘కచా! ధర్మబద్ధమైన కోరికతో నిన్ను యాచిస్తే నిరాకరించావు. నీవు నేర్చుకున్న విద్య నీకు సిద్ధించదు’’.
కచుడు దీనికి ఇలా సమాధానం చెప్పాడు. ‘‘గురుపుత్రికవు అందుకని తిరస్కరిస్తున్నాను. గురువు దీనికి అనుమతించడు. నీ ఇష్టమైనట్లు నన్ను శపించుకో. నేను ఋషిధర్మాన్ని చెప్పాను. నీవు కామంతో నన్ను శపిస్తున్నావు. ధర్మంతో కాదు. ఋషిపుత్రుడెవడు నీ పాణిగ్రహణం చెయ్యడు. నీవు శపించినట్లుగా నా విద్య నాకు ఫలించదు. కాని నేను నేర్పినవారికి ఫలిస్తుంది. అది చాలు’’.
ఇలా దేవయానితో చెప్పి కచుడు దేవలోకానికి వెళ్లిపోయి దేవతలను కలిసి విషయం అంతా వివరించాడు. వారు సంతోషించి అతనికి శాశ్వతమైన కీర్తి లభిస్తుందని యజ్ఞ్భాగం స్వీకరిస్తాడని తెలిపారు. కచుని ద్వారా మృతసంజీవినీ విద్యను దేవతలంతా నేర్చుకున్నారు. వారు ఇంద్రుని దగ్గరకు వచ్చి అతను మరల యుద్ధం చేసే సమయం వచ్చిందని అన్నారు. ఇంద్రుడు సరేనని బయలుదేరి వెళ్ళి ఒక వనంలో కొందరు కన్యలు జలకాలాడటం చూసి వాయురూపంలో వారి వస్త్రాలని కలగాపులగం చేశాడు.
కన్యలంతా బయటకు వచ్చి కలిపి ఉన్న వస్త్రాలను తీసుకొని ధరించారు.

(ఇంకావుంది)

-- డాక్టర్ ముదిగొండ ఉమాదేవి