డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవయాని తండ్రితో ఇలా చెప్పింది ‘‘తండ్రీ! ఇతను నహుషుని కుమారుడు. అరణ్యంలో నా పాణిని గ్రహించాడు. నన్ను ఇతనికిచ్చి వివాహం చెయ్యి’’
శుక్రుడు యయాతితో ఇలా అన్నాడు. ‘‘నరశ్రేష్ఠా! నాకు అత్యంత ప్రీతిపాత్రురాలైన నా కూతురు నిన్ను వరించింది. నేనామెను నీకు దానం చేస్తున్నాను. ఆమెను నీ పట్టమహిషిగా స్వీకరించు’’.
యయాతి ‘‘ఈమెను నా భార్యగా స్వీకరించిన తర్వాత వర్ణసాంకర్యం వల్ల వచ్చే పాపం నాకు రాకూడదు. అలా నన్ను అనుగ్రహించు’’.
శుక్రుడు ‘‘నిన్ను ఈ పాపం నుండి విముక్తి చేస్తున్నాను. దేవయానిని ధర్మప్రకారం స్వీకరించు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠను గౌరవించు. కాని శయ్య మీదకు ఆహ్వానించకు’’
ఇలా శుక్రుడు చెప్పిన తర్వాత యయాతి శుక్రపుత్రికను వివాహం చేసుకొన్నాడు. తర్వాత శర్మిష్ఠను కూడా తీసుకొని భార్యతో సహా నగరానికి వెళ్లాడు.
యయాతి దేవయానిని తన అంతఃపురంలో ఉంచి ఆమె అనుమతితో శర్మిష్ఠను అశోకవనంలో ఒక గృహం నిర్మించి అందులో ఉంచి ఆమెకు వస్త్రాలు, ఆభరణాలు, భోజన వసతులు ఇచ్చి గౌరవించాడు.
ఇలా కొంతకాలం గడిచింది. దేవయాని గర్భం ధరించింది. ఒక కుమార్తెను కన్నది. శర్మిష్ఠ కూడా వనవతి అరుంది. ఆమె ఆభరణాలు ధరించి భర్త పొందు కోరి ఇలా అనుకుంది ‘ఋతుకాలం వచ్చినా నాకు వరింపబడిన భర్త లేడు. నేనేం చేయాలి? దేవయాని వరించినట్లుగానే నేను కూడా ఆమె భర్తనే పతిగా వరిస్తాను. నా నిశ్చయాన్ని రాజుకు ఏకాంతంలో చెప్తాను.’’
ఆ సమయంలో అక్కడికి ఒంటరిగా వచ్చిన రాజును చూసి ఇలా అంది. ‘‘ఓ నహుషపుత్రా! ఇంద్రుడు, చంద్రుడు మొదలైనవారు నీతో సరిసమానులు. నీ ఇంటిలో ఉన్న నన్ను ఎవరూ చూడలేరు. నా వంశం, అందం, ప్రవర్తన అంతా నీకు తెలుసు. నేను నిన్ను యాచిస్తున్నాను. నన్ను అనుగ్రహించి నాకు పుత్రభిక్ష పెట్టు.’’
యయాతి ‘‘నిజమే! నీ రూప, శీల సంపద శ్రేష్ఠమైనది. కాని శుక్రుడు దేవయానితో నా వివాహ సమయంలో ‘నిన్ను శయనానికి ఆహ్వానించకూడదు’ అని నియమం విధించాడు కదా!’’
అందుకు శర్మిష్ఠ ఇలా అంది - ‘‘తన భర్త తన సఖురాలి భర్త ఇద్దరూ సమానులే. నా సఖి నిన్ను పతిగా వరించింది కనుక నాకు కూడా నీవు పతివే. ఎవరికి ఏ కోరిక ఉంటే అది తీరుస్తానని రాజుగా ప్రమాణం చేశావు. అది అసత్యం చేయకు. నాకు పుత్రదానం చేయి. నీవు ధర్మాన్ని రక్షించే రాజువి. నన్ను అధర్మం నుండి కాపాడు. భార్య, దాసుడు, పుత్రుడు వీరు ముగ్గురూ ధనంపై అధికారం లేనివాళ్లు. వారి ధనమూ వారూ ఎవరి ఆధీనంలో ఉంటారో అవి వారివే. నేను దేవయాని దాసిని. కనుక ఆమెతోపాటు నేను కూడా నీకే చెందుతాను. కనుక నన్ను పొందు’’.
శర్మిష్ఠ మాటలు విని రాజు అంగీకరించి ఆమెను స్వీకరించాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయి చక్కని పుత్రుని కన్నది. దేవయానికి ఈ విషయం తెలిసింది. ఆమె శర్మిష్ఠతో ఇలా అంది. ‘‘శర్మిష్ఠా! కామంతో ఎంతటి పాపాన్ని చేశావు?’’
అప్పుడు శర్మిష్ఠ ఇలా అంది ‘‘్ధర్మాత్ముడు, వేదవేత్త అయిన ఒక ఋషి ఇక్కడకు వస్తే అతనిని సేవించి ధర్మసమ్మతంగా ఈ పుత్రుని పొందాను.’’
అప్పుడు దేవయాని ఆ ఋషి నామం, వంశం గురించి చెప్పమంటే శర్మిష్ఠ తనకు తెలియదు అంది. దేవయాని శర్మిష్ఠ మాటలు సత్యమని నమ్మింది.
తరువాత దేవయానికి యదువు, తుర్వసువు జన్మించారు. శర్మిష్ఠకు కూడా రాజు వల్ల ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అని ముగ్గురు పుత్రులు కలిగారు. ఒకసారి దేవయాని యయాతితో కలిసి వనానికి వెళ్లి అక్కడ దేవకుమారుల్లాంటి పిల్లలు ఆడుతుంటే చూసింది.
ఆమె రాజుతో ఇలా అంది ‘‘నిన్ను పోలిన ఈ పిల్లలు ఎవరు?’’
ఆ పిల్లలను పిలిచి వారి వంశం, తండ్రి గురించి ప్రశ్నించింది.
ఆ పిల్లలు వేలితో రాజును చూపించారు. తమ తల్లి శర్మిష్ఠ అని చెప్పారు. శర్మిష్ఠను కోపంగా దేవయాని అడిగింది. ‘‘అభ్యాగవతియైన ఋషివలన పిల్లలు పుట్టారని చెప్పావే? అది కాదు నీవే యయాతిని ప్రోత్సహించావు. నాకు దాసివై ఉండి నాకు ఇష్టం లేని పనిచేసి ఆసురీబుద్ధిని చూపించుకున్నావు’’.
అందుకు శర్మిష్ఠ ఇలా అంది ‘‘నేను ఋషి అని చెప్పిన మాట సత్యమే. నేను ధర్మాన్ని తప్పలేదు. నీవు ఎప్పుడు రాజును వరించావో అప్పుడు నేనూ వరించినట్లే. సఖి యొక్క భర్త ధర్మంగా నాకూ భర్తే. నీ భర్త రాజర్షి. గురువు శుక్రాచార్యుడు మనిద్దరిని అతనికి ఇచ్చాడు. నీ భర్త నాకు పూజ్యుడే’’.
ఈ మాటలతో దేవయాని ఆగ్రహించి రాజుతో ఇలా అంది ‘‘ఇక నేనిక్కడ ఉండలేను. నాకు ఇష్టం లేని పనిచేశావు’’ అని ఆమె తండ్రి దగ్గరకు వెళ్లింది. రాజు ఆమె వెనకాలే వెళ్లాడు.
అప్పుడు దేవయాని ఇలా అంది ‘‘అధర్మం ధర్మాన్ని జయించింది. వృషపర్వుని కూతురు నన్ను అతిక్రమించింది. ఈ రాజు ఆమె యందు ముగ్గురు పుత్రుల్ని కన్నాడు’’.
అది విని శుక్రుడు ఇలా అన్నాడు ‘‘మహారాజువై అప్రియమైన అధర్మాన్ని ఆచరించావు. కనుక ముసలితనం నీకు ఇప్పుడు వచ్చి పీడిస్తుంది’’.
దానికి యయాతి ఇలా అన్నాడు ‘‘దానవరాజు కూతురు నన్ను పుత్రుని కోసం యాచించింది. ఇటువంటి యాచన చేసిన స్తన్రి నిర్లక్ష్యం చేస్తే అది మహాపాపం కనుక చేశాను. అదీకాక ఎవరేది అడిగినా ఇవ్వాలనేది నా వ్రతం. ఆమె నన్ను కోరింది. వేరొకరిని ఇష్టపడలేదు. అందుకని ఈ పని చేశాను. అధర్మంపట్ల భయంతో శర్మిష్ఠను పొందాను.
అందుకు శుక్రుడు ఇలా అన్నాడు. ‘‘నీవు నా ఆజ్ఞ మొదట పొందాలి. కాని అది జరుగలేదు’’ ఇలా కోపించి శుక్రుడు యయాతిని శపించాడు. వెంటనే యయాతి తన వనాన్ని పోగొట్టకొని ముసలివాడు అయినాడు. అతను శుక్రునితో ఇలా అన్నాడు ‘‘దేవయాని యందు నేనింకా తృప్తి పొందలేదు. కనుక నన్ను అనుగ్రహించు. నా రుూ వృద్ధాప్యాన్ని తీసివేయి’’.
దానికి శుక్రుడిలా అన్నాడు. ‘‘నా మాట అసత్యం కాదు. కాని నీవు ఈ ముసలితనాన్ని వేరొకరికి సక్రమింపజేయవచ్చు’’.
రాజు ఇలా అన్నాడు ‘‘నా ముసలితనాన్ని తీసుకున్న నా పుత్రుడే రాజ్యాన్ని పొందును గాక! దీనికి నీ అనుమతి కోరుతున్నాను’’ శుక్రుడు దానికి ఒప్పుకున్నాడు.
ముసలితనంతో యయాతి తన భవనానికి వెళ్లి పెద్దకుమారుడైన యదువుతో ఇలా అన్నాడు. ‘‘నాయనా! శుక్రుని శాపం వల్ల నాకు ఈ అకాల వృద్ధాప్యం వచ్చింది. కాని నాకు ఇంకా సుఖాల పట్ల తృప్తి కలుగలేదు. నీవు నా ముసలితనాన్ని తీసుకో. కొంత కాలం నేను సుఖించి నీ వనాన్ని తిరిగి ఇస్తాన’’.
అప్పుడు యదువు ఇలా అన్నాడు ‘‘ముసలితనంలో పాన భోజనాల వల్ల ఏర్పడే దోషాలు చాలా ఉంటాయి. కనుక నీ వృద్ధాప్యాన్ని నేను తీసుకోలేను. నీకు ఇంకా ప్రియమైన పుత్రులు చాలా మంది ఉన్నారు. వారిని అడుగు’’. (ఇంకావుంది)

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి