డైలీ సీరియల్

కీచక వధ- 52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఇంకా ఇలా అంది. ‘‘రాణీ! ఈ రోజే నీవు నీ తమ్ముడికి జీవశ్రాద్ధం పెట్టించు. నీ తమ్ముణ్ణి కన్నుల నిండుగా చూసుకో. ఇక అతని ప్రాణాలు ఉండవు. నా భర్తలలో ఒకడు అత్యంత ఆగ్రహం కలవాడు. ఈ భూమీద అతనితో సమానమైన బలం గలవాడు ఇంకొకడు లేడు. అతనెందుకో కోపించక ఊరుకున్నాడు’’ రాణితో ఇలా చెప్పి సైరంధ్రి కీచకవధ కోసం వ్రతదీక్ష పూనింది. ఎవరు ఎంత బ్రతిమాలినా ఆమె ఒంటిమీద ధూళి కూడా తుడుచుకోలేదు. స్నానం చేయలేదు. భోజనం చేయలేదు. ఆ స్థితిలో ఆమెను చూసిన అందరూ కీచకుని చావు ఖాయమనుకున్నారు. ఆమె కీచకుడు చేసిన అవమానం సహించడానికి కారణముంది.
క్షత్రియుడైన తండ్రికి బ్రాహ్మణి అయి తల్లికి పుట్టినవాడు సూతుడు అనబడతాడు. వీరు ద్విజులకు ఉచితమైన పనులు చేస్తారు. ఇతను క్షత్రియుని కంటే తక్కువ, వైశయుని కంటే ఎక్కువ. రాజులకు ఈ సూతజాతితో వైవాహిక సంబంధాలు ఉంటాయి. కాని వారికి రాజశబ్దం లభించలేదు. కేకయుడు అనే వాడు సూతులకు అధిపతి. అతనికి భార్య మాళవి యందు అనేకమంది పుత్రులు జన్మించారు. వారిలో జ్యేష్ఠుడు కీచకుడు. అతడు మహా బలవంతుడు. ఈ కీచకులందరికీ చెల్లెలుగా సుధేష్ణ పుట్టింది. ఆమె విరాటరాజును పెళ్లి చేసుకొని అతని పట్టపురాణి అయింది. ఆమెకు విరాటుని వలన ఉత్తరకుమారుడు అనే పుత్రుడు, ఉత్తర అనే పుత్రిక జన్మించారు. కీచకునికి అనేకమంది తమ్ముళ్లు ఉన్నారు. కీచకుని సహాయంతో విరాటుడు సమస్త శత్రువులను జయించి బలమైన రాజ్యాన్ని స్థాపించాడు. కీచకుడే విరాటరాజు సేనాపతి.
మరి ద్రౌపది ఎందుకు కీచకుని శపించలేదు అంటే దానికి కారణముంది. క్రోధం వలన తపస్సు నష్టమవుతుంది. అందుకనే ఋషులు కూడా తొందరగా ఎవరినీ శపించరు. సహనమే ధర్మం. క్షమయే పుణ్యం. ద్రౌపదికి ఈ విషయం కూడా తెలుసు. అందుకే కీచకుని ఆమె శపించలేదు. పాండవులు అత్యంత సమర్థులై ఉండి ద్రౌపది దురవస్థను చూస్తూ అజ్ఞాతవాసం పూర్తికానందున ఊరుకున్నారు. భీముడు మాత్రం కీచకుని చంపడానికే నిశ్చయించు కున్నాడు. కాని యుధిష్ఠిరుడు అతన్ని ఆపుతున్నాడు.
సూతపుత్రుడైన కీచకుడు తనను కాలితో నిండుసభలో తన్నినప్పటి నుంచి ద్రౌపది అతడిని ఎలాగైనా చంపాలని నిశ్చయించుకొని భీమసేనుని తల్చుకుంది. అతను తప్ప ఇంకెవ్వరూ ఈ పని చేయలేరు అని ఆమెకు తెలుసు. ఆ రాత్రి ఆమె భీమసేనుని భవనానికి వెళ్లింది. భీమసేనునితో ఇలా అంది. ‘‘ఆర్యపుత్రా! నా శత్రువు మహాపాపి అయిన సూతపుత్రుడు నా పట్ల అంత అవమానకరంగా ప్రవర్తించినా ఇంకా వాడు బ్రతికి ఉండడంతో నాకు నిద్ర ఎలా పడుతుంది?’’ ఇలా చెప్పాలని తలుస్తూ ఆమె నిద్రిస్తున్న భీముని లేపింది.
‘‘్భమసేనా! ఏమిటిలా నిద్రపోతున్నావు? భర్త బ్రతికి ఉండగా అతని భార్యను స్పృశించిన పాపాత్ముడు జీవించి ఉండకూడదు కదా!’’ అని అన్నది.
భీమసేనుడు పూర్తిగా నిద్రమేల్కొని ఆమెతో ఇలా అన్నాడు. ‘‘దేవీ! ఏ పనిమీద నీవిలా నా దగ్గరికి వచ్చావు? నీవు ఎప్పటిలాగ లేవు. చిక్కిపోయి ఉన్నావు. విషయం అంతా వివరిస్తే దాన్ని నివారించడానికి నేను ఉపాయాన్ని ఆలోచిస్తాను. నేను నిన్ను ఆపదనుండి తప్పిస్తాను. కనుక విషయం చెప్పి నీ గృహానికి వెళ్లిపో’’.
ద్రౌపది అతనితో ఇలా అన్నది. ‘‘యుధిష్ఠిరుని భర్తగా పొందిన స్తక్రి శోకం తప్ప ఇంకేం ఉంటుంది? దుర్యోధనుడు నన్ను దాసి అనడం ప్రాతికామి ద్వారా నన్ను సభలోకి రప్పించడం - ఈ అవమానం ఇంకా దహిస్తూనే ఉంది. దుర్యోధనుడు నన్ను అవమానిస్తూ ఉండగా అక్కడ ఉన్న గురువులు, పెద్దలు అత్తమామలు కర్ణాదులు ఉన్నారు కదా! అందరూ చూస్తూ ఉండగా దుశ్శాసనుడు నా జుట్టు పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చాడు. వనవాసంలో సింధురాజు చేసిన అవమానం - ఇవన్నీ ఎలా మర్చిపోతాను? మీరంతా జీవించి ఉండగానే నేను సుధేష్ణకు దాసిగా జీవిస్తున్నాను. మీ సంతోషం కోసం ఇలాంటి కష్టాలను లెక్కచేయను.
కాని విరాటరాజు కొలువులో ఆ నీచుడు కీచకుడు కాలితో తన్ని అవమానించాడు. ఇది సహించి నాలాంటి రాజపుత్రి ఎలా జీవించి ఉండగలదు? ఆ కీచకుడు రాజు బావమరిది. అతను సేనాపతి, దుష్టులు. రాజభనంలో నన్ను చూసి తనకు భార్యవు కమ్మని అడుగుతున్నాడు. ఆ జుగుప్సాకరమైన ప్రస్తావన వినీవినీ నా మనస్సు బ్రద్దలైపోతున్నది. నాకు నీ కోపం, పరాక్రమం తెలుసు. కనుక నా బాధను, కష్టాన్ని చెప్పుకొని నీ ముందు విలపిస్తున్నాను. పాండునందనా! ఏనుగు పండ్లను కాలితో తొక్కి నుజ్జు నుజ్జు చేసిన రీతిగా ఆ దుష్టకీచకుని తలను ఎడమకాలితో తన్ని మర్దించు. అతను రేపు సూర్యోదయం చూస్తే నేను జీవించను.
నా కష్టాలన్నింటికీ మీ అన్నయే కారణం. అతని ద్యూతక్రీడ వ్యసనం వల్లనే నా గతి ఇలా అయింది. ప్రతీరోజు వేయి బంగారు నాణాలతో జూదం ఆడినా మన సంపద తరిగి ఉండేది కాదు. కాని అతను సమస్త రాజ్యాన్ని విడిచి వనవాసం వెళ్లాలనే నియమంతో జూదం ఆడాడు. అతను అంతటి వ్యసనపరుడు. ఇప్పుడు తాను చేసిన పనులకు మాట్లాడకుండా వౌనంగా ఉన్నాడు. ఆ వ్యసనమే అతన్ని ఈ స్థితికి తెచ్చింది. రాజధానిలో అతని కోసం పదివేల ఏనుగులు, గుర్రాలు, బంగారు గొలుసులు ధరించి సిద్ధంగా ఉండేవి. అతన్ని సేవించడానికి ఎంతో మంది రాజులు ఉండేవారు. నిత్యము అతడు వేలకొద్దీ బంగారు నాణెములు దానం చేసేవాడు. అతని భోజనాలయంలో లక్షలమంది స్తల్రు వచ్చేవారికి వడ్డిస్తూ ఉండేవారు. ఆ ధర్మరాజే నేడు జూదంతో సమస్తం పోగొట్టుకొని విరాటరాజు దగ్గర కుంకుభట్టుగా జీవిస్తున్నాడు. ఇంద్రప్రస్థలో అనేకమంది సూతులు మాగధులు అతన్ని నిత్యం స్తుతించేవారు. అతని సభలో వేదవిజ్ఞానం తపస్సు కలిగి ఉన్న ఋషులు, మహర్షులు ఉండేవారు. ఎనభై వేలమంది స్నాతక బ్రాహ్మణులను తనవద్ద ఉంచుకొని పోషించేవాడు. వారితోపాటు పదివేల మంది దానం పట్టని సన్యాసులను పోషించేవాడు. అలాంటి ధర్మరాజు ఇప్పుడు ఈ దురవస్థలో జీవిస్తున్నాడు. మత్స్యరాజుకు సేవకునిగా బ్రతుకుతున్నాడు. యుధిష్ఠిరుని ఈ స్థితి చూస్తే ఎవరికి బాధ కలుగదు? రాజు యొక్క ఈ దురవస్థ నేను చూడలేక పోతున్నాను.
అదేవిధంగా నీవు వంటలు వండేవానిగా ఉన్నందుకు నా మనస్సు రోదిస్తున్నది. నీవు కూడా ఈ ప్రభువుకు సేవకునిగా ఉంటున్నావు. వంటలు చేయని సమయంలో నీవు అందరినీ వినోదం కోసం సింహాలతో, ఏనుగులతో పోరాడుతూ ఉంటే నా మనస్సు వ్యధ చెందుతున్నది. ఇక అర్జునుడు ఒంటరిగా దేవతలను కూడా జయించినవాడు, శత్రుభయంకరుడు నేడు చేతులకు గాజులు తొడిగి అంతఃపురంలో ఆడపిల్లలకు నాట్యం నేర్పిస్తున్నాడు. భూమికి రాణినైన నేను ఈనాడు సుధేష్ణకు దాసిగా ఉండవలసి వచ్చింది. మీకు కాని, కుంతీదేవికికాని భయపడని నేను ఈ రోజు విరాటరాజుకు భయపడుతున్నాను’’.
ద్రౌపది ఇలా తన కష్టాల గురించి చెప్తూ ఉంటే భీమసేనుడు కాయలు కాచిన ఆమె చేతులు పట్టుకొని విలపించాడు. అతను ఆమెతో ఇలా అన్నాడు. ‘‘నీ చేతులు చూస్తే నా భుజబలమూ, అర్జునుని గాండీవము ఎందుకూ పనికిరానివని తెలిసింది. నేను అప్పుడే ఆ నీచ కీచకుని చంపి ఉండేవాడిని. కాని యుధిష్ఠిర మహారాజు అజ్ఞాతవాసం బయటపడుతుందని సూచిస్తూ నావైపు చూచాడు. అందువలన ఊరుకున్నాను.
ఆ నీచుడు నిన్ను కాలితో తన్నడం నేను చూశాను. ఈ మత్స్యదేశాన్ని నేలమట్టం చేయాలనిపించింది. కాని ధర్మరాజు సైగతో నన్ను ఆపాడు. పాంచాలీ! నీవు ధర్మాన్ని విడిచిపెట్టకు. క్రోధాన్ని విడిచిపెట్టు. నీవు చేసిన ఈ నిందను ధర్మరాజు కాని తక్కిన సోదరులు కాని వింటే వారంతా తప్పక మరణిస్తారు. వారు మరణిస్తే నేను బ్రతకను. నీవు సద్గుణవతివి. కొంతకాలం ఓపిక పట్టు. ఒక్కపదిహేను రోజులు అవగానే పదమూడో ఏడు అయిపోతుంది. నీవు ఈ రాణులందరికీ రాణివవుతావు’’.
*
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి