డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశ్యప ప్రజాపతి జలాన్ని జలజంతువులను రక్షించడానికి ఈ దిక్కును వరుణునికి పట్ట్భాషేకం చేశాడు. ఇక్కడే అస్తాద్రి ఉంది. అది సూర్యుని ప్రతిదినము గ్రహిస్తుంది. ఈ దిక్కునే దితి గర్భం నుండి మరుత్తులు పుట్టారు. సూర్యచంద్రులను సంహరించాలని సంకల్పించిన రాహువు మొండెము ఈ దిక్కులోనే సముద్రంలో ఉంటుంది. ఇక్కడి నుండే సూర్యుని తిరోగతి ప్రారంభవౌతుంది. ఇక్కడ వరుణాలయంలో మూడు లోకాలకు సరిపడా నీరు నిలువచేయబడింది. ఈ దిక్కు నాగరాజైన అనంతుని నివాసం. వాయువు నివాసం ఈ దిక్కే. మరీచి పుత్రుడైన కశ్యపుని నివాసమూ ఇక్కడే. ఇప్పుడు ఎటు వెళ్దాము?’’
తరువాత వారిరువురూ ఉత్తర దిక్కుకు వెళ్లారు. అప్పుడు గరుడుడు ఆ దిక్కును ఇలా వర్ణించాడు. ‘‘ఈ దిక్కులో ప్రయాణం మనుష్యుని పాపాల నుండి ఉద్ధరిస్తుంది. మోక్షసుఖాన్నిస్తుంది. ఇలా ఉద్ధరింప గల శక్తి కలది కనుక దీనికి ఉత్తర దిశ అన్న పేరు వచ్చింది. ఈ దిక్కు శ్రేష్ఠమైనది. స్వార్థపరులకు పాపాత్ములకు ఈ దిక్కున తావు లేదు. ఈ దిక్కుననే బదరికాశ్రమము ఉంది. అక్కడ సచ్చిదానంద రూపుడైన నారాయణుడు, జయశీలుడైన నరుడు శాశ్వతుడైన బ్రహ్మ నివసిస్తారు. ఇక్కడే ఉమతో సహా మహేశ్వరుడు కైలాసంపై నివాసముంటాడు. ఇక్కడే ఆకాశం నుండి గంగను పరమేశ్వరుడు తలపై దాల్చి మానవలోకానికి పంపాడు. ఇక్కడే పార్వతి ఈశ్వరుని కోసం తపస్సు చేసింది. ఈ దిక్కునే కైలాసపర్వతం మీద కుబేరునికి యక్ష రాక్షస గంధర్వాధిపతి గా పట్ట్భాషేకం జరిగింది. ఇక్కడే సిద్ధుల నివాసాలు ఉంటాయి. స్వాతినక్షత్రం ఇక్కడే ఉదయిస్తుంది. ఇక్కడే సప్తర్షులు అరుంధతి ప్రకాశిస్తూ ఉంటారు. ఈ దిక్కునే సత్యవాదులైన మహర్షులు గంగా ద్వారాన్ని రక్షిస్తూ ఉంటారు. మహే శ్వరుడు నరనారాయణులకు తప్ప ఇంకెవ్వరికీ కన్పించడు. ఒక్క నరుడు తప్ప ఇంకెవ్వరూ గంగాద్వారం దాటి ముందుకు వెళ్లలేరు. త్రివిక్రమావతారంలో విష్ణువు మూడు లోకాలను ఆక్రమించినపుడు ఈ దిక్కున పాదం మోపాడు. ఈ విష్ణుపాద చిహ్నం ఈనాటికీ ఇక్కడ ఉంది. ఈ దిక్కుననే లోకపాలకులందరూ ప్రతినిత్యం ఉదయం సాయంత్రం సమావేశమై ఎవరికి ఏది అవసరమో చర్చిస్తూ ఉంటారు. గాలవా! నాలుగు దిక్కుల గురించి నీకు వివరించాను. ఏ దిక్కును తీసుకొని వెళ్లమంటే ఆ దిక్కుకే తీసుకొని వెళ్తాను’’.
అప్పుడు గాలవుడు గరుత్మంతునికి నమస్కరించి ఇలా అన్నాడు. ‘‘సుపర్ణా! ధర్మానికి కన్నుల వలె సూర్యచంద్రులు ప్రకాశించే తూర్పు దిక్కునకు నన్ను ముందు తీసుకొని వెళ్లు’’. వెంటనే గరుత్మంతుడు అతన్ని తన వీపుపై ఎక్కించుకొని ఆ దిశగా ఎగిరాడు. గాలవునికి గరుత్మంతుని రెక్కల మధ్యన కూర్చుని చేస్తున్న ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. అతను గరుత్మంతునితో ఆశ్చర్యంగా ఇలా అన్నాడు. ‘‘గరుడా! నీ రూపం ఆకాశంలో ఎగురుతూ సూర్యుని రూపంలాగ ప్రకాశిస్తోంది. నీ రెక్కల గాలికి సముద్రాలు, పర్వతాలు నదులు అరణ్యాలతో సహా ఈ సమస్త భూమిని పైకి లాగుతున్నట్లుగా ఉంది. నిరంతరం నీ రెక్కలు ఊపటం చేత సముద్రంలోని మొసళ్లను, ఏనుగులతో పాటు సముద్ర జలాన్ని కూడా పైకి లాగుతున్నట్లుంది. ఈ సముద్రపు ఘోషలో ఏమీ వినిపించడం లేదు. నాయనా! కాస్త నెమ్మదిగా ఎగురు. లేకపోతే నేను పడిపోతాను. నాకు దిక్కులు కాని సూర్యుడు కాని, ఆకాశం కాని కన్పించడం లేదు. ఒక్క చీకటి మాత్రం కన్పిస్తున్నది. నాకు శరీరం కూడా కన్పించడం లేదు. నీ కళ్లు మాత్రమే మెరుస్తున్న రత్నాల్లాగా కన్పిస్తున్నవి. నీ గమనంలోని వేగాన్ని తగ్గించు. నీ వేగాన్ని నేను తట్టుకోలేను. వెనక్కు పోదాం. ఒక చెవివైపు నలుపు ఉన్న ఎనిమిది వందల గుర్రాలను గురువుగారికి దక్షిణగా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మార్గమే కన్పించడం లేదు. ఇప్పుడు ఈ జీవితానే్న పరిత్యజించాలి. నా దగ్గర కొంచెం కూడా ధనం లేదు. ధనసహాయం చేసే మిత్రులూ లేరు. ఈ పనికి ధనరాశి కావాలి. లేకుంటే ఏ పనీ అవదు’’. అతని దీనమైన మాటలు విన్న గరుడుడు ఎగురుతూనే ఇలా అన్నాడు.
‘‘బ్రాహ్మణోత్తమా! నీవు ప్రాణత్యాగం చేయాలనుకుంటే నీవు వట్టి అమాయకుడవు. ఎందుకంటే మృత్యువు పరమేశ్వర స్వరూపమే కాని ఎవరూ కల్పించేది కాదు. నీ గుర్రాల విషయం ముందే ఎందుకు చెప్పలేదు? దానికి ఒక ఉపాయం ఉంది. ఈ ఋషభపర్వతం మీద విశ్రమించి భుజించి వెనక్కి వెళ్దాం.’’
ఆ తర్వాత వారిరువురూ ఋషభపర్వతం పై దిగి అక్కడ బ్రహ్మజ్ఞాని అయిన శాండిలిని చూశారు. గరుడుడు ఆమెకు నమస్కరించాడు. గాలవుడు ఆమెను సత్కరించాడు. ఆమె వారిని ఆశీర్వదించి కూర్చోమంది. వారికి సిద్ధన్నాన్ని సమర్పించింది. వారు భుజించి హాయిగా కొంతసేపు నిద్రపోయారు. రెండు గడియల తర్వాత లేచిన గరుడుడు తన రెక్కలు రెండూ లేకపోవడం గమనించాడు. అవి లేకపోవడం వలన అతను మాంసపిండంలాగ కన్పించాడు. గాలవుడు అట్టి గరుడుని చూసి బాధపడి ఇలా అన్నాడు. ‘‘గరుడా! నాకు సహాయం చేద్దామని నన్ను తీసుకొని వచ్చి నీవు ఇలాంటి ఫలితాన్ని పొందావేమిటి? ధర్మవిరుద్ధమైన ఏ అశుభాన్ని అయినా మనసులో స్మరించావా? ధర్మవిరుద్ధమైన ఏ చిన్న కార్యాన్ని నీవు చేయవు కదా!’’
అప్పుడు గరుడుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘బ్రాహ్మణుడా! ఈ సిద్ధ తపస్వినిని ఇక్కడి నుండి బ్రహ్మ, మహాదేవుడు, విష్ణువు, ధర్మమూ, యజ్ఞము ఉన్న చోట నివసించడానికి తీసుకొని పోవాలనుకున్నాను. నేనది ఆమెకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆమెను కొనిపోవాలని తలచాను’’.
ఇలా అతను శాండిలితో ‘‘మీపై గౌరవంతో నేనిలా చేయాలని భావించాను. మీకిష్టం లేకపోతే వద్దు. నా ఆలోచనను మన్నించి క్షమించండి’’ అన్నాడు.
అప్పుడు ఆమె ఆనందించి వారిరువురితో ఇలా అంది. ‘‘సుపర్ణా! భయపడకు. నీవు సుపర్ణుడవే అవుతావు. నీవు నన్ను నిందించావు. అది నేను సహించను. అనందింత ప్రవర్తనతో సదాచారాన్ని పాటించడం వలన నేను సిద్ధిని పొందాను. ఆచారమే ధర్మాన్ని సఫలం చేస్తుంది. అశుభ లక్షణాల వల్ల ఆచారము నశిస్తుంది. కనుక మీరిరువురూ మీకిష్టమైన చోటికి వెళ్లండి. నీవు నన్ను నిందించ వద్దు. మరల నీవు బలవంతుడవు కాగలవు’’. ఆమె ఇలా అనగానే గరుడునికి మరల రెక్కలు మొలిచాయి. అప్పుడు వారు శాండిలి దగ్గర అనుమతి తీసుకొని పూర్వం వచ్చిన బాటనే వెళ్లారు. గాలవునికి కావలసిన గుర్రాలు ఎక్కడా కన్పించలేదు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి