డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు నారాయణుని నాయకత్వాన వారంతా దధీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి బ్రహ్మ చెప్పిన విధంగా అతనిని వరం కోరారు. మహర్షి ప్రశాంత దృక్కులతో వారిని చూసి వారికి మేలు చేయదలచి వెంటనే తన ప్రాణాలు వదిలివేశాడు. దేవతలు అతని శరీరంలోని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేయించారు.
అప్పటికే వృత్రుడు భూమిని, ఆకాశాన్ని ఆక్రమించి ఉన్నాడు. అతని సైన్యం అయిన దైత్యులు పెద్ద పెద్ద శరీరాలతో ఆయుధాలు ధరించి అతనికి అన్ని వైపులా ఉన్నారు. వారు ఆయుధాలతో దేవతలను మోదుతూ ఉంటే దేవతలు భయంతో అన్ని వైపులకు పరుగులుపెట్టారు. ఇది చూసి భయపడి ఇంద్రుడు నారాయణుని శరణు వేడాడు. నారాయణుని ఇలా ప్రార్థించాడు. ‘‘నీవు త్రివిక్రముడివి. మూడు లోకాలను ఉద్ధరించావు. ఈ వృత్రాసురుని బారి నుండి మమ్ము కాపాడు’’.
అప్పుడు విష్ణువు తన శక్తిని బ్రహ్మర్షుల శక్తిని ఆ వజ్రాయుధంలోకి పెట్టి సమయం వచ్చినప్పుడు దానిని ఉపయోగించగమని చెప్పాడు. ఇంకా వారికొక సలహా ఇచ్చాడు ‘‘మీరంతా వృత్రుడి దగ్గరకు వెళ్లి అతనితో సంధి చేసుకోండి. తర్వాత అతన్ని జయించడానికి ప్రయత్నిద్దాం. నా శక్తిని ఋషుల శక్తిని వజ్రాయుధంలో ప్రవేశపెడ్దాము. అలా ఆ ఆయుధానికి బలం చేకూరుస్తాం.’’
మహావిష్ణువు మాట విని ఋషులు, దేవతలు ఇంద్రునితో కలిసి వృత్రాసురుని దగ్గరకు వెళ్లారు. ఋషులు వృత్రునితో ఇలా అన్నారు. ‘‘ఓ దుర్జయా! ఇప్పటిదాకా నినె్నవరూ జయించలేకపోయారు. నీవుకూడా ఇంద్రుడిని గెలవలేదు. మీ ఇద్దరి మధ్య యుద్ధాల వల్ల లోకాలన్నీ బాధపడుతున్నాయి. కనుక ఇంద్రునితో నీవు సంధి చేసుకోవాలి’’.
ఋషుల మాటలు విన్న వృత్రాసురుడు ఇలా అన్నాడు. ‘‘దేవేంద్రుని నాకు సంధి ఎలా కుదురుతుంది?’’
ఋషులు ఇలా నచ్చచెప్పారు. ‘‘సజ్జనులు మైత్రినే కోరుకుంటారు. ఇంద్రుడు సత్యవాది. ధర్మజ్ఞుడు. అతనితో సంధి నీకు మేలు చేస్తుంది’’
వృత్రుడు మరల ఇలా అన్నాడు. ‘‘నేను చెప్పేది మీరు చేస్తే మహర్షులు చెప్పినట్లు నేను చేస్తాను. తడిసినది, ఎండినవి, రాతితో, కొయ్యతో చేసిన ఏ వస్తువుతోను, శస్త్రంతోను, అస్త్రంతోను పగలు కాని రాత్రి కాని ఇంద్రాది దేవతలు నన్ను చంపకూడదు. మీరు దీనికి ఒప్పుకొని సరేనంటే ఇంద్రునితో సంధికి నేను అంగీకరిస్తాను’’. ఋషులు అతను చెప్పిన దానికి ఒప్పుకొని వారిద్దరికీ సంధి కుదిర్చారు.
ఇంద్రుడు వృత్రునితో స్నేహంగా ఉన్నప్పటికీ అతన్ని వధించడానికి అనేక ప్రయత్నాలు రహస్యంగా చేస్తూనే ఉన్నాడు.
ఒక రోజు ఇంద్రుడు వృత్రుని సముద్రం ఒడ్డున చూశాడు. ఆ సమయం దారుణమైన ముహూర్తం. సంజవేళ అయింది. అంటే పగలు రాత్రి కాని సమయం. ఇంద్రుడు మహర్షులు వృత్రునికి ఇచ్చిన వరాలను గుర్తు చేసుకొన్నాడు. కనుక ఆ సమయంలో వృత్రుని చంపాలి. ఇలా ఆలోచిస్తూ అతను ఎదురుగా ఉన్న సముద్రపు నురగను చూశాడు. చూసి ఇలా అనుకున్నాడు. ‘‘ఈ నురుగు తడి కాదు, పొడికాదు. అలాగే ఆయుధమూ కాదు.దీనిని వజ్రాయుధానికి పూసి వృత్రునిపై విసురుతాను’’ ఇలా ఆలోచించి వజ్రాయుధానికి ఆ నురుగును పూసి వృత్రుని పై విసిరాడు. విష్ణువు దానిలో ప్రవేశించి వృత్రుని వధించాడు. వృత్రుడు మరణించగానే భూమి స్థిమితపడింది. చల్లని గాలులు వీచాయి. జనులంతా సంతోషించారు. మహర్షులు అతన్ని స్తుతించారు.
వృత్రుడు మరణించగా మిగిలిన కాలకేయులు సముద్రంలోకి ప్రవేశించి ఈ లోకాలను నాశనం చేయడానికి ఉపాయాలు ఆలోచింపసాగారు. కొందరు దైత్యులు ఇలా సలహా ఇచ్చారు. ‘‘విద్య, తపస్సు ఉన్నవారిని ముందు వధించాలి. ఎందుకనగా లోకాలు తపము చేత నిలుస్తున్నాయి. కనుక ముందు తపస్సును నాశనం చేయాలి. తాపసులు ధర్మపరులు వారు నశిస్తే లోకాలు నశించినట్లే. ఇలా ఆలోచించి రత్నమయమైన సముద్రంలో దైత్యులు నిశ్చింతగా నివసించి అవకాశం దొరికినప్పుడు మునులను పట్టి తినసాగారు. వారిని మనుష్యులు గుర్తించలేకపోయారు. ఇంద్రాది దేవతలు ఈ భీభత్స పరిస్థితిని చూసి మరల నారాయణుని శరణు వేడారు. అతను వారిని అగస్త్యుని ప్రార్థించమని చెప్పాడు. దేవతలు అదేవిధంగా చేయగా అగస్త్యుడు వారిపై దయతలచి సముద్ర జలాలను త్రాగేశాడు. నీరంతా ఇంకిపోగా అందులో నుండి కాలకేయులు బయటపడగా దేవతలు వారిని వధించారు. తిరిగి భూమిపై శాంతి నెలకొల్పబడింది.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి