డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11. శ్రీరాముని చరిత్ర
సూర్యవంశపురాజులలో సర్వశ్రేష్ఠుడు శ్రీరాముడు. అతను దశరద మహారాజు పుత్రుడు. దశరథుడు ప్రజలను కన్నబిడ్డలవలె పాలించాడు. రామునిలోని సుగుణాలు లెక్కించలేము. అతను పితృవాక్య పరిపాలకుడు. తండ్రి ఆజ్ఞానుసారం భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో పదునాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. అప్పుడు అరణ్యంలోని తాపసులు వచ్చి తమను రాక్షసుల బారినుండి కాపాడమని కోరారు. రాముడు పధ్నాలుగు వేల రాక్షసులను వధించి, మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి వారికి వీలు కల్పించాడు. శ్రీరాముడు అరణ్యంలో ఉన్నప్పుడే లంకాధిపతి అయిన రావణుడు రామలక్ష్మణులు లేకుండా చూసి సీతను అపహరించాడు. సీత అపహరణం గురించి జటాయువు రామునికి తెలిపాడు. అప్పుడు శోకంతో ఉన్న రాముడు తనలాగే కష్టాలలో ఉన్న వానరరాజు సుగ్రీవునితో స్నేహం చేసి అతని అన్న వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. తర్వాత రాముడు సుగ్రీవునితోను, మహాబలులైన వానరులతోను సీత లంకలో బంధింపబడి ఉన్నదని తెలుసుకున్నాడు. లంకను చేరడానికి అతను వానరుల సహాయంతో సముద్రంపై సేతువు నిర్మించి, లంక చేరి రాక్షసులతో యుద్ధం చేసి రావణునితో సహా అందరినీ వధించాడు. కాని తనను శరణుకోరిన విభీషణుని లంకకు రాజును చేశాడు. దేవదానవులకు వధింప వీలుగానివాడై దేవతలను, బ్రాహ్మణులను కంటకంగా బాధించిన రావణుని యుద్ధంలో బంధుమిత్ర, పుత్ర సహితంగా వధించాడు. తర్వాత సోదరునితో, భార్యతో, వానరవీరులతో పుష్పక విమానం ఎక్కి అయోధ్య చేరాడు. అతడు సోదరులు, మంత్రులు తనను సేవిస్తూ ఉండగా నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమిని పాలించాడు. అతను ధర్మాన్ని తప్పకుండా రాజ్యాన్ని పాలించాడు. అతన్ని దేవతలు, మునులు కూడా సేవించారు. మహాయజ్ఞాలైన అశ్వమేద, రాజసూయాలను చేశాడు. అతను ఇచ్చిన హవిస్సులను దేవేంద్రుడు ఆనందంతో స్వీకరించాడు. అతని పాలనలో ఋషులు, దేవతలు, కలిసి ఈ భూమి మీద నివసించారు. ఆయన పాలనలో ప్రాణవాయువులు క్షీణించలేదు. యజ్ఞాలలో, అగ్నిహోత్రాలలో అగ్నిదీప్తులు ప్రజ్వరిల్లినాయి. ఏ అనర్థాలు జరుగలేదు. ప్రజలు దీర్ఘాయువులుగా జీవించారు. నాలుగు వేదాల స్వాధ్యాయంతో దేవతలు, పితృదేవతలు ఆనందంతో హవ్యకవ్యాలను స్వీకరించారు. అంతటా యజ్ఞయాగాదులు, వాపీకూపతటాక నిర్మాణాలు జరిగాయి. కౄరమృగాలు, పాములు లేవు. అగ్నిప్రమాదాలు, జలప్రమాదాలు లేవు.
ఆ కాలంలో అధర్మంతో మెలిగేవారు, లుబ్ధులు గాని, మూర్ఖులు గాని లేరు. అన్ని వర్ణాల వారు తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించారు. పూర్వం జనస్థానంలో రాక్షసులు నాశనం చేసిన స్వధాపూజలను శ్రీరాముడు వారిని సంహరించి మళ్లీ కొనసాగేలా చేశాడు. దేవతలకు పితృదేవతలకు హవ్యకవ్యాలను సమర్పింపజేశాడు. పెద్దవారు ఎవ్వరూ చిన్నవారి మృతిని చూడలేదు.
శ్రీరాముని రాజ్యంలో దొంగల భయం కాని, రోగబాధలు కాని, ఏ విధమైన విపత్తులు కాని కలుగలేదు. కరువు, వ్యాధులు, అనావృష్టి భయాలు అతని రాజ్యంలో లేవు. సమస్తలోకం సుఖమయంగా ప్రసన్నంగా కన్పించేది. సర్వజనులు సుఖసంతోషాలతో ఉండేవారు.
శ్రీరాముడు ఆజానుబాహువు. అరవింద దళాయతాక్షుడు, నీలమేఘశ్యాముడు. ‘‘రామో మూర్తివాన్ ధర్మః’’ అంటే ధర్మమే రాముని రూపంతో అవతరించింది. అతని కారణంగా జగత్తు అంతా రామమయం అయింది. అతను పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఆయనకు, అతని సోదరులకు ఒక్కొక్కొరికి ఇద్దరు ఇద్దరు పుత్రులు కలిగారు. వారితో ఎనిమిది రాజవంశాలు స్థాపించబడినాయి. అతను స్వర్గానికి తనతోపాటు చతుర్వర్ణప్రజలను తీసుకొని వెళ్లాడు. అతని ధర్మ ప్రయాణమే రామాయణంగా వాల్మీకి మహర్షి రచించాడు. అదే ఆదికావ్యం.
12. గయ మహారాజు కధ
అమూర్తరయసుని తనయుడు గయుడు. అతను వంద సంవత్సరాలు హోమం చేయగా మిగిలిన అన్నానే్న భుజించాడు. ఇందుకు ప్రసన్నుడయి అగ్నిదేవుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు గయుడు ఈ విధంగా వరం అడిగాడు. ‘‘దేవా! తపస్సుతో బ్రహ్మచర్యంతో, వ్రతంతో, నియమంతో, గురువుల అనుగ్రహం వల్ల వేదాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇతరులను బాధపెట్టకుండా, హింసించకుండా నాకు అక్షయమైన ధనం కోరుకుంటున్నాను. బ్రాహ్మణులకు దానం చేయలనే కోరిక నాలో నిత్యం ఉండాలి. నా వర్ణానికే చెందిన కన్యలయందు నాకు పుత్ర సంతతి కలగాలి.
నేను చేసే ధర్మకార్యాలలో ఎటువంటి విఘ్నాలు రాకూడదు. నా మనస్సు నిరంతరం ధర్మమునందు నిలిచి ఉండాలి’’. అగ్నిదేవుడు అతని కోర్కెలకు ‘‘అలాగే జరుగుతుంది’’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.
గయుడు తను కోరుకున్నవి అన్నీ పొంది శత్రువులను జయించి, నూరు సంవత్సరాల కాలం శ్రద్ధతో ధర్మ, పౌర్ణమాసం, అగ్రాయణం, చాతుర్మాస్యం మొదలైన అనేక యజ్ఞాలు చేశాడు. వాటిల్లో సమృద్ధిగా దక్షిణలను ఇచ్చాడు. వంద సంవత్సరాలకాలంలో ప్రతిరోజు ప్రాతఃకాలముననే లేచి బ్రాహ్మణులకు లక్షా పదివేల గోవులను, పదివేల గుర్రాలను, లక్ష నిష్కాలను దానం చేసేవాడు. అతడు అంగిరసుని లాగా అన్ని నక్షత్రాలలో నక్షత్ర దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేశాడు. అతను చేసే యజ్ఞాలలో యూపస్తంభాలు అన్నీ సువర్ణమయమే. సముద్రాలలో, ద్వీపాలల్లో, అడవుల్లో, నగరాల్లో ఉండే సకల ప్రాణులు ఆయన యజ్ఞసంపదతో సంతృప్తి చెంది, ‘‘గయ మహారాజు చేసిన యజ్ఞాలలాగ ఇతర యజ్ఞాలు లేవు’’ అని ప్రశంసించారు.
ఈ యజ్ఞాలవల్ల గయమహారాజు మూడు లోకాల్లోను ప్రసిద్ధి చెందాడు. అంత గొప్పవాడు గయ మహారాజు.
ఇంకావుంది...