డైలీ సీరియల్

అంబోపాఖ్యానము-81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీష్ముని మాటలతో పరశురామునికి ఆగ్రహం కలిగింది. అతను భీష్మునితో ఇలా అన్నాడు. ‘‘భీష్మా! అదృష్టంకొద్దీ నాతో తలపడాలనుకుంటున్నావు. పద కురుక్షేత్రానికి. అక్కడ నా బాణాల చేత చచ్చిన నీవు కాకులకు, గ్రద్ధలకు ఆహారమవుతుంటే నీ తల్లి గంగాదేవి చూస్తుందిలే’’. అలా అంటున్న పరశురాముని శిరసు వంచి ప్రణామం చేసి భీష్ముడు కురుక్షేత్రానికి బయలుదేరాడు. అతను తెల్లని కవచం ధరించి తెల్లని ధనుస్సు పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు. అప్పటికే అక్కడ పరశురాముడు ఉన్నాడు. వారివురి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూడడానికి అక్కడికి బ్రాహ్మణులు, తాపసులు, ఇంద్రసహితంగా దేవతాగణాలు వచ్చారు.
అప్పుడు భీష్ముని తల్లి గంగ అక్కడికి వచ్చి గురువైన పరశురామునితో యుద్ధం చేయవద్దని చెప్పింది. తాను భార్గవరామునితో శిష్యునితో యుద్ధం చేయవద్దని యాచిస్తానని చెప్పింది. ఆమె ఇలా అంది. ‘‘ఇలాంటి పంతం పట్టకు. జమదగ్ని సుతునితో యుద్ధం కోరుకోకు. అతను రుద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు, క్షత్రియ సంహారకుడు’’.
అప్పుడు భీష్ముడు తల్లికి మ్రొక్కి జరిగినదంతా వివరించాడు. అప్పుడు గంగ పరశురాముని దగ్గరకు వెళ్లి అతడిని భీష్ముని క్షమించమని వేడుకొంది. దానికి పరశురాముడు ఇలా అన్నాడు. ‘‘్భష్ముడిని ఆపు. అతను నేను చెప్పినట్లు చేయలేదు. అందుకని అతడితో యుద్ధానికి సిద్ధమయ్యాను’’
ఇలా గంగతో అని భార్గవరాముడు భీష్మునితో పోరుకు సిద్ధమయ్యాడు. గంగ వారిద్దరినీ పోరు నుంచి ఆపలేకపోయింది. భీష్ముడు పరశురా మునితో తాను రథం మీద ఉండి కవచంతో ఉన్నాడు కనుక అతన్ని కూడా కవచం తొడుక్కొని రథం మీద యుద్ధానికి రమ్మన్నాడు. దానికి పరశు యాడు ఇలా సమాధానమిచ్చాడు.
‘‘కురునందనా! నాకు ఈ భూమే రథం. వేదాలే గుర్రాలు. వాయువే సారథి. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే వేదమాతలే కవచం’’ ఇలా అంటూ అతను భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. భీష్ముడు అప్పుడు తన గురువుని రథం మధ్యలో చూచాడు. ఆ రథం నగరమంత విశాలంగా ఉంది. అది అతని మనస్సుచేత సృష్టించ బడింది. అతను కవచం ధరించి, ధనుస్సు, బాణాలు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఇష్టుడైన అకృతవ్రణుడు సారథిగా ఉన్నాడు. భీష్ముడు రథం మీద నుంచి దిగి బ్రాహ్మణశ్రేష్ఠుడైన భార్గవరాముని సమీపించి నమస్కరించి తనకు జయం కలగాలని ఆశీర్వదించ మన్నాడు.
పరశు రాముడు ఇలా అన్నాడు - ‘‘కురువంశశ్రేష్ఠా! అభివృద్ధి కోరుకొనేవారు ఇలాగే చేయాలి. నీవు ధైర్యంగా యుద్ధం చేయి. నిన్ను జయించడానికి నేను ఇక్కడకు వచ్చాను కనుక నీకు జయం కలగాలని ఆశీర్వదించను. నీ ప్రవర్తనకు నేను సంతోషిం చాను.’’
అప్పుడు భీష్ముడు రామునితో ఇలా అన్నాడు. ‘‘బ్రాహ్మణోత్తమా! నీ గురుత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఈ ధర్మయుద్ధంలో నా ప్రతిజ్ఞావాక్యాన్ని విను. నీ శరీరగతమైన వేదాలమీద గానీ, గొప్పదైన నీ బ్రాహ్మణ్యం మీద కాని, నీ తపస్సు మీద కాని నేను దాడి చేయను. నీవు ఆశ్రయించిన క్షత్రియధర్మం మీద దాడి చేస్తాను. బ్రాహ్మణుడు శస్త్రాలను ధరించడం ద్వారా క్షత్రియుడవుతాడు’’. ఇలా అంటూ భీష్ముడు అతనిపై బాణవర్షం కురిపించాడు. అవి రాముని శరీరంలో గుచ్చుకున్నాయి. గాయాలనుండి కారుతున్న రక్తంతో అతను ధాతుజలాన్ని విడుస్తున్న మేరుపర్వతంలా ప్రకాశించాడు. కాని అతను వెంటనే లేచి వాడి బాణాలను కురిపించగా భీష్ముడు తన బాణవర్షంతో అతన్ని నిశే్చతనుడిని చేశాడు. గురువు ఆ స్థితిలో పడి ఉండడం చూసి భీష్ముడు తనను తాను నిందించుకున్నాడు.
ఇంతలో సూర్యుడస్తమించడంతో ఆనాటి యుద్ధం ముగిసింది. సూర్యోదయం కాగానే మరల వారిద్దరూ యుద్ధం మొదలుపెట్టారు. పరశురాముడు భీష్మునిపై భయంకరంగా మండుతున్న బాణాలను ప్రయోగించాడు. వాటిని భీష్ముడు తునకలు చేశాడు. అప్పుడు భార్గవరాముడు అస్త్రాలని ప్రయోగించాడు. అతడు వేసిన దివ్యాస్త్రాలను భీష్ముడు తాను కూడా దివ్యాస్త్రాలు వేసి అడ్డుకున్నాడు. పరశురామునికి కోపం వచ్చి భీష్ముని దగ్గరకు వచ్చి అతని వక్షఃస్థలం మీద కొట్టగా అతను మూర్ఛపోయి రథం మీద కూలబడి పోయాడు. సూతుడు అతన్ని వెంటనే దూరంగా తీసుకొనిపోయాడు.
భీష్ముడు మూర్ఛపోవడం చూసి అంబ మొదలైనవారు సంతోషంగా కోలాహలం చేశారు. అప్పుడు తెలివి వచ్చిన భీష్ముడు రథసారథితో తన్ను రాముడు ఉన్న చోటికి తీసుకుపొమ్మన్నాడు. అక్కడికి వెళ్లి అతను పరశురామనిపై మరల బాణవర్షం కురిపించాడు. వాటిని రాముడు ఖండించాడు. భీష్ముడు ఒక కాలాగ్ని వంటి బాణాన్ని ప్రయోగించి రాముని మూర్ఛపోయేటట్లు చేశాడు. అతను పడిపోగానే అందరూ హాహాకారాలు చేశారు. మునులందరు అతని దగ్గరికి పరుగెత్తి వెళ్ళి నీళ్ళు జల్లి ఆశీస్సులతో అతన్ని సేదతీర్చారు. అప్పుడు పరశురాముడు లేచి ఆగ్రహంతో భీష్మునిపైకి లక్షల బాణాలు వేశాడు. వాటిని భీష్ముడు ఖండించాడు. ఈ విధంగా యుద్ధంలో వదిలిన బాణాలు ఆకాశం అంతా నిండి సూర్యుడిని కన్పడ కుండా చేశాయి. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో యుద్ధం ఆనాటికి ఆగింది.
మూడవనాడు యుద్ధం మొదలవగానే పరశురాముడు అనేక దివ్యాస్త్రాలను వర్షంలాగ భీష్మునిపై కురిపించాడు. భీష్ముడు ప్రాణాలు సైతం లెక్కించక ఆ దివ్యాస్త్రాలను, తాను ప్రయోగించిన అస్త్రాలతో నిరోధించాడు.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి