డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు-82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు పరశురాముడు భయంకరమైన ఒక శక్తిని వదిలాడు. అది ప్రళయకాల సూర్యుడిలా వెలుగుతూ భీష్మునిపైకి వచ్చింది. అతను ఆ శక్తిని మూడు ముక్కలు చేసి భూమిపై పడవేశాడు. దాంతో కోపం వచ్చిన భార్గవుడు పనె్నండు ఘోరశక్తులను భీష్ముడిపై వదిలాడు. భీష్ముడు బాణమయవలను ప్రయోగించి వాటిని ఖండించాడు. తర్వాత భీష్ముడు తన దివ్యాస్త్రాలతో పరశురాముని దివ్యాస్త్రాలను సూతుల సహితంగా ఖండించాడు. అప్పుడు పరశురాముడు వేసిన బాణాలు భీష్ముని రథాన్ని సూతుని గుర్రాలను కప్పివేశాయి. వారిరువురు ఆ బాణాలవల్ల తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాస్తమయం అవడంచేత యుద్ధం ఆగింది.
మరునాడు సూర్యోదయ సమయంలో మరల యుద్ధం మొదలైంది. పరశురాముడు ఒక ఎతె్తైన రథం మీద నిలబడి బాణవర్షం కురిపించగా భీష్ముని సూతుడు మూర్ఛపోయాడు. అతని ప్రాణాలు పోయాయి. ఇంకొక బాణంతో రాముడు భీష్ముని వక్షస్థలం మీద కొట్టాడు. దానితో అతను క్రింద పడిపోయాడు. అతను చనిపోయాడు అనుకొని రాముడు మహానాదం చేశాడు. భీష్ముని కంటికి అష్టవసువులు కన్పించారు. వారు అతన్ని తమ చేతులతో పొదివి పట్టుకున్నారు. ‘్భయపడకు, నీకు శుభమగుగాక’’ అని దీవించారు.
అప్పుడు అతని రథం మీద సారథిగా గంగాదేవి కన్పించింది. అతను తల్లికి మ్రొక్కి మరల రథం మీద ఎక్కాడు. ఆమె అతని రథాన్ని గుర్రాలతో సహా కాపాడింది. తర్వాత భీష్ముడు తనే స్వయంగా రథం నడుపుకుంటూ పరశురామునితో సాయంత్రం వరకు యుద్ధం చేశాడు. భీష్ముడు వదలిన బాణంతో రాముడు మూర్ఛితుడయ్యాడు. కాని వెంటనే అతను లేచి కాలాగ్ని సదృశమైన బాణాన్ని భీష్మునిమీద ప్రయోగించబోతుంటే మహర్షులు అతన్ని వారించారు. రాత్రి అవటం చేత వారిరువురు యుద్ధం ఆపారు.
ఆ రాత్రి భీష్ముడు నిద్రకు ముందు ఇలా ఆలోచించాడు. ‘‘రామా! నేను జయించగలిగే మాటుంటే నాకు ఈ రాత్రి దేవతలు ప్రసన్నంగా దర్శనం ఇత్తురు గాక!’’. ఇలా తలచి అతను నిదురబోయాడు. రాత్రి కలలో అతన్ని ప్రొద్దున రథంలో పడిపోతున్నప్పుడు లేపి పట్టుకొన్నారే వారు కన్పించి ఇలా అతనితో అన్నారు. ‘‘గాంగేయా! లే! భయపడకు. నీవు మా వాడివి. నిన్ను మేము రక్షిస్తాము. రాముడు నిన్ను ఏ విధంగానూ జయించలేడు. నీవే రాముడిని జయిస్తావు. ఇదిగో ప్రస్వాపం అనే అస్త్రం. దీని ప్రయోగ ఉపసంహారాలు నీకు పూర్వజన్మలో తెలుసు. ఇది విశ్మకర్మచేత నిర్మింపబడింది. ఇది ఏ మానవుడికీ తెలియదు. దీన్ని స్మరించి ప్రయోగించు. నీకు సిద్ధిస్తుంది. కాని రాముడు దానితో నాశనం కాడు. కనుక నీకు పాపం అంటదు. ఈ బాణం వల్ల అతను నిదురపోయినట్లుంటాడు. మరల ఇంకొక బాణంతో నీవే అతడిని నిద్రలేపగలవు. కనుక తెల్లవారగానే ఈ అస్త్రం ప్రయోగించు’’ ఇలా చెప్పి వారు
అదృశయులైనారు.
ఆ మరునాడు వారిరువురికి జరిగిన యుద్ధం చూసిన సమస్తప్రాణులు గజగజ వణికాయి.
పరశురాముడు ముందటిలాగానే మరల శక్త్యాయుధాన్ని భీష్మునిపై ప్రయోగించాడు. అది యముని దండంలా అతి వేగంగా వచ్చి అతని వక్షఃస్థలాన్ని తాకింది. అప్పుడు భీష్ముడు పాము విషంతో సమానమైన బాణాన్ని భార్గవరామునిపై వేశాడు. మరల రాముడు ఇంకొక బాణాన్ని భీష్ముని గుండెపై వేయగా అతడు రక్తసిక్తమై నేలపై పడ్డాడు. అతను లేచి ఇంకొక తీవ్రమైన బాణాన్ని రామునిపై వేశాడు. జమదగ్నిసుతుడు కోపంతో భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని ప్రతిఘటించడానికి భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు అస్త్రాలు మధ్యలో ఢీకొన్నాయి. అప్పుడు ఆకాశంలో తేజస్సు కన్పించింది. ఋషులు, గంధర్వులు, దేవతలు, సమస్తప్రాణులు ఆ అస్త్రాలచేత సంతాపాన్ని పొందారు. పర్వతాలు, వనాలు, వృక్షాలతో సహా భూమి కంపించింది. ఆకాశం నిండా మంటలు రేగాయి. దేవతలు, అసురులు, రాక్షసులతో సహా అందరూ హాహాకారాలు చేశారు. భీష్ముడు వసువులు చెప్పిన విధంగా ప్రస్వాపనాస్త్రాన్ని రామునిపై వేద్దామను కున్నాడు. వెంటనే ఆ మంత్రం అతనికి స్ఫురించింది.
కాని ఇంతలో ఆకాశం నుండి ‘‘్భష్మా! ఆ అస్త్రం ప్రయోగించకు’’ అన్న వాక్కులు వినిపించాయి. భీష్ముడు ఆ మాటలు విని కూడా అస్త్రాన్ని భార్గవరామునిపై ఎక్కు పెట్టాడు. అప్పుడు నారదుడు భీష్ముని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘‘గంగాసుతా! ఆకాశంలో దేవతలు అందరూ చూస్తున్నారు. వారంతా నిన్ను వారిస్తున్నారు. కనుక ఈ అస్త్రం ప్రయోగించకు.
భార్గవుడు తపస్వి. బ్రహ్మజ్ఞుడు. బ్రాహ్మణుడు. పైగా నీకు గురువు. అతన్ని ఏ విధంగానూ అవమానించకు. అప్పుడు భీష్మునికి ఆకాశంలో నిల్చుని ఉన్న ఆ ఎనిమిది మంది బ్రహ్మవాదులు కన్పించారు. వారు కూడా అతన్ని నారదుడు చెప్పినవిధంగా చేయమన్నారు. భీష్ముడు అస్త్రాన్ని ఉపసంహరించాడు. అది చూసి సంతోషించిన పరశురాముడు ‘‘మందబుద్ధినైన నేను భీష్మునిచే ఓడింపబడ్డాను’’ అని అన్నాడు. అప్పుడు అతనికి తండ్రి జమదగ్ని, అతని తండ్రి ఋచీకుడు కన్పించారు. వారు అతనిని అనునయించి ఇలా అన్నారు. ‘‘ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయకు. భీష్మునితో అందునా క్షత్రియునితో యుద్ధం చేయడం మంచిది కాదు. యుద్ధం క్షత్రియధర్మం. బ్రాహ్మణునికి స్వాధ్యాయం, వ్రతానుష్ఠానం పరమధర్మం. భీష్మునితో చేసిన ఈ యుద్ధంలో ఇంతవరకు జరిగిన విధ్వంసం చాలును. ఇక యుద్ధం నుండి తొలగిపో. ఇక విల్లు ఎక్కు పెట్టకు. తపస్సు చేసుకో’’.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి