డైలీ సీరియల్

సారస్వతోపాఖ్యానం-88

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధృతరాష్ట్రుడు కోపించి అక్కడ మరణించి ఉన్న కొన్ని ఆవులను చూపించి ఇలా అన్నాడు ‘‘బ్రాహ్మణోత్తమా! నీ కిష్టమైతే వీటిని తీసుకొనివెళ్లు’’. ధర్మవేత్త అయిన ఋషి ఆ రాజు మాటలు విని ‘‘అయ్యో! సభలో ఈ రాజు ఎంత కౄరంగా మాట్లాడాడు’’ అని చింతించాడు. తర్వాత అతను క్రోధంతో ధృతరాష్ట్రుని నాశనం చేయాలని తలచాడు. అతను ఆ మృత పశువులను ముక్కలుగా చేసి వాటితో ఆ రాష్ట్రానికి ఆహుతి చేయసాగాడు. సరస్వతీ తీరంలోని అవాకీర్ణ తీర్థంలో అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ ముక్కలని ఆ రాష్ట్రాన్ని ఆహుతి చేశాడు. అప్పుడు ధృతరాష్ట్రం క్షీణించసాగింది. అనేక ఇబ్బందులు రాజ్యానికి కలిగాయి. దానితో భయపడి రాజు, బ్రాహ్మణులు కూడా బాధపడ్డారు. ఇలా ఎందుకు జరిగిందని పండితులని ప్రశ్నించాడు. అప్పుడు వారు ఇలా చెప్పారు. ‘‘పశువులను యాచించిన బకమునికి మీరు అవమానించారు. దానితో కోపించి ఆ ముని ఆ మృతగోవులతో నీ రాజ్య నాశనానికి ఆహుతి చేస్తున్నాడు. అందువల్ల నీ రాజ్యానికి ఈ వినాశనం కలుగుతున్నది. ఆయన తపస్సు ప్రభావం వలన నీ రాజ్యానికి మహాప్రళయం సంభవించబోతున్నది. కనుక సరస్వతీ తీరానికి వెళ్ళి ఆ ముని కాళ్లమీద పడి ఆయన ను ప్రసన్నుని చేసుకో’’.
వారి సలహా విని ధృతరాష్ట్రుడు సరస్వతీనది దగ్గరకు వెళ్ళి బకునితో మాటలాడాడు. రాజు తలను నేలకు ఆనించి, చేతులు జోడించి బకమునితో ఇలా ప్రార్థించాడు. ‘‘స్వామీ! నాయందు ప్రసన్నం కండి. నా అపరాధాన్ని క్షమించండి. మంద బుద్ధినై, నేను లోభత్వంతో, మూర్ఖత్వంతో తప్పు చేశాను. ఇప్పుడు నా రాజ్యసంక్షోభంలో నాకు మీరు తప్ప దిక్కెవరూ లేరు. నా మీద దయచూపండి’’. ఈ విధంగా శోకిస్తున్న రాజును చూసి బకుడు ఆయన మీద దయ తలచి రాజ్యానికి విముక్తి కలిగించాడు. రాజు ఆయనకు అనేకమైన పశువులను దక్షిణగా సమర్పించాడు. వాటిని తీసుకొని బకుడు ఆనందంతో నైమిశారణ్యానికి వెళ్లిపోయాడు. బృహస్పతి కూడా రాక్షస నాశనం కోసం అక్కడ ఆహుతులను సమర్పించాడు. సరస్వతీ తీర్థాలలో ఇంకొక తీర్థం వశిష్ఠపవాహ తీర్థం. ఈ తీర్థంలో నది అత్యంత వేగంతో ప్రవహిస్తుంది. దానికొక కారణముంది.
వశిష్ఠ మహర్షికి, విశ్వా మిత్రునికి తీవ్రమైన శతృత్వ ముండేది. తపస్సులో పోటీపడడంతో ఈ శతృత్వం కలిగింది. స్థాణుతీర్థంలో పడమటి ఒడ్డున విశ్వామిత్రుని ఆశ్రమం, తూర్పు ఒడ్డున వశిష్ఠుని ఆశ్రమం ఉండేవి. అక్కడ పూర్వం శంకరుడు ఘోరతపస్సు చేశాడు. స్థాణువు (శివుడు) అక్కడ యాగం చేసి సరస్వతిని పూజించి ఆ తీర్థాన్ని ఏర్పరిచాడు. ఆ తీర్థంలోనే తారకుని నాశనం కోసం స్కందుని దేవసేనాధిపతిగా అభిషేకించారు. ఆ తీర్థంలోనే విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేసి వశిష్ఠుని చలింపజేశాడు. ఆ మహర్షు లిద్దరూ పోటీపడి తపస్సు చేసేవారు. వశిష్ఠుని తేజస్సు చూసి విశ్వామిత్రుడు చింతకు లోనయ్యేవాడు. అప్పుడు అతను ఇలా ఆలోచించాడు ‘‘ఈ సరస్వతీ నది తపోనిధి అయిన వశిష్ఠుని వేగంగా నా దగ్గరకు తీసుకొనిరావాలి. అప్పుడు అతన్ని తప్పక చంపివేస్తాను’’. ఆ ముని క్రోధంతో నదిని ధ్యానించాడు. అలా స్మరించడంతో ఆ నదీమతల్లి కలత చెందినది. ఆమె వివర్ణమైన ముఖంతో, చేతులు జోడిస్తూ విశ్వామిత్రుని దగ్గరకు వచ్చింది. ఆమె తీవ్రంగా దుఃఖిస్తూ ‘‘ఏమి చేయాలో చెప్పండి’’ అని ఆ మునిని వేడింది. విశ్వామిత్రుడు కోపంతో ‘‘వెంటనే వెళ్ళి వశిష్ఠుని తీసుకొనిరా’’ అని ఆజ్ఞాపిం చాడు.
సరస్వతి అతని మాటలతో అతను చేయబోయే పాపకర్మను తెలుసుకొని, వశిష్ఠుని తపశ్శక్తి తెలుసు కనుక, వశిష్ఠుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుడు తనను ఆదేశించిన విషయం చెప్పింది. ఆమె ఇద్దరి శాపాలకు భయపడి కంపించ సాగింది. భయపడి కృశించి పోతున్న నదిని చూసి ఆ తపోధనుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు ‘‘నదీమ తల్లీ! నిన్ను నీవు కాపాడుకో. లేకపోతే విశ్వామిత్రుడు నిన్ను శపించవచ్చు. నా గురించి నీవు విచారించవద్దు’’.
అప్పుడు నదీమతల్లి ఇలా ఆలోచించింది. ‘‘వశిష్ఠుడు నాపై ఎంతో దయ చూపాడు. అతనికి హితమైన పని చేయాలి’’ ఇలా ఆలోచిస్తూ తన ఒడ్డున జపం చేస్తూ హోమం చేస్తున్న విశ్వామిత్రుని చూసి, ఇదే సరియైన అవకాశమని భావించి తన వేగంతో తూర్పు ఒడ్డును బ్రద్దలు చేసి ప్రవహించ సాగింది. అలా కొట్టుకుపోతున్న ఒడ్డుతో పాటు వశిష్ఠుడు కూడా కొట్టుకొనిపోయాడు. అతను అలా అలా కొట్టుకొనిపోతూ సరస్వతీనదిని ఇలా స్తుతించాడు.
‘‘తల్లీ! నీవు పితామహుని సరస్సు నుండి ప్రభవించావు. అందుకే నీవు సరస్వతి అని పిలువబడ్డావు. నీ నీటితో ఈ విశ్వమంతా వ్యాపించింది. నీవు ఆకాశంలో ప్రవహించి, మేఘాలలో నీటిని కలిగిస్తున్నావు. ఈ జలమంతా నీ స్వరూపమే. నీ వల్లనే మేము వేదాధ్యయనం చేయగల్గుతున్నాము. పుష్టి, ద్యుతి, సిద్ధి, బుద్ధి, కీర్తి, వాణి, స్వాహా అన్నీ నీవే.’’
ఇలా తనను స్తుతిస్తున్న వశిష్ఠుని ఆ నధి విశ్వామిత్రుని ఆశ్రమం వైపు తీసుకొని పోయింది. వశిష్ఠుడు వచ్చినట్లు విశ్వామిత్రునికి తెలిపింది. క్రోధంతో అతను వశిష్ఠుని అంతం చేయగల ఆయుధం కోసం వెతికాడు. అతని క్రోధం చూసి నది వశిష్ఠుని మరల తూర్పు దిశగా తీసుకొని పోయింది. దానితో చాలా దుఃఖించి కోపంతో విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ‘తల్లీ! నీవు నన్ను మోసం చేసి వెళ్లావు. కనుక నీవు నీటి బదులు రక్తాన్ని ప్రవహించు. ఇది రాక్షసులకు ఇష్టం’’. ఈ విధంగా తపస్వి అయిన విశ్వామిత్రునిచే శపించబడి ఆ నది సంవత్సరం పాటు రక్తం కలిసిన నీటితో ప్రవహించింది. అప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు అలా ప్రవహిస్తున్న నదిని చూసి ఎంతో దుఃఖిం చారు. ఆ విధంగా ఆ నది వశిష్ఠపవాహంగా లోకంలో ప్రసిద్ధి చెందినది. మరలా ఆ నది తన మార్గంలోకి వచ్చింది. ఎలా వచ్చింది?
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి