డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నది ముని శాపంతో రక్తంతో ప్రవహించసాగింది. అప్పుడు రాక్షసులు అక్కడకు వచ్చి ఆ రక్తాన్ని త్రాగుతూ సుఖంగా ఉండసాగారు. వారు స్వర్గాన్ని గెలిచినంత ఆనందాన్ని పొందేవారు. కొంతకాలానికి ఆ నదిలో మునగాలని కొందరు మహర్షులు అక్కడికి వచ్చారు. వారు సరస్వతీ తీర్థాలన్నింటిలో మునిగి ఆనందం పొంది చివరకు నెత్తురు ప్రవహిస్తున్న ఈ తీర్థానికి వచ్చారు. ఆ నీటిని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ రాక్షసులు ఆ రక్తపు నీటిని త్రాగుతూ ఆ మునులను చంపి వారి రక్తాన్ని ఆ ప్రవాహంలో కలిపేయాలని ప్రయత్నించారు. కాని ఆ మునులు నదీమతల్లిని రక్షించాలనుకున్నారు. వారు ఆ నదికి నమస్కరించి ఇలా అడిగారు. ‘‘కల్యాణీ! నీ ప్రవాహం ఎందుకు రక్తమయమైందో ఆ కారణం చెప్పు. మేమేదైనా ఉపాయం ఆలోచిస్తాము’’.
అప్పుడు నది వారికి జరిగిన విషయం, ముని శాపం గురించి వివరించింది. అప్పుడు మునులు ఆ నదితో ఇలా అన్నారు. ‘‘అనఘా! కారణం తెలిసింది. కనుక మునులందరు చేయగలగింది చేస్తారు’’ అని మునులు ‘‘మనం అందరం కలిసి సరస్వతిని శాపం నుండి విడిపిద్దాము’’ అని నిశ్చయించుకొన్నారు.
ఆ మునులంతా తపస్సులతో, నియమాలో, ఉపవాసాలతో, వ్రతాలతో పరమేశ్వరుని అర్చించి సరస్వతి నదికి విముక్తి కలిగించారు. అప్పుడు ఆ నది పూర్వంలాగ స్వచ్ఛనమైన నీటితో ప్రవహించ సాగింది. మునులు నదీజాలలని ప్రక్షాళన చేసి నిర్మల జలాలుగా మార్చటం చూసి రాక్షసులు భయపడి వారిని శరణు వేడారు. వారు మునులతో ఇల ప్రార్థించారు. ‘‘మేము ఆకలితో ఉన్నాం. ధర్మానికి దూరంగా ఉన్నాము. మేము అనేక పాపాలు చేశాము. మాకు మంచి మార్గదర్శనం చేయడానికి మీవంటి ధర్మాత్ములు, పుణ్యాత్ములు దొరుకలేదు. అందువల్ల ఇలాంటి పాపాలు చేస్తున్నాము. ఈ పాపాలు పెరిగితే మేము స్ర్తీహ్మరాక్షసులమవుతాము. క్షత్రియ, వైశ్య, శూద్రులను, బ్రాహ్మణులను ద్వేషించేవారు రాక్షసులు అవుతారు. గురువును, వృద్ధులను, ఋత్విక్కులను అవమానించినవారు కూడా రాక్షసులౌతారు. కనుక మమ్మల్ని తరింపజేయండి. మా మీద దయ చూపండి.’’
వారి మాటలు విన్న మునులు రాక్షసుల ముక్తికై నదిని ప్రార్థిస్తూ ఇలా అన్నారు. ‘‘ఉమ్మివేసిన అన్నం, పురుగులు పడిన అన్నం, ఎంగిలి కూడు, కన్నీరులో తడిసిన అన్నం, కుక్కలు ముట్టిన అన్నం ... ఇవి లోకంలో రాక్షసుల భాగం కనుక పండితుడు వాటిని విసర్జించాలి.’’ తర్వాత ఆ మునులు ఆ తీర్థాన్ని శుద్ధి చేసి రాక్షసవిముక్తికై నదిమీద ఒత్తిడి తెచ్చాడు. వారి అభిప్రాయం తెలుసుకొని నది తన స్వరూపం అయిన అరుణను రప్పించింది. రాక్షసులు ఆ అరుణలో స్నానం చేసి తమ శరీరాలను విడిచిపెట్టారు. అరుణి వారి పాతకాలను బ్రహ్మహత్యాపాపాన్ని పోగొట్టింది. ఇది తెలిసి దేవరాజు ఇంద్రుడు కూడా ఆ తీర్థంలో స్నానం చేసి తన బ్రహ్మహత్యాపాపాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే అతను నముచి దగ్గర తాను చేసిన ప్రతిజ్ఞను భంగపరిచాడు.
పూర్వం ఇంద్రునికి భయపడి నముచి సూర్యరశ్మిలో దాగాడు. ఇంద్రుడు అతనితో స్నేహం చేసి ఇలా అన్నాడు. ‘‘పగలుకాని, రాత్రి కాని, తడి ఆయుధంతో కాని పొడి ఆయుధంతో కాని నిన్ను చంపను’’. ఇలా ప్రతిజ్ఞ చేసి అంతటా మంచు కప్పి ఉండటం చూసి నీటి నురుగుతో నముచి తలను ఖండించాడు. అలా తెగిన నముచి తల ఇంద్రుని వెంటపడింది. ఇంకా ఇలా అనసాగింది. ‘‘ఓరీ పాపాత్ముడా! మిత్రద్రోహి!’’
దానితో భయపడి ఇంద్రుడు బ్రహ్మతో నివేదించాడు.
అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు. ‘‘పాపభయాన్ని పోగొట్టే అరుణతీర్థంలో స్నానం చేసి యాగం చెయ్యి. మునులు తమ తపశ్శక్తితో ఆ తీర్థ జలాన్ని పవిత్రం చేశారు. అక్కడ అరుణ గుప్తంగా ఉంది. ‘‘సరస్వతీనది అరుణను తన జలంతో ముంచింది. ఆ అరుణా సరస్వతుల సంగమ స్థానం అత్యంత పవిత్రమైనది.’’
ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్లే చేశాడు. యాగం చేసి స్నానం చేశాడు. నముచి శిరస్సు కూడా ఆ తీర్థంలో తడిసి ఉత్తమ లోకాలకు చేరింది.
ఈ విధంగా సరస్వతీ నదీ తీరంలో ఉన్న తీర్థాలు మానవులకు, దేవతలకు, ఋషులకు ఎన్నో విధాల ఉపయోగపడ్డాయి.
కాలకవృక్షీయోపాఖ్యానము
పూర్వం క్షేమదర్శి అనే రాకుమారుడు యుద్ధంలో తన సైన్యాన్ని అంతా పోగొట్టుకొని దిక్కుతోచక తిరుగుతూ కాలకవృక్షీయుడు అనే మునిని కలిశాడు. అతను మునికి నమస్కరించి తన పరిస్థితి వివరించి ఈ కష్టం నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపుమన్నాడు. అతను మునితో ఇలా అన్నాడు - ‘‘మహాత్మా! ధనంపైన ఆధిపత్యం కోరుకొనేవాడు నాలా రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? దీని కోసం ఇతరులను ఆశ్రయించడంలాంటి నీచమైన పనులు కాక ఇంకేదైనా ఉపాయం దయచేసి చెప్పండి. శారీరిక, మానసిక వ్యాధులతో బాధపడేవారికి నీవంటి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు శరణ్యుడు అగును. అప్పుడు అతను కోరికల పట్ల విరక్తి చెంది జ్ఞానమనే ధనాన్ని పొంది ప్రీతిని, శోకాన్ని విడిచి పెట్టి సుఖాన్ని పొందుతాడు. కాని అర్థసంపాదనకు ప్రాధాన్యత ఇచ్చే నాలాంటి వారి సంగతేమిటి? నేను ఆ భోగాలమీద, ధనం మీద మోహాన్ని వదలుకోలేక పోతున్నాను. కనుక నాలాంటి వాడు పొందే ఇంకేదైనా సుఖం ఉంటే చెప్పండి’’ అని తన దీనస్థితిని చెప్తూ బాధపడుతున్న ఆ రాకుమారుని చూసి మహాత్ముడైన ఆ ఋషి ఇలా అన్నాడు. ‘‘నీకు అన్నీ తెలుసు. నేను - నాది అనేది అంతా అనిత్యమే. ఏదీ శాశ్వతం కాదు. నీ కళ్లముందు ఏది ఉందని అనుకుంటున్నావో అది అంతా లేదన్న నిజాన్ని గ్రహించు. అప్పుడు నీకు కష్టం వచ్చినా నీవు భరించగలవు. జరిగినది, జరుగబోయేది సమస్తమూ జరిగేది కాదు. ఇది తెలుసుకుంటే నీవు అధర్మాల నుండి బయటపడతావు. పూర్వం రాజ్యం, సంపద వంశపారంపర్యంగా వచ్చేవి. ఇక మీదట అలా ఉండకపోవచ్చు. ఇది తెలిస్తే ఏ బాధా ఉండదు. కనుక శోకించడం తగదు. పూర్వం ఉన్న నీ పితృ పితామహులు యిప్పుడు ఎచ్చట ఉన్నారు? నీవు వారిని చూడటం లేదు కదా! వారు నిన్ను చూడలేదు. శరీరం అనిత్యం. అలాంటి శరీరం ద్వారా పొందే వాటికోసం ఎందుకు దుఃఖిస్తావు? కొంతకాలానికి నీవు కూడా ఉండవు. నీవే కాదు నీ శతృవులు కూడా నశించిపోతారు. అందువల్ల మన దగ్గర సంపదలు ఉన్నప్పటికీ ‘ఇవి నావి కావు’ అన్న భావనతో ఉండాలి.’’ అతని మాటలు విని రాజు ఇలా అన్నాడు.
‘‘మహాత్మా! ఈ రాజ్యం అంతా యాదృచ్ఛికమే అని తలుస్తాను. అన్నిటికంటే శక్తిమంతమైనది కాలం మాత్రమే.
ఇంకావుంది...

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి