డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో మూడు రకాల ప్రాణులు ఉన్నారు. కష్టాలు రాకమునుపే వాటి నివారణ ఉపాయం ఆలోచించేవాడు అనాగతవిధాత.
సరియైన సమయంలో ఆత్మ రక్షణకు ఉపాయం వెతికేవాడు ప్రత్యుత్పన్నమతి. ఈ రెండు రకాల వారు సుఖంగా ఉన్నతిని పొందుతారు.
ఇక మూడవరకం వారు ప్రతీ పనికి అవసరం లేని ఆలస్యం చేసేవాడిని దీర్ఘసూత్రుడు అంటారు. వాడు నశిస్తాడు. దీనికి ఉదాహరణగా ఒక కద ఉంది. అదే మూడు చేపల కద. పూర్వము ఒక చెరువులో చాలా చేపలు జీవించేవి. అందులో మూడు చేపలు మూడు రకాల మనస్తత్వాలు కలవి. ఒకదానికి చాలా ముందు చూపు ఉంది. రెండవది సమయానికి తగిన పని చేసే తెలివితేటలు కలది. మూడవది ప్రతి పనికి అక్కర్లేని ఆలస్యం చేస్తూ సరియైన నిర్ణయం తీసుకోలేనిది.
ఒకమారు కొందరు బెస్తవాళ్ళు ఆ చెరువు గుంటలోని నీటిని తోడి పారబోస్తున్నారు. చెరువులో నీరు తగ్గిపోవడం చూసి మొదటి చేప అయిన దీర్ఘదర్శి తక్కిన మిత్రులతో ఇలా అంది. ‘‘ఈ చెరువులో నివసించే మనందరికీ గొప్ప ఆపద కలుగబోతున్నది. తప్పించుకునే దారి ఇప్పుడే వెతకాలి. మనం ఇక్కడి నుంచి వేరొక చోటికి వెళ్ళిపోవాలి. కీడు రాకముందే మంచి ఉపాంతో తొలగించు కొనే వారికి ప్రాణభయం ఉండదు. కనుక ఇంకొక చెరువుకు పోదాం పదండి’’.
అప్పుడు రెండవ చేప అయిన ప్రాప్తకాలజ్ఞం ఇలా అంది. ‘‘మిత్రమా! నీవు చెప్పిన సలహా బాగుంది. కాని మనం అంత తొందర పడవలసిన అగత్యం లేదని నా అభిప్రాయం’’.
తరువాత మూడవ చేప అయిన దీర్ఘసూత్రం స్నేహితులతో ఇలా అంది. ‘సమయం వచ్చినప్పుడు నా బుద్ధికి తగిన యుక్తి తోస్తుంది. అది ఎప్పుడూ నవ్వులపాలు కాదు’’.
దీర్ఘదర్శి వారి మాటలు విని ఆ సన్నటి నీటి దారిలో ప్రయాణం చేసి ఇంకొక పెద్ద మడుగులోకి చేరుకుంది.
చాలామటుకు నీరు తోడి పోసి జాలరులు అనేక ఉపాయాలతో చెరువులోని చేపలను పట్టుకున్నారు. మిగిలిన చేపలతో పాటు దీర్ఘసూత్రం కూడా వలలో చిక్కుకుంది. ప్రాప్తకాలజ్ఞం కూడా వలను నోటితో పట్టుకొని దొరికినట్లు నటించింది. జాలర్లు చేపలన్నీ వలలోనే ఉన్నాయి అని తలచారు. ప్రాప్తకాలజ్ఞం త్రాటిని నోటకరుచుకొని తక్కిన చేపలతోపాటు పైకి వచ్చింది. తర్వాత పక్కనున్న పెద్ద చెరువులో ఆ చేపలున్న వలను కడుగుతున్నప్పుడు మెల్లిగా చెరువులోని నీటిలోకి జారుకుంది. కాని ఏ విధమైన తెలివితేటలు, చొరవ లేని దీర్ఘసూత్రం మాత్రం కదలలేక అన్ని ఇంద్రియాలు పట్టుతప్పి చచ్చిపోయింది. నెత్తి మీదకు వచ్చిన ఆపదను అప్పుడు కూడా తెలుసుకోలేని మూర్ఖుడు దీర్ఘసూత్రం లాగే నశిస్తాడు.
కాని ‘నేను తెలివి గలవాడిని, అవసరం అయినప్పుడు ఆలోచించ వచ్చులే’ అని నిర్లక్ష్యం చేసేవాడు ప్రాప్తకాలజ్ఞంలా ప్రాణ సంకటంలో చిక్కుకుంటాడు.
అలాకాక రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి తగిన తరుణోపాయం ముందే ఆలోచించే వాడు, సమయానికి తగిన బుద్ధిని ఉపయోగించేవాడు ఈ ఇద్దరూ సుఖంగా వృద్ధిలోకి వస్తారు. సరియైన ఆలోచనలు లేనివాడు నశిస్తాడు. ఈ సత్యాన్ని మూడు చేపల కద చెప్తున్నది.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి