డైలీ సీరియల్

మహాభారతంలో ఉపాఖ్యానాలు -114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక మహారణ్యంలో ఒక బోయవాడు ఉండేవాడు. అతని రూపం ప్రవర్తన చాలా భీకరంగా ఉండేవి. నల్లటి శరీరంతో ఎర్రటి కళ్ళతో అతను యముడిలా ఉండేవాడు. అతను కర్కశంగా ప్రవర్తించడం వలన అతనికి మిత్రులు కూడా లేరు.అతని కౄర ప్రవర్తన వల్ల బంధువులు కూడా అతన్ని విడిచి పెట్టారు.
ఆ బోయవాడు ప్రతినిత్యం వల తీసుకుని వెళ్ళి పక్షులను పట్టి చంపి వాటిని అమ్మేవాడు. ఇదే అతని నిత్యకృత్యం. ఈ విధంగా చాలాకాలం. గడిచింది. ఇలా పక్షులను పట్టించడం పాపం అని అధర్మం అని అతనికెప్పుడూ అనిపించలేదు. ఈ వృత్తి తప్ప ఇంక ఏ వృత్తీ అతనికి రుచించలేదు. ఒక రోజు అతను అరణ్యంలో ఉండగా తుఫాను వచ్చి అన్ని దిక్కుల నుండి చెట్టును కూల్చివేయసాగింది. కొంచెం సమయంలో పెద్దవర్షం ఉరుములతో మెరుపులతో పడసాగింది. నేలంతా నీటితో నిండి పోయింది. ఈ భీకర తుఫానులో బోయవాడు చలికి వణికిపోతూ వనంలో తిరుగసాగాడు. వర్షానికి అనేక పక్షులు నేల కూలాయి. కౄరమృగాలు కూడా ఎక్కడో అక్కడ నేలను ఆశ్రయించి పడుకున్నాయి.
బోయవాని శరీరం చలికి గడ్డకట్టి పోయి అతను కదల లేకపోయాడు. అప్పుడు అతను చలికి వణికి పోతున్న ఒక పావురాన్ని చూశాడు. అతను ఆ పావురాన్ని తన బుట్టలో పెట్టాడు. ఈ విధంగా అతను దురాలోచనతో ఇంకా పాపం ఒడిగట్టుకున్నాడు. ఇంతలో అతనికి ఒక పెద్ద వృక్షం కన్పించింది. ఆ పెద్ద వృక్షాన్ని ఆశ్రయించి ఎన్నో పక్షి సమూహాలు జీవిస్తున్నాయి.
ఇంతలో వర్షం తగ్గిపోయి ఆకాశం నిర్మలంగా కన్పించింది. అప్పుడు అతనికి తన ఇల్లు విడిచి చాలా దూరం వచ్చానని తెలిసింది. ఆ రాత్రి ఆ చెట్టు క్రిందే ఉండాలని నిశ్చయించుకుని నేలపై ఆకులు పరుచుకుని నిద్రించాడు.
ఆ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి చాలాకాలంగా తన భార్య, మిత్రులతో కలసి నివసిస్తోంది. దానికి రంగు రంగుల రెక్కలున్నాయి. దాని భార్య ప్రొద్దునే్న ఆహారం కోసం బయటికి వెళ్ళి ఇంకా ఇల్లు చేరలేదు. చీకటి పడుతున్నది కనుక ఆ పక్షి భయపడుతున్నది. పెద్దగాలి వాన వచ్చింది. భార్య ఇంకా రాలేదు. కారణమేమిటా అని మగ పక్షి ఇలా ఆలోచిస్తున్నది. -
‘‘ఈ అరణ్యంలో ఎక్కడో అక్కడ నా భార్య క్షేమంగానే ఉన్నది కదా! ఆమె లేకపోతే నా గృహం శూన్యమే. పుత్రులూ, మనుమలు, కోడళ్ళు, సేవకులు ఇంటి నిండా ఉన్నా భార్య లేకపోతే ఆ గృహస్థుని ఇల్లు శూన్యమే. ఇల్లంటే ఇల్లు కాదు. గృహిణియే ఇల్లు. ఇల్లాలు లేని ఇల్లు అరణ్యంతో సమానము. ఎంతో అందమైనది చక్కటి కళ్ళు, రెక్కలు గల నా భార్య ఇంటికి రాకపోతే నేను జీవించి ఏ ప్రయోజనం? నా భార్య మహా పతివ్రత. నేను తింటేనే తను తింటుంది. నేను నిద్రించినపుడే తాను నిద్రిస్తుంది. నేను ఎక్కడికైనా దూరప్రాంతానికి వెళితే అది చాలా దీనంగా ఉంటుంది. నాతో ఎంతో ప్రియంగా మాట్లాడుతుంది. ఆమెకు నాపై అనురాగం, భక్తి స్నేహం, ప్రీతి ఎక్కువ. అటువంటి భార్య ఉన్న మగవాడు ధన్యుడు. చెట్టు క్రింద అయినా అలాంటి భార్యతో కలిసి ఉంటే అదే పెద్ద ఇల్లు. ఆమె లేకపోతే ఇల్లు కూడా అరణ్యంతో సమానం. లోకంలో ఒంటరి అయిన పురుషునికి భార్యయే బంధువు, మిత్రుడు అన్నీ. ఆర్తునకు భార్య లాంటి ఔషధం ఇంకోకటి లేదు.
భార్య వంటి బంధువు లేదు. భార్య వంటి మార్గం లేదు. లోకంలో ధర్మ సంగ్రహంలో భార్యవంటి సహాయకుడు లేడు. ఈ విధంగా దుఃఖిస్తున్న కపోతం యొక్క మాటలు విన్న బోయవానికి చిక్కిన కపోతి విన్నది. అది ఇలా అనుకుంది - ఆహా ఏమి నా భాగ్యము. నా భర్త నాలో ఉన్నాయో లేవో కాని నా గుణాలను ఇంతగా కీర్తిస్తున్నాడు. తనయందు భర్త సంతృప్తి పొందకపోతే ఆమె స్ర్తీయే కాదు. భర్త ఆనందిస్తే సకల దేవతలూ ఆనందించినట్లే. భార్యకు భర్త అగ్నిసాక్షిగా ఏర్పడిన దైవము. భర్త ఆనందించకపోతే ఆ స్ర్తియొక్క జీవితం వ్యర్థము’’ ఇలా చింతించి బోయవానికి చిక్కిన కపోతి దుఃఖిస్తున్న భర్తతో ఇలా అంది - ‘‘స్వామీ నీకు శేయస్కరమైన మాట చెప్తున్నాను. ఆలకించు. ముఖ్యంగా నీవు శరణాగత రక్షకుడవు కమ్ము. నీ ఇంటికి వచ్చి ఈ బోయవాడు ఆకలితో పడిఉన్నాడు. అతన్ని అర్చించు. గోవును చంపినా, బ్రాహ్మణుని చంపినా, శరణాగతుని చంపినా పాపం సమానమే. మనయింటి ముందు శరణాగతుడు ఆకలితో చావకూడదు. జాతా ధర్మాన్ని బట్టి మనకు కపోత వృత్తి విధించబడింది. నీలాంటి వాడు ఆ వృత్తిని గౌరవించాలి, పాటించాలి. యథాశక్తి తన ధర్మాన్ని ఏ గృహస్థు పాటిస్తాడో అతను మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు. నీవు సంతానవంతుడివి కూడా. కనుకనే దేహం పై మోహాన్ని వీడి ఈ బోయవాని మనస్సు తృప్తి చెందేటట్లు అర్చించు. నా కోసం బాధపడకు జీవనయాత్రకై ఇంకొక భార్యను పొందవచ్చు. ఇలా పంజరంలో ఉన్న కపోతి భర్తతో అంది.
మగపావురం ధర్మయుక్తి సమన్వితమైన భార్య మాటలువిని సంతోషించింది. కంటనీరు పెట్టింది. ఆ కపోతం బోయవానికి శాస్త్రోక్తంగా పూజించి అతనితో ఇలా అంది. ‘‘నీకు స్వాగతం, నీకోసం ఏమి చేయాలి? నీవు బాధపడకు. ఈ ఇల్లు నీ ఇల్లే. నీ కేం కావాలో చెప్పు. నీవు నా ఇంటికి వచ్చిన అతిథివి. శత్రువైనా సరే ఇంటికి వస్తే ఆతిథ్య మివ్వాలి. నరకటానికి వచ్చిన వాడికి కూడా చెట్టు నీడనిస్తుంది. కాని ముడుచుకోదు. పంచయజ్ఞాలకు అధికారి అయిన గృహస్థునకు ఇది విధి. గృహస్తు వీటిని పాటించకపోతే ఇహపరలోకాలు అతనికి దక్కవు.
కనుక నీవు ఏది అడిగితే అది నేను చేయగలను. నీవు దుఃఖపడకు’’. పక్షి అన్న మాటలు విని బోయవాడు తనకు చలి వేస్తున్నదని అన్నాడు. దాన్నించి తనను రక్షించమన్నాడు. కపోతం వెంటనే నేలపై ఆకులు ప్రోగుచేసి అగ్ని తెచ్చేందుకు తన రెక్కల శక్తి అంతా ఉపయోగించి ఎగిరి ఒక కమ్మరి ఇంటికి పోయి నిప్పు తీసుకుని వెంటనే వచ్చి ఆకులను అంటించింది. మంటలు పెద్దది చేసి బోయవానితో ఇలా అంది- ‘‘నీకు భయమేమేలేదు. హాయిగా ఈ మంట దగ్గర కూర్చుని ఆ సెగతో నీ శరీరాన్ని వెచ్చచేసుకో’’.
-ఇంకావుంది

డాక్టర్ ముదిగొండ ఉమాదేవి