డైలీ సీరియల్

మానవత్వమే పరమోన్నతం( ధ్రువుడు -6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లు, గ్రహాలు , నక్షత్రాలు, తారగణాలు, జ్యోతిశ్చక్రమూ, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి ‘‘ధ్రువక్షితి’’ అనే మహోన్నత స్థానాన్ని నీకు ఇస్తున్నాను.
మూడు లోకాలు నశించేటపుడు కూడా నీ ధ్రువక్షితి నశించదు. ఎపుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇపుడు నీకు ఆహ్వానం పలుకడానికి నీ తండ్రే స్వయంగా వస్తాడు. నిన్ను అక్కున చేర్చుకుని ఆనందభాష్పాలతో ఇంటికి తీసుకొని వెళ్లి నీకు రాజ్యాధికారాన్ని అప్పగిస్తాడు. నీవు ధర్మమార్గంలో సర్వజన రంజకంగా పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తమ్ముడు నిన్ను అనుసరించే ఉంటాడు. నీకు అన్నీ శుభాలు కలుగుతాయి. విధి తన ధర్మాన్ని తాను చేస్తుంది అని పలికి నారాయణుడు గరుడ వాహనా రూఢుడై వైకుంఠానికి బయలుదేరాడు.
ధ్రువుడు తన తపస్సును ఫలవంతం చేసుకొని నారాయణుని దర్శనం పొందాడన్న విషయం తెలుసుకొని ఆ ధ్రువుని తీసుకొని రావడానికి ఉత్తానపాదుడు బయలుదేరి వెళ్లాడు. మంగళ వాయిద్యాలతో మంత్రి పురోహితులందరూ ఆయన్ను అనుసరించారు. సురుచి , సునీతి ఇద్దరూ ఉత్తముని వెంటబెట్టుకొని బంగారు రథాలు ఎక్కి ధ్రువుణ్ణి ఆహ్వానించడానికి బయలుదేరారు. వీరితోపాటు రాజ్యంలోని అందరూ ధ్రువుని దర్శనానికి బయలుదేరారు.
ధ్రువుని ఆహ్వానించడానికి తన రాణులతో బయలుదేరిన ఉత్తానపాదుడు అల్లంత దూరంలోనే ధ్రువుని ఉత్తాన పాదుడు చూసి కన్నీళ్లు కారిపోతుండగా అడుగులు వేశాడు. నాయనా అంటూ ఎంతో గారాబంగా చూశాడు. తండ్రి తనకు ఎదురురావడం చూసి ధ్రువుడు గబగబా వచ్చి తండ్రి పాదాలకు నమస్కరించాడు. తల్లులకు నమస్కరించాడు. ఉత్తాన పాదుడు తనకొడుకైన ధ్రువుని లేవనెత్తి ఆనందభాష్పాలు రాలుతుండగా తన గుండెలకు హత్తుకున్నాడు. నుదుటిపై ముద్దిడుకున్నాడు. ఒళ్ళంతా తడిమి చూసుకొన్నాడు. నాయనా నీవెంత కష్టపడ్డావు అంటూ ఎన్నో విషయాలు మాట్లాడాలనుకొంటూ మాటలురాక తడబడుతూ బంగారు పల్లకిలో చేయ పట్టి కూర్చోబెట్టాడు. మంగళవాయిద్యాలుమ్రోగుతుండగా ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. నగరంలోని రాజమార్గంలోని మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితమైన గవాక్షాల తోనూ మెరిసిపోతున్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. ప్రకృతి కూడా ధ్రువునికి స్వాగత గీతిక ఆలపిస్తుందా అన్నట్లు చల్లని గాలి వీస్తుంది. ఆ గాలికి అనువుగా చెట్లన్నీ తమ కొమ్మలను, ఆకులను కదిలిస్తున్నాయి. పూలన్నీ పుష్ప వర్షం కురుస్తున్నట్లు జలజలా రాలుతున్నాయి.
స్వాగతం పలికే ప్రకృతిని చూసి రాజర్షి యైన ఉత్తానపాదుడు తన కొడుకు ప్రభావానికి ఎంతో ఆశ్చర్యానందాలను పొందాడు. ధ్రువునికి ప్రజలపై గల అనురాగమునూ, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానమునూ పరికించి నవ నవ వంతడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్ట్భాషిక్తుడిని చేశాడు. ఇక తాను వానప్రస్థానానికి వెళ్లవలసిన సమయం వచ్చిందని నిశ్చయించుకుని తన బాధ్యతలన్నీతన వారసులైన కుమారులకు అప్పగించి ఇహభోగాలపై విరక్తి పెంచుకుని భగవంతునిపైన ఆసక్తిని పెంచుకుంటూ వనాలకు బయలుదేరాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహం చేసుకొన్నాడు. భ్రమి ధ్రువులకు కల్పుడు, వత్సరుండు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వాయుపుత్రికయైన ఇలను కూడా పెండ్లి చేసుకొన్నాడు. ఆమె వల్ల ఒక కూతురును, కుమారుని పొందాడు.
స్వర్గతుల్యంగా తన రాజ్యాన్ని ధ్రువుడు పాలించసాగాడు. శ్రీహరి చెప్పినట్లుగానే భవిష్యత్తు ఉంటుందని మళ్లా చెప్పక్కర్లేదు కదా.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804