ఈ వారం స్పెషల్

భలే మంచి చదువు బేరమూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఫలానా పేరు మోసిన కార్పొరేట్ కాలేజీ హాస్టల్‌లో మా అమ్మాయిని చేర్పించాం..’- అని చెప్పుకోవడం ఇపుడు తల్లిదండ్రులకు ఓ ఫ్యాషన్‌గా మారింది. అమ్మాయినో , అబ్బాయినో బాగా ఖరీదైన కార్పొరేట్ రెసిడెన్షియల్ స్కూళ్లు లేదా కాలేజీల్లో చేర్పించడం తమ హోదాకు తగిన చిహ్నంగా ఈ కాలపు పేరెంట్స్ భావిస్తున్నారు. మరికొంత మంది తల్లిదండ్రులు పిల్లల అల్లరిని తట్టుకోలేక హాస్టళ్లలో వేస్తున్నారు. ఏదెలా ఉన్నా తల్లిదండ్రుల ధోరణిని కార్పొరేట్ కాలేజీలు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి. ‘ర్యాంకులు, మార్కుల’ ఎరవేసి ప్రైవేటు విద్యాసంస్థలు ‘అడ్మిషన్ల’ను ఇస్తున్నాయి. ఇక హాస్టళ్లను జైళ్లకంటే కఠినంగా నిర్వహించి తల్లిదండ్రుల మన్ననలు పొందుతున్నాయి. పక్కకు చూస్తే చాలు తప్పు చేసినట్టు నలుగురి మధ్య నిలదీసి విద్యార్థులు సిగ్గుపడేలా కఠినంగా శిక్షిస్తున్నాయి. ఎదిగీ ఎదగని మనసులు ఈ ఘటనలపై ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోని తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కఠినంగా ఉండమనే చెబుతున్నాయి. ఇదో ‘మేనియా’గా మారి ఇపుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు వీరవిహారం చేస్తున్నాయి. ఐఎఎస్‌లను, దిగువ స్థాయి సిబ్బందిని అదుపు చేస్తూ ఎదిగిన ఈ కాలేజీల యాజమాన్యాలు నేడు ప్రభుత్వాలను, మంత్రులను, ఐఎఎస్‌లను, ముఖ్యమంత్రులను సైతం శాసించే స్థాయికి- ‘ఇంతింతై వటుడింతై అన్నట్టు’ ఎదిగి తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలతో తగాదాలకు సైతం తల్లిదండ్రులు సాహసించలేకపోతున్నారు. కాలేజీల క్యాంపస్‌లో ఆత్మహత్యలు జరిగినా, కార్పొరేటు యాజమాన్యాలను అదుపు చేసే యంత్రాంగం గానీ, మంత్రాంగం గానీ లేకపోగా అధికారగణం దాసోహం అవుతోంది. దీంతో విద్యాసంస్థల యాజమాన్యాలు చెప్పిందే వేదంగా నడుస్తోంది. అనేక కాలేజీల్లో జరుగుతున్న చాలా బలవన్మరణాలు పోలీసు రికార్డుల వరకూ వెళ్లడం లేదు. చిన్న చిన్నకాలేజీలను కొనేసి అక్కడ ఉన్న విద్యార్థులను, ఫ్యాకల్టీని తమ అదుపులోకి తీసుకుంటున్న ఘరానా కార్పొరేట్ కాలేజీల మోసాలు, దగాకు ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. ‘అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్టు’గానే కాదు, సామదాన బేధ దండోపాయాలను సైతం ఈ విద్యాసంస్థలు ప్రయోగిస్తున్నాయి. ఒకరిద్దరికి ఎక్కడో వచ్చిన ర్యాంకులను చూపించి విద్యార్థులకు భ్రమలు కల్పిస్తున్నారు. ఒక ప్రాంతానికి
పరిమితమైన ఈ కార్పొరేట్ కాలేజీలు నెమ్మదిగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం విద్యార్థులను దగా చేస్తున్నాయి. నిరంతరం విద్యార్థులను యంత్రాల్లా చదివించడం ద్వారా కొన్ని ర్యాంకులు సాధిస్తున్న మాట నిజమే అయినా, పిడుగుకూ, బియ్యానికి ఒకే సూత్రం అన్నట్టు సామన్య విద్యార్థుల నెత్తిమీద కూడా కత్తిపెట్టి ర్యాంకులు సాధించమనడంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అత్యంత తెలివైన విద్యార్థులకు మాత్రమే పనికొచ్చే సూత్రాన్ని అందరిపై ప్రయోగించడంతో విపరిణామాలు సంభవిస్తున్నాయి.
ఎంతో మంది సత్పురుషులు, సంఘ సంస్కర్తలు, సామాజిక వేత్తలు, మానవతావాదులకు నిలయంగా ఉన్న భారతదేశం అనతి కాలంలోనే ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి చేరుతుందనే సంతోషం కంటే రోజు రోజుకూ దిగజారిపోతున్న విద్యావిలువలను చూస్తుంటే విచారం పెరగడం ఖాయం. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ర్యాంకులు సాధించడంలో ముందున్నా, విలువలతో కూడిన చదువుల విషయంలో మాత్రం తిరోగమిస్తున్నాయనే చెప్పాలి. జూనియర్ కాలేజీల్లో ఏ అబ్బాయిని లేదా అమ్మాయిని ప్రశ్నించినా వారి నుంచి ఒకటే సమాధానం- ‘ఇంజనీర్ లేదా డాక్టర్ అవుతాం’ అని. అదేవారి జీవితంలో గొప్ప లక్ష్యంగా మారుతోంది. ఎందుకు? అని ప్రశ్నిస్తే ఆ రంగాలు డబ్బు సంపాదనకు దగ్గరదారిగా చెబుతున్నారు. ఈ యావను గుర్తించిన కార్పొరేట్ కాలేజీలు ర్యాంకులు రప్పించే ‘కారాగారాలు’గా మారుతున్నాయి. ఒకపుడు ఉన్నత చదువులకు పట్టిన చెద నేడు జూనియర్ కాలేజీలకు నెమ్మదిగా పాఠశాలలకు, పూర్వవిద్యకూ పట్టింది. ఎల్‌కేజీ కంటే ముందే నర్సరీ, ప్రీ నర్సరీ తరగతులకు కూడా ‘కార్పొరేట్’ తెగులు పట్టేసింది. కొంత మంది తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల కోసం అడ్వాన్స్‌గా సీట్లను రిజిస్టర్ చేసుకోవడంతో మొదలవుతున్న కార్పొరేట్ చదువుల పరుగులు ‘పగ్గాలు లేని స్వారీ’గా మారుతోంది.
* * *
ఒకప్పుడు మునుల ఆశ్రమాల్లో, గురుకులాల్లో గురుభక్తితో సాగిన విద్యావ్యవస్థ కాలగతిలో మారి, ఇపుడు కార్పొరేట్ శక్తుల చేతుల్లో నలిగిపోతోంది. భారతదేశం విశిష్ఠ సంస్కృతి, సంప్రదాయాల కాణాచి. వేల సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ విద్యావైభవం వెలుగొందింది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల, ఉజ్జయిని, విక్రమశిల విశ్వవిద్యాలయాలు ఎంతో ప్రాశస్త్యం పొందాయి. ప్రపంచం నలుమూలల నుండి వచ్చి వీటిలో చదువుకునే వారు. విద్య అంటే విషయాలను నేర్చుకోవడం, చదవడం, రాయడం మాత్రమే కాదు, ‘సమగ్ర జ్ఞానాన్ని అందించేదే విద్య’ అని బెంగాలీ కవి, విద్యావేత్త, తత్వవేత్త, సామాజిక వేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అన్నారు. బోధన-నిర్దిష్ట నైపుణ్యాల అభ్యసనల సమీకరణమే విద్య. పరిజ్ఞానాన్ని, మంచి దృక్పథాన్ని, ధనాత్మకమైన దృష్టికోణాన్ని, జ్ఞానాన్ని, మానవీయతను సంస్కృతిని, వారసత్వాన్ని అందిస్తూ సామాజికం చేసేదే విద్య. విద్య మానసిక బలాన్ని పెంచాలని, మేధస్సును అభివృద్ధి చేయాలని, జీవన నిర్మాణానికి, మనిషిగా రూపొందించడానికి , వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి విద్య తోడ్పడాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు.
కానీ, నేటి కార్పొరేట్ యుగంలో ‘విద్య’కు నిర్వచనం మారిపోయింది. నాడు విజ్ఞాన సముపార్జనకు విద్యను ఆర్జిస్తే, విద్య జ్ఞానానికి వినియోగించే తరం దాటిపోయి, ఉద్యోగం కోసమో, డబ్బు సంపాదించే మార్గంగానో చదువు మారిపోయింది. సంప్రదాయంగా కొంత మంది వ్యవసాయం, మరికొంత మంది వ్యాపారం, ఇంకొంత మంది కులవృత్తులకు పరిమితమైతే కొద్ది మంది మాత్రమే ఉద్యోగాలు చేసేవారు, కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. తమ శక్తి సామర్ధ్యాలను పక్కన పెట్టి- ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి అనే కోరిక అందరిలోనూ బలీయం కావడంతో దీనిని ఒక ఆసరాగా తీసుకుంటున్న కార్పొరేట్ కాలేజీలు తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాయి.
పిల్లలకు మంచి ర్యాంకులు తెప్పిస్తాం, నీట్‌లో, జిప్‌మర్‌లో, ఎయిమ్స్‌లో సీటు ఇప్పిస్తాం, జెఇఇ అడ్వాన్స్‌లో ర్యాంకుతో ఐఐటిల్లో సీటు గ్యారంటీ.. లేకుంటే మీరు కట్టిన ఫీజును వాపస్ చేస్తాం.. అంటూ విద్యార్థులను గాలం వేస్తున్న కార్పొరేట్ కాలేజీల ఎత్తుగడలకు తల్లిదండ్రులు, విద్యార్థులు చిత్తయిపోతున్నారు. ఏటా జూన్ 1వ తేదీన జూనియర్ కాలేజీలు ప్రారంభం అవుతుండగా, కార్పొరేట్ కాలేజీలు మాత్రం విద్యార్థుల వేటను కొన్ని నెలల ముందుగా ఆగస్టులోనే ప్రారంభిస్తున్నాయి. డిసెంబర్ వచ్చేనాటికి అడ్మిషన్లను పూర్తిచేస్తున్నాయి. ‘జూన్‌లో అడ్మిషన్ పొందాలంటే మూడు లక్షల ఫీజు కట్టాలి, మీ అబ్బాయి లేదా అమ్మాయికి కేవలం లక్ష రూపాయిలకే సీటు ఇస్తాం, రెండు లక్షలు తగ్గిస్తాం.’ అంటూ వల వేస్తున్నాయి. ఫీజుల ఎంత ఉంటాయో అన్న అవగాహనకు బదులు- ఎంత మేర తగ్గిందోనని అమాయకంగా లెక్కలు వేసుకుంటున్న తల్లిదండ్రులు వెంటనే కొంత అడ్వాన్స్ కట్టి కాలేజీల్లో చేర్పిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల, బంధుమిత్రుల, టీవీ ప్రకటనల ప్రభావంతో పిల్లలను హాస్టల్‌లో ఉంచడమే ఉత్తమం అనే నిర్ణయానికి పేరెంట్స్ వస్తున్నారు. ఇది కూడా కార్పొరేట్ కాలేజీలకు బాగా కలిసొచ్చే అంశమే. రకరకాల మాయమాటలతో అడ్మిషన్లు పూర్తి చేసేందుకు కార్పొరేట్ కాలేజీలు ఎంత వరకైనా వెళ్తున్నాయి. స్కూళ్ల హెడ్మాస్టర్లకు డబ్బులిచ్చి విద్యార్థుల డేటా సేకరించడం, ఇంటింటికీ సొంత పిఆర్వోలను పంపించడం, వారికి కమీషన్లు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు కమీషన్లు ఎరవేస్తున్నాయి. ఒక విద్యార్థి తన స్నేహితురాలినో, స్నేహితుడినో చేర్పిస్తే దానికి కూడా కమీషన్లు చెల్లిస్తున్నాయి. మంచి ప్రతిభా పాటవాలను ప్రదర్శించే పిల్లలను గుర్తించి వారికి స్టడీ మెటీరియల్, పుస్తకాలు అంటూ ఉచితంగా ఇచ్చి వారిని వదిలిపెట్టకుండా అవసరమైతే తిరిగి కొంత నగదు కాలేజీల వారే చెల్లించి వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇదంతా ఒక ఘట్టం. ఇది పూర్తయిందంటే చాలు ఇక విద్యార్థులు ఆంక్షల బోనులోకి వెళ్లినట్లే. కాలేజీల యాజమాన్యాలు ఆ తర్వాత తమ నిజస్వరూపాన్ని ప్రదర్శిస్తాయి. హాస్టళ్లలో ఉదయం ఆరు గంటల నుండి 8 గంటల వరకూ స్టడీ అవర్స్, ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకూ క్లాసు వర్కు, ఒంటి గంట నుండి మూడు గంటల వరకూ స్టడీ అవర్స్, నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ స్టడీ అవర్స్, రాత్రి 8.30 నుండి 10.30 వరకూ స్టడీ అవర్స్ కొనసాగిస్తాయి. అదే డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్‌కు అయితే కొద్దిగా విరామం దక్కుతుంది. ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు, ఇద్దరు ముగ్గురు కేర్ టేకర్లతో మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 లక్షల మంది ఇంటర్ విద్యార్థుల్లో సింహభాగం ఘరానా కార్పొరేట్ కాలేజీల్లోనే చదువుతున్నారు. మొత్తంగా చూస్తే డజనుకు పైగా లేని ఈ కార్పొరేట్ సంస్థలు ‘గొలుసు కాలేజీల’ను నడుపుతున్నాయి. చాలా యాజమాన్యాలు రెసిడెన్షియల్ కాలేజీలను హాస్టళ్లను బహిరంగంగానే నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చట్టాల ప్రకారం వీటికి అనుమతి లేదు, అయినా అధికారులు గుడ్డిగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే.
ప్రభుత్వం సొంతంగా విద్యాసంస్థలను నిర్వహించలేక ప్రైవేటు రంగంపై ఆధారపడటం వల్ల వచ్చిన అనర్థం ఇది. ఈ పరిస్థితిని ఇప్పటికైనా అధిగమించాలంటే కేజీ నుండి పీజీ స్థాయి వరకూ ప్రభుత్వ ఆధీనంలోనే ఉచిత విద్యను అందించాలి. అలా జరిగినపుడే విద్యారంగం కొంతైనా గాడిలో పడుతుందని ఆశించవచ్చు.
*

నేటి చదువులు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంచడం పోయి, ర్యాంకుల సాధనే లక్ష్యంగా సాగుతున్నాయి. విద్య వ్యాపారంగా, లాభాపేక్షగా మారినపుడు ఇలాంటి సమస్యలు వస్తాయి.
- డాక్టర్ చుక్కా రామయ్య

ఇంటర్మీడియట్ బోర్డు మార్గదర్శకాలను తల్లిదండ్రులు పాటిస్తే సగం అనర్థాలకు పరిష్కారం దక్కుతుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు గతంలో మాదిరి లేవు. ఇపుడు అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఉన్నాయి. మంచి అనుభవం ఉన్న అర్హులైన లెక్చరర్లు అందుబాటులో ఉన్నారు. పూర్తి ఉచితంగా ఇంటర్ చదువులు పూర్తి చేసే సువర్ణావకాశం ఉంది. ఇది వదిలిపెట్టి ఎండమావుల వెంట పడటం సరికాదు.
-డాక్టర్ అశోక్, కార్యదర్శి, తెలంగాణ ఇంటర్ బోర్డు

లెక్కలేనన్ని ఆత్మహత్యలు..
తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలకు లెక్కేలేదు. గత పదేళ్లలో దాదాపు 10వేల మంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగించక మానదు. చాలా ఆత్మహత్యలు పోలీసు రికార్డుల వరకూ రావడం లేదు. కొన్ని ఆత్మహత్యలకు వాస్తవాలకు ప్రేమ పేరుతో, అనారోగ్య కారణాలతో, సామాజిక అంశాలతో, కుటుంబ కలహాల పేరుతో, ఒత్తిడి పేరుతో పాతరేస్తున్నారు. కొన్ని కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రులకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్నాయి. 2001లో ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ కేవలం ఆత్మహత్యల అంశంపైనే సమగ్ర దర్యాప్తు నిర్వహించింది. 2005నుండి 2011 వరకూ 1500 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు పలు ఎన్‌జిఓలు చెబుతున్నాయి. 2011-12 విద్యాసంవత్సరంలో 1300 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2013లో ఆ సంఖ్య 340కి తగ్గినా, ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో వందకు పైగా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. నూజివీడులో రమాదేవి, నల్గొండ జిల్లా తిమ్మనగూడెంలో అనూష, నిజామాబాద్ జిల్లా రానంపల్లి విద్యార్థిని, ఇంజనీరింగ్ విద్యార్థిని వౌనిక, విజయనగరం జల్లా శిఖాబడికి చెందిన చీపురుపల్లి మాలతి, కెపిహెచ్‌బికి చెందిన ఎం రమేష్, కృష్ణాపురానికి చెందిన పావని, సూర్యాపేటకు చెందిన వేణు, కర్నూలుకు చెందిన శ్రీకాంత్, హిందూపూర్ నవీన్, మదనపల్లి సంతోష్‌కుమార్, గూడవల్లిలో ఈశ్వర్‌రెడ్డి, వనపర్తిలో శివశాంతి, విజయవాడ నిడమానూరులో భార్గవరెడ్డి బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చేంతాడంత అవుతుంది.

విద్యారంగాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు
ప్రొఫెసర్ మధుసూధనరెడ్డి కమిటీ (పుస్తకాల భారం, ఫీజులు)
ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ (విద్యార్థుల ఆత్మహత్యలు)
చక్రపాణి (ఐఎఎస్) కమిటీ (కార్పొరేట్ కాలేజీల ఆగడాలు)
బాలసుబ్రహ్మణ్యం (ఐఎఎస్) కమిటీ (ర్యాగింగ్ )
చుక్కా రామయ్య కమిటీ (పాఠశాల విద్య సంస్కరణలపై)
చక్రపాణి (ఐఎఎస్) కమిటీ సిఫార్సులు
* జూనియర్ కాలేజీల్లో విద్యార్థులను మార్కుల ఆధారంగా సెక్షన్లు మార్పు చేయవద్దు
* ప్రతి సబ్జెక్టుపై నెలకు ఒకసారి మాత్రమే పరీక్ష నిర్వహించాలి
* మార్కుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించరాదు
* ప్రతి కార్పొరేట్ కాలేజీలో ఒక మానసిక నిపుణుడిని నియమించాలి
* ఇంటర్ తర్వాత ఉద్యోగ అవకాశాలపై కౌనె్సలింగ్ నిర్వహించాలి.
* ఉదయం 8 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత తరగతులు నిర్వహించరాదు
* నైతిక విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలి
ఆచార్య నీరదారెడ్డి కమిటీ
( ఉన్నత విద్యామండలి మాజీ ఉపాధ్యక్షురాలు) సిఫార్సులు:
* కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లలో విద్యార్థుల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆ దుస్థితి మారాలి
* హాస్టళ్లు కాన్సంట్రేషన్ క్యాంపుల మాదిరి తలపిస్తున్నాయి, విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయతను ప్రదర్శించాలి.
* ప్రతి కళాశాలలో మానసిక వైద్య నిపుణడిని కౌన్సిలర్‌గా నియమించాలి
* తొమ్మిది గంటలకు ముందు చదివించే విధానాన్ని స్వస్తి చెప్పాలి.
* ఆటలు, పాటలకు, మానసిక ఉల్లాసాన్ని కలిగించే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* చదువు మధ్యలో విరామం ఉండాలి
* ప్రతి కళాశాల ప్రాంగణంలో ఫిర్యాదుల విభాగం, వాటిని అందజేసేందుకు బాక్స్‌ను ఏర్పాటు చేయాలి.
* కార్పొరేట్ కాలేజీల హద్దుమీరిన ప్రకటనలకు స్వస్తి పలకాలి.
* ర్యాంకులు, మార్కులు అంటూ తల్లిదండ్రులను ఏమార్చరాదు.
* విద్యార్థులను ఒకరితో మరొకరిని పోల్చడం సరికాదు
* పరీక్షల మార్కులను నోటీసు బోర్డులో ఉంచరాదు.
* బాగా చదివేవారు, చదువు సరిగా రాని వారు అంటూ సెక్షన్లను విడదీయడం, ‘మందబుద్ధుల’ పేరిట ప్రత్యేక క్లాసులను నిర్వహించడం సరికాదు.
* ఆత్మహత్యలపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి
* కార్పొరేట్ కాలేజీలు ఎక్కువ ఫీజులను వసూలు చేయకుండా సహేతుకమైన ఫీజులను నిర్ధారించి అది అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి
* ప్రతి కాలేజీలో సైన్స్ కోర్సులతో పాటు హ్యుమనిటీస్ కోర్సును అందించాలి
* ఒక యాజమాన్యం ఒకే కాలేజీని నడిపించేలా చర్యలు తీసుకోవాలి
* రెసిడెన్షియల్ కాలేజీలపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి.

విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిది ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకూ అంతే బాధ్యత ఉంది. పిల్లల శక్తి సామర్ధ్యాలను గుర్తించకుండా వారినేదో ఐఎఎస్‌లను, డాక్టర్లను, ఇంజనీర్లను చేయాలనే తపనతో కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరకపోగా, వారు తీవ్రమైన ఒత్తిడికి గురై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత విద్యావిధానంపై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలి
- డాక్టర్ మధుసూదనరెడ్డి
అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ల సంఘం (తెలంగాణ)

జ్ఞాన సామర్థ్యంతో సంబంధం లేకుండా ఏదో సాధిస్తారని భావించి కార్పొరేట్ కాలేజీల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. తీరా వారు చేరిన తర్వాత విద్యాత్మక ప్రతిభ సరిగా లేకపోవడంతో మార్కులు, ర్యాంకుల విషయంలో ఇటు తల్లిదండ్రుల నుండి అటు అధ్యాపకుల నుండి తిట్లు పడుతున్నాయి. దీంతో విద్యార్థులు ఆత్మన్యూనతా భావానికి గురై తమ శక్తిపై నమ్మకం కోల్పోతున్నారు. మానసిక ఆందోళనకు గురవుతున్నారు. నిస్సహాయక స్థితిలోకి వెళ్లి చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ వారికి సకాలంలో భరోసా ఇచ్చి వారిపై నమ్మకాన్ని కలిగించి భుజం తడితే ఆ పరిస్థితికి వెళ్లే అవకాశం లేదు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై ఇటు తల్లిదండ్రులు, అటు యాజమాన్యాలు జాగ్రత్తగా మృదువుగా వ్యవహరించాల్సి ఉంటుంది
-సిఎవి ప్రసాద్,
పాఠశాల విద్య మాజీ అదనపు సంచాలకుడు

కార్పొరేట్ ఫీజులు
ఇంటర్నేషనల్ స్కూళ్లలో
ప్రీ నర్సరీ : లక్ష నుండి రెండున్నర లక్షలు
పదో తరగతి : ఆరు లక్షల వరకూ
(ట్యూషన్ ఫీజు, రవాణా, భోజనం, యాత్రలు కలిపి)
ఒలింపియాడ్ స్కూళ్లలో
పదో తరగతి వరకూ : లక్ష 50వేలు (సంవత్సరానికి)
హాస్టళ్లలో రెండున్నర లక్షలు
జూనియర్ కాలేజీలు: ఏటా మూడు లక్షలు (హాస్టళ్లు)
డే స్కాలర్ : లక్ష రూపాయిలు
సెమీ రెసిడెన్షియల్ : లక్షన్నర
కోచింగ్‌లకు, సెకండియర్ ఫీజు అదనం

- బి.వి. ప్రసాద్