ఈ వారం స్పెషల్
ఆటవిడుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సెలవుల పండుగ వచ్చేసింది...
చిన్నాపెద్దా అందరికీ ఇది వేడుక సమయమే...
నిప్పులు కక్కుతున్న సూరీడు
ఎంత మండిపోతేమాత్రం..
భయపడేవారెవరు..?
సెలవులన్న భావనే.. వారిలో నూతనోత్తేజానికి ఊపిరినిస్తుంది.
ఇన్నాళ్లూ బుద్ధిమంతుల్లా తలలూపిన చిన్నారులు.. ఇప్పుడు చిచ్చరపిడుగులైపోతారు...ఆ భడవల ధగధగలముందు ప్రచండ భానుడి భగభగ దిగదుడుపే..!
ఇన్నాళ్లూ పలకాబలపం, పుస్తకాలు చేతపట్టి, ‘బట్టీయజ్ఞం’లో తలమునకలైపోయిన ఈ సిసింద్రీల మోములు ఇప్పుడు దివిటీల్లా వెలిగిపోతూంటాయి. ఇన్నాళ్లూ మోసిన పుస్తకాల బ్యాగులు పక్కనపడేసి... రయ్‌మంటూ మైదానానికి దూసుకుపోయే బుడతల వేగం ముందు ఏ రాకెట్ పనికొస్తుంది? కానె్వంట్ చదువుల కోసం ‘యూనిఫామ్’లో బందీలైపోయిన చిన్నారులు ఇప్పుడు మామూలు దుస్తుల్లో.. మరోలోకంలోకి వచ్చి మట్టితోను, మడుగులోనూ ఆడేసుకుని, చెట్టుచేమల్లో, చెలమల్లో కలియతిరిగి అలసిపోవడం వేసవి సరదాలో ఓ అందమైన దృశ్యం.
తరచిచూడాలి గానీ.. ఈ సెలవుల సీజన్ ఓ కొత్త బంగారులోకం.
ఆ లోకంలో విహరిస్తున్నప్పుడు...పిల్లల్లో అసలుసిసలు మేధస్సు తొంగి చూస్తుంది. అది కనిపెట్టేసినప్పుడు పెద్దల కళ్లు పెద్దవైపోయి... ఆశ్చర్యపోవడం తరచూ కన్పించే సన్నివేశమే.
మా రోజుల్లోనైతేనా... అని
జ్ఞాపకాల గుర్తులు తవ్వితీసి మురిసిపోయే పెద్దలు...
ఈ రోజులున్నాయి చూశారూ..! అని
గత జీవన విధానానికీ...ఈకాలపు ధోరణికి పోలికపెట్టి
సన్నాయినొక్కులు...సరాగాల సరిగమలు పలికే అమ్మలక్కలు.. రచ్చబండరాయుళ్ల కాలక్షేపం కబుర్లలో వెతకాలే గాని.. బోలెడంత వేదాంతం ఉంటుంది. అదేమీ మిట్టవేదాంతం కాదు. అనుభవసారం.. మంచిచెడుల మాటామంతీ...
***
ఇది పోటీ ప్రపంచం. సమయం విలువ మరీ పెరిగిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో పైచేయి సాధించాలన్న తాపత్రయం అందరిలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా పెద్దల్లో. పిల్లలు ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత కష్టపడాలో తామే నిర్ణయించేస్తున్నారు. ఆ లక్ష్య సాధనకోసం.. పిల్లలపై ఒత్తిడి పెంచి, తామూ విద్యార్థులైపోయి సానబెడుతున్నారు. ఇది తప్పని చెప్పలేం. కాకపోతే చిన్నారుల మనసుకు కాస్తంత ఆహ్లాదం, ఆటవిడుపు అవసరం. అదికూడా లేకుండా చదువు పేరుతో రుబ్బేయడమే తప్పు. చదువులో వారు రాణించినా లోకజ్ఞానం, పదిమందిలో నెగ్గుకురావడం, అసలు ప్రపంచం ఎలా ఉంటుందోనన్న అవగాహన వారిలో పూర్తిగా లోపిస్తోంది. వాటిపై చక్కటి అవగాహన ఉంటే, మార్కులు, ర్యాంకులకు మరింత వనె్నవస్తుంది. ఆ చిన్నారుల భవిత పసిడికాంతితో ధగధగలాడుతుంది. కానీ మార్కులు, ర్యాంకుల వెంపర్లాటలో పిల్లల మనసులోని మాట పట్టించుకునేవారు తక్కువైపోయారు. పది, ఇంటర్ చదువుతున్నవారిని పక్కన పెడితే, చిన్న తరగతుల పిల్లలకూ వేసవి సెలవుల్లోనూ చదువుల రాపిడి తగ్గడం లేదు.
ఆ రోజుల్లో...
వేసవి సెలవులు వస్తున్నాయంటే నెలరోజుల ముందునుంచే పల్లెపట్టుల్లోని పెద్దలు, ఇంటికి వచ్చే పరివారం కోసం సరంజామా సిద్ధం చేసుకునేవారు. ఉమ్మడి కుటుంబాల ఊసులు తగ్గి చాలాకాలమే అయిపోయింది. కనీసం పెద్దకుటుంబాల మాటకొస్తే.. సెలవుల్లో అంతా కలుసుకోవడం, విభిన్న మనస్తత్వాలున్నవారంతా ఒక్కచోటకు చేరడం, ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి కష్టసుఖాలు వల్లెవేసుకోవడం, కాస్తోకూస్తో గొడవపడి, పెద్దలపై గౌరవంతో రాజీపడి సెలవులు గడిపేయడంలో మజా మాటల్లో చెప్పలేం. పిల్లల ఆటల అల్లరి, వారిని కాపుకాయలేక పెద్దలు పడే అవస్థలు, తాతల ఆంక్షలు, ‘పోనిద్దురూ’ అంటూ చిన్నారులకు వత్తాసు పలికే అమ్మమ్మ, నాయనమ్మల మురిపాలు వేసవి ముచ్చట్లే. మంటుటెండలు భయపెడుతూంటే మధ్యాహ్నపువేళ పిల్లల్ని ఇంటిపట్టునే ఉండేట్లు చేయడంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలు వారిపై ఉండే మమతానురాగాలను వెల్లడిస్తాయి. సూరీడు కాస్తంత మొహం చాటేస్తే చాలు చటుక్కున గుమ్మందాటి దూసుకుపోయే పిల్లలు చెరవుల్లో ఈతకొట్టడం, మామిడి తోపుల్లో కాయలు కొట్టడం, తాటిముంజెలు పీల్చేయడం, ఈతపళ్ల రుచి చూడటం పల్లెపట్టులో దొరికే వెచ్చని ఆనందం. పట్నవాసం బతుకుల్లో మచ్చుకైనా కన్పించని ఈతరం పిల్లలు- పల్లెకు పరుగుపెట్టేది అందుకోసమే. ఇక మేనమామలు, అల్లుళ్లు, మేనకోడళ్ల సరసాలు, వెక్కిరింపులు, అంతా కలసి చెట్టూపుట్టా తిరగడం, చిన్ననాటి సంగతులు నెమరువేసుకోవడం, గుడి, సినిమా.. బంధువుల ఇళ్లకు వెళ్లడంలో అలుపూసలుపూ లెక్కలోకి రావు. ఈ చర్యలన్నీ మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్నిచ్చే చర్యలు. ఇప్పటికీ ఇలా రాకపోకలు సాగుతున్నాయి కానీ పూర్వం ఉన్నంత బలంగా, చిక్కగా అనుబంధాలు లేవు. అలాగాని ఈ సంప్రదాయం పూర్తిగా మరుగున పడలేదు. ఇప్పటికీ చాలా పల్లెలకు సెలవుల కళ వస్తుంది. ఆవకాయలు, మాగాయలు అందరికీ సరిపోయేలా, అందరూ కలసి పెట్టుకోవడం తెలుగువాకిట వేసవి ఘుమఘుమల్లో మొదటిది. ఆరోగ్యం పట్ల మక్కువ పెరిగి ఊరగాయల వాడకం తగ్గినా.. నసాళానికికెక్కే ఆవరుచి ఇచ్చే కిక్కుకోసం పరితపించే తెలుగువాళ్లు ఉండరంటే ఉండరు. ఈ ఎండల్లోనే కొత్త చింతపండు చేతికొస్తుంది. కాలక్షేపం, ఉపాధి మార్గం చూపే చింతపండులోని పిక్కతీయడం, ఆ పిక్కలతో అష్టాచెమ్మా సహా మరికొన్ని ఆటలు ఆడటం, పిక్కలను అరగదీసి చురకలు పెట్టుకోవడం, గాయం చేయకుండా ఒకింత బాధపెట్టే ఆ చింతచురక అనుభవించడంలో ఆ క్షణ కలిగే ఆనందాన్ని లెక్కగట్టడం ఎవరికి సాధ్యం? ఇది చిన్నాపెద్దా, ఆడామగా అన్న తేడాలేకుండా సాగిపోయే ఆట. ఇక ఈ సీజన్‌లోనే దొరికే చింతచిగురుతో అతివలు చేసే వంటకాల్లో వలపంతా రంగరిస్తారోఏమో... దాని రుచే వేరు. కుండలో నీళ్లు, తరవాణి జలాలు దాహం తీర్చి, వడదెబ్బను ఢీకొట్టడంలో తిరుగులేనివే. ఇప్పుడు ఓఆర్‌ఎస్ అంటూ చెప్పే బలమైన లవణాల సమూహం.. మన ఉప్పేసిన చల్ల, నవమిపానకాల సరికొత్త రూపమేకదా. ఎండలు తెచ్చే కష్టాలను వల్లెవేసి, వాటి పరిష్కారానికి చిట్కాలు చెప్పే పెద్దలు ఇప్పుడు తగ్గిపోయారు. వినే ఓపికా ఇప్పటి సమాజానికి లేదు. అలాగని ఈ మార్పును తప్పు బట్టలేం. ఆధునిక వైద్యం, మేలైన విధానాలు అందుబాటులోకి వచ్చాక చిట్కాలకు విలువ తగ్గింది. కానీ, చిట్కా వైద్యంలో అనురాగంబంధం కలగలసిపోవడంవల్ల ఆ రోజుల్లో చికిత్స బ్రహ్మాండంగా ఫలితాన్నిచ్చేది. సెలవుల్లో ఎక్కువమంది ఒకచోట చేరడం వల్ల విభిన్న మనస్తత్వాలగురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. సమస్యలు, చికాకులు, సర్దుబాట్లు, మానవసంబంధాల పట్ల అవగాహన కలిగేవి. అందరూ కలసి ఉండటానికి కొన్ని కుటుంబాలు సిద్ధమైతే ఎండలు ఎంత వేధించినా అంతా కలసి తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లడం మరికొందరికి అలవాటు. ఉక్కపోతలో ఆపసోపాలు పడుతూ, చిర్రెత్తుకువచ్చే కోపంతో విసుక్కుంటూ ప్రయాణాలు చేయడం, చల్లబడ్డాక ఎక్కడలేని ప్రేమలు ఒలకబోసే సగటు మనిషి మనసుమమత ఏమిటో వేసవిలోనే ఎక్కువగా బయటపడుతుంది. ఆరుబయట పడుకున్నప్పుడు ఆకాశంలో కన్పించే చంద్రుడు, అతగాడు ముఖం చాటేసినప్పుడు కన్పించే చుక్కలు.. అన్నీ వివరించే కథలు చెప్పే పెద్దలు...అవి వింటూ నిద్రపోయే చిన్నారుల ఎదల్లో ఎంత ఆనందం ఉంటుందో ఎవరు లెక్కగట్టగలరు. ఆర్థికంగా ఉన్నాలేకపోయినా...అభిమానం ఉన్న కుటుంబాలన్నీ ఇలా వేసవిని వినోదంగా మార్చుకోవడం తెలుగుగడ్డపై కన్పించే వేడుక. ముఖ్యంగా ఆ రోజుల్లో వేసవి ప్రయాణాలన్నీ పిల్లలకోసమే, వారి ఆనందం కోసమే సాగేవి. చదువుసంధ్యలు నేర్పే బడులకు దూరంగా సుద్దులు,బుద్ధులు నేర్పే లోకంలోకి ఈ ప్రయాణం సాగిపోయేది. ఇలా చెబుతూవెళితే గతకాలపువైభవం వర్ణించడానికి ఈ సెలవులు చాలవుగానీ...ఈలోకంలోకి వద్దాం.
ఈ రోజుల్లో..
ఆధునికయుగం ఇది. ఇంటర్నెట్‌లో చిక్కుకుపోయిన జనం.. ఆ వల లోంచి బయటపడటానికి అట్టే ఇష్టపడరు. పూర్వంతో పోలిస్తే ఆర్థికంగా బలపడిన సమాజం ఇప్పుడుంది. ప్రయాణ సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, ఎంజాయ్ చేయడానికి తగిన ప్రాంతాలు రూపుదిద్దుకున్నాయి. అయితే మనలోనే ఇంకా సరైన మార్పు రాలేదు. అందువల్ల పూర్వం రోజుల్లో పిల్లలకు సెలవుల్లో దక్కినంతటి ఆనందం.. ఇప్పటి పిల్లలకు అందుతోందా? అంటే ఔనని చెప్పలేం. పెద్దలకు తీరికలేకపోవడం, వారు తీరికచేసుకోకపోవడం పిల్లలకు పెద్దనష్టమే. కంప్యూటర్లలో గేమ్‌లు, వీడియోఆటలు, ఫోన్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో ఊసులు కాలక్షేపం కలిగిస్తాయేగానీ అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటునివ్వవు. నలుగురితో కలవడం, నలుగురిలో నెగ్గుకురావడం ఈ ప్రపంచం నేర్పడం లేదు. చిన్నారుల్లో మానసిక పరిపక్వత, మనోనిబ్బరం పెంచేందుకు ఒకప్పుడు సెలవులు ఉపయోగపడేవి. ఇప్పుడంత తీరిక వారికి చిక్కడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ముందుండటమే లక్ష్యమైపోయింది. నిరంతరం చదువే ధ్యాస, శ్వాసగా మారిపోయింది. టాప్ ర్యాంకు కొట్టేయడమే ప్రధానమైపోయింది. వేసవిలోనూ చదువులే. వ్యాపారం కోసం వేసవిలోనూ తరగతులు నిర్వహించడం విద్యాసంస్థలకు అలవాటైపోయింది. నిండా రెండేళ్లు నిండని పిల్లలకూ సెలవులు చిక్కిపోయి, బడిమెట్లు ఎక్కాల్సివస్తోంది. పెద్దల ఆలోచనల్లో విపరీతమైన మార్పువల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ పోకడ ఎక్కువగా ఉంది. అయితే విహారయాత్రలు, వినోదయాత్రలు పూర్తిగా మానేయలేదు. కాకపోతే హడావుడిగా, మొక్కుబడిగా అవి సాగిపోతున్నాయి. ఆ కొద్దికాలంలో పిల్లలు నేర్చుకునేది, పెద్దలు చెప్పగలిగేదీ చాలా స్వల్పం. సెలవుల్లో తాత, అమ్మమ్మ, నాన్నమ్మ దగ్గరకు వెళ్లాల్సిన పిల్లలు తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా శిక్షణ శిబిరాలకు తరలిపోతున్నారు. సహజంగా నేర్చుకోవల్సిన చిన్నచిన్న విద్యలను మరీ ఖర్చుపెట్టి, చదువులాగానే బలవంతంగా నేర్పిస్తున్నారు. ఇవి పిల్లలకు ఉపయోగపడుతున్నా, మానసికంగా ఒత్తిడినుంచి వారు బయటపడలేకపోతున్నారు.
శిక్షణ శిబిరాల జోరు..
పల్లెపట్టుల్లో సహజంగా అబ్బే పలు విద్యావిషయాలు పట్టణాల్లో శిక్షణ ఇచ్చి నేర్పిస్తున్నారు. పోటీ పరీక్షలు, తదుపరి చదువుల టైట్ షెడ్యూల్ నేపథ్యంలో పట్టణం, నగరం వదలివెళ్లడానికి ఇష్టపడని, వీలుపడని తల్లిదండ్రులు పిల్లలకు ఈ శిక్షణ శిబిరాల్లో కొత్తవిద్యలు నేర్పిస్తున్నారు. ఈత, బాడ్మింటన్, స్కేటింగ్, క్రికెట్, చెస్ ఇలా ఏదో ఒక అంశంలో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. తమ పిల్లలు ఆయా ఆటల్లో రాటుదేలి రాణించాలని పెద్దలు దగ్గరుండి నేర్పిస్తున్నారు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం వంటి రంగాల్లోనూ మరికొందరు శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రభుత్వాలూ ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఇక ప్రైవేటు సంస్థల తరహాయే వేరు. ఇది తప్పని చెప్పలేం. ఇవి అవసరమే అయినా లోకాన్ని అర్థం చేసుకునే నేర్పు పిల్లలకు కలగాలంటే వారు ఆంక్షల నుంచి బయటపడాలి. నలుగురిలోకి వెళ్లాలి. కుటుంబ బాంధవ్యాలు బలపడాలి. చదువుతోపాటు లోకజ్ఞానం ఉంటే ఆ చిన్నారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు.
ఇవి అవసరం...
సెలవుల్లో యాత్రలు చేస్తే మంచిది. ఓ పార్కుకు వెళితే మొక్కల గురించి పిల్లలకు చెప్పాలి. ఓ జంతు ప్రదర్శన శాలకు వెళితే జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులను ప్రత్యక్షంగా చూసిన అనుభవం వస్తుంది. పుస్తకాల్లోనూ, టీవీల్లోనూ చూసినవాటికి, ప్రత్యక్షంగా చూసిన అనుభవానికి హస్తిమసికాంతరం తేడా ఉంటుంది. ఓ పులి పొడవు ఆరడుగులు అంటే పిల్లాడికి ఏం తెలుస్తుంది? ఆరు అడుగులు అంటే ఏం ఊహిస్తాడు? అదే ప్రత్యక్షంగా చూస్తే అది ఎంత పెద్దదిగా ఉందో తెలిసిపోతుంది. అందుకే పిల్లల్ని జూకు తీసుకువెళ్లాలి. మొక్కలకు నీళ్లుపోయడం, అవి పెరుగుతున్న విషయాన్ని వారికివారుగా గుర్తించి చెప్పడంలో వాళ్లకి దొరికిన ఆనందం ఏ శిక్షణ శిబిరంలోనూ లభించదు. కొత్తకొత్త ప్రాంతాలకు తీసుకువెళితే ఆయా ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. థీమ్‌పార్క్‌కు తీసుకువెళితే అప్పటికి ఆనందం దొరుకుతుందేమో కానీ దానివల్ల ఒరిగే జ్ఞానం తక్కువే. అదే ఓ వేథశాల (ప్లానిటోరియం)కు తీసుకువెళితే కళ్లముందు ఖగోళం సాక్షాత్కరిస్తుంది. అక్కడ ఓ గంటసేపు ప్రదర్శన చూస్తే అంతరిక్షం, చుక్కలు, గ్రహాలపై కనీస అవగాహన కలుగుతుంది. మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. కొత్తవిద్యలు నేర్పించడం మంచిదే..కానీ ముందు మనసుకు చురుకుదనాన్ని ఇచ్చేదేమిటో కనిపెట్టి, అది పిల్లలకు అందించాలని చెబుతున్నారు.
సృజనకు పదును...
పెద్దలకు ఏం ఇష్టమో అది పిల్లలకు ఇష్టమై ఉండాలనేం లేదు. చిన్నారులకు ఏం ఇష్టమో కనిపెట్టి వారికి అందులో అవకాశం కల్పించాలి. వారి అభినివేశాన్ని గమనించి క్రియేటివిటీకి పదునుపెట్టాలి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, కథలు చెప్పడం, కథలు వినడం.., చిన్నచిన్న పక్షులు, జంతువులను పెంచడం వంటివి అలవాటు చేయాలి. పంటపొలాలు, నదులు, సాగరతీరాలకు తీసుకువెళితే పిల్లలకు కలిగే ఆనందం ఎలా ఉంటుంది? అసలు ఆ సమయంలో పెద్దలూపిల్లలైపోరూ.. ఇలా పిల్లల ఇష్టాలను బట్టి వారికి ఆయా అంశాల్లో ప్రవేశం కల్పించాలి. వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని దారికి తెచ్చుకోవాలి. సెలవుల్లో ఏం చేయాలో వారినే అడగొచ్చు. మీరేం చేయదలుచుకున్నారో చెప్పొచ్చు. చివరకు ఏది మేలైనదో, ఏది వారి మనసుకు నచ్చుతుందో అదే చేయొచ్చు. పిల్లల ఆనందమే కదా పెద్దలకు కావలసింది. శిక్షణ శిబిరాలకు వెళ్లినా...సెలవుల్లో అసలు మజా ఎక్కడ దొరుకుతుందో వెదకండి...అక్కడకు వెంటనే వెళ్లండి...వేసవి పూర్తికాకముందే.. ఆనందాన్ని ఆశ్రయించండి. పిల్లలకు ఆటవిడుపునివ్వండి.
*
చుట్టాలతో గడపాలి
పిల్లలకు చదువొక్కటే కాదు మానసిక ఉల్లాసం కూడా అవసరం. ఏడాది పొడవునా విద్యాసంస్థలు పిల్లల్ని చదువు పేరుతో క్షణం ఖాళీ లేకుండా చేస్తున్నాయి. కనీసం వేసవి సెలవులు ఇచ్చినప్పుడైనా పిల్లల్ని చదువుకు దూరంగా ఎంజాయ్ చేసేలా తల్లిదండ్రులు దృష్టి సారించాలి. సెలవుల్లో పిల్లల్ని బంధువుల ఇళ్ళకు పంపించడం ద్వారా ప్రస్తుతం దూరమవుతున్న బంధాలు దగ్గరయ్యే వీలుంటుంది. ఒంటరి బతుకుల కన్నా ఉమ్మడి కుటుంబాల్లోని గొప్పతనం తెలుసుకునే వీలు కలుగుతుంది. పిల్లలు ర్యాంకులు, ఉన్నత ఉద్యోగాలే కాదు వారి మానసిక వికాసం కూడా అవసరం. - ఎ.అచ్యుతానంద్
విద్యుత్ సంస్థ జనరల్ మేనేజర్, విశాఖపట్నం
--
చదువుకు విరామం
వేసవి సెలవులు అంటే పిల్లల చదువులకు సెలవులు ఇవ్వడమే. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పుడు చక్కని అవకాశం. సెలవుల్లోనూ పాఠాలు, కోచింగ్‌లు అనకుండా వారిని ఆడుకోనివ్వాలి. ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడం ద్వారా జనరల్ నాలెడ్జి పెరగడమేగాక ఆయా ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి
- సిహెచ్.ఉమాదేవి
గృహిణి, పెందుర్తి, విశాఖ
--
దూర ప్రాంతాలు
చూడాలని ఉంది
వేసవి సెలవుల్లో బంధువులతో సరదాగా గడపాలని ఉంది. చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించాలని ఉంది. నిత్యం పాఠశాలల్లో పుస్తకాలతో బిజీగా గడిచిపోతుంది. వేసవి సెలవుల్లో కుటుంబీకులతో దూర ప్రాంతాలకు వెళ్లాలని ఉంది. అమ్మమ్మ, తాతయ్యలతో సరదాగా గడపాలని అనుకుంటున్నా.
- పయిల అక్షిత,
10వ తరగతి,
ఉక్కునగరం, విశాఖ
--
ఇవీ ఇష్టమైన ప్రదేశాలు...
భారత్‌లో వేసవి సెలవుల సందడి మొదలైంది. ఈ సమయంలో విహార, వినోదయాత్రలకు చాలామంది సిద్ధమవుతారు. మనదేశంలో టాప్‌టెన్ టూరిస్టు స్పాట్‌లకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువ. చిన్నచిన్న కుటుంబాలు, ఉద్యోగులు, కొత్త దంపతులు ఈ వేసవిలో వినోదం, విశ్రాంతి కోసం అక్కడికి వెళుతారు.
కులుమనాలి, కొడైకెనాల్, ఊటీ, మైసూరు, కుర్గ్, డార్జిలింగ్, నైనితాల్, మున్నార్, జమ్ముకాశ్మీర్, ముస్సోరి ఎక్కువమంది సందర్శిస్తారు. ఇక పిల్లల్లో ఎక్కువగా ఇష్టపడేది జూలు, థీమ్‌పార్కులు. ఆధునిక నగరాల్లో ఇవి ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి
ఈతంటే పిల్లలకు ఇష్టం
మామూలు రోజుల్లోనూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్‌కు సెలవుల్లో పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఈత అంటే వారికి ఎంతో సరదా. దీనితో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతోంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు ఎంతో ఆసక్తితో స్విమ్మింగ్‌కు వస్తున్నారు. ఉదయం అయిదు షిఫ్టులు, సాయంత్రం మూడు షిఫ్టుల్లో చిన్నారులు ఈత నేర్పుతున్నాం. రెండున్నర అడుగులు మొదలుకుని 4, 5, ఏడున్నర అడుగుల ఎత్తు వరకున్న సికిందరాబాద్ స్విమ్మింగ్ పూల్‌కు ప్రతి వేసవిలోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ చేసేందుకు రెగ్యులర్ మెంబర్‌షిప్‌తో పాటు వేసవి ప్రత్యేక మెంబర్ షిప్ కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. ఈత ప్రాక్టీస్ చేసే చిన్నారుల భద్రత పట్ల దృష్టి సారిస్తున్నాం. మొత్తం ఎనిమిదిమంది స్విమ్మింగ్ కోచర్లుండగా, వీరిలో నిత్యం నలుగురైదుగురు స్విమ్మర్లు పూల్‌లోనే ఉంటూ వారికి వెళుకువలు నేర్పుతుంటారు. జిహెచ్‌ఎంసికి చెందిన స్విమ్మింగ్ పూల్ కావటంతో ఛార్జీలు తక్కువగా ఉన్నందున, ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పటికే ఎనిమిది మందల మంది ఈత నేర్చుకునేందుకు తమ వివరాలను నమోదు చేసుకోవటం ఇందుకు నిదర్శనం. వీరు గాక, మరో వంద మంది రెగ్యులర్‌గా ఉదయం, సాయంత్రం ఈతకు వస్తుంటారు. ఈ సారి ఎండలు ఎక్కువగా మండిపోవటంతో వేసవి తాపం నుంచి పిల్లలు సేద తీరేందుకు కొందరు తల్లిదండ్రులే వారిని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌కు వస్తున్నారు.
-శ్రీనివాస్ గౌడ్
కోచ్, జిహెచ్‌ఎంసి స్విమ్మింగ్‌పూల్, సికిందరాబాద్
--
ఆత్మవిశ్వాసం పెంపొందించాలి
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. మహనీయుల జీవిత కథలు చెప్పి వారిలో స్ఫూర్తినింపాలి. నీతికథలు, శతకాలు బోధించాలి. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం, పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం వంటి అంశాలను వివరించాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి అర్ధమయ్యేలా చెప్పాలి. తమ పనులు తామే చేసుకోవడం, పనుల్లో సాయపడటం, మొక్కల పెంపకం, క్విజ్ వంటి వాటిపై వారి దృష్టి మళ్లించాలి.
-రహీమున్సీసా బేగం
కన్వీనర్, భేటీ బచావో, భేటీ పడావో,విశాఖ
--
తాతయ్యతో గడపాలని ఉంది
వేసవి సెలవులు మంచి ఆనందాన్ని కలిగిస్తాయి. నానమ్మ, తాతయ్యలతో గడపాలని ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా బీచ్, జూకు వెళ్లాలని ఉంది. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేయాలని అనుకుంటున్నా. అమ్మానాన్నలతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా.
-ఆర్.ప్రశాంతవర్మ,
8వ తరగతి, గాజువాక, విశాఖ
--
ప్రకృతిని పరిచయం చేయండి
వేసవి సెలవులు అంటే ఏడాది పాటు చదువులతో బిజీగా గడిపిన పిల్లలకు ఆటవిడుపులాంటివి. వేసవి సెలవుల్లో చదువును పక్కన పెట్టి ప్రకృతిని పిల్లలకు పరిచయం చేయాలి. ఆడుకోనివ్వాలి. మొక్కల పెంపకం, పక్షులకు ఆహారం పెట్టడం వంటి పనులను వారితోనే చేయించాలి. ఉదయం, సాయం సమయాల్లో దగ్గర్లో పొలాలు ఉంటే అక్కడ కాసేపు గడిపేలా చూడాలి. పంటలు, పురుగులు, పక్షులు, చెట్లతో పరిచయం చేసుకునే వీలు కల్పించాలి. కొత్తగా తెలుసుకున్న విషయాలను పుస్తకమిచ్చి రాయమనాలి.
- జయతి లోహితాక్షన్
నేచర్ ఫొటోగ్రాఫర్, పిల్లల వ్యక్తిత్వ వికాస నిపుణురాలు, నర్సీపట్నం, విశాఖ జిల్లా
--
ఎంతో హాయ..
స్కూల్‌లో పరీక్షలు మూడు రోజుల క్రితం ముగియటంతో ప్రస్తుతం సెలవులిచ్చారు. ప్రతి సంవత్సరం స్విమ్మింగ్ ప్రాక్టీసుకు వచ్చే నాకు ఈ సారి కాస్త లేటయింది. స్విమ్మింగ్ చేస్తే చాలా హాయిగా ఉంటుంది. గంటన్నర సేపు పూల్‌లో గడుపుతా. రాత్రి ఆకలి పెరిగి భోజనం బాగా చేసి హాయిగా నిద్రపోతా. ఉదయం లేచేటప్పటికి ఎంతో ఆహ్లాదంగా ఉంటోంది.
-సందీప్,
ఏడో తరగతి విద్యార్థి, సికిందరాబాద్