ఈ వారం స్పెషల్

‘ఆంక్షల’గడ్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాలర్ డ్రీమ్స్.. ఇవాళ భారత దేశంలో ఈ కలను కనని మధ్యతరగతి కుటుంబాలు చాలా చాలా తక్కువ. చదివేది డాలర్ కోసమే, చదవబోయేది డాలర్ కోసమే. బిటెక్కో, ఎంటెక్కో పట్టా పొందాలి.. లేక ఏ కంప్యూటర్ విద్యపైనో వేళ్లు కదిలించాలి.. ఎంచక్కా విమానం ఎక్కేసి అమెరికాలోని ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లి సెటిలైపోవాలి. ఇదీ సగటు మధ్యతరగతి కుటుంబాల బేసిక్ థాట్.. ఇందుకోసం పిల్లలు పుట్టినప్పటి నుంచే ప్రణాళికల రచనలు జరిగిపోతాయి. ఎక్కడ.. ఏం చదవాలో డిసైడయిపోతాయి. ఎంత ఫీజులైనా కుమ్మరించేందుకు తల్లిదండ్రులూ సిద్ధమైపోతారు. కరిగిపోవటానికి ఆస్తులు.. పెరిగిపోవటానికి అప్పులూ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి. కొడుకో.. కూతురో ఏదో చదువు చదివేసి.. అమెరికాకు పై చదువుల పేరుతో వెళ్లిపోయి.. డాలర్‌ను రూపాయి లెక్కల్లో జమాఖర్చులు వేసుకుంటూ.. కడుపుకట్టుకుని.. కూడబెట్టుకుని ఇండియాకు తిరుగుటపా చేస్తే.. 1:70 డాలర్-రూపాయి దామాషా లెక్కల్లో లగ్జరీ జీవితాలు గడిపేయొచ్చన్నది మన కుటుంబాల ఆశ.. ఆశయం.. లక్ష్యం. ఈ ప్రస్థానంలో తొలి అడుగు డిగ్రీ పూర్తి కాగానే ఉన్నత విద్యలు చదువుకునే పేరుతో ఎఫ్1 విద్యార్థి వీసాను సంపాదించుకుని అక్కడ కాలుమోపడం. ఓ పక్క చదువుకుంటూ, మరోపక్క పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ డాలర్ సంపాదనలో పడటం. ఆ తరువాత నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగాన్ని సంపాదించుకుని అందుకు అవసరమైన హెచ్1బి వీసాను పొందడం. ఇదీ అమెరికాలో డాలర్ డ్రీమ్‌ని నిజం చేసుకునేందుకు మార్గం.
హెచ్1బి వీసా అన్నది అమెరికాకు ప్రవాసేతర వీసా. అమెరికన్ కంపెనీలు తాత్కాలిక నియామకాల ప్రాతిపదికన విదేశీ కార్మికులను నియమించుకునేందుకు వీలు కల్పించే వీసా ఇది. ఇప్పుడు ఈ వీసాకు గ్రహణం పట్టింది. అమెరికా కొత్త అధ్యక్షుడు స్థానిక అమెరికన్లకు ఉపాధి కల్పనను పెంచేందుకు ఈ వీసా కార్యక్రమాన్ని సమూలంగా మార్చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రవాస జాతీయతా చట్టంలో అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తూ అమెరికన్ కాంగ్రెస్‌లో ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అమెరికాకు వలసలు, అమెరికన్లకు ఉద్యోగాలకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే పలు వాగ్దానాలు చేశారు. జనవరి 20న బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే ఆ వాగ్దానాలను అమలు చేయటం మొదలు పెట్టారు. మొదట ఒబామా కేర్ సెంటర్‌ను రద్దు చేశారు. తరువాత ఏడు ముస్లిం మెజార్టీ దేశాల ప్రజల వలసలపై మూడు నెలల తక్షణ నిషేధం విధించారు. మరోవైపు అమెరికా ప్రతినిధుల సభలో హెచ్1బి వీసాదారుల కనీస వేతన సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ వీసాదారుల కనీస వేతనం ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ బిల్లులో ప్రతిపాదించిన నిబంధన అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగార్థులకు కూడా ఆందోళన కలిగించే అంశం. హెచ్1బి వీసాలపై వివాదం ఇప్పటిదేమీ కాదు. అమెరికన్ కంపెనీలు తమ పొట్టలు కొట్టి తక్కువ వేతనాలకు చీప్ లేబర్‌ను విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాయని, అందువల్లే నిరుద్యోగుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతూ వస్తోందని చాలాకాలంగా ఆందోళన జరుగుతూనే ఉంది. గతంలో ఒబామా సైతం దీనిపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించారు. అయితే అవన్నీ వెనక్కి పోయాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అరుూ్య కాగానే విడదీయటానికి సాధ్యం కాని మెలికలతో బిల్లు రెడీ అయింది. కాలిఫోర్నియా కాంగ్రెస్ సభ్యురాలు జాయ్ లోఫ్‌గ్రెన్ అత్యధిక నైపుణ్యం, సమగ్రత, పారదర్శకత చట్టం-2017పేరుతో ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును సెనేట్‌లోనూ ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఇందులో చేసిన ప్రతిపాదనలు నిజంగా అమల్లోకి వస్తే ఇక హెచ్1బి వీసాలపై భారతీయులే కాదు, మొత్తం ప్రపంచమే ఆశలు వదులుకోవలసి వస్తుంది.
బిల్లులో పొందుపరిచిన నిబంధనలు అటు అమెరికన్ కంపెనీలకు, అమెరికాలో నడుస్తున్న విదేశీ కంపెనీలకూ శరాఘాతమే. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవటానికి ప్రధాన ఉద్దేశం తక్కువ వేతనాలే. భారతీయులతో సహా ఇతర దేశాల నుంచి వచ్చే విదేశీ కార్మికులకు(ఉద్యోగులకు) ఆయా కంపెనీలు ఏడాదికి 60వేల నుంచి 75వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నాయి. అదే అమెరికన్లను నియమిస్తే వారికి ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. పైగా అంతేకాదు అమెరికన్లకు ఓవర్‌టైమ్(ఓటీ) చెల్లించాల్సి ఉంటే గంటకు దాదాపు వంద డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే భారతీయులకైతే, లేదా ఇతర దేశస్థులకైతే గంటకు 60 డాలర్లతో సరిపుచ్చవచ్చు. అంటే నలభై డాలర్ల మిగులు అన్నమాట. అంతే కాదు, అమెరికన్లు వారాంతంలో పనిచేయరు. వారికి అధీకృత సెలవులూ దండిగానే ఉంటాయి. కార్మిక చట్టాలు యాజమాన్యాల కంటే స్వదేశీ ఉద్యోగులకే అనుకూలంగా ఉంటాయి. వీటన్నింటి కారణంగానే అమెరికాలోని ఐటి కంపెనీలు హెచ్1బి వీసాలను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు, చైనీయు లు అతి తక్కువ వేతనాలకే పని చేస్తారని పలు కంపెనీలు బాహాటంగానే చెప్తున్నాయి. అందుకే ఏటా అమెరికా జారీ చేసే 65వేల హెచ్1బి వీసాలలో ఎక్కువ శాతం భారతీయులు, చైనీయులకే లభిస్తున్నాయి. ఈ వీసా కార్యక్రమాన్ని వివిధ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని, ఇందుకు సంబంధించిన అభియోగాలపై విచారణ జరిపిస్తామంటూ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటన కూడా చేశారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిస్నీలాండ్ వంటి ప్రముఖ సంస్థలు అమెరికా కార్మికులను తొలగించి, తక్కువ వేతనాలకు విదేశీకార్మికులను నియమించుకున్నాయని ఆరోపణలు రావటంతో అమెరికాలో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. సరిగా ఇదే సమయంలో ట్రంప్ అధికారంలోకి రావటం, ఎన్నికల హామీలను దూకుడుగా అమలు చేస్తున్న దిశలో హెచ్1బి వీసాపైనా ప్రధానంగా దృష్టి సారించారు. ఈ వీసాల జారీని తగ్గించగలిగితే ఎక్కువ మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వవచ్చన్న ఆలోచనతోనే కఠిన నిబంధనలతో బిల్లును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన విదేశీ ఉద్యోగులకు నష్టదాయకమైనా, కచ్చితంగా అమెరికన్ నిరుద్యోగులకు శుభవార్తే. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే విదేశీ కార్మికులకు ఏటా 1.30లక్షల డాలర్లు చెల్లించటం కంటే, అమెరికన్లకు లక్ష డాలర్ల వేతనంతో సరిపెట్టవచ్చనే కంపెనీలు ఆలోచిస్తాయి. దీంతో సహజంగానే హెచ్1బి స్పాన్సర్‌షిప్ తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ వీసాలు ఏటా 65వేలు జారీ చేయాలన్న నిబంధన ఉంది. కొత్త బిల్లులో ఆ పరిమితిని పూర్తిగా తొలగించారు. వేతనాలు రెండు వందల శాతం పెంచాలన్న నిబంధన విధించిన తరువాత వీసాల సంఖ్యకు పరిమితి ఉన్నా లేకపోయినా ఒకటే. ఆయా కంపెనీలు తమంత తాముగానే విదేశీ ఉద్యోగుల సంఖ్యను కుదించుకుంటాయి. అత్యున్నత నైపుణ్యం కలిగిన వారికే ఇకపై ఆ కంపెనీలు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేసి తీసుకుంటాయి. నిపుణుల కోసం ఖర్చు పెరగటంతో పాటు, స్థానికుల్ని మరింత మందిని నియమించుకోవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా సాగుతూ వచ్చిన నాసిరకం డిగ్రీలతో హెచ్1బి వీసాలను పొందటం ఇకపై ఎంతమాత్రం సాధ్యం కాదు.

భారత్ కంపెనీలపై ప్రభావం
ట్రంప్ సర్కారు నిర్ణయం అమలైతే పెద్ద దెబ్బ భారత ఐటి కంపెనీలపైనే ఎక్కువగా పడుతుంది. ఇప్పటి వరకూ చేస్తున్నట్లుగా భారత ఉద్యోగులను అక్కడికి తీసుకుపోయి తక్కువ వేతనాలకు పనిచేయించుకోవటం మన కంపెనీలకు సాధ్యం కాకపోవచ్చు. వాస్తవానికి 1965నుంచే భారత్ నుంచి అమెరికాకు ప్రజల వలసలు మొదలయ్యాయి. అప్పుడు పదిహేను వేల వరకూ ఉన్న భారత సంతతి ప్రజల సంఖ్య సుమారు 35లక్షల వరకూ పెరిగింది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఏటా 35వేల మంది పీజీ చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుని స్థిరపడిపోతున్నారు కూడా. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి జనాభా ఒక శాతం దాటిపోయింది. అంటే ప్రతి వందమందిలో ఒకరు భారతీయులే. జనాభా లెక్కల ప్రకారం చూస్తే చైనీయులు 1.25శాతం, ఫిలిప్పీన్స్ సంతతి వాళ్లు 1.2శాతం ఉన్నారు. మన తెలుగువారి జనాభా 2.70లక్షలు దాటిపోయింది. ఇప్పుడు అమెరికా ప్రతినిధుల సభ వీసా నిబంధనలకు సంబంధించిన బిల్లును ఆమోదిస్తే భారతీయులపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికాకు వెళ్లాలని దరఖాస్తు చేసుకునే విదేశీయుల్లో 60శాతం భారతీయులే ఉండటం
గమనార్హం. గత విద్యాసంవత్సరంలో దాదాపు లక్షన్నర లక్షల మంది విద్యార్థులు అమెరికాకు చదువుల కోసం వెళ్లారు. వీరి వల్ల అమెరికాకు 3,300కోట్ల డాలర్ల ఆదాయం కూడా వస్తోంది. ఇప్పుడు కొత్త బిల్లు ఆమోదం పొందితే ఉన్నత డిగ్రీల కోసం అమెరికాకు వలస వెళ్లే విద్యార్థులు, విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను అక్కడికి పంపించే భారతీయ టెక్ కంపెనీలపై ఈ చట్టం ప్రతికూల ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే బిల్లు ఆమోదం పొందటం మాటెలా ఉన్నా, ప్రవేశ పెట్టారన్న వార్తలు రాగానే టెక్ కంపెనీల షేర్ల విలువలన్నీ ధడాలున పడిపోయాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రా, హెచ్‌సిఎల్ సంస్థల షేర్లు బాగా పడిపోయాయి. అంతే కాదు మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో భారత ఐటి రంగం వాటా దాదాపు 9 శాతం. ఈ రంగంలో సుమారు 40 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మన దేశ ఐటి సంస్థల ఎగుమతుల్లో 65 శాతం వాటా అమెరికాదే. అంటే మన ఐటి రంగం మొత్తంగా అమెరికాపైనే ఆధారపడి ఉందన్నది స్పష్టం. ఈ దశలో ట్రంప్ హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేయటం నిశ్చయంగా మన ఐటిరంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని మన ఐటి సంస్థలు ఏ విధంగా ఎదుర్కొంటాయన్నది మున్ముందు తెలుస్తుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తమ విద్యార్థుల్లో, ఉద్యోగార్థుల్లో, కంపెనీల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది. నాస్‌కాం సంస్థ అమెరికాకు వెళ్లి సంప్రతింపులు జరిపేందుకూ రంగం సిద్ధం చేసుకుంది. భారత ఐటి కంపెనీలూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఐటికి సంబంధించి భారత్ అమెరికాపై ఎంత ఎక్కువగా ఆధారపడిందో, అమెరికాకూ భారత అవసరం అంతే ఉంటుందని నిపుణులు ఆశాభావంతో ఉన్నారు. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇతర దేశాలతో పోలిస్తే మన వాళ్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని కూడా భావిస్తున్నారు. అయితే ఈ ఆశాభావం ఎంతవరకు నిజమవుతుందన్నది అనుమానమే. పూర్తిగా స్వదేశీ నినాదంతో ముందుకు వెళ్తున్న ట్రంప్ నిర్ణయాలు మనకు ఒక రకంగా గుణపాఠం కావలసి ఉంది. వీసా బిల్లు చట్టరూపం దాలిస్తే మేధోవలసలు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అవకాశాన్ని భారత ఐటి కంపెనీలు, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి. మన గడ్డపై మేధను మరోచోటికి తరలకుండా ఇక్కడే తగినన్ని అవకాశాలు కల్పించాలి. సంతృప్తికర వేతనాలతో వారి సేవలను దేశ పురోగతికి వినియోగించుకోవాలి. అలాంటప్పుడు ఎవరో, ఏదో దేశమో మనల్ని రానివ్వటం లేదనో, మనకు వీసాలివ్వటం లేదనో బాధ వ్యక్తం చేయడం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ వేగంగా దూసుకువెళ్తున్న భారత్‌కు ఈ మేధో వలసలను అడ్డుకోవటం అత్యంత ఆవశ్యకం. ఆ అవకాశం ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ద్వారా లభిస్తోంది. దీన్ని ఏ విధంగా మనకు అనుకూలంగా మార్చుకుంటారన్నది మన ఐటి కంపెనీలు, మన ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది.

ఏమిటీ వీసా?
అమెరికాలో హెచ్1బి వీసా ఒక ప్రవాసేతర వీసా. అమెరికా రాజ్యాంగంలోని 101(ఏ)(15)(హెచ్) అధికరణం పరిధిలో జారీ చేసే వీసా ఇది. తాత్కాలిక నియామకాల ప్రాతిపదికన ప్రత్యేకమైన వృత్తులలో నైపుణ్యం ఉన్న విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ఆయా కంపెనీలకు అనుమతిస్తుంది. ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, భౌతిక, గణిత శాస్త్రాలు, బయోటెక్నాలజీ, వైద్యం, విద్య, న్యాయశాస్త్రం, ఆర్థిక నిర్వహణ వంటి అనేక నిర్దేశిత విభాగాల్లో ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉండాలి. ఈ వీసాతో మూడేళ్లపాటు అమెరికాలో ఉండవచ్చు. లేదా పొడిగింపు సాధించినట్లయితే ఆరేళ్లపాటు ఉండవచ్చు. లాభాపేక్ష లేని పరిశోధనాసంస్థలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి పట్ట్భద్రులైన విదేశీయులకు హెచ్1బి వీసా పరిమితులను మినహాయించి వీసాలను ఇవ్వటానికి చట్టం అనుమతిని ఇస్తుంది. వీసాలను ఆమోదించే విధానం సదరు కంపెనీ యాజమాన్యం ఇచ్చే ధ్రువీకరణ పైనా, ఉద్యోగం కోరుకునే విదేవీయుడు సమర్పించిన పత్రాలపైనా ఆధారపడి ఉంటుంది. ఈ వీసా పొందిన వాళ్లు ఏ కంపెనీ అయితే తమను స్పాన్సర్ చేసిందో ఆ కంపెనీ తన దరఖాస్తులో పేర్కొన్న పనులను మాత్రమే చేయాలి. ఒకవేళ ఆ కంపెనీ యజమాని అంగీకరించినట్లయితే అప్పుడు ఒకరి కంటే ఎక్కువ కంపెనీలలో పనిచేయవచ్చు. అయితే ప్రతి కంపెనీ కూడా 1-129 ధ్రువీకరణ పత్రాన్ని సదరు ఉద్యోగికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీసా దారులు వైద్యపరమైన సంరక్షణ కోసం, సామాజిక భద్రత కోసం పన్నులను చెల్లించాలి. హెచ్1బి వీసా కోసం వసూలు చేసిన ఫీజును అమెరికా శ్రామికుల విద్య, శిక్షణ కోసం వినియోగిస్తారు. ఈ వీసాలపై ఏటా అమెరికా సుమారు 284మిలియన్ డాలర్లను సేకరిస్తోంది.
ఇవీ ప్రత్యామ్నాయాలు
హెచ్1 బి వీసా విధానం కఠినమైతే అమెరికాలో ఉద్యోగాలను కోరుకునే వారికి ప్రత్యామ్నాయం ఏమిటన్నది ఇప్పుడు తాజాగా తలెత్తిన సమస్య. దీనికి రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
ఉన్నత విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, లాభాపేక్ష లేని ప్రభుత్వ పరిశోధన సంస్థల్లో ఉద్యోగం పొందితే హెచ్1బి వీసాతో సంబంధం లేకుండా అమెరికా వెళ్లే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం పిహెచ్‌డి అర్హత తప్పనిసరిగా ఉండాలి.
ఒకవేళ పిహెచ్‌డి అర్హత లేకుండా సాధారణ డిగ్రీతోనే అమెరికాకు వెళ్లాలంటే ఐచ్ఛిక ప్రయోగ శిక్షణ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అన్న అవకాశం అందుబాటులో ఉంది. ముందుగా ఎఫ్-1 విద్యార్థి వీసాతో తొమ్మిది నెలల కంటే ఎక్కువ కాలపరిమితి ఉండే కోర్సుల్లో అడ్మిషన్ పొందాలి. ఇందులో ఉత్తీర్ణత సాధించి, సదరు కోర్సుకు సంబంధించిన సంస్థల్లో ప్రాక్టికల్ శిక్షణ కోసం అనుమతి పొందాలి. సాధారణ డిగ్రీ అభ్యర్థులు ఏడాది పాటు ఈ ఓపీటీ కోసం తాము చదువుకున్న కోర్సుకు సంబంధించిన సంస్థల్లో చేరవచ్చు. డఉ విభాగాల్లో గరిష్ఠంగా మూడేళ్లు శిక్షణ తీసుకునే అవకాశముంది. ఈ సంస్థల్లో మెరుగైన పనితీరును కనబరిస్తే ఆ కంపెనీ ఇచ్చే స్పాన్సర్‌షిప్ లెటర్ ద్వారా హెచ్1బి వీసా కూడా సంపాదించవచ్చు.

హెచ్1బి వీసా దరఖాస్తుకు అయ్యే రుసుము (సుమారుగా)
దరఖాస్తు ఫారం : 325 డాలర్లు
ఏఐసిడబ్ల్యుఏ రుసుం : 750 నుంచి 1500 డాలర్లు
మోసాల నిరోధ రుసుం : 500 డాలర్లు
114-113 చట్టాలు వర్తిస్తే దాని రుసుం : 4000 డాలర్లు
ప్రాసెసింగ్ ఫీజు: 1225 డాలర్లు
ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఫీజు : 500 నుంచి 3000 డాలర్లు

- కోవెల సంతోష్‌కుమార్