ఈ వారం స్పెషల్

జెఫ్ బెజొస్ అపర కుబేరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనలే అతడి పెట్టుబడి...
ఉయ్యాల తొట్టెలో పడుకున్న వయసులో...
ఉన్నత విద్య చదివేటప్పుడు...
ఉద్యోగం చేసేటప్పుడు... ఎప్పుడైనా సరికొత్త ఆలోచనలే అతడిని నడిపించాయి.
ప్రపంచం ‘ఔరా’ అని అతడివేపు చూసేటట్టు చేశాయి.
పనిచేయడంలోను...
పనిచేయించడంలోను..
కలలు కనడంలోను..
కలల సాకారానికి ప్రయత్నించడంలోను అతడిది విభిన్నశైలి...ఇంటర్నెట్... ప్రపంచానికి పరిచయమయ్యాక, ఆ కొత్త మాధ్యమంలో వ్యాపారాన్ని జోడించిన అతడి తెలివికి దక్కిన మూల్యం.. అపర కుబేరుడిగా ఎదగడమే. ఈ ఏడాది జూలై 27న కొద్ది గంటలపాటు అతడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా రికార్డు నమోదు చేశాడు. చాలాకాలంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న బిల్‌గేట్స్‌ను తోసిరాజని ఆ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఆ తరువాతి ‘స్టాక్’ పరిణామాల్లో తేడావచ్చి రెండో స్థానానికి చేరుకున్నాడు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం తొలిసారిగా బిలియనీర్‌గా గుర్తింపు దక్కించుకున్న అతడి పేరు జెఫ్ బెజొస్. ఆన్‌లైన్ రిటైల్ వ్యాపార సంస్థ ‘అమెజాన్’ అధిపతి, కార్యనిర్వహణాధికారి. 53 సంవత్సరాల జెఫ్ బెజొస్ ఆలోచనలు, పనిచేసే తీరు, విభిన్నమైన వ్యక్తిత్వాన్ని చాటుతాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం భవిష్యత్‌లో అత్యంత సంపన్నుడిగా తొలిస్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమే. గడచిన ఐదేళ్లుగా అతడి అమెజాన్ ఆర్థికంగా సాధిస్తున్న ఫలితాలే అందుకు కారణం.
ఇదీ నేపథ్యం..
ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా బిల్‌గేట్స్‌కాక మరొకరి పేరు వినడం అరుదు. కొద్ది గంటలే అయినా జెఫ్ బెజొస్ ఆ స్థానంలో నిలబడటం ప్రపంచాన్ని ఆకర్షించింది. దాతృత్వంలో బిల్‌గేట్స్ సహా చాలామంది సంపన్నులతో పోలిస్తే బెజొస్ వెనుకబడిన వ్యక్తి. అందువల్ల మునుముందు ఆయన సంపద అమాంతం పెరుగుతూ అపర కుబేరుడిగా అగ్ర స్థానాన్ని సంపాదించడం కష్టమైన పనేం కాదన్నది అంచనా. దీర్ఘకాల వ్యూహాలు, వినియోగదారుడి సంతృప్తే లక్ష్యంగా, కఠినంగా వ్యవహరించే ‘బాస్’గా తీసుకునే నిర్ణయాలు అతడిని ఈ స్థానానికి తీసుకువచ్చాయి. ప్రస్తుతం అతడి సంపద 87 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. బిల్‌గేట్స్ సంపద సుమారు 90 బిలియన్ యుఎస్ డాలర్లు. ప్రస్తుతం అతడి ‘అమెజాన్ డాట్ కామ్’ వృద్ధి ఇలాగే కొనసాగితే ఒకటి రెండేళ్లలో అతడే నెంబర్‌వన్ స్థానాన్ని అధిష్ఠించడం ఖాయం. వరల్డ్‌వైడ్ వెబ్‌లో ఆన్‌లైన్ షాపింగ్ రిటెయిలర్ సంస్థల్లో అమెజాన్ అతిపెద్దది. అలాగే జెఫ్ బెజొస్‌కి చెందిన ‘క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సర్వీసెస్’ కూడా ఆ తరహా సేవలందిస్తున్న అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్. ఇక అతడి ‘బ్లూ ఆరిజన్’ సంస్థ ప్రపంచంలో ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లి, తీసుకువచ్చే పర్యటనలు నిర్వహించేందుకు ఉద్దేశించినది. ఇది తొలి ప్రైవేట్ అంతరిక్ష వాహక నిర్వహణ సంస్థ. అమెజాన్ ఆదాయంలో వేలాది కోట్ల డాలర్లను ఏటా ‘బ్లూ ఆరిజన్’కు మళ్లిస్తున్న జెఫ్ బెజొస్ కల ఏమిటో తెలుసా? పచ్చగా కళకళలాడే భూమిని ‘ప్రకృతి కేంద్రం’గా కాపాడుకోవాలని, నీలిమేఘాలను దాటి అంతరిక్షంలోని గ్రహాలు, చివరకు ఆస్టరాయిడ్స్‌పైనైనా సరే కొన్ని కాలనీలు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, ఇళ్లు, హోటళ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఇది అతడికి చిన్నప్పుడే వచ్చిన ఆలోచన. హైస్కూల్ విద్య అభ్యసించేటప్పుడు తోటి విద్యార్థులతోను, ఉపన్యాస పోటీల్లోను, కాలేజీ విద్య చదివేటప్పుడు ప్రయోగాల సందర్భంగాను అతడు చెప్పిన మాటలు ఇవి. వాటినే ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకువచ్చాడు జెఫ్. ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి ప్రఖ్యాత దినపత్రికను కొనుగోలు చేసి పత్రికారంగంలోనూ అడుగుపెట్టిన జెఫ్ విభిన్నమైన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా నివసిస్తున్న ఇళ్ల సమీపంలోని అత్యంత విలాసవంతమైన, అతిపెద్ద భవంతిని కొనుగోలు చేసిన జెఫ్ భార్య, నలుగురు పిల్లలతో కలసి ఉంటున్నాడు.
తాతే స్ఫూర్తి..
టెడ్ జొర్గెన్‌సెన్, జాక్లిన్ బెజొస్ దంపతుల గారాల పుత్రుడు జెఫ్ బెజొస్. 1964 జనవరి 12న అల్‌బుకరెక్‌లో పుట్టాడు. పదిహేడేళ్ల వయసులో జాక్లిన్ జెఫ్‌కు జన్మనిచ్చింది. మరుసటి ఏడాది భర్తనుంచి విడాకులు తీసుకుంది. క్యూబా నుంచి వలస వచ్చిన మైగల్ బెజోస్‌ను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల జెఫ్ బెజొస్‌ను సవతి తండ్రి మైగల్ దత్తత తీసుకున్నాడు. చిన్నప్పటి నుంచి చురుకుగా ఉండే జెఫ్‌కు సైన్స్ అంటే పిచ్చి. ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు అందులోంచి బయటపడేందుకు స్క్రూడ్రైవర్‌తో ఊచలు తొలగించిన వైనం అందరినీ సంభ్రమాశ్యర్యాలకు గురిచేసింది. ప్రాథమిక విద్య చదువుకునే రోజుల్లో తమ్ముళ్లు అల్లరి చేయకుండా ఓ అలారమ్‌ను గదిలోపెట్టి భయపెట్టిన చిచ్చరపిడుగు జెఫ్. వేసవి సెలవుల్లో తాతగారింటికి పంపేవారు. అతడి తాత అమెరికా అణుశక్తి సంస్థలో పెద్ద ఉద్యోగి. ఆయనతో గడపడం వల్ల చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే ఆసక్తి పెరిగింది. హైస్కూల్ చదువులోనూ కళాశాల తరపున సైన్స్‌పై ఎన్నో అంశాల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. సరికొత్త ఆలోచనలను విశదీకరించేవాడు. ‘స్టూడెంట్ సైన్స్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్’కు నాయకత్వం వహించాడు. యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా నుంచి 1982లో ‘సిల్వర్ నైట్’ అవార్డును పదిహేడేళ్లకే అందుకున్న మేధావిగా పేరుపొందాడు.
మార్పు అక్కడి నుంచే..
ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జెఫ్ బెజొస్ ఉద్యోగాలకోసం వేట మొదలెట్టాడు. 1986లో మొదట వాల్‌స్ట్రీట్‌లోని సంస్థల్లో పనిచేశాడు. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో పనిచేసిన తరువాత బ్యాంకర్స్ ట్రస్ట్‌కు సేవలందించాడు. ఆ తరువాత ఫండింగ్ సంస్థ డి.ఇ.షా కంపెనీలో చేరాడు. అక్కడ ఉండగానే సహచరి మెకన్జీతో ప్రేమలోపడి వివాహం చేసుకున్నాడు. ఆమె మంచి నవలా రచయిత. అక్కడ పనిచేస్తుండగానే అతడికి ఇంటర్నెట్ విస్తరించడం, ప్రపంచంలో నలుమూలలకూ పరిచయం అవడం గమనించాడు. దంపతులిద్దరూ కలసి ఇంటర్నెట్ ఆధారిత రిటెయిల్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో దీర్ఘకాల వ్యూహాలను సిద్ధం చేశారు. న్యూయార్క్ నుంచి సియాటెల్ వరకు విస్తృత పర్యటనలు చేసి మార్కెట్‌ను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఉద్యోగానికి తిలోదకాలు ఇచ్చి తన ఇంటిలోని గ్యారేజ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అమెజాన్ డాట్ కామ్‌ను ఆవిష్కరించాడు. ఏ ప్రచార ఆర్భాటం లేకుండా కేవలం ‘వౌత్ పబ్లిసిటీ’తో తొలి నెలలోనే మంచి ఆదరణ లభించడంతో ఇక తిరుగులేదనుకున్నాడు. నెమ్మదిగా విస్తరణ దిశగా అడుగులు వేశాడు.
పుస్తకాల పిచ్చి..
జెఫ్ బెజొస్‌కు పుస్తకాలంటే ఇష్టం. చదవడం మరీ ఇష్టం. ఇప్పటికీ తన ఉద్యోగులను పుస్తకాలను చదవమని సూచిస్తుంటాడు. కార్యాలయంలో జరిగే భేటీకి సిద్ధమయ్యేందుకు తగిన పుస్తకాలను చదవమని సూచిస్తుంటాడు. అమెజాన్ డాట్ కామ్ పెట్టిన తరువాత ఏయే వస్తువులు విక్రయించాలో ఓ చిత్తు జాబితాను తయారు చేశాడు. వడపోత తరువాత సుమారు 20 రకాల వస్తువులను ఎంపిక చేసుకున్నాడు. చివరకు పుస్తకాలను విక్రయించాలని నిర్ణయించాడు. ప్రస్తుతం ఆన్‌లైన్ పుస్తకాల విక్రయ సంస్థల్లో అమెజాన్ అగ్ర స్థానంలో ఉంది. విశేషం ఏమిటంటే ఈ సంస్థ దేనినీ ముందుగా సిద్ధంగా ఉంచుకోదు. ఆర్డర్ బుక్ అయ్యాకే సేకరించి సరఫరా చేస్తుంది. అమెజాన్ డాట్ కామ్ ఏర్పడిన తొలిరోజుల్లో ఓ గమ్మత్తయిన సంప్రదాయం పాటించేవారు. ఆర్డర్ బుక్ అయినప్పుడల్లా కార్యాలయంలోని ఓ గంట మోగేది. అతి కొద్దిరోజుల్లోనే ఆ గంట మోగడానికి విరామం దొరకని పరిస్థితి ఏర్పడటంతో ఆ సంప్రదాయాన్ని రద్దు చేశారు. ఒకప్పుడు పుస్తకాల విక్రయం కోసమే ఏర్పాటు చేసిన అమెజాన్ ఇప్పుడు అమ్మని వస్తువు లేదు. చివరకు ద్రోన్‌లను కూడా విక్రయించబోతోంది. అమెజాన్ లోగో అంతరార్థం అదే. అమెజాన్ నదీ ప్రవాహాన్ని పోలిన పాయ, స్మైలీ ఎండ్‌తో ముగిసేటట్టు ఉంటుంది. పాయ ఎ వద్ద మొదలై జడ్ వద్ద అంతవౌతుంది. అంటే ఎ టు జడ్ వరకు అన్నీ తమ వద్ద దొరుకుతాయన్నది ఆ లోగోకు అర్థం.
అబ్రకదబ్ర నుంచి..
జెఫ్ బెజొస్ తన ఆన్‌లైన్ రిటెయిల్ సంస్థను ఏర్పాటు చేయాలనుకున్న తరువాత ఏం పేరుపెట్టాలా? అని ఆలోచించాడు. మొదట ‘అబ్రకదబ్ర’ అన్న పదాన్ని తన స్నేహితుడైన లాయర్‌కు సూచించాడు. అయితే ఆ పదాన్ని సరిగా వినిపించుకోని లాయర్ ‘కడవద్ర’ అని అనుకుని బాగోలేదన్నాడు. ఆ తరువాత ‘రెలెంట్‌లెస్ డాట్ కామ్’ అని పెడదామనుకున్నారు. చివరకు విశాలమైన, పొడవైన, అందరికీ తెలిసిన, ఎన్నో జీవరాశులకు ఆలవాలమైన అమెజాన్ నది పేరు పెట్టాలనుకున్నాడు. తొలినాళ్లలో లోగో కూడా కేవలం పుస్తకాల కోసమేనన్నట్లు రూపొందించారు. ఆ తరువాత మార్పులు చేశారు.
కఠినమైన బాస్
ప్రపంచంలో అతి కఠినమైన, దుర్మార్గమైన బాస్‌గా జెఫ్ బెజొస్‌కు పేరుంది. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందితే అందుకు కారకుడైన ఉద్యోగి, అతడి పై బాధ్యులకు చివాట్లు, ఉద్వాసనలు తప్పవు. వినియోగదారులనుంచి నేరుగా ఫిర్యాదులు లేదా సమాచారాన్ని అందుకునే ఏర్పాటు అమెజాన్‌లో ఉంది. గట్టిగా అరవడం, చేయిచేసుకునే విధంగా వ్యవహరించడం అతడి అలవాటని అంటారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ‘ఇవాళ నిద్రపోవడానికి పిల్స్ వేసుకోకతప్పదా?’ అంటూ తోటి ఉద్యోగులపై చిందులు తొక్కడం అతి సాధారణం అని చెబుతారు. ఇతర టెక్ సంస్థలతో పోలిస్తే అమెజాన్‌లో చేరికలు, ఉద్వాసనలు లేదా పదవీ విరమణలు ఎక్కువే. అమెజాన్‌లో ‘డోర్‌డెస్క్’లు, ‘టు పిజ్జా’ విధానం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. తక్కువ ఖర్చుతో, తేలికపాటి కలపతో, హంగులు లేని డెస్క్‌లను అమెజాన్ వాడుతుంది. వాటిని విక్రయిస్తుంది కూడా. అలాగే సరికొత్త ఆవిష్కరణలు, విధుల నిర్వహణకు చిన్నచిన్న బృందాలు ఉంటే చాలన్నది బెజోస్ విశ్వాసం. ఆ బృందంలో ఎందరు సభ్యులుండాలీ అంటే రెండు పిజ్జాలు ఎంతమందికి సరిపోతాయో అందరుంటే చాలన్నది అతడి సూత్రం. మహా అయితే పదిమందికి మించని చిన్నచిన్న బృందాలుగా పనిచేయాలన్నది అతడి ఆలోచన. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌తో సమావేశాల్లో వివరణలు ఇవ్వడానికి అతడు వ్యతిరేకి. తన ఉద్యోగులు సమావేశాలకు తప్పనిసరిగా పేపర్‌పై పెన్‌తో రాసి, నోట్స్‌తో సిద్ధమవ్వాల్సిందే. సమావేశానికి అరగంట ముందు వచ్చి పుస్తక పఠనంలో మునిగి తేలాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. తల్లితరపు తాత సంపన్నుడే. యుక్త వయసు వచ్చేసరికి టెక్సాస్‌లో దాదాపు 25వేల ఎకరాల రాంచ్ (ఏకముక్క భూభాగం) ఉండేది. ఇప్పుడు మరిన్ని భూములు సేకరించాడు. విస్తృతమైన, వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనులకు ఆ స్థలాలను వినియోగిస్తున్నాడు. బ్లూఆరిజన్, థౌజండ్ ఇయర్స్ వాచ్ వంటి వినూత్న కార్యకలాపాలు ఇప్పుడు ఊపందుకున్నాయి. సియాటెల్‌లోని అతడి కార్యాలయంలో ముందరి గదిలోనే ‘ఐస్ ఏజ్’ నాటి ‘కేవ్ బేర్’ కళేబరాన్ని ఉంచాడు. ఆ కళేబరం కాస్త భయపెట్టేదిగానే ఉంటుంది. ‘ఆహారం అందించకండి’ అన్న ట్యాగ్‌లైన్ అక్కడ పెట్టి ఉంటుంది. భూగోళాన్ని, జీవజాతులను పరిరక్షించాలన్నది అతడి తపన. అన్నట్లు సొంత విమానంలో వెళుతూ ఓసారి ప్రమాదానికి గురైన బెజొస్ దాదాపు మృత్యువు అంచుల్లోకి వెళ్లి బయటపడ్డాడు. ప్రస్తుతం తన కలల పథకమైన ‘బ్లూ ఆరిజన్’పై దృష్టిపెట్టాడు.
అంతా రహస్యం
‘రహస్యం’ అతడికి ఇష్టమైన విధానం. అమెజాన్ ఆవిష్కరణ దగ్గర నుంచి బ్లూ ఆరిజన్ వరకు చాలాకాలం రహస్యంగానే కొనసాగించాడు. తన కారులో వెళుతూ అమెజాన్ ఆర్డర్లను స్వీకరించిన స్థితి నుంచి ఎదిగిన బెజొస్‌కు నలుగురు పిల్లలు. వీరిలో ముగ్గురు మగ పిల్లలు. ఒకఅమ్మాయని చైనానుంచి దత్తత తీసుకున్నారు. వీరి వయసు 12 నుంచి 16 సంవత్సరాల లోపు ఉంటుంది. వారెలా ఉంటారు? ఏం చేస్తుంటారన్నది బాహ్య ప్రపంచానికి తెలియదు. తన ఇమేజ్‌కు దూరంగా, స్వతంత్రంగా వారిని పెంచడం జెఫ్‌కు ఇష్టం. ఏడాదికి ఒకసారి అన్నదమ్ములు, తాత, భార్య బంధువులతో కలసి టూర్‌కు వెళుతూంటాడు. టెక్సాస్‌లో ఓ కొండపై ఏర్పాటు చేయనున్న ‘్థజండ్ ఇయర్స్’ వాచ్ ప్రాజెక్టుకు రూపకర్త. ఏడాదికి ఒకసారి తిరిగే చిన్న ముల్లు, వందేళ్లకు ఒకసారి తిరిగే పెద్దముల్లు ఉంటాయ. వెయ్యేళ్లు పూర్తయనప్పుడు ఓ పక్షి బయటకు వచ్చి కనపడుతుంది. ఈ వాచ్ భావితరాలకు మన గుర్తుగా ఆయన భావిస్తాడు.
బిలయనీర్‌గా..
అమెజాన్ పెట్టిన తరువాత చాలాఏళ్లు నష్టాలను చవిచూసింది. అయితే 1998లో ఐపిఒ తరువాత 1.6 బిలియన్ యుఎస్ డాలర్ల ఆదాయం సముపార్జించింది. 2007 నాటికి 4.4. బిలియన్ డాలర్లు, 2012 నాటికి 18.4 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో ప్రపంచంలో 27వ స్థానాన్ని జెఫ్ బెజొస్ సాధించాడు. ఆ తరువాతి ఏడాది నుంచి అమెజాన్ విజృంభణ మొదలైంది. గడచిన రెండేళ్లలో 65 బిలియన్ డాలర్ల సంపదను అమెజాన్ కూడబెట్టింది. దీంతో ఈ ఏడాది జులై 27న అమెజాన్ షేర్ల విలువ అమాంతం పెరిగింది. దాదాపు 90 బిలియన్ డాలర్ల విలువైన సంపదతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను వెనక్కి నెట్టేసి జెఫ్ బెజొస్ తొలిస్థానం ఆక్రమించాడు. అయితే అదే రోజు సాయంత్రానికి అమెజాన్ షేర్ల విలువ కాస్త తగ్గడంతో రెండోస్థానానికి పడిపోయాడు. ప్రపంచ సంపన్నుల్లో పేరెన్నికగన్న గేట్స్, బఫెట్, జుకర్‌బర్గ్ వంటి దిగ్గజాలు తమ ఆదాయంలో చాలాభాగం దాతృత్వ కార్యక్రమాలకు ఇస్తున్నారు. దాంతో సంపద విలువ పెరుగుదల తగ్గుతోంది. వీరితో పోలిస్తే జెఫ్ కాస్తంత పిసినారే. ఒకటి రెండు సందర్భాల్లో మినహా దాతృత్వ కార్యక్రమాలకు ఇతడు వెచ్చించినది తక్కువే. అమెజాన్ వృద్ధి ఇలాగే సాగితే మళ్లీ అగ్రస్థానం దక్కడం కష్టమేమీకాదు. అయితే సియాటెల్‌కు చెందిన ఎంటర్‌పెన్యుయర్ జాకీ అంచనా ప్రకారం బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్‌ల సంపద కలిపితే ఉన్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ రష్యా అధినేత పుతిన్‌కు ఉంది. అమెరికా కాంగ్రెస్ సభ్యుడి నివేదికలో పుతిన్‌కు 200 బిలియన్ యుఎస్ డాలర్ల సంపద ఉందని పేర్కొన్నట్లు హెర్మిటేజ్ కేపిటల్ మేనేజ్‌మెంట్ మాజీ సిఇఒ బిల్ బ్రౌడెన్ అంటున్నారు.

అంతరిక్షంలో ఆవాసం
బ్లూ ఆరిజన్
అంతరిక్షంలోకి వెళ్లిరావడం అన్నది ఇంతవరకు ప్రభుత్వ సంస్థలే నిర్వహిస్తున్నాయి. భారీ వ్యయం, భూ వ్యతిరేక వాతావరణంలో మనగలగడం వంటి సమస్యల నేపథ్యంలో అతి తక్కువ దేశాలే అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగ పర్యటనలు నిర్వహిస్తున్నాయి. అయితే భూకక్ష్యలో పర్యటించి వచ్చేందుకు డబ్బులు చెల్లించగలిగి, ఇష్టం ఉన్న వ్యక్తులకు ఆ అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజన్’ అనే ప్రైవేట్ ఏరో స్పేస్ సంస్థను నెలకొల్పాడు. తనకున్న వేలాది ఎకరాల స్థలానికి మరికొంత సేకరించి ప్రయోగాలు మొదలెట్టాడు. 2000 సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టాడు. భూకక్ష్యలోను, మార్స్, చంద్రుడు, చివరకు ఆస్టరాయిడ్స్‌పైనైనా నివాసం ఉండే కనీసం చూసి వచ్చేలా ట్రిప్‌లు నిర్వహించాలన్నది అతడి యోచన. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కోసం ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీగా దీనిని మొదలెట్టాడు. ఎన్నో పరిశోధనలు, ప్రయోగాల తరువాత 2015లో తొలిసారిగా ఒక కాప్స్యూల్ మానవరహితంగా భూకక్ష్యలోకి వెళ్లి సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజా విజయంతో ఉత్సాహం మీదున్న జెఫ్ పరిమిత బృందంలో పరిశోధనలు నిర్వహిస్తున్నాడు. ఏటా లక్షలాది అమెజాన్ షేర్లు విక్రయించి కోట్లాది డాలర్లను ఈ ప్రాజెక్టుకోసం కేటాయిస్తున్నాడు. 2006 వరకు అంతా రహస్యంగా సాగిన ఈ ప్రాజెక్టు ఆ తరువాత వెలుగులోకి వచ్చింది. కనీసం 20 లేదా 30 లక్షల మందిని అంతరిక్షంలో నివసించేలా ప్రాజెక్టులు నిర్మించాలన్నది ఆయన కల. సైన్స్ అన్నా, అంతరిక్ష ప్రయాణం అన్నా అతడికి పిచ్చి. హైస్కూలు విద్య అభ్యసించేటప్పుడే తన కలలను విడమర్చి చెప్పిన జెఫ్ హాలీవుడ్ సినిమా సిరీస్‌లో ‘స్టార్‌టెక్ బియాండ్’లో ఏలియన్ పాత్రలో నటించాడు.

-కృష్ణతేజ