ఈ వారం స్పెషల్

అందలమెక్కిన అందరివాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొన్నటికి మొన్న..
వెంకయ్య కాదన్నా..
అ తరువాత మోదీ అన్నట్లు..
అనుకున్నట్లు..
‘ఉషాపతి’ .. ఉపరాష్టప్రతి అయ్యారు..
వాక్పటిమ, సంభాషణా చతురత కలబోసిన నిండైన తెలుగువాడు వెంకయ్య.. ఇప్పుడు పెద్దలసభకు పెద్దరికం వహించబోతున్నారు.. తెలుగు రాష్ట్రాల పెద్దదిక్కుగా వ్యవహరించిన ఈ పెద్దాయన ఇప్పుడు రాజ్యసభకు రారాజు.. వస్తధ్రారణ.. అనర్గళ ప్రసంగధార ఆయనకు పేరుతెచ్చిపెట్టాయి. మారుమూల పల్లెలో పుట్టినా స్వయంకృషితో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలలో తలలో నాలుకలా వ్యవహరించిన వెంకయ్యపై పెద్దబాధ్యతే పడింది. తెలుగువారికి గర్వకారణమైన ఆ అవకాశం అయిష్టంగానే స్వీకరించిన వెంకయ్య ఇన్నాళ్లూ నెరపిన కార్యదక్షత మరోరూపంలో దర్శనమివ్వబోతోంది. చలోక్తులు, గలగలా మాట్లాడటం, ఎత్తిపొడుపులు, మాటల తూటాలు పేల్చడాలు తగ్గి హుందాతనం, రాజనీతిజ్ఞత కలబోసిన సరికొత్త అవతారంలో ఆయన కనిపించవచ్చు. నిజానికి రాష్టప్రతి పదవికి అభ్యర్థుల ఎంపిక సమయంలో వెంకయ్య పేరు వినవచ్చింది. చివరకు ఉపరాష్ట్ర పదవి వరించింది.
***
మారుమూల పల్లెలో పుట్టినవారైనా మన దేశంలో ఎంతటి ఉన్నత పదవినైనా అధిష్ఠించే అవకాశం ఉంది. దేశ అత్యున్నత పదవులకు ఎదిగేందుకు ప్రతి ఒక్కరికీ వీలున్న ప్రజాస్వామ్య వ్యవస్ధ మనది. లేకుంటే ఎక్కడో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ దేశ ఉప రాష్టప్రతి అయ్యేవారా? ఎవ్వరైనా, ఏదైనా తలుచుకుంటే సాధించవచ్చా? అంటే ఔనని వెంకయ్యను చూసి చెప్పొచ్చు. ఆ విషయాన్ని ఆయనే చెప్పకచెప్పారు. 1998లో తొలిసారి రాజ్యసభలో ప్రవేశించినపుడు ‘నేను ఈ సభకు నేతృత్వం వహించే రోజు వస్తుందని అనుకోలేదని’ చెప్పారు. ఇదే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గొప్పదనం. ఆయనకు ఈ పదవి మామూలుగా రాలేదు, తన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడానికి చాలా కష్టపడ్డారు.
సుడిగాలి పర్యటనల్లో దిట్ట
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలను అతి వేగంగా పర్యటించిన వ్యక్తిగా వెంకయ్య రికార్డు సృష్టించారు. కొన్ని జిల్లాలను ఆయన గరిష్ఠంగా పదిసార్లు సైతం పర్యటించారు. ఒకే రోజు నాలుగైదు రాష్ట్రాలు తిరుగుతూ పత్రికా విలేకరులతో సంభాషిస్తూ ప్రభుత్వ విధానాలను విడమరచి చెప్పేవారు. విమర్శలకు పదునైన మాటలతో, ఘాటైన విమర్శతో దీటైన సమాధానం ఇవ్వడంలో దిట్ట.
నెల్లూరు నుంచి..
నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడు జీవితం నిత్యజీవన పోరాటమే. ఆ పోరాటమే అతడిని రాజకీయ దురంధరుడిగా తీర్చిదిద్దింది. ఎపుడూ తెల్లని ఫుల్‌షర్టు, అడ్డపంచెతోనే దక్షిణాది లుక్‌లోనే కనిపించే వెంకయ్యనాయుడును కేవలం ఒక కులం వారే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు తమ వాడిగానే వెంకయ్యను భావిస్తారు. దానికి కారణం విపక్షాల నాయకులను సైతం ఆయన శతృవులుగా ఎన్నడూ చూడకపోవడమే. పార్టీ నాయకులకు వీర విధేయుడు, అజాతశత్రువు.
అందమైన అంత్యప్రాసలకు, అనర్గళ ఉపన్యాసాలకు వెంకయ్య పెట్టింది పేరు. మాతృభాష కాని హిందీలోనూ అనితరసాధ్యమైన మాటల తూగు.. పదాల విరుపులతో ఉత్తరాదివారిని సైతం ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు. రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు. పార్టీ అగ్రనేతల పోస్టర్లు అతికించే స్థాయి నుండి అదే పార్టీకి రెండు మార్లు అధ్యక్షుడైన రాజకీయ కృషీ వలుడు. ఇంతటి సమర్ధుడిని అకస్మాత్తుగా మంత్రిపదవి నుండి తప్పించి ఉప రాష్టప్రతిగా ఎందుకు నిలిపినట్టు ....అందరిదీ ఇదే ప్రశ్న..
వచ్చే ఎన్నికల్లో ఎక్కువ తక్కువలు జరిగితే ఉప రాష్టప్రతి హోదాలో చైర్మన్‌గా రాజ్యసభను గాడిలో పెట్టి ప్రభుత్వానికి ఊతం ఇవ్వగలిగే సమర్ధత వెంకయ్యకే ఉందని పార్టీ నమ్మకం. వెంకయ్యను ఉప రాష్టప్రతి పదవికి కలిసికట్టుగా ఎంపిక చేయడం వెనుక పెద్ద కథే నడిచిందనేది ఎనలిస్టుల వాదన. బిజెపిలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాత అంత పాపులర్ లీడర్ వెంకయ్యనాయుడే. ప్రధానమంత్రి అయ్యే సామర్ధ్యం ఉన్నవాడు, తెలివితేటలు, అనుభవం ఉన్న వాడు కూడా వెంకయ్యనాయుడే. పార్టీలో అత్యంత సీనియర్ కూడా ఆయనే. పార్టీలోగాని, ఆర్‌ఎస్‌ఎస్‌లోగాని వెంకయ్యనాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడేవారే లేరు. ఇన్ని అనుకూల పాయింట్లు ఉన్న వెంకయ్యనాయుడును తెలివిగా ప్రధాన స్రవంతి నుంచి పక్కకు మళ్లించారని చెప్పేవారూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఎన్‌డిఎ ఫలితాలు అటూ ఇటూ అయితే నరేంద్రమోదీ స్థానంలో వెంకయ్య పేరు తెరమీదకు వచ్చే అవకాశం లేకపోలేదని, దానిని ముందే పసిగట్టి ఆయనను ఉప రాష్టప్రతి చేశారన్నది విశే్లషకుల మాట.

దక్షిణాదిలో బిజెపికి పెద్ద దిక్కు వెంకయ్యనాయుడే. ఏ పదవిలో ఉన్నా వారం వారం దక్షిణాది రాష్ట్రాలలో పర్యటించే అలవాటున్న వెంకయ్య పార్టీని ఎదగకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. సౌత్ స్టేట్‌లకు ఢిల్లీలో వాయిస్ వెంకయ్యనాయుడే. తమిళనాడులో జయలలిత మరణించిన వెంటనే అక్కడ అల్లర్లు జరగకుండా నివారించేందుకు ‘ట్రబుల్‌షూటర్’గా అక్కడికి ప్రధాని మోదీ వెంకయ్యను పంపించారు. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిని చేయడంలో వెంకయ్య తన చతురతను ప్రదర్శించారు.
నెల్లూరు నుంచి..
వెంకయ్యనాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంలో 1949 జూన్ 1న జన్మించారు. ఆయన పుట్టిన ఏడాది మూడు నెలలకే ఒక ప్రమాదంలో తల్లి రమణమ్మ మరణించారు. తల్లి ముఖం కూడా స్పష్టంగా గుర్తులేని పిల్లవాడిగా పెరిగిన వెంకయ్య అమ్మమ్మ ఊరు మంగళగుంటకు చేరుకున్నారు. మేనమామ ఇంట్లో పెరిగారు. సమీపంలోని కసుమూరు పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేశారు. నిత్యం మూడు కిలోమీటర్లు దూరం నడచివెళ్లి ప్రాథమిక విద్య పూర్తి చేశారు. నెల్లూరు వి ఆర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివారు. ఎలాంటి అంశంపైనైనా అలవోకగా సుదీర్ఘంగా గణాంకాలతో మాట్లాడటం అక్కడే అలవాటైంది. వైజాగ్ ఆంధ్రా యూనివర్శిటీలో లా పూర్తి చేశారు. నెల్లూరులో ఉండగానే ఆర్‌ఎస్‌ఎస్‌వైపు ఆకర్షితులయ్యారు. అదే వైజాగ్‌లో విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యేందుకు కారణమైంది. విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ ప్రజాసమస్యలపై దృష్టిపెట్టారు. 1972లో కాకాని వెంకటరత్నం ప్రారంభించిన జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తారు. జైలు జీవితాన్ని గడిపారు.
తెనే్నటి శిష్యరికమే...
రాజకీయ సభల్లో ఎలా మాట్లాడాలో, ఎలాంటి పద ప్రయోగాలు చేస్తే ప్రజల హృదయాలను గెలుచుకోవచ్చో తనకు బోధించింది మాత్రం తెనే్నటి విశ్వనాధం అని వెంకయ్య ఎపుడూ చెప్పేవారు, జైలు జీవితంలో గౌతు లచ్చన్న, తెనే్నటి విశ్వనాధం, చలసాని ప్రసాద్ తదితరులు సహ ఖైదీలు, ఆ సమయంలో వారి జీవితానుభవాల నుండి వెంకయ్య ఎంతో నేర్చుకున్నారు.
రాజకీయ ప్రస్థానం
1974లో లోక్‌నాయక్ జయప్రకాష్‌నారాయణ్ యువజన సంఘర్షణ సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌గా వ్యవహరించారు. విద్యార్థి ఉద్యమం నుండి జనసంఘ్‌కు చేరుకున్న వెంకయ్య తర్వాత అది జనతా పార్టీలో కలవడంతో అక్కడ యువజన విభాగానికి అధ్యక్షుడు అయ్యారు. అక్కడి నుండి ఆయన పార్టీతో అనుబంధం పెరిగింది. ఎబివిపి నాయకుడిగా, బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, బిజెపి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1975లో ఒంగోలులో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత 1978, 83లలో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందారు. స్వల్పకాలంలో శాసనసభ ప్రతిపక్ష నేతగా అదరగొట్టారు. ఆ తర్వాత ఆత్మకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985లో ఎపి బిజెపి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన వెంకయ్య 1988లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 1993 నుండి 2000 సంవత్సరం వరకూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1996 నుండి 2000 సంవత్సరం వరకూ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1998లో కర్నాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2010లో కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
1999లో ఎన్‌డిఎ విజయంతో ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే వెంకయ్య ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని రూపొందించారు. బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాది నుండి పనిచేసిన వారిలో వెంకయ్య రెండో వారు, తమిళనాడులో జన్మించిన తెలుగువాడు జానా కృష్ణమూర్తి, 2003లో వెంకయ్య పార్టీ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2004 జనవరి 28న ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడయ్యారు, 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఆయన పదవికి రాజీనామా చేశారు.
2014 ఎన్నికల్లో బిజెపి ఘనవిజయంతో నరేంద్రమోదీ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగానూ, సమాచార మంత్రిగా, పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రిగానూ , స్వచ్ఛ భారత్ మంత్రిగా వ్యవహరించారు. ఐక్యరాజ్యసమతి ఆవాస సంస్థ చైర్మన్‌గా అంతర్జాతీయ పదవిని కూడా దక్కించుకున్నారు. చివరికి భారత 13వ ఉప రాష్టప్రతిగా ఆగస్టు 11వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.
భావోద్వేగాల నడుమ..
‘పార్టీని తల్లిగా భావించి ఎదిగాను, నేనీ స్థాయికి చేరుకోవడానికి పార్టీయే కారణం, ఉప రాష్టప్రతిగా వెళ్తే తల్లి లాంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది, పార్టీ వదిలి వెళ్తుంటే నాకు మనసు రావడం లేదు’ అంటూ వెంకయ్యనాయుడు చాలా సార్లు భావోద్వేగానికి గురయ్యారు. అయినా పార్టీ ఆదేశాన్ని శిరసావహించి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో పాల్గొన్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా అపుడు విపక్షంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వాదించిన వెంకయ్య, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం విమర్శలకు తావిచ్చింది. ప్రత్యేక హోదా చట్టంలో లేదని, ఒక వేళ ఇచ్చినా రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ అది పరిష్కారం కాదని వ్యాఖ్యానించడం చాలామందిని బాధించింది.
సహాయక సిబ్బందిపై ప్రేమ
ప్రతి రోజు సహాయక సిబ్బందితో పేరు పేరునా పిలిచి మాట్లాడటం వెంకయ్యకు చాలా ఇష్టమైన కార్యక్రమం, చివరికి పాత్రికేయులను సైతం పేరుపెట్టి పిలవడం అలవాటు. ఇటీవల బిజెపి జాతీయ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందిని తన ఇంటికి పిలిచి వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. మరికొందరిని ఆర్థికంగా ఆదుకున్నారు. అంతేకాదు నిరంతరం వెంకయ్య వెన్నంటే ఉండే సత్యకుమార్‌ను బహిరంగ సభలో సత్కారం చేశారు. తనకు వేళాపాళా లేదని, అయినా వారంతా తనను అర్ధం చేసుకుని సేవలు అందిస్తారని చెప్పుకొచ్చారు వెంకయ్య.
మృత్యుంజయుడు
రెండుమార్లు పెనుప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడిన రాజకీయ నేత వెంకయ్యనాయుడు. ఇక చిన్నాచితకా ప్రమాదాలకు లెక్కేలేదు. 2005 జనవరి 29న బీహార్‌లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఆయన హెలికాప్టర్‌కు నిప్పు అంటించారు. అపుడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నారు. వెంటనే ఆయన తేరుకుని తప్పించుకున్నారు. మరోమారు 2007 జూలై 15న ఉత్తరప్రదేశ్ లక్నో విమానాశ్రయం సమీపంలో అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందకు దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డారు.
ఉషాపతి
‘రాష్టప్రతి , ఉప రాష్టప్రతి కాదు, ఉషాపతిగానే హాయిగా ఉన్నాను’ అంటూ తరచూ వెంకయ్యనాయుడు చెప్పేవారు. మంగళగుంటకు చెందిన మరో మేనమామ కుమార్తెనే ఉష. 1971 ఏప్రిల్ 14న వారి వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె దీప వెంకట్ సంతానం.
భావి రాష్టప్రతి?
వెంకయ్యనాయుడు సెంటిమెంట్ చూస్తే రాష్టప్రతి కానున్నారని అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుండి గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి ఉప రాష్టప్రతిగా నియమితులై తర్వాత వారు రాష్టప్రతి అయ్యారు. అదే బాటలో వెంకయ్యనాయుడు కూడా రాష్టప్రతి అవుతారని చెబుతున్నారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించకముందే హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో వక్తలు అంతా వెంకయ్య రాష్టప్రతి కానున్నారని ఆశీర్వదించారు.
ఉపరాష్టప్రతి పదవికి వెంకయ్యనాయుడు పేరు ప్రతిపాదించినప్పుడు సిద్ధాంతరీత్యా పోటీ తప్ప పెద్దవ్యతిరేకత ఎదురుకాలేదు. ఫలితాలు వెంకయ్య అందరివాడేనన్న రీతిలో వచ్చాయి. ఆ ధీమాతో, సుదీర్ఘ అనుభవంతో పెద్దల సభ నాయకుడిగా, ఉపరాష్టప్రతిగా తనదైన ముద్ర వేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.
**
రచయితగా ముద్ర
ఎంత బిజీగా ఉన్నా వెంకయ్య అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, పార్టీ ప్రసంగాలు, వివిధ సందర్భాల్లో మాట్లాడిన ఉపన్యాసాలు కలిపి గ్రంథస్తం చేశారు. వాటికి ‘అలుపెరగని గళం, విరామమెరుగని పయనం’ అనే పేరు పెట్టారు. గతంలో అసెంబ్లీ ఉపన్యాసాలు ఒక గ్రంథంగానూ, ఎంపిగా, మంత్రిగా చేసిన ప్రసంగాలను మరో గ్రంథంగా ఆవిష్కరించారు.
మాటల మాంత్రికుడు
‘హిందు పదాన్ని వింటే చాలు చాలామందికి అలర్జీ వస్తోంది ఎందుకో తెలియడం లేదు, హిందు పదాన్ని నరేంద్రమోడీనో, వాజపేయి, లేదా వెంకయ్యనాయుడో ఇవ్వలేదు. హిందు పేరిట దినపత్రికలే ఉన్నాయి, ది హిందు, హిందుస్థాన్ టైమ్స్, సంస్థలు కూడా ఉన్నాయి. హిందుస్థాన్ షిప్‌యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, హిందుస్థాన్ మిషిన్ టూల్స్- హెచ్‌ఎంటి ఈ పేర్లు ఎవరిచ్చారు? మేమిచ్చామా? బిజెపి పుట్టక ముందు నుండే ఈ పేర్లున్నాయి. జండా వందనం తర్వాత అంతా జై హింద్ అంటాం. అంటే హిందువులకు జై, మిగిలిన వారికి కాదు అని అర్థమా? హిందు మాటను ఎందుకిలా తప్పుగా అర్థం చేసుకుంటారు, అది మతం కాదు, భారతీయ జీవన శైలి.’
***
‘తాత్కాలిక అవసరాలపై దృష్టిపెడుతున్నాం, దీర్ఘకాలిక అవసరాలపై దృష్టిపెట్టడం లేదు. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి కేవలం 4 శాతం మాత్రమే ఖర్చు చేస్తోంది, దాంతో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాల్సి వస్తోంది. జనాకర్షక పథకాలు, తాత్కాలిక తాయిలాలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. గ్రైండర్ ఇస్తా, మిక్సీ ఇస్తా, టివి ఇస్తా, చివరికి తాళిబొట్టు ఇస్తా అంటూ రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. వీటన్నింటికీ నేను తీవ్ర వ్యతిరేకం, ఇపుడు కావల్సింది వైద్యం, మంచినీరు, పశువైద్యం, వ్యవసాయానికి చేయూత.
***
‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నాళ్లు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ మన తల్లి, మన చెల్లి పైన ఎండ, తలపై కుండ, కడుపులో మండ, కిలోమీటరు దూరం వెళ్లి వాగులు, వంకల్లో నుండి బురదనీటిని తెస్తే దానినే తాగాల్సిన దౌర్భాగ్యంలో మనం ఇంకా ఉన్నామంటే దానికి కారణం తాత్కాలిక అవసరాలపై దృష్టి పెట్టడమే. ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకే పరిమితం కాలేదు. అన్ని పార్టీలకూ ఈ దౌర్భాగ్యం పట్టింది.’
***
‘శాశ్వత ప్రయోజనాలను కల్పించి, ప్రజలకు శక్తిని ఇవ్వాలి. ఉదయానే్న ఒక మట్టగిడిసి చేపను ఇస్తే సాయంత్రం నా కొరమేను చేప ఎక్కడయ్యా అని అడుగుతారు, దానికి బదులు చేపను పట్టడం నేర్పిస్తే ఏ చేప కావాలనుకుంటే ఆ చేపను పట్టుకుంటారు.’
***
‘జనము, కులము, మతము ఈ మూడింటికీ ప్రాధాన్యత పెరిగిపోయింది. వాస్తవానికి అభ్యర్ధులకు ఉండాల్సింది గుణం. దానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది.’
***
‘ప్రజల్లో చైతన్యం రావాలి, ఒక వూళ్లో ఏదో పంచుతూ పోతుంటే బాగా డబ్బున్న ఆమె ఇంటిని దాటి వెళ్లిపోతున్నపుడు ఆమె కూడా పిలిచి ఏమయ్యా మాకు ఇవ్వక్కర్లేదా అని ప్రశ్నించిందంట, పేదవారికి ఇవ్వమని ఇచ్చారు అంటే, అయితే వారి ఓట్లు వేయించుకోండి. మా దగ్గరకు ఓట్లు కోసం రాకండి అని ఆమె చెప్పింది. ఇదీ మన పరిస్థితి’
***
‘నమస్కారం సంస్కారం, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని , మంచివారిని గౌరవించడం మంచి సంస్కారం అవుతుంది’
***
‘డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్, డివోషన్ ,కమిట్‌మెంట్, కేరక్టర్, కాండక్టు, కెపాసిటీ ఉన్న పార్టీ మాది. అందుకే అంత గట్టిగా మాట్లాడతా’
***
‘కాంగ్రెస్ పార్టీలో పిఎం ప్రెసైడ్స్, మేడమ్ డిసైడ్స్, మా పార్టీలో పిఎం ప్రెసైడ్స్, టీమ్ డిసైడ్స్’
***
‘్భరతదేశం శక్తి కుటుంబ వ్యవస్థ, వారసత్వం. అయితే పెళ్లికాకముందే కొడుకు కోసం ఫ్లాట్ కొనడం, ఎక్కడ ఉంచాలని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే, పెళ్లయ్యాక తండ్రిని ఎక్కడ పెట్టాలని కొడుకులు ఆలోచించే రోజులు వచ్చాయి.
***
‘రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అంతా తాత్కాలిక ప్రత్యర్ధులు మాత్రమే.’
* * *
‘నా నినాదం.. డిస్కస్, డిబేట్, డిసైడ్, డెలివర్’
(రాజ్యసభ అధ్యక్షుడిగా తొలి ఉపన్యాసంలో)
*
సమయం లేదు మిత్రమా!

పార్లమెంటు నడుస్తున్న తీరును ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూస్తున్న సామాన్యుడు కొంత అసంతృప్తికి గురవుతునే ఉన్నాడు, వారి భావాలను అర్ధం చేసుకుని మసలుకోవాలి, అద్భుతమైన మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపుప్రపంచ దేశాలు చూస్తున్నాయి, ఇక మీదట నేను అన్ని పార్టీల వ్యక్తిని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తా, సభను సజావుగా నడుపుకుందాం, భారత్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. దేశ విజయంలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం, కాలక్షేపానికి సమయం లేదు, మనకు అతిగొప్ప మేథో సంపత్తి, సంస్కృతి, సంప్రదాయాల వారసత్వం ఉంది. అయినా, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు తర్వాత కూడా మనం పేదరికం, నిరక్షరాస్యత, అసమానతలు, వ్యవసాయ సమస్యలు, అధికార దుర్వినియోగం, ప్రాంతీయ ఆర్ధిక అసమానతలు ఎదుర్కొంటున్నాం, అంతా కలిసి పనిచేసి దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి’
-ఎం వెంకయ్యనాయుడు

-బి.వి.ప్రసాద్