ఈ వారం స్పెషల్

ఊపిరి ఊగిసలాడె..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ ‘కనిపించడం లేదు..’! అవును.. దట్టంగా అలముకున్న కాలుష్యం పొగలో దేశ రాజధాని నగరం నిజంగానే ‘కనిపించడం లేదు..’! రహదారులపై నాలుగైదు అడుగుల దూరంలో ఏముందో మన కళ్లకు అగుపించని పరిస్థితి.. పొగల సెగతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈ మహానగరంలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సిన దుస్థితి.. ‘గాలి నాణ్యత సూచీ’ (ఏక్యూఐ) దారుణంగా మారడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ఢిల్లీ సహా దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లోని గుర్‌గావ్, నోయిడా పట్టణాల్లోనూ వాతావరణం పౌరులకు అత్యంత ప్రతికూలంగా మారింది. కాలుష్యం విషమించడంతో ప్రతి ఏటా ఈ చారిత్రక నగరం ఊపిరాడక విలవిలలాడడం సర్వసాధారణమైంది.
ఒకప్పుడు ఢిల్లీకే పరిమితమైన కాలుష్య మేఘాలు ఇపుడు రాజధాని శివారు ప్రాంతాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ‘వాయువు ఆయువు తీస్తోందంటూ’ జనం అల్లాడిపోతున్నా పరిస్థితులు చక్కబడడం లేదు. గాలి నాణ్యత గత మూడేళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడమే ప్రస్తుత విపత్కర పరిస్థితికి మూల కారణమని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. శ్వాసకోశ సమస్యలున్నవారే కాదు.. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారంటే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిందో అవగతమవుతుంది. వాయు కాలుష్య వైపరీత్యానికి దేశ రాజధాని ప్రతీకగా నిలిచింది.
వాయు నాణ్యత సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఏకంగా 494 పాయింట్లకు చేరడంతో ఢిల్లీ వాసులు భయం నీడలో బిక్కుబిక్కుమంటున్నారు. ‘ఇక్కడ నివసించడం మా వల్ల కాదు.. ఈ మహానగరం నుంచి ఎక్కడికైనా వెళ్లిపోతాం..’ అని కొందరు ఘోషిస్తుండగా, ‘నిజానికి ఢిల్లీ నగరం దేశ రాజధాని అనిపించుకోవడానికి తగదు..’ అని ఇంకొందరు తెగేసి చెబుతున్నారు. ఈ ఏడాది కూడా దీపావళి అనంతరం వాయు కాలుష్యం తన విశ్వరూపం ప్రదర్శించడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించక తప్పలేదు. రహదారులపై వాహనాల రాకపోకలకు ‘సరి-బేసి’ విధానాన్ని మళ్లీ అమలులోకి తెచ్చారు. ఈ విధానానికి విరుద్ధంగా వాహనాలు రోడ్డెక్కితే భారీ జరిమానాలు తప్పవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘సరి-బేసి’ని ఉల్లంఘించిన వాహన చోదకులకు పోలీసులు భారీగా చలాన్లు జారీ చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని నివారించడంలో కేజ్రీవాల్ సర్కారు విఫలమైందని విమర్శిస్తూ భారతీయ జనతాపార్టీ ఎంపీ విజయ్ గోయల్ ‘సరి-బేసి’ నిబంధనను త్రోసిరాజని తన వాహనాన్ని నడిపారు. ఇందుకుగాను ఆయనకు ఢిల్లీ పోలీసులు నాలుగు వేల రూపాయల జరిమానా విధించారు. మరోవైపు వాయు కాలుష్యంపై సమగ్ర వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కారులోని సంబంధిత శాఖల అధికారులు తమ ముందు హాజరు కావాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఎమర్జెన్సీ!
ఢిల్లీలో విషమించిన వాయు కాలుష్యం తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం ప్రకటించింది. ‘1975 నాటి అత్యవసర పరిస్థితి ఇంతకంటే ఎంతో నయం.. ప్రస్తుత వాయు కాలుష్యం అప్పటి ఎమర్జెన్సీ కంటే ఎంతో ప్రమాదకరమైనది.. మీ చావు మీరు చావండని ప్రజలను వారి ఖర్మానికి వదిలేస్తారా..?’- అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తీవ్రస్థాయిలో ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆక్షేపించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యం విషమించడానికి కారణమవుతున్నందున హర్యానా, పంజాబ్ రాష్ట్రాలపైనా ఆయన మందలింపులతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఉమ్మడిగా కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా, వాయు కాలుష్యాన్ని కొలిచే కొన్ని ‘యాప్’ల ప్రకారం రోజుకు 30 నుంచి 40 సిగరెట్టుల తాగితే ఎంత కర్బన కాలుష్యం మన ఊపిరితిత్తుల్లోకి వెళుతుందో ఇప్పుడు ఢిల్లీ వాసులు అంత కాలుష్యాన్ని పీలుస్తున్నారట!
ఇళ్లలోనూ అభద్రతే..
అత్యంత దారుణంగా మారిన వాయు కాలుష్యం కారణంగా జాతీయ రాజధాని ప్రాంత ప్రజలు తమ ఇళ్లలోనూ ఏ మాత్రం భద్రంగా లేరని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. కాలుష్యం కోరల్లో చిక్కుకొని ‘విలువైన తమ ఆయుర్దాయాన్ని’ ప్రజలు కోల్పోతున్నారని, జనం ఇలా మరణించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని కోర్టు స్పష్టం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఢిల్లీ చుట్టుపక్కల పంజాబ్,హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో పంటల వ్యర్థాలను ఇష్టారాజ్యంగా తగులబెట్టడాన్ని తక్షణం ఆపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీ పరిసరాల్లో భవన నిర్మాణాలను, కట్టడాల కూల్చివేతలను ఆపాలని, పంటల అవశేషాలను తగులబెట్టడాన్ని నిలిపివేయాలని, బొగ్గు ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని కోర్టు సూచించింది. వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కలిగించడానికి బదులు సందర్శకులు ఢిల్లీని వదిలివెళ్లాలంటూ అధికారులు వౌఖిక ఆదేశాలు ఇవ్వడాన్ని కోర్టు తప్పుపట్టింది. పొలాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టరాదంటూ గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలుకాకపోవడం పట్ల హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పౌరుల జీవన హక్కును హరించి వేయడాన్ని తాము అనుమతించబోమని, ఈ దుస్థితికి కారకులైన వారిపై కఠిన చర్యలకు సమయం ఆసన్నమైందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ప్రమాదంలో పడేస్తున్న రైతులపై మాకు ఎలాంటి సానుభూతి లేదు.. విషమ పరిస్థితులను నివారించేందుకు సంబంధిత రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. ప్రజలు ఊపిరాడక చనిపోవాలన్నది మీ ఉద్దేశమా..? కాలుష్యం బారినపడి మీ రాష్ట్రాలు (పంజాబ్, హర్యానా) సైతం ఇబ్బంది పడుతున్నాయి.. గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ పాలనావ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.. అందరినీ జవాబుదారులుగా నిలబెడతాం..’- అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ‘తీవ్ర వాయు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఏటా పదిహేను రోజుల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.. అయినా మనం ఏమీ చేయలేకపోతున్నాం.. ఒక నాగరిక దేశంలో ఇలా జరగడం సిగ్గుచేటు.. జీవనహక్కు చాలా ముఖ్యం అని పాలకులు, అధికారులు గ్రహించాలం’టూ ధర్మాసనం పేర్కొంది. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ‘సరి-బేసి’ విధానాన్ని మరోసారి ప్రవేశపెట్టినప్పటికీ, ద్విచక్ర- త్విచక్ర వాహనాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని, దీనివల్ల ఏం సాధించారని, ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేస్తే కొంతైనా ఫలితం ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి వెళ్లిపోతాం..
వాయు కాలుష్యం విషమించడంతో దేశ రాజధాని ప్రాంతం (ఎనీసీఆర్) నుంచి మరో నగరానికి తరలి వెళ్లేందుకు నలభై శాతం మంది ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. కాగా, కాలుష్యం వల్ల ఊపిరి ఆడని పరిస్థితుల్లో మాత్రమే ఢిల్లీ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు పదహారు శాతం మంది ఆసక్తి చూపారు. ఇటీవల ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. 31 శాతం మంది మాత్రం ఎన్‌సీఆర్ పరిధిలోనే నివసిస్తూ, కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛందంగా చర్యలు చేపడతామని తెలిపారు. ఎయిర్ ప్యూరిఫైర్స్‌ను వాడడం, మాస్క్‌లు ధరించడం, మొక్కలు పెంచడం వంటి చర్యలకు తాము సిద్ధమేనని వారు ప్రకటించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే తాము ఢిల్లీలో ఉంటున్నామని పదమూడు శాతం మంది చెప్పారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదని అత్యధిక సంఖ్యాకులు అంగీకరించారు. శ్వాసకోశ ఇబ్బందులతో ప్రస్తుత సీజన్‌లో నాలుగైదుసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని 13 శాతం మంది చెప్పగా, అనారోగ్య సమస్యలున్నప్పటికీ ఇంటి వద్దే ఉంటున్నామని 44 శాతం మంది తెలిపారు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఇంతవరకూ తమకు లేవని 14 శాతం మంది వివరించారు.
భవన నిర్మాణాలను, కట్టడాల కూల్చివేతలను నిలిపివేయడం వల్ల ఎలాంటి ఉపశమనం లేదని చాలామంది సర్వేలో కుండబద్దలు కొట్టారు. పొగ మేఘాలు కమ్ముకున్నందున తాము ఎక్కడికీ వెళ్లలేక పోతున్నామని అధిక సంఖ్యాకులు ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం, పొగమంచు వల్ల ఏటా దీపావళి అనంతరం ఇబ్బంది పడడం అలవాటైపోయిందని ఢిల్లీవాసులు వాపోతున్నారు. వాయు కాలుష్య సూచీ గత మూడేళ్ల కాలంతో పోల్చి చూస్తే ఇపుడు దారుణంగా క్షీణించడంతో ఢిల్లీకి వచ్చే విమానాలను దారి మళ్లించడం లేదా ఆలస్యంగా నడపడంతో పారిశ్రామిక వర్గాల ప్రతినిధులు అసంతృప్తికి లోనయ్యారు. ఇతర దేశాలు నడిపే అంతర్జాతీయ విమాన సర్వీసులకూ అంతరాయం కలగడంతో ఆ ప్రభావం పర్యాటక రంగంపై పడుతోంది. 2016 నవంబర్ 16న గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) సగటు 497గా నమోదు కాగా, మళ్లీ ఆ స్థాయిలో ఇపుడు గాలి నాణ్యత క్షీణించిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. కాగా, వాయు కాలుష్యం నుంచి ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన ‘తాజ్ మహల్’ను పరిరక్షించేందుకు ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు ప్రారంభించింది. తాజ్ మహల్ వద్ద గాలి శుద్ధి వ్యాన్‌ను ఉంచారు. తాజ్ మహల్ చుట్టూ 300 మీటర్ల పరిధిలోని గాలిని ఆ వ్యాన్ శుద్ధి చేస్తుంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో నిరంతరం రహదారి నిర్మాణ పనులను చేపడుతూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నందున ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ’ (ఎన్‌హెచ్‌ఏఐ)కు ఆ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూ. 6.84 కోట్ల రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
మారని పరిస్థితులు...
వాయు కాలుష్యానికి కారణమవుతున్నందున పంటల వ్యర్థాలను తగులబెట్టడాన్ని నిషేధించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నాలుగేళ్ల క్రితమే రాష్ట్రాలకు నిర్దేశించింది. ఎన్‌జీటీ విధించిన నిబంధనలు అమలులోకి వచ్చాయని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు చెబుతున్నా, ఈ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం పదకొండు వందల రూపాయల నిధితో ప్రత్యేక పథకాన్ని ప్రకటించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు గోచరించడం లేదు. తమకు ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలు లభించడం లేదని రైతులు చెబుతుండగా, మరోవైపు పొలాల్లో పంటల అవశేషాలను తగులబెట్టడం యథేచ్ఛగా సాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటల వ్యర్థాలను తగులబెట్టడంతో కాలుష్య మేఘాలు దేశ రాజధానికి చేరుకొంటున్నాయి. ఒక టన్ను పంట వ్యర్థాలను కాల్చడం వల్ల అరవై కిలోల కార్బన్ మోనాక్సైడ్, పధ్నాలుగు వందల కిలోల బొగ్గుపులుసు వాయువు, మూడు కిలోల సూక్ష్మ ధూళికణాలతో బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విష పదార్థాలు వాతావరణంలోకి చొరబడుతున్నాయి. దేశం మొత్తమీద ప్రతి సంవత్సరం సుమారు పది కోట్ల టన్నుల పంట వ్యర్థాలను దహనం చేస్తుండగా, ఇందులో సింహభాగం హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్‌లదే కావడం గమనార్హం. ఉత్తర భారతంలో గోధుమ గడ్డిని పశుగ్రాసంగా వాడుతూ, ఎండిపోయిన వరిదుబ్బులను భారీగా పంట పొలాల్లోనే దగ్ధం చేస్తుంటారు. పంటల అవశేషాలను ఇలా కాల్చివేస్తున్నందున వాయు కాలుష్యమే కాదు, భూమి పొరల్లో పంటలకు ఉపయోగపడే వేల రకాల బాక్టీరియా అంతరించిపోతోంది, భూమిలో తేమ శాతం తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితులు పంటల ఉత్పత్తులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. పంట వ్యర్థాలను పొలాల్లో తగులబెట్టడానికి బదులు, వాటిని మరోలా ఉపయోగించుకుంటేనే వాయు కాలుష్యం అదుపులోకి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో రైతులను ప్రభుత్వాలే చైతన్యపరచాల్సి ఉందని వ్యవసాయ శాస్తవ్రేత్తలు సూచిస్తున్నారు. వర్షాలు కురిశాక పంట వ్యర్థాలను తగులబెట్టడం తగ్గుముఖం పడుతుందని, అపుడు పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు అంటున్నా, వారి అంచనాలు వాస్తవ విరుద్ధమని వాయు నాణ్యత సూచీ చెబుతోంది.
ఢిల్లీ మాత్రమే కాదు..
ముఖాలకు మాస్క్‌లు కట్టుకోనిదే బయటకు రాని దుస్థితి ఢిల్లీతో పాటు గుర్‌గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ నెలకొంది. లాహోర్, కరాచీ (పాకిస్తాన్), కాబూల్ (ఆఫ్ఘనిస్తాన్), ఢాకా (బంగ్లాదేశ్) నగరాలు గాలి నాణ్యత సూచీలో మన ఢిల్లీ కంటే మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. వాయు కాలుష్య ప్రభావానికి లోనయ్యే రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ చేరడం ఆందోళనకరం. వాయు కాలుష్యం విషమించడం అనేది ఢిల్లీ పరిసర ప్రాంతాలకో, కొన్ని నగరాలకో పరిమితం కావడం లేదు. మన దేశంలో మూడొంతుల నగరాలు, పట్టణాలు కాలుష్యం కోరల్లో విలవిలలాడుతున్నాయి. వాయు నాణ్యత పరంగా 180 దేశాల జాబితాలో మన దేశం అత్యంత కింది స్థాయిలో ఉండడం పాలకుల, అధికారుల నిర్వాకానికి నిదర్శనం. మన దేశంలో ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకటి వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్నట్లు గణాంకాలు ఘోషిస్తున్నాయి. నదుల్లో ఇష్టారాజ్యంగా వ్యర్థాలను పారవేయడం, పారిశ్రామిక కాలుష్యం, వాహన కాలుష్యం వంటి అంశాల్లో పాలకుల నిర్లిప్తత కారణంగా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇలాంటి అంశాల్లో కఠిన చర్యల కారణంగా చైనా వంటి దేశాల్లో గాలి నాణ్యత కొంత ఆశాజనకంగా ఉంటోంది. వాయు కాలుష్యం వల్ల నేత్ర, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు విషమిస్తున్నాయని అనేక అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడకుండా రోజూ పరిశుభ్రమైన నీటిని ఎక్కువగా తాగాలని, వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను ఆశ్రయించాలని, గాలిని పరిశుభ్రం చేసే మొక్కలను ఇంటి ఆవరణలో పెంచాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లే వారు ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లోవ్స్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, చర్మసంబంధిత ఎలర్జీలున్నవారు కొన్ని జాగ్రత్త చర్యలను పాటించాలని వాతావరణ శాస్తవ్రేత్తలు సలహాలిస్తున్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్రాల్లో కాలుష్య నియంత్రణ మండళ్లు ఇస్తున్న ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ఈ వ్యవస్థలు సజావుగా నడిచే పరిస్థితులు కనిపించడం లేదన్నది జగమెరిగిన సత్యం. వాతావరణంలో సీసం, ఆర్సెనిక్, నికెల్ శాతాలు పెరగడంతో అనారోగ్య సమస్యలు విజృంభిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఢిల్లీలోని ప్రస్తుత విపత్కర పరిస్థితులను చూసైనా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమగ్ర కార్యాచరణకు పూనుకోవాలి. ‘జీవించే హక్కు’ నినాదం కాదని, అదో విధానం అని ప్రభుత్వాలు రుజువు చేయాలి. పర్యావరణ స్పృహ ప్రజల్లోనూ, పాలకుల్లోనూ పెరిగితే తప్ప వాయు కాలుష్యాన్ని నివారించడం అసాధ్యం. *
‘హరిత రవాణా’ శరణ్యం..
గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో భారత్ ఇక హరిత రవాణా దిశగా అడుగులు వేయాలని, కాలుష్య రహిత వాహనాలను వినియోగించడం అత్యంత అవసరమని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సూచించారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా ఆమె ఈ సూచన చేశారు. డీజిల్ వాహనాలను ఉపసంహరించాల్సిన తరుణం ఆసన్నమైందని, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ప్రజారవాణా వ్యవస్థ ఎంతో ఉత్తమమైందన్నారు. డీజిల్ వాహనాలకు బదులు విద్యుత్ వాహనాలపై దృష్టి సారించేందుకు ప్రతి నగరంలోనూ ‘హరిత రవాణా’ అభివృద్ధి చెందాలన్నారు. ఢిల్లీలోని ద్వారకానగర్ మెట్రో రైల్వే స్టేషన్‌లో జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సౌర పలకలను వినియోగించడాన్ని ఆమె పరిశీలించారు. ఎలక్ట్రికల్ రిక్షాల సంఖ్యను పెంచాలని కూడా ఆమె సూచించారు. భారత్‌లో హరిత రవాణా సదుపాయాల కల్పనకు ఒక బిలియన్ యూరోల (ఎనిమిది వేల కోట్ల రూపాయల) ఆర్థిక సహాయాన్ని జర్మనీ అందిస్తోందని మెర్కెల్ వివరించారు.

మనకూ ప్రమాద ఘంటికలు!
వాయు కాలుష్యంతో ఢిల్లీవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు విశేష ప్రచారం జరుగుతున్నా, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల నమోదైన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని విశే్లషిస్తే పలు ఆందోళనకరమైన అంశాలు వెలుగు చూశాయి. ‘ఏక్యూఐ’ సగటు 50లోపు ఉంటే పరిస్థితి అత్యంత సంతృప్తికరంగాను, 51 నుంచి 100 లోపు ఉంటే సంతృప్తికరంగాను, 101 నుంచి 200 లోపు అయితే మధ్యస్తంగాను, 201 నుంచి 300 లోపు అయితే ఎక్కువగాను, 300 నుంచి 400 లోపు ఉంటే అత్యంత ఎక్కువగాను, 401క కంటే మించితే దారుణంగా ఉన్నట్టు నిపుణులు చెబుతుంటారు. గాలి నాణ్యత సూచీ క్షీణించే కొద్దీ ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు తీవ్రతరం అవుతాయి. వాయు కాలుష్యం మరీ ఎక్కువైతే శ్వాసకోశ సమస్యలు విషమించే పరిస్థితి తప్పదు. సూక్ష్మ ధూళికణాలు, అతి సూక్ష్మ ధూళికణాలు, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫల్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమ్మోనియా వంటి ఎనిమిది రకాల కాలుష్య ఉద్గారాల తీవ్రతను సాయంత్రం నాలుగు నుంచి మర్నాడు సాయంత్రం నాలుగు గంటల వరకూ లెక్కిస్తారు. ఈ ఉద్గారాల సగటు ఆధారంగా ‘గాలి నాణ్యత సూచీ’ని నిర్ణయిస్తారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అమరావతి, రాజమహేంద్రవరం, తిరుపతి ప్రాంతాల్లో ఈనెల మొదటి మూడు రోజుల్లో వాయు నాణ్యత సూచీ క్రమంగా దిగజారిందని నిపుణులు గుర్తించారు. హైదరాబాద్‌లో పీఎం 10, పీఎం 2.5లను ప్రధాన కాలుష్య ఉద్గారాలుగా అధ్యయనంలో పేర్కొన్నారు. అమరావతి, రాజమహేంద్రవరంలలో ఓజోన్, విశాఖపట్నంలో పీఎం 2.5, తిరుపతిలో నైట్రోజన్ ఆక్సైడ్‌లు కీలక కాలుష్య ఉద్గారాలుగా ‘వాయు నాణ్యత సూచీ’లో విశే్లషించారు.

-పిఎస్సార్