ఈ వారం స్పెషల్

సమైక్యతకు ‘శ్రీరామరక్ష’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం మరోసారి పరిణతిని ప్రదర్శించింది. శాంతియుతంగా ఉంటూ లౌకిక స్ఫూర్తిని చాటింది. అయోధ్యలోని మందిర్-మసీదు వివాదంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును రాజకీయాలకు అతీతంగా హిందూ, ముస్లిం సంస్థలు స్వాగతించడమేగాక, ఎంతో ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాయి. మత సమైక్యతకు ప్రతీకలుగా మందిర్, మసీదు నిర్మాణాలు నిలవనున్నాయి. రామజన్మభూమి భూ వివాదం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పరిణితి స్ఫూర్తితో భారతావని స్వీకరించింది. శతాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదానికి సుప్రీం కోర్టు భరతవాక్యం పలికి దేశ చరిత్రను కొత్తమలుపు తిప్పింది. ప్రపంచ న్యాయచరిత్రలోనే సుదీర్ఘకాలం కొనసాగిన కేసుగా, అత్యధిక కాలం వాదనలు జరిగిన రెండో కేసుగా రామజన్మభూమి వివాదం వాసికెక్కింది.
రామజన్మభూమి వివాదం ఈనాటిది కాదు, న్యాయవ్యాజ్యానికి గురై శతాబ్దికి పైగా రగులుతోంది. చరిత్ర, పురావస్తు ఆధారాలు, మతం, న్యాయం సమ్మిళితమైన వాస్తవాలు, సాక్ష్యాలు, వాదనలు కలబోసి కోట్లాది ప్రజల మనోభావాలకు న్యాయసమ్మత పరిష్కారాన్ని సుప్రీం కోర్టు కనుగొన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వివాదం స్థరాస్తికి సంబంధించింది. అంత మాత్రాన దానిని ఆ ఒక్క అంశానికే పరిమితం చేయలేం. కోట్లాది మంది ప్రజల మనోభావాలు, నమ్మకాలు, విశ్వాసాలు , ఆశలు, ఆశయాలకు సంబంధించిన అంశంగా ముడివేసుకుంది. ఆలయ నిర్మాణానికి అనువుగా 1993 నాటి అయోధ్య భూసేకరణ చట్టం నిబంధనలకు అనుగుణంగా మూడు నెలల కాలవ్యవధిలో ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని, మరో పక్క మసీదుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సుప్రీం పేర్కొంది. 1,045 పేజీల సుదీర్ఘ విలక్షణ తీర్పులో రామజన్మభూమి నిర్ధారిత ప్రాతిపదికలను 116 పేజీల అనుబంధంలో జతపరిచింది.
1992లో అయోధ్యలో బాబ్రీ కట్టడం కూల్చివేత దరిమిలా అప్పటి కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద స్థలం సహా మొత్తం 67 ఎకరాల భూమిని సేకరించింది. 1993లో అయోధ్య భూ సేకరణ చట్టాన్ని రూపొందించింది. అంతకుముందు నుండే మొదలైన ఇక్కట్లు బాబ్రీ కూల్చివేతతో వ్యవహారం ముదిరి పాకాన పడ్డాయ. శతాబ్దాల వివాదాలను లేశమాత్రంగా ప్రస్తావించినా, ఆ చిక్కుముళ్లకు న్యాయస్థానం వెళ్లలేదు. అందుబాటులో ఉన్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను ప్రాతిపదికగా తీసుకుని తమ నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ తీర్పు ఏకపక్షం కాకూడదనే , ప్రతివాదులకు వారి వద్ద ఉన్న భూమి హక్కులకు సంబంధించిన ఆధారాలను చూపించమని కోరింది. భూమి తమ అధీనంలో ఉందన్న మాట తప్పితే ఆ భూమిపై హక్కులకు సంబంధించిన పత్రాలు అందుబాటులో లేవని తమ నిస్సహాయతను వ్యక్తం చేయడంతో సర్వోన్నత న్యాయస్థానానికి పని సులువైపోయింది. కక్షిదారులతోనే తమకు భూ హక్కులు లేవని చెప్పించింది.
అయోధ్యవాసి...
అయోధ్యలో రామజన్మభూమికి సంబంధించి విభిన్నమైన కథనాలను వైరివర్గాలు వినిపించాయి. శ్రీరామచంద్రుడు హిందూ దేవతల్లో ప్రముఖుడు. త్రేతాయుగంలో విష్ణు అవతారం. భారత వాంఙ్మయంలో ఆదికావ్యం రామాయణం. వేదకాలం తర్వాత దేవనాగరి భాష అయిన సంస్కృతంలో దీనిని రాశారు. రామాయణ గాధ త్రేతాయగం నాటిదని వాల్మీకి తన గ్రంథంలో పేర్కొన్నారు. ఇండోనేసియా, థాయిలాండ్, కంబోడియా, వియత్నం, మలేషియా, లావోస్ వంటి దేశాల్లో కూడా రామాయణం ప్రసిద్ధి చెందిన కావ్యం. ఆనాటి నుండే రాముడు హిందువులకు ఆదర్శపురుషుడు.
1528లో బాబర్ రాకతో అయోధ్యలోని పరిస్థితులు మారిపోయాయి. మొఘల్ సామ్రాజ్య స్థాపనలో భాగంగా విజయచిహ్నాన్ని అయోధ్యలో నెలకొల్పారు. అదే నేడు అంతా చెప్పుకునే బాబ్రీ మసీదు. వాస్తవానికి తొలి రోజుల్లో అక్కడ ఉన్నది మసీదు కాదు, ఒక స్మారక చిహ్నం. ఇందుకోసం రామ మందిరాన్ని కూల్చివేశారనేది ఒకటైతే, ముంబైలోని పురావస్తు గ్రంథాలయంలో లభించిన అముద్రిత గ్రంథాల ఆధారంగా చూస్తే రామమందిరాన్ని క్రీస్తు పూర్వం 1426లోనే కూల్చేశారనేది మరో వాదన. అంటే దాదాపు 3445 ఏళ్లుగా వివాదం ఏదో ఒక రూపంలో ఉంది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ కూల్చివేతతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
అంతుచిక్కని వివాదం
2010లో అలహాబాద్ హైకోర్టు నాలుగు పిటిషన్లను విచారించి సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రాం లల్లా విరజ్‌మాన్ సంస్థలు 2.77 ఎకరాల స్థలాన్ని సమానంగా విభజించుకోవాలని ఇచ్చిన తీర్పు అయోధ్య వివాదాన్ని మరో మలుపు తిప్పింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో 11 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటి విచారణ మొదలైన తర్వాత మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని సుప్రీం కోర్టు భావించి ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని నియమించింది. నిజానికి శ్రీరాముడు ఎపుడు పుట్టాడో, ఎన్నాళ్లకు అవతారం చాలించాడో పురాణాల్లో చెప్పుకుంటున్నా, నిర్ధారిత ఆధారాలు పాక్షికంగా మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఆనవాళ్లు అనేకం..
కాబూల్ పరిపాలకుడు ఇబ్రహీం లోడీని ఓడించమని బాబర్‌కు 1526లో ఆహ్వానం అందింది. 1526 ఏప్రిల్ 21న మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. అందులో బాబర్ వీరోచితంగా పోరాడి ఇబ్రహీం లోడీని ఓడించాడు. ఆ క్రమంలోనే బాబర్ అయోధ్యను సందర్శించాడు. ఇంత వరకూ రికార్డులు పక్కాగా ఉన్నా, కొన్నింటిలో మాత్రం బాబర్ ఆదేశాలతోనే అయోధ్యలో బాబ్రీ కట్టడం జరిగిందని చెబుతున్నారు. అసలు అక్కడ రామ మందిరం ఉన్న విషయం బాబర్‌కు తెలియదని, బాబర్ వద్ద సైన్యాధిపతిగా ఉన్న మీర్ బక్షీ తాష్కండి ఆ పని పూర్తిచేశాడని మరికొంత మంది చరిత్రకారులు చెబుతున్నారు. మందిరం కూల్చివేత బాబర్ పనేనని ఆధారాలు లేకుండా చేయకూడదనే బాబర్‌నామాలో 1528 ఏప్రిల్ 2 నుండి 1528 సెప్టెంబర్ 8వ తేదీ వరకూ పేజీలు లేకుండా చేశారనే వాదన మరొకటి ఉంది. 1528 నుండి 1934 మధ్య 76 యుద్ధాలు ఇందుకోసమే జరిగాయి. బాబర్ కాలంలో నాలుగు, హుమయూన్ కాలంలో పది, అక్బర్ కాలంలో 20, ఔరంగజేబ్ కాలంలో 30, షాదిత్ అలి కాలంలో ఐదు, నసీరుద్దీన్ హైదర్ కాలంలో మూడు , వాజీదా అలీషా కాలంలో రెండు, బ్రిటిష్ కాలంలో రెండు యుద్ధాలు జరిగాయి.
ఆధారాలు లెక్కలేనన్ని ..
అబుల్ ఫజల్ అక్బర్‌కు అంకితం ఇస్తూ రాసిన ‘ఇనీ-అక్బరీ’లో అయోధ్య ప్రస్తావన, రాముడి ప్రస్తావన ఉంది. ‘ఎర్లీ ట్రావెల్ ఇండియా’ అనే గ్రంథంలో విలియం ఫాస్టర్ అయోధ్య ప్రస్తావన చేశారు. 1608 నుండి 11 మధ్య విలియం పింఛ్ రాసిన గ్రంథంలోనూ రామ మందిరానికి సంబంధించిన పలు ఆధారాల ప్రస్తావన ఉంది. ఫాదర్ జోసఫ్ తిఫిన్ తిలర్ 1789లో అయోధ్యకు వచ్చినపుడు ఆనాటి పరిస్థితులను గ్రంథస్తం చేశాడు. అందులో కూడా అయోధ్య గురించి, రాముడి జన్మస్థలం గురించి ప్రస్తావన ఉంది. అయోధ్యలో ఒక ఇంట్లో మహావిష్ణువు జన్మించారనే ప్రతీతి ఉందని పేర్కొన్నాడు. ఇక్కడ విష్ణువు అంటే రాముడే అని హిందువుల నమ్మకం. ఔరంగజేబు మసీదును నిర్మించాడని కొంత మంది, బాబర్ నిర్మించాడని మరికొంత మంది చెప్పినట్టు జోసఫ్ తిలర్ పేర్కొన్నాడు.
1853లోనే మొదలు...
మందిరం- మసీదుకు సంబంధించి తొలిసారి భూ వివాదం 1853లో చెలరేగింది. వాల్టర్ హమిల్టన్ ప్రచురించిన ఈస్టు ఇండియా గెజిటర్ 1816లో అబుల్ ఫజల్ రాసిన ‘ఇనీ-అక్బరీ’ గ్రంథంలో అయోధ్య ప్రస్తావన ఉంది. మాంట్గోమేరి మార్టిన్ రాసిన మరో గ్రంథంలో 360 హిందూ దేవాలయాలు ధ్వంసం అయిన అంశాన్ని ప్రస్తావించారు. మీర్‌బక్షీ తాష్కండి అక్కడ ఉన్న పూజారుల నుండి రామమందిర స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మార్టిన్ పేర్కొన్నాడు. తాష్కండి కొత్త నిర్మాణం తర్వాత ఆ కట్టడాన్ని కొంత కాలం పాటు మసీదు -ఇ- జన్మస్థాన్ అని పిలిచేవారు, తర్వాత దాని పేరు బాబ్రీ మసీదుగా మారింది.
ఆనాడు అది సాకేతపురం..
అయోధ్యను తొలి రోజుల్లో సాకేతపురం అని వ్యవహరించేవారు. అయోధ్య కోసల రాజ్యానికి రాజధాని. సరయూ నదీతీరంలో ఫైజాబాద్‌కు సమీపంలో ఉన్న అయోధ్య విష్ణుమూర్తి ఏడో అవతారమైన రాముడు జన్మించిన స్థలం. అధర్వణ వేదంలో అయోధ్య దేవతల నిర్మించిన స్వర్గమని పేర్కొన్నారు. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవ శ్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు నిర్మించి పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ వంశం వాడైన ఫ్రుదువు వల్లనే భూమికి పృథ్వి అనే పేరు వచ్చింది. సూర్యవంశస్థులైన హరిశ్చంద్రుడు, భగీరథుడు, రఘుమహారాజులతో రాజ్యవిస్తరణ జరిగింది. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా మారింది. రఘుమహారాజు మనుమడు దశరథుడు, దశరథుడి కుమారుడు శ్రీరామచంద్రుడు. తర్వాతి కాలంలో జైనమతగురువులైన తీర్ధాంకరులు ఇక్కడే జన్మించారు. అయోధ్య అత్యంత ప్రాచీనమైన , పెద్దదైన మహాద్భుత నగరం. తులసీదాస్ తన రామచరిత మానస్ రాయడం అయోధ్యలోనే ప్రారంభించారు. భగవాన్ స్వామినారాయణ్ కూడా తన బాల్యాన్ని ఇక్కడే గడిపారు. తమిళనాడుకు చెందిన చాలా మంది ఆళ్వార్లు అయోధ్య నగరం గురించి చాలా మార్లు ప్రస్తావించారు. క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో జన్మించిన బుద్ధుడి కాలంలో సాకేతపురం కోసలరాజు విశ్రాంతి కేంద్రంగా ఉండేది. బుద్ధుడి కాలంలో భారతదేశంలో పది రాజ్యాలు మాత్రమే ఉండేవి. కోసల అందులో బలమైన రాజ్యం. దాని అధీనంలోనే సాకేతపురం ఉండేది.
ఏం చేయాలో తేల్చుకోలేక...
అత్యద్భుతమైన అయోధ్య నగరంలో స్థల వివాదంతో 1859లో బ్రిటిష్ పాలకులు వివాదాస్పద స్థలంలో కంచెను ఏర్పాటు చేశారు. లోపలి భాగంలో ముస్లింలు, బయటిభాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఉండేది. ఆర్కియాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఏఎం శాస్ర్తీ, డాక్టర్ కేవీ రమేష్, డాక్టర్ టీపీ వర్మ, ప్రొఫెసర్ బీఆర్ గ్రోవర్, డాక్టర్ ఏకే సిన్హా తదితరులు రాసిన వ్యాసాల్లో మసీదు కూల్చినపుడు దొరికిన శిలాఫలకాల్లో మసీదుకు పూర్వం దేవాలయం ఉండేదనే సాక్ష్యాలున్నాయని పేర్కొన్నారు.
వివాదానికి పుట్టినిల్లుగా చెప్పుకునే మహంత్ రఘుబీర్‌దాస్ 1885 జనవరి 28న దాఖలు చేసిన పిటిషన్(61/280)పై 1886 మార్చి 18న బ్రిటిష్ ఇండియా ఫైజాబాద్ జిల్లా న్యాయమూర్తి స్థల వివాదాన్ని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించారు. 1949 డిసెంబర్ 23న మసీదులో రాముడి విగ్రహాలను ఉంచినపుడు ఆనాటి యూపీ సీఎం జీబీ పంత్‌కు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ లేఖ రాస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 1961లో ఈ వ్యవహారాలు కాస్తా కేసుల వరకూ దారితీశాయి. 1984లో వివాదాస్పద స్థలంలో మందిర నిర్మాణానికి ఉద్యమం మొదలైంది. 1986లో ఆనాటి ఫైజాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా మసీదు తాళం తీయాలని ఆదేశించారు. ముస్లింలు దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు పోరాట సమితిని ప్రారంభించారు.
అద్వానీ రథయాత్ర..
1989లో వీహెచ్‌పీ రామమందిర నిర్మాణం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. వివాదాస్పద స్థలం వద్ద రామ మందిరానికి పునాదిరాయ వేసింది. 1990 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 30 వరకూ భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్ర విశ్వహిందూ పరిషత్, సంఘ్‌పరివార్‌ల ఉద్యమానికి ఊతం ఇచ్చింది. ఉద్యమ ఉధృతిలోనే 1990లో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ చర్చల ద్వారా వివాదానికి పరిష్కారం చూపాలని ప్రయత్నించినా కుదరలేదు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ కట్టడాన్ని కొంత మంది కూల్చివేయడంతో తలెత్తిన ఎన్నో వివాదాలు న్యాయస్థానాల్లో పిటిషన్లకు కారణమయ్యాయి.
2002 మార్చి 13న సుప్రీంకోర్టు తన తీర్పులో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని పేర్కొంది. ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని పేర్కొంది. 2003 ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలంలో పురాతత్వశాఖ తవ్వకాలు ప్రారంభించి , జూన్ వరకూ కొనసాగించాయి. మందిరాన్ని పోలిన కొన్ని అవశేషాలు లభించాయని పురాతత్వ నివేదిక ఇచ్చింది. వివాద పరిష్కారానికి కంచి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతి కూడా ప్రయత్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో విచారణకు ఏర్పాటు చేసిన లిబర్‌హాన్ కమిటీ 17 ఏళ్ల తర్వాత అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు 2009 జూన్ 30న తమ నివేదికను ఇచ్చింది. అదే ఏది జూలై 7వ తేదీన యుపీ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలైంది. స్థల వివాదానికి సంబంధించిన 23 ఫైళ్లు కనిపించడం లేదన్నది ఆ అఫిడవిట్ సారాంశం. 2010 సెప్టెంబర్ 30న వివాదాస్పద స్థలాన్ని రామజన్మభూమిగా అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. దీనిపై 2011 మే 9న సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017 మార్చి 21న అయోధ్య వివాదాన్ని పరస్పరం చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ సూచించారు. తర్వాత అలహాబాద్ హైకోర్టులో ఇస్మాయిల్ ఫరూఖీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు 2017 ఆగస్టు 7న త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
రామజన్మభూమి వివాదానికి సంబంధించి శతాబ్దాల చరిత్రను అధ్యయనం చేసిన ధర్మాసనం అసలు రాముడు ఎక్కడ పుట్టాడు? నేడు ఆయన వారసులు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? అనే వౌలిక అంశాలను వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం లేవత్తింది. రామ్ చబూత్రపై కీలకమైన ప్రశ్నలను సంధించింది. నేలమట్టమైన బాబ్రీ మసీదులో కేంద్రక గుమ్మటం కింద భాగంలోనే రాముడు పుట్టాడని హిందువులు విశ్వసిస్తున్నారేమో? దీనిపై మీరేం అంటారు ?అని వక్ఫ్‌బోర్డు తరఫునా, అసలు కక్షిదారుడైన సిద్ధిఖీ తరఫున హాజరైన న్యాయవాదులను ప్రశ్నించింది. మూడు గుమ్మటాల వెలుపలి భాగంలో రామ్ చబుత్రా ఉందని, దానికి సమీపంలో రెయిలింగ్ పెట్టారని హిందువులు చెబుతున్నారు, కేంద్రక గుమ్మటం కింద ఉన్న ప్రదేశం వద్దకు( లోపలికి వెళ్లేందుకు) హిందువులకు ఎన్నడూ ప్రవేశం లేదని ముస్లింలు అంటున్నారు ఆ కేంద్రక గుమ్మటం కింద ఏదో దైవత్వం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారేమో లోపలికి వెళ్లే వీలు లేక చబూత్రా వద్దే పూజలు చేస్తున్నారేమో కదా అని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు అన్నీ జడ్జి ఊహలేనని, వాటికి ఆధారాలు లేవని ముస్లింల పక్షాన న్యాయవాది చెబుతున్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాలను స్పృశించడమేకాదు, అన్ని సంభావ్యతలనూ పరిశీలిస్తున్నామని మరో న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఇంకో పక్క మసీదుకు సంబంధించి లిఖిత పూర్వక ఆధారాలు, భూమి యాజమాన్య హక్కుల పత్రాలు తమ వద్ద లేవని కూడా బాబ్రీ మసీదు యాజమాన్య బోర్డు ఒప్పుకోక తప్పలేదు. ఇక తీర్పు రావడంతో కేంద్రం ఎపుడు రామాలయం నిర్మిస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
మధ్యవర్తుల కమిటీ..
వివాద పరిష్కారానికి ముగ్గురు మధ్యవర్తులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లా అధ్యక్షతన ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచ్‌లను నియమించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎన్‌వీ నజీర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. చివరికి ఈ వివాదంపై వాదులు, ప్రతివాదులు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దాదాపు నాలుగున్నర నెలల పాటు శ్రమించిన కమిటీ హిందూ ముస్లిం వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపినా ఇరు వర్గాలకీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించడంలో విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలుత మధ్యవర్తిత్వ విషయం ప్రస్తావనకు వచ్చినపుడు ముస్లిం సంస్థలు స్వాగతించాయి. నిర్మోహి అఖోడా మినహా మిగిలిన హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. తొలి ఫిర్యాదుదారుడైన ఎం సిద్ధిఖ్ వారసులు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదదనలు వినిపిస్తూ కక్షిదారులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నపుడు మధ్యవర్తిత్వమే మేలైన మార్గమని పేర్కొన్నారు. ఒక్క మధ్యవర్తినే కాకుండా ముగ్గురు నలుగురితో మండలిని ఏర్పాటు చేస్తే మంచిదని పేర్కొన్నారు. ఆలయ మూల విరాట్ రామ్‌లాలా విరాజ్‌మాన్ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాధన్ వాదనలు వినిపించారు. ప్రజల నుండి విరాళాలు సేకరించి మరో చోట మసీదు నిర్మించడానికి తాము సుముఖమేనని రామజన్మస్థలి నిర్థారణ విషయంలో మాత్రం సంప్రదింపులకు తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. నిజానికి రెండేళ్ల క్రితమే సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించింది. సమస్య పరిష్కారానికి మద్యవర్తిత్వం ఉండాలని 2017 మార్చి 21న సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ , జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌లతోకూడిన ధర్మాసనం ఈ సూచన చేసింది. అయితే ఆ సమయంలో కక్షిదారులు ఇందుకు అంగీకరించలేదు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే అయోధ్య వివాదంపై నియమితులైన ముగ్గురు మధ్యవర్తిత్వ సభ్యుల మధ్య సారూప్యత, సాన్నిహిత్యం కూడా ఉంది. ముగ్గురూ తమిళనాడు వాసులే, వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులే. మధ్యవర్తిత్వ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ ఖలీఫుల్లాకు చాలా మంచి పేరుంది. శస్తచ్రికిత్సలు చేసే సమయంలో వైద్యులు ఎంత సూక్ష్మపరిశీలన చేస్తారో సామాన్యులకు న్యాయం అందించడంలో కూడా ఖలీఫుల్లా అలా వ్యవహరిస్తారనే పేరుంది. జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో పనిచేసినపుడు ఆయన రాష్ట్రం అంతా తిరిగి న్యాయ సహాయ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్లనే ఆగ్రహంతో రగిలిపోయే కశ్మీరీలకు భారతీయ న్యాయవ్యవస్థపై ఎన్నడూ లేనంత నమ్మకం పెరిగింది. వేదిక్ జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా పరిగణించడమేగాక విశ్వవిద్యాలయాల్లో అభ్యాసానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పు, క్రికెట్ కంట్రోల్ బోర్డులో చేపట్టాల్సిన సంస్కరణలపై చేసిన సూచనలు ఆయన సునిశిత దృష్టికి అద్దం పడతాయి. బీసీసీఐ సంస్కరణలపై ఆయన చేసిన కృషిని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ప్రత్యేకించి ప్రశంసించారు. 1951 శివగంగై జిల్లా కారైకుడిలో జస్టిస్ ఖలీఫుల్లా జన్మించారు. 1975లో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2000లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. తర్వాత జమ్మూ కశ్మీర్‌లోనూ, అనంతరం సుప్రీంకోర్టులో పనిచేస్తూ 2016 జూలైలో పదవీ విరమణ చేశారు. శ్రీశ్రీ రవిశంకర్ తంజావూరు జిల్లా పాపనాశనంలో జన్మించారు. శ్రీరాం పంచ్ అంటే మధ్యవర్తిత్వానికి ఆద్యుడు అని చెప్పాలి. మద్రాసు హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచ్ దేశంలో మధ్యవర్తిత్వ ఉద్యమానికి ఆద్యుడు . దేశంలో తొలిసారి మద్రాసు హైకోర్టుకు అనుబంధంగా ‘ద మీడియేషన్ ఛాంబర్స్’ ను ఏర్పాటు చేశారు. మీడియేషన్ ప్రాక్టీస్ అండ్ లా పేరుతో మధ్యవర్తిత్వంపై సమగ్ర కరదీపికను రచించారు. ‘సెటిల్ ఫర్ మోర్’ పేరుతో మధ్యవర్తిత్వం ఆవశ్యకతపై పుస్తకం రాశారు. సింగపూర్ మీడియేషన్ సెంటర్‌లో సర్టిఫైడ్ మీడియేటర్‌గా వ్యవహరించారు. సుమారు 40 ఏళ్లుగా ఆయన న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.
ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సుప్రీంకోర్టు చిట్టచివరి అవకాశంగా మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపింది. కుదిరితే మధ్యవర్తిత్వం లేకుంటే సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ప్రకటించాలని నిర్ణయించుకుంది.
దైనందిన విచారణ
అయోధ్య వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సుప్రీంకోర్టు ఆగస్టు 6 నుండి 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా రామమందిరం ఉన్న ప్రదేశం తమదే అని చెప్పడానికి అవసరమైన హక్కు పత్రాలు ఏవీ తమ వద్ద లేవని సున్నీ వక్ఫ్ బోర్డు స్పష్టం చేసింది. నిర్మోహి సంస్థ తరఫున న్యాయవాది సుశీల్ కుమార్ జైన్, ముస్లిం పార్టీల తరఫున రాజీవ్ ధావన్, రాంలీల తరఫున కే పరాశరన్ వాదనలు వినిపించారు.
అయోధ్య విచారణపై టైమ్‌లైన్
అయోధ్యపై సకాలంలో విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరించాలనే పట్టుదలతో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అవసరానికి మించి ఎక్కువ సమయం విచారణలో పాల్గొని తీర్పును సిద్ధం చేసింది. వాదనలను ఎలాంటి ఆటంకాల లేకుండా అక్టోబర్ 18 నాటికి పూర్తి చేయాలని ఇరు పక్షాలకూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వివిధ రూపాల్లో శతాబ్దాలుగా ఉన్న వివాదానికి తెరపడుతుందని అంతా ఎదురుచూసినట్టే సర్వామోదిత తీర్పును వెలువరించింది. తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు భవిష్యత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డీ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్‌లు ఉన్నారు. నవంబర్ 17వ తేదీన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో తీర్పును సకాలంలో వెలువరించాలని ధర్మాసనం నిర్ణయించింది. ధర్మాసనంలో సహజంగా ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని, తీర్పును వెలువరించడం ఆనవాయితీ కాగా, ఈసారి ఐదుగురూ కలిసి ఏకాభిప్రాయంతో వెలువరించారు.
చాలా జాగ్రత్తలు
తీర్పుపాఠం వెలువరించే ముందు సుప్రీంకోర్టు ఈసారి దేశ రక్షణను సైతం పరిగణనలోకి తీసుకుంది. సీనియర్ అధికారులను పిలిపించుకుని సున్నిత ప్రాంతాల్లో పహరాను పటిష్టం చేసింది. సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టింది. అయోధ్య తీర్పుపై ఎవరూ మాట్లాడవద్దని రాజకీయ పార్టీలకు హితవు చెప్పడమేగాక, సామాజిక మాధ్యమాలపై నిఘా పెట్టింది. అదే విధంగా మీడియాకు సైతం మార్గదర్శకాలను జారీచేసింది. ఎలక్ట్రానిక్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తావు లేకుండా సూచనలు చేసింది.
రాముడిదే భూమి..
దేశాన్ని కుదిపేసిన అయోధ్యలోని వివాదంలో ఉన్న స్థలం రామ్‌లల్లాకే దక్కుతుందని నవంబర్ 9న సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 1045 పేజీలున్న తీర్పు సారాంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 45 నిమిషాల పాటు చదివి వినిపించారు. ‘వివాదాస్పద ప్రాంతంలో రాముడు జన్మించాడన్నది హిందువుల విశ్వాసం ముస్లింలు కూడా ఆ ప్రాంతం గురించి అదే చెబుతారు. హిందువుల విశ్వాసం నిర్వివాదాంశం. అక్కడ సీతా రసోయి, రామ్ చబుత్ర, బందర్ గృహ్ ఉండటం ఆ ప్రాంతం మతపరమైన వాస్తవానికి దర్పణం పడుతోంది. ఆ స్థలానికి లాంఛనప్రాయంగా రాముడే యజమాని’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. రామాలయ నిర్మాణానికి మూడు నెలల్లోగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రార్థనా స్థలాల కూల్చివేతతో నష్టపోయిన ముస్లింలకు మసీదు నిర్మించుకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా అయోధ్యలో ఒక మంచి అనువైన ప్రదేశంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని పేర్కొంది. ప్రతిపాదిత ఆలయ నిర్వహణకు షెబైటి హక్కులు తమకు ఉన్నాయన్న నిర్మోహి అఖడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. మసీదు కింద 8-10 వ శతాబ్దాల నాటి వలయాకార ఆలయ ఆనవాళ్లున్నాయని రిపోర్టులు చెబుతున్నాయని ఇవి ఇస్లాంకు సంబంధించినవి కావని కూడా స్పష్టం చేసింది. విశ్వాసాలు, నమ్మకాలు ఆధారంగా కాకుండా సాక్ష్యాల ప్రాతిపదికపైన మాత్రమే కేసును పరిష్కరించినట్టు పేర్కొంది. వివాదాస్పద స్థలాన్ని మూడు ముక్కలు చేయాలన్న హైకోర్టు తీర్పు సరైంది కాదని ధర్మాసనం పేర్కొంది. వివాదాస్పద ప్రదేశాన్ని విభజించడం వల్ల ఎవరి ప్రయోజనాలూ నెరవేరవని శాంతి భద్రతల పరిరక్షణకూ ఏ మాత్రం దోహదం కాదని, పిటిషనర్ల అభ్యర్థనలకూ, కోర్టు ఇచ్చిన తీర్పునకూ ఎలాంటి సంబంధం లేదని ధర్మాసనం పేర్కొంది. నిర్మోహి అఖడా వేసిన దావాకు కాలదోషం పట్టిందని, దానిని కొట్టివేసింది. సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డు , రామ్‌లల్లా విరాజ్‌మాన్ దావాలకు మాత్రం కాలదోషం పట్టలేదని పేర్కొంది.
పూజల ఆధారంగా నిర్ణయం..
రామ్‌లల్లాకు వివాదస్పద స్థలం చెందుతుందనడానికి కోర్టు అక్కడ జరిగే పూజలు, ప్రార్థనలను పరిగణనలోకి తీసుకుంది. బాబ్రీ కట్టడం గుమ్మటాలు వెలుపలి భాగం హిందువుల పూజలు అప్రతిహతంగా సాగేవనడానికి గట్టి ఆధారాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. 1857లో గోడ నిర్మాణం జరిగినా పూజలు ఆగలేదు. అంటే వెలుపలి భాగం అప్పటికే హిందువుల అధీనంలో ఉన్నట్టని ధర్మాసనం పేర్కొంది. నిర్మాణం లోపలి భాగం విషయానికి వస్తే 1857 ప్రాంతంలో అవధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తెచ్చుకునే వరకూ హిందువులు పూజలు చేసేవారని చెప్పడానికి ఆధారాలున్నాయి. 16వ శతాబ్దం నుండి 1857 వరకూ నిర్మాణం లోపలి భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనడానికి ముస్లింలు ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు. అయితే ఆ తర్వాత 1949 వరకూ అక్కడ నమాజ్ జరిగిందనేందుకు సాక్ష్యాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. రాముడు అయోధ్యలో జన్మించినట్టు దాదాపు అందరూ అంగీకరించినా ఆ నగరంలో ఎక్కడ పుట్టాడనేదానిని తేల్చడం సమస్యగా మారడంతో ధర్మాసనం వాల్మీకి రామాయణాన్ని, స్కంధ పురాణాన్ని, తులసీదాస్ రామచరితమానస్‌ను పరిగణనలోకి తీసుకుంది. ఇవి ఆధారాలు కావని కొట్టి పారేయలేమని పేర్కొంది. హిందూ మతానికి ఇలాంటి గ్రంథాలే మూలమని అభిప్రాయపడింది. అందులోని శ్లోకాలను కూడా ఊటంకించింది.
పురావస్తు నివేదికలే ఆధారం
కోర్టు తన తీర్పును చెప్పడంలో ప్రధానంగా పురావస్తు శాఖ నివేదికలనే ఆధారంగా చూపింది. బాబ్రీ కట్టడం కింద హిందూ నిర్మాణ శిథిలాలున్నట్టు పురావస్తు శాఖ తవ్వకాల్లో స్పష్టమైందని సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ నిర్మాణం క్రీస్తుశకం 12వ శతాబ్దినాటిదని అంచనావేస్తున్నట్టు పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో శాస్ర్తియ దర్యాప్తు బాధ్యతను పురావస్తు శాఖకు అలహాబాద్ హైకోర్టు 2002లో అప్పగించింది. పురావస్తు తవ్వకాల్లో మసీదు కింద 12వ శతాబ్దికి చెందిన హిందూ నిర్మాణ శిథిలాలు బయటపడ్డాయి , ఆ నిర్మాణ గోడలను ఆసరాగా చేసుకుని ముస్లింలు ఒక కట్టడాన్ని నిర్మించారు, హిందూ నిర్మాణానికి 17 వరుసల్లో ఐదేసి స్తంబాలున్నాయి. అయితే దానిని ఎందుకు ధ్వంసం చేశారన్న దానిపై స్పష్టత లేదు, మసీదు నిర్మించేందుకే పాత నిర్మాణాన్ని కూలగొట్టారని చెప్పేందుకు కూడా ఆధారాలు లేవు, మసీదు దిగువన 8 నుండి 10 వ శతాబ్ది కాలం నాటి వలాయాకార ఆలయ నిర్మాణం ఆనవాళ్లున్నాయి ఇవి ఇస్లాంకు సంబంధించినవి కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో 1976-77లో ఒక మారు, 2003లో మరోమారు తవ్వకాలు చేపట్టారు. రెండోసారి జరిగిన తవ్వకాల నివేదికను సుప్రీంకోర్టు ఆధారం చేసుకుంది. అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం ఆదేశంతో 2003 మార్చి 12 నుండి 2003 ఆగస్టు 7వ తేదీ వరకూ బీఆర్ మణి ఆధ్వర్యంలో బృందం భూగర్భంలోకి చొచ్చుకెళ్లే రాడార్ విధానంలో తవ్వకాలు నిర్వహించింది. అదే ఏడాది ఈ కమిటీ 574 పేజీల నివేదికను ఇచ్చింది.
ట్రస్టు ద్వారా ఆలయం
భూమిపై నేరుగా ఎవరికీ కోర్టు హక్కులు కల్పించలేదు. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రిసీవర్‌కు అప్పగించాలని, రిసీవర్ ట్రస్టుకు ఇవ్వాలని స్పష్టం చేసింది. బాబ్రీ కట్టడం గుమ్మటాల కింద భాగం, గుమ్మటాల వెలుపలి భాగం, సహా వివాదాస్పద ప్రాంతం మొత్తం రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు దక్కుతుందని పేర్కొంది. ఈ స్థలాన్ని మూడు నెలల్లో కేంద్రప్రభుత్వం నియమించే ట్రస్టుకు అప్పగించాలని, ఆ ట్రస్టు ద్వారానే ఆలయ నిర్మాణం జరగాలని కూడా పేర్కొంది. అయోధ్య భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 6,7 కింద దఖలుపడ్డ అధికారాలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఒక పథకాన్ని రూపొందించాలని సూచించింది. ఒక ట్రస్టు లేదా బోర్డు లేదా మరో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ట్రస్టులో నిర్మోహి అఖడాకు ప్రాతినిధ్యం ఉండాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆలయానికి అన్నీ సిద్ధం
అయోధ్యలోని కరసేవక్‌పురంలో మూడు దశాబ్దాలుగా అక్కడి శిల్పులు తదేకదీక్షగా అందమైన శిల్పాలను రూపుదిద్దుతున్నారు. స్తంభాలు, పైకప్పు, మెట్లు, ఇలా ఆలయంలోని వివిధ విభాగాలకు కావల్సిన వాటన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. 1989 నుండి ఇంత వరకూ ఒక్క రోజు కూడా శిల్పులు విశ్రమించలేదు. ఫలితంగా ఇప్పటికే అక్కడ 1.25 లక్షల ఘనపుటడుగుల రాళ్లను చెక్కారు. వీటితో ఆలయంలో ఒక అంతస్తును కట్టేయవచ్చు. రామజన్మభూమి న్యాస్ నేతృత్వంలోని వందలాది మంది శిల్పులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఒక్క గ్రాము ఇనుము కూడా వాడకుండా రాముడి ఆలయం నిర్మించాలనేది వారి ఆశయం. ప్రస్తుతం 2.77 ఎకరాల స్థలంలోనే సీతా రసోయి, సీతా కూప్, రామ్‌చబుత్రా, శేషావతార్ మందిర్ ఉన్నాయి. దీనిచుట్టూ మరో 67 ఎకరాలు కేంద్రం అధీనంలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏర్పాటయ్యే రామాలయ నిర్మాణ ట్రస్టు గతంలో రామజన్మభూమి న్యాస్ రూపొందించిన డిజైన్ ప్రకారమే భవ్యమందిరాన్ని నిర్మించాలని ఆశిస్తున్నట్టు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జే చెబుతున్నారు. ప్రముఖ శిల్పి చంద్రకాంత్ సోంపురా రూపొందించిన ఆకృతి ఆధారంగానే రామమందిరాన్ని నిర్మించాలని వీహెచ్‌పీ భావిస్తోంది. అప్పటి వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్ సూచన మేరకు 1989లో ఈ ఆకృతిని రూపొందించారు. ఉద్యమం సందర్భంగా ఆ నమూనాయే ప్రజల్లో భాగా ప్రాచుర్యం పొందింది. అందువల్ల దీని ఆధారంగానే నిర్మాణం జరుగుతుందని అంతా భావిస్తున్నారు. మందిరానికి 212 స్తంభాలు అవసరం కాగా, వీటిలో 106 స్తంభాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇవన్నీ కింది అంతస్తుకు సరిపోతాయి. ప్రధాన శిల్పి రజనీకాంత్ సోంపురా మరణంతో గత జూలైలో పనులు ఆగిపోయాయి. మళ్లీ 250 మంది శిల్పులతో పనులు ప్రారంభించాల్సి ఉందని పర్యవేక్షకులు అన్నూభాయ్ సోంపురా అన్నారు. ఆలయం పనులు పూర్తికావాలంటే కనీసం ఐదేళ్లుపడుతుందని అన్నారు. రాజస్థాన్ నుండి శిలలు తీసుకురావాలి, శిల్పాలకు తెల్లటి సిమెంట్‌తో అతికించాలి. గర్భగుడికి గోడలు నిర్మించాలి, పాలరాయితో చౌకత్‌లు చెక్కాలి, అన్నింటికీ మించి ఆలయ శిఖరం నిర్మించాలి, ఇవన్నీ జరగాలంటే మరికొంత సమయం అంతా వేచి ఉండాల్సిందే. *

బీవీ ప్రసాద్ 99633 45056