ఈ వారం స్పెషల్

మహిమాన్వితుడు మణికంఠుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందళ దేశాన్ని పాలించే రాజశేఖరుడు సంతానం లేక తీవ్ర మానసిక క్షోభ పడుతుంటాడు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజశేఖరుడు పంబా నదీ తీరంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఎక్కడి నుంచో పసిబిడ్డ ఏడ్చినట్టు వినిపించింది. ఆ ఏడుపుఎక్కడి నుంచి వచ్చిందో వెతకమని తన భటులను పంపిస్తాడు. ఒక పెద్దవృక్షం కింద పసిబాలుడు ఒంటరిగా కనిపించాడు. భటులు వెంటనే రాజుకు ఆ విషయాన్ని తెలిపారు. పిల్లలు లేని రాజు ఎంతో కుతూహలంతో ఆ బాలుడున్న వృక్షం వద్దకు వచ్చి, ఎంతో అందంగా ముద్దులొలికేలా ఉన్న ఆ శిశువును అక్కున చేర్చుకొని ముద్దాడుతాడు. ఆ బాలుడి మెడలో మణిహారం ఉండటంతో భగవంతుడే తనకు సంతానం లేదని గ్రహించి ప్రసాదించిన వరంగా పందళరాజు ఎంతో సంతోషిస్తాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డను తన రాజ్యానికి తీసుకెళ్తే రాజకుమారునిగా ప్రజలు ఆమోదిస్తారా? అన్న శంక ఒకవైపు మదిలో మెదులుతున్నా రాజపురానికి బయలుదేరతాడు. అరణ్యమార్గంలో వెళ్తుండగా అగస్త్య మహాముని తారసపడతాడు. మహారాజు తీసుకెళ్తున్న బాలుడిని చూసి- ‘ఈ బిడ్డ మీ రాజ్యానికే కాకుండా భూలోకానికంతటికీ వనె్న తెస్తాడు’ అని దీవిస్తూ, మెడలో మణిహారం ఉండటంతో ‘మణికంఠుడి’గా నామకరణం చేస్తాడు. వేటకు వెళ్లిన రాజు తొందరగా తిరిగి రావడాన్ని చూసి రాణి ఆశ్చర్యంగా ఎదురు వెళ్తుంది. తనకు ఆ బాలకుడు దొరికిన వృత్తాంతాన్ని రాజు వివరించడంతో సంతానం లేని రాణి ఎంతో పారవశ్యంతో పొంగిపోతుంది. రాజదంపతులు తమ ఆనందాన్ని పంచుకొనేందుకు దేశప్రజలతో కలసి సంబరాలు జరుపుకుంటారు.
బాలుడు పెరిగి పెద్దాడవుతున్న కొద్దీ పందళరాజ్యం కూడా సకల సంపదలతో తులతూగుతుంది. తమకు భగవంతుడు ప్రసాదించిన బాలుడి వల్లనే అంతా కలసి వస్తున్నదని రాజదంపతులు సంతోషిస్తుంటారు. మణికంఠునికి ఐదవ ఏటనే విద్య అభ్యసించడానికి గురువువద్దకు పంపిస్తారు. ఏది చెప్పినా అప్పటికప్పుడు గ్రహించడంతో గురువర్యులు ఆ బాలకుడిని కారణజన్మునిగా భావిస్తారు. రాజదంపతులకు మరింత ఆనందాన్ని కలిగిస్తూ రాణి గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిస్తుంది. భగవంతుడు ప్రసాదించిన బాలుడు రాజభవనానికి వచ్చాకనే, తమకు సంతానం కలిగిందని రాజదంపతులు మిక్కిలి సంతసిస్తారు. సకల విద్యల్లో మణికంఠుడు 12 ఏళ్లకే ఆరితేరుతాడు. అన్ని విధాలుగా యోగ్యుడైన మణికంఠుడికి పట్ట్భాషేకం చేసి శేష జీవితాన్ని భగవన్నామ స్మరణలో గడపాలని పందళరాజు భావిస్తాడు. ఆ విషయాన్ని రాణికి చెబితే ఆమె కూడా ఎంతో సంతోషిస్తుంది. అయితే, దుష్టుడైన మంత్రికి మణికంఠునికి రాజ్యం అప్పగించడం ఇష్టం లేనందున, మహారాణి మనసు మార్చాలని ప్రయత్నిస్తాడు. సొంత బిడ్డను రాజును చేయకుండా అడవిలో దొరికిన బాలుడికి ఎలా పట్ట్భాషేకం చేస్తారని రాణి మనసులో విషం నింపుతాడు. మణికంఠునిపై ప్రేమను కోల్పోయి ఏ విధంగానైనా అతడిని మట్టుబెట్టాలని రాణి, మంత్రి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఆ పన్నాగాలు పారకపోవడంతో చివరకు రాణి తాను అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడుతుంది. దిగులు చెందిన పందళరాజు వైద్యులను పిలిపించి, ఆమెకు తగిన చికిత్స చేయాల్సిందిగా అర్థిస్తాడు. తనకు వచ్చిన రోగానికి మందు లేదని, పులిపాలను చూర్ణంలో కలిపి మందు సేవిస్తే తప్ప తగ్గదని మంత్రి చెప్పమన్నట్టుగా రాణి తన భర్తకు వివరిస్తుంది.
పులిపాలను తీసుకొచ్చే వారికి ఎంత ధనమైనా ఇస్తానని రాజ్యమంతా చాటింపు చేసినప్పటికీ ఎవరూ ముందుకురారు. ఈ విషయం తెలిసిన మణికంఠుడు తానే వెళ్లి పులిపాలు తీసుకొస్తానంటాడు. అయితే తాను ఎంతో గారాబంగా పెంచుకున్న మణికంఠుడిని అడవికి పంపించడానికి రాజు ఇష్టపడడు. మణికంఠుడిని కుట్రపూరితంగా అడవికి పంపించించి క్రూరమృగాలకు ఆహారమయ్యేలా రాణి, మంత్రి వ్యూహం పన్నుతారు. పులిపాలు తీసుకొని రావడం మణికంఠుడికి తప్ప ఎవరికీ సాధ్యం కాదని వారు రాజుకు నచ్చజెప్పుతారు. తీవ్ర మనోవేదనతోనే మణికంఠుడిని పులిపాల కోసం అడవికి పంపించడానికి రాజు ఒప్పుకుంటాడు. అడవిలో వెళ్తున్నపుడు ఉపయోగపడుతాయని రెండు అరల సంచిలో- ఒక అరలో తినుబండారాలు, మరొక అరలో భగవంతుని నివేదనకు వస్తువులను మూటగట్టి (ఇరుముడి) మణికంఠునికి అందజేస్తారు. మణికంఠుడు పులులను వెతుక్కుంటూ అడవి మార్గంలో పయనిస్తుండగా ఎరుమేలిలో అటవీ ప్రాంత రాజు వావర్‌కు తారసపడతాడు. బాలుడి మెడలో ధగధగ మెరిసే మణిహారంపై కనే్నసిన వావర్ దానిని లాక్కోవడానికి ప్రయత్నించగా మణికంఠుడు అతడిని మట్టికరిపిస్తాడు. దీంతో వావర్ మణికంఠునికి శరణుజొచ్చి సేవకుడిగా మారుతాడు.
ఆ తర్వాత మణికంఠుడు అడవిలో ముందుకు వెళ్లగా- శాపం కారణంగా మహిషి రూపంలో ఉన్న రాక్షసుడు కనిపిస్తాడు. మహిషిని అతడు సంహరించగానే దేవతలు ప్రత్యక్షమై మణికంఠుడి నిజరూపాన్ని తెలుసుకుంటారు. తాను పులిపాల కోసం అడవికి వచ్చినట్టు చెప్పగానే దేవతలంతా పులుల గుంపుగా మారి మణికంఠుడితో కలిసి పందళరాజ్యానికి బయలుదేరుతారు. పులి వాహనుడై వచ్చిన మణికంఠుడిని చూసి ప్రజలు, రాజు, రాణి, మంత్రి భయభ్రాంతులకు గురవుతారు. తల్లి వైద్యానికి పులిపాలు పిండి ఇస్తానని మణికంఠుడు చెప్పగానే- అతడు సామాన్య బాలుడు కాదని, సాక్షాత్తూ భగవత్ స్వరూపుడిగా గ్రహించి తమను మన్నించమని అందరూ వేడుకుంటారు. మణికంఠుడికి పట్ట్భాషేకం చేయాలని రాజదంపతులు నిర్ణయించగా, తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్తానని అతను చెబుతాడు. తాను విసిరే బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు గుడి కట్టించమని కోరుతాడు. తమను వదిలివెళ్లవద్దని ఎంతగా వారు ప్రాధేయపడినప్పటికీ మణికంఠుడు ఒప్పుకోడు. చివరకు ఏటా మకర సంక్రాంతి రోజున ‘జ్యోతి’ రూపంలో దర్శనం ఇస్తానని చెప్పి అడవిలోకి వెళ్లిపోతాడు. మణికంఠుడు బాణం వదిలిన చోట అయ్యప్ప స్వామి ఆలయం వెలిసిందని పురాణ గాథ.
ఆలయ చరిత్ర..
అయ్య (విష్ణువు), అప్ప (శివుడు).. ఈ ఇరువురి పేర్ల సంగమంతో ‘అయ్యప్ప’ నామం పుట్టింది. హరిహర సుతునిగా అయ్యప్ప జన్మించినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. కేరళలోని పత్తినంతిట్ట జిల్లా పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో శబరికొండపై అయ్యప్ప కొలువుదీరాడు. సముద్ర మట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో దట్టమైన అటవీ ప్రాంతంలో 18 కొండల నడుమ శబరి గిరీశుని ఆలయం వెలిసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయాన్ని స్వయంగా పరుశురాముడు నిర్మించినట్టు పురాణగాధ.
రెండు వందల ఏళ్ల క్రితం 1819లో 70 మంది భక్తులు దర్శించగా ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్టు ఈ ఆలయాన్ని నిర్మించిన పందళరాజ వంశీయుల రికార్డుల్లో ఉన్నట్టు చారిత్రక పరిశోధకులు గుర్తించారు. 1907 వరకు శబరిమలలో అయ్యప్ప ఆలయానికి పైకప్పు ఎండుగడ్డి, ఆకులతో కప్పబడి ఉండేదట. గర్భగుడిలో అయ్యప్ప విగ్రహం కూడా శిలా రూపంలో ఉండేదని పూర్వీకులు చెబుతారు. గడ్డి, ఆకులు, తడకలతో ఉన్న ఈ ఆలయం 1909లో ఆగ్నికి ఆహుతి కావడంతో పునర్నిర్మించినట్టుల ఈ ప్రాంతవాసులు చెబుతారు. అప్పుడే అయ్యప్ప శిలావిగ్రహానికి బదులు పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానం అధీనంలో ఉండగా భక్తుల సంఖ్య ఏటా లక్షలాదిగా పెరగడంతో దేవస్థానం బోర్డు ఏర్పాటు చేసి, ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు కేవలం మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ‘జ్యోతి దర్శనాని’కి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజలకు కూడా తెరవడం ఆరంభించారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో 1945 నుంచి ఓణం వంటి పర్వదినాల సందర్భంగా ఆలయాన్ని తెరవడం ఆరంభించారు.
ఒకప్పుడు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకే పరిమితమైన శబరియాత్రలో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, మహారాష్టల్రకు చెందిన భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం మొదలైంది. 1950లో బందిపోటు దొంగలు ఆలయాన్ని ధ్వంసం చేసి విలువైన ఆభరణాలను దోచుకెళ్లడంతో దేవస్థానం బోర్డు, భక్తులు కలసి 1951లో ఆలయాన్ని మూడోసారి పునరుద్ధరించారు. భక్తుల సంఖ్య లక్షల నుంచి కోట్లకు చేరుకోవడంతో దేవస్థానం బోర్డు 1980 నుంచి 1982 మధ్యకాలంలో పంబ నదిపై వంతెన, సన్నిధానం వద్ద ఫ్లైఓవర్, క్యూ లైన్లు, విద్యుద్దీపాలు, మంచినీటి కుళాయిలు, వసతి గృహాలు, ఆస్పత్రి వంటి సదుపాయాలను సమకూర్చారు. పరుశరామ నిర్మితంగా చెప్పబడే ‘పదునెట్టాంబడి’ (18 రాతి మెట్లు) భక్తులు కొట్టే కొబ్బరి కాయలతో అరిగిపోవడంతో 1985లో వీటిపై పంచలోహ కవచాన్ని ఏర్పాటు చేశారు. 1989-90లో పంబ మార్గంలో కొంత భాగాన్ని, సన్నిధానం ఆవరణను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించారు.

మాలధారణం.. నియమాల తోరణం..
అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులే స్వయంగా ‘స్వాములు’గా మారి 41 రోజుల పాటు కఠోర (మండలం) దీక్ష పాటించాలి. కఠిన నియమాలతో కూడిన ఈ దీక్ష స్వామివారి దర్శనంతో ముగుస్తుంది. దీక్ష చేయనివారు కూడా అయ్యప్పను దర్శించుకోవచ్చు. కానీ, తలపై ‘ఇరుముడి’ ఎత్తుకొని పదునెట్టాంబడి (18 మెట్లు) ఎక్కడానికి అర్హులు కారు. దీక్ష చేపట్టిన స్వాములను మాత్రమే అయ్యప్ప అనుగ్రహిస్తాడని నమ్మకం. రెండు వందల ఏళ్ల క్రితమే అయ్యప్ప దీక్షలు కొనసాగినట్టు పందళరాజ వంశీయుల గ్రంధాల్లో నిక్షిప్తం అయినట్టు పెద్దలు చెబుతారు. 1819లో 70 మంది స్వాములు శబరి ఆలయాన్ని సందర్శించగా, వారి ద్వారా ఏడు రూపాయల ఆదాయం వచ్చినట్టు రాజవంశీయుల రికార్డుల్లో ఉంది. శబరి ఆలయాన్ని ఏటా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కొన్ని రోజుల పాటు మాత్రమే తెరుస్తారు. మిగతా కాలమంతా అయ్యప్ప ఆలయం మూసే ఉంటుంది. భక్తులు నవంబర్ 17న మండల పూజను ప్రారంభించి డిసెంబర్ 27న ముగిస్తారు. సంక్రాంతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఈ మధ్యకాలంలోనే దీక్ష వహించిన అయ్యప్పలు మండల పూజ, జ్యోతి దర్శనం (మకరవిళక్కు) అనే రెండు సందర్భాల్లో స్వామిని దర్శనం చేసుకుంటారు.
శబరిమల సందర్శనకు వచ్చే భక్తులు, స్వాములకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఎరుమేలి, రెండవది పంపానది. ఎరుమేలి మార్గాన్ని పెద్దపాదంగా, పంపా మార్గాన్ని చిన్నపాదంగా పిలుస్తారు. అయ్యప్ప తన తల్లి వైద్యం కోసం పులిపాలను తెచ్చేందుకు ఎరుమేలి మార్గంలోనే వెళ్లినట్టు విశ్వసిస్తారు. ఎరుమేలి వద్ద అయ్యప్పను మరో మతానికి చెందిన వావర్ అనే దొంగ అడ్డగించి యుద్ధం చేసి ఆ తర్వాత శిష్యునిగా, భక్తునిగా మారినట్టు జానపదులు చెబుతుంటారు. ఈ కారణంగానే అయ్యప్ప భక్తులు ఎరుమేలి వద్ద మొదట వావర్ స్వామి దర్గాను, ఆ తర్వాత అయ్యప్ప (ధర్మశాస్త) ఆలయాల్ని సందర్శించి ‘పేట తులాల’ అనే గిరిజన నృత్యాన్ని ఆడిన తర్వాతనే శబరియాత్ర ప్రారంభం అవుతుంది. ఎరుమేలి నుంచి పంపానదికి 80 కిలో మీటర్లు, పంపానది నుంచి 8 కిలో మీటర్ల దూరంలో శబరి గిరీశుని ఆలయం ఉంటుంది. ఎరుమేలి నుంచి వెళ్లే మార్గం దట్టమైన అడవిలోంచి కొండల మీదుగా రాళ్లు, రప్పలు, ముళ్లు దాటుకుంటూ వెళ్లడం అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ మార్గంలోనే అయ్యప్ప మహిషిని సంహరించినట్టు పురాణ గాధ. అయ్యప్పను సులభతరంగా దర్శించుకోవాలనుకునే వారు మాత్రం నేరుగా పంపానది వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఆలయానికి చేరుకుంటారు. ఏ మార్గం నుంచి వచ్చే భక్తులైనా తప్పనిసరిగా 8 కిలో మీటర్లు కాలి నడకన వెళ్లాల్సిందే. శబరి పీఠానికి చేరుకోవడానికి కాలినడకే శరణ్యం. తనను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కఠిన మార్గం ద్వారా చేరుకోవాల్సిందేనన్న నియామాన్ని అయ్యప్ప పెట్టాడన్న నమ్మకంతో ఇక్కడ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం లేదు. ప్రధాన మంత్రి, రాష్టప్రతి వంటి ప్రముఖులైనా అయ్యప్పను దర్శించుకోవాలన్నా 8 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాల్సిందే.
అనారోగ్యం కానీ, వయోభారంతో కానీ శబరికొండపైకి ఎక్కలేని వారిని పైకి తీసుకెళ్లడానికి డోలీ సౌకర్యం ఉంటుంది. డబ్బులు తీసుకుని స్థానికులు డోలీని మోస్తారు. ఏ మార్గం నుంచి వచ్చిన భక్తులైనా మొదట పంపానదిలో స్నానమాచరించిన తర్వాతనే శబరికొండకు బయలుదేరాలనేది నియమమం. శబరికొండపైకి ఎక్కి స్వామి సన్నిధానం చేరుకున్న తర్వాత మాల ధరించిన అయ్యప్పలను మాత్రమే 18 మెట్లపై నుంచి అనుమతిస్తారు. దీక్ష చేయకుండా వచ్చే వారిని పక్కనున్న మార్గం ద్వారా ఆలయంలోకి అనుమతిస్తారు. అయ్యప్ప దర్శనం తర్వాత ఇరుముడిని సమర్పించిన అనంతరం మెడలో మాలను తీసివేయడం నియమం. ఎక్కువ మంది భక్తులు మాలను శబరిలోనే విసర్జిస్తారు. కొందరు మాత్రం ఎక్కడైతే మాలను ధరించారో తిరిగి అక్కడికి వచ్చేదాక దీక్షను కొనసాగిస్తారు. *
పరమ పవిత్రం.. 18 మెట్లు
అయ్యప్పస్వామి దర్శనంలో భక్తులు పరమ పవిత్రంగా భావించేది ‘పదునెట్టాంబడి’నే (18 మెట్లు). ఈ మెట్లను పరశురాముడు స్వయంగా నిర్మించినట్టు పురాణగాధ. వీటిపై నుంచి వెళ్లాకే పరశురాముడు అయ్యప్పను దర్శించుకున్నట్టు భక్తజనుల విశ్వాసం. అయ్యప్ప ఆలయాన్ని మూడుసార్లు పునరుద్ధరించినప్పటికీ మెట్లను మాత్రం పునర్నిరించకుండా వాటినే యథాతథంగా ఉంచి, వాటికి పంచలోహ తాపడం చేశారు. మండలం పాటు దీక్ష చేసిన స్వాములు మాత్రమే ఇరుముడి తలపై ధరించి వీటిని ఎక్కడానికి అర్హులు. దీక్ష పూనకుండా అయ్యప్పను దర్శించుకునే భక్తులకు వేరే మార్గం ఉంటుంది. అయ్యప్ప సన్నిధానం 18 పర్వాతాల మధ్య ఉండటంతో 18 మెట్లు ఏర్పాటు చేసినట్టు పెద్దలు చెబుతారు. పొన్నంబలమేడు, గౌడెన్నల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, తంగమల, మ్యద్లుంల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కల్, తలప్పరమల, నీలిమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల, శబరిమల వంటి 18 పర్వతాలు ఉన్నాయి. 18 సంఖ్యకు పురాణాలు, ఇతిహాసాల్లో ప్రాముఖ్యత ఉంది. భగవద్గీత, మహాభారతం, చతుర్వేదంలో 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 పురాణాలు, ఉప పురాణాలు ఉన్నాయి. మహాభారత యుద్ధం, రావణ సంహారం 18 రోజులు జరిగినట్టు చెబుతారు.
మొదటి ఎనిమిది మెట్లు అరిషడ్వర్గాలు: ఇవి రాగద్వేషాలను సూచిస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం వంటివి అధిగమించాలని అర్థం.
తర్వాతి ఐదుమెట్లు పంచేంద్రియాలు: కళ్లు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ.
తదుపరి మూడు మెట్లు: గుణాలను సూచిస్తాయి. సత్యం, తామసం, రాజసం.
చివరి రెండు మెట్లు: విద్య, అవిద్యను సూచిస్తాయి.
ఆలయ ప్రవేశం.. వివాదం
గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో కేరళ రాష్ట్రం అట్టుడికిపోయింది. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ నెలన్నర పాటు ఆందోళనకారులకు, అయ్యప్ప భక్తులకు మధ్య కొనసాగిన వివాదం రణరంగాన్ని తలపించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు వయసు కలిగిన స్ర్తిలకు ప్రవేశం నిషేద్ధమన్నది అనాదిగా వస్తున్న ఆచారం. ఇది హిందువుల మత విశ్వాసం కూడా. దీనికి భిన్నంగా గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు ‘అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాల’ని తీర్పు ఇచ్చింది. తమకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిదంటూ కొందరు మహిళలు, నాస్తిక సంఘాలు, లింగ వివక్షను వ్యతిరేకించే మహిళా సంఘాలు, ఇతర మతాలకు చెందిన మహిళలు శబరి యాత్రకు బయలుదేరడంతో అయ్యప్ప ఆలయం వరకు అడుగడుగునా భక్తులు, హిందూ మత హక్కుల పరిరక్షణ సంస్థలు, సంఘాలు అడ్డుకోవడంతో పలుచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కేరళలోని శబరిమలకు సమీపంలోని అనేక పట్టణాలు,గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు నిషేద్ఞాజలు అమలు చేశారు. కోర్టు ఆదేశాలను అమలుచేయక తప్పదని కేరళలోని సీపీఎం ప్రభుత్వం భక్తుల విశ్వాసానికి విరుద్ధంగా ఆలయ ప్రవేశానికి బయలుదేరిన మహిళా ఆందోళనకారులకు రక్షణ కల్పించింది. దీంతో దేశవ్యాప్తంగా కేరళ ప్రభుత్వ వైఖరి పట్ల బీజేపీ సహా మరికొన్ని రాజకీయ పార్టీలు, విశ్వహిందూ పరిషత్ వంటి మతసంస్థలు, ధార్మిక సంస్థలు ఆగ్రహం ప్రకటించాయి. అయితే అయ్యప్ప ఆలయాన్ని తెరిచి ఉంచేది కొన్ని రోజులు మాత్రమే కావడంతో ఆ గడువు తీరిపోవడంతో అప్పటికి వివాదం సమసిపోయింది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టులో అనేక కేసులు పెండింగ్‌లో ఉండటంతో అయోధ్య వివాదంపై తుది తీర్పు ఇచ్చిన అప్పటి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఈ వివాదంపైనా తుది తీర్పు ఇస్తారని అంతా భావించారు. అయ్యప్ప ఆలయ వివాదంపై తీర్పు ఇచ్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి అప్పగించి గొగొయ్ పదవీ విరమణ చేశారు.
మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు..
అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి. దీంతో రుతుక్రమం వయసులో ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఈ మత విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ 1991లో కేరళ హైకోర్టు అయ్యప్ప ఆలయంలోకి 10-50 మధ్య వయసు కలిగిన మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ తీర్పును కొందరు సవాల్ చేస్తూ 2006లో సుప్రీంను ఆశ్రయించారు. కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని వాదించారు. ఈ కేసును విచారించి సెప్టెంబర్ 28, 2018లో సుప్రీం కోర్టు తన తీర్పులో- ‘ఆలయ ప్రవేశానికి స్ర్తి, పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీనిని అయ్యప్ప భక్తులు, హిందు ధార్మిక సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. ఆలయ ప్రవేశానికి సుప్రీం అనుమతి ఇచ్చిందని కొందరు మహిళలు మతాచారాలకు విరుద్ధంగా శబరిమలకు చేరుకోవడంతో గత ఏడాది ఆందోళనకర వాతావరణం ఏర్పడింది.
శబరిమల, మేడారం.. సారూప్యం
కేరళలోని అయ్యప్ప స్వామికి, తెలంగాణలోని వనదేవతలు సమ్మక్క-సారలమ్మల చరిత్రకు, ఆచార వ్యవహారాలకు మధ్య యాధృచ్చికంగా చాలా దగ్గరి సారూప్యం ఉంది. అయ్యప్ప స్వామి సహ్యాద్రి పర్వతశ్రేణుల మధ్య కారడవిలో కొలువైతే, సమ్మక్క-సారలమ్మ దండకారణ్యంలోని మేడారం వద్ద దట్టమైన అడవిలో గద్దెలపై కొలువుదీరుతారు. అయ్యప్ప ఆలయాన్ని ఏడాదిలో మూడుసార్లు మాత్రమే తెరిస్తే, సమ్మక్క-సారలమ్మలు రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఐదురోజుల పాటు భక్తులకు దర్శనం ఇస్తారు. అయ్యప్పను దర్శించుకొనే భక్తులు మొదట పంపానదిలో స్నానం ఆచరిస్తే, మేడారం యాత్ర సందర్భంగా జంపన్న వాగులో స్నానం చేశాక వనదేవతలను దర్శించుకుంటారు. అయ్యప్ప దర్శనానికి ముందు ఎరుమేలిలో వావర్ స్వామిని దర్శించుకోవాల్సి ఉండగా, మేడారంలో గట్టమ్మతల్లిని దర్శించుకోవాల్సి ఉంటుంది. పందళరాజు రాజశేఖరుడు అడవిలో వేటకు వెళ్లినప్పుడు శిశువు రూపంలో మణికంఠుడు (అయ్యప్ప) లభించగా, మేడారం కోయదొర పగిడిద్దరాజుకు సమ్మక్క అడవిలో దొరుకుతుంది. అయ్యప్ప పులిమీద స్వారీ చేసినట్టుగానే సమ్మక్కకు కూడా పులినే వాహనం. శబరికొండపై అయ్యప్ప అదృశ్యం అయినట్టుగానే, సమ్మక్క చిలుకలగుట్టపై అదృశ్యం అవుతుంది. అయ్యప్పను కొలిచే భక్తులు వినాయకుడు, కుమారస్వామిని కొలిచినట్టే, సమ్మక్క భక్తులు ఆమె కూతురు సారలమ్మ, సోదరుడు జంపన్నను కొలుస్తారు. అయ్యప్పను భక్తులు నెయ్యితో పూజిస్తే, సమ్మక్కకు బంగారం (బెల్లం) మొక్కుగా సమర్పిస్తారు. అయ్యప్ప ఏడాదికి ఒక్కసారి భక్తులకు మకరజ్యోతిగా దర్శనం ఇస్తే, సమ్మక్క-సారలమ్మలు రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు దర్శనం ఇస్తారు. శబరియాత్ర జనవరిలో ముగిస్తే, మేడారం జాతర ఫిబ్రవరిలో ముగుస్తుంది.

ఆరోగ్య ప్రాప్తిరస్తు!
శబరియాత్రకు నిష్ఠతో వెళ్లడం ఆషామాషీ కాదు. అయ్యప్ప మాల ధరించాలంటే మండలం పాటు (41 రోజులు) కఠిన దీక్షను పాటించాలి. దీక్షలోని కఠోర నియామావళి వెనుక చక్కటి ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. దీక్షా నిబంధనల నుంచి ఎవరికీ మినహాయింపు లేదు. రాజుకైనా, భటుడికైనా, సంపన్నుడైనా, కటిక దరిద్రునికైనా ఒక్కటే నియమావళి. మొదటిసారి అయ్యప్ప మాల ధరించే స్వాములు తప్పనిసరిగా నల్లటి దుస్తులే ధరించాలి. గురుస్వామి హోదాకు చేరుకున్న తర్వాత మాత్రమే కాషాయం, నీలి దుస్తులు ధరించవచ్చు. నల్లటి దుస్తులు తమోగుణాన్ని సూచిస్తాయి. నలుపు శనికి ప్రీతి. నలుపు రంగు కావడంతో దుస్తులు మాసిపోతాయన్న దిగులు ఉండదు. నల్లటి రంగుకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది. ఉతికి అరిస్తే త్వరగా ఆరిపోతాయి. దీక్ష సమయంలో స్వాములు బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం బుద్ధికి, శక్తికి నిదర్శనం. స్వాములు దీక్ష సమయంలో కటిక నేలపై వస్త్రం పరుచుకొని పడుకోవాలి. నేలపై పడుకోవటం వల్ల వెన్నుపూస గట్టిపడి అయ్యప్ప దర్శనానికి వెళ్లినప్పుడు శబరి పర్వతారోహణ సులువు అవుతుంది. స్వాములు ప్రతినిత్యం సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత రెండు సార్లు చన్నీటితో తలస్నానం ఆచారించాలి. చన్నీటి స్నానం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవత్ ధ్యానానికి ఉపకరిస్తుంది. బ్రహ్మీ ముహుర్తంలోనే పూజించడం వల్ల భగవంతుడు ప్రసన్నం అవుతాడని నమ్మకం. అయ్యప్పలు ఏకభుక్తం (మధ్యాహ్నం ఒకే పూట భోజనం) మాత్రమే చేయాలి. మద్యం, మాంసం, పొగాకు, ధూమపానం, తాంబూలం పూర్తిగా నిషిద్ధం. పూర్తిగా సాత్వికాహారం మాత్రమే స్వీకరించాలి. ఉదయం, సాయంత్రం అల్పాహారం, పండ్లు స్వీకరించవచ్చు. ఒంటి పూట భోజనం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండడం సులభతరం అవుతుంది. తాంబూలం, మసాలా దినుసులు, ఉల్లిపాయలు వంటివి భోజనంలో నిషిద్ధం. ఇవి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అయ్యప్ప దీక్షాధారులు ముఖ క్షవరం, కేశ ఖండనం చేయరాదు. చెప్పులు ధరించకూడదు. తోటివారిని ‘అయ్యప్ప’ అని మాత్రమే పిలవాలి. పిల్లలను మణికంఠుడని, మహిళలను మాలికాపురం మాత అని సంభోదించాలి. మధ్యాహ్నం స్వీకరించే భోజనాన్ని భిక్షగా, రాత్రి చేసే అల్పహారాన్ని సద్దిగా పిలవాలి. నొసట ఎల్లప్పుడు విబూది, చందనం, కుంకుమ బొట్టు ధరించాలి. దీక్షా సమయంలో భార్యతో పాటు స్ర్తి మూర్తులందరినీ మాతలుగా భావించాలి. అశుభకార్యాలకు వెళ్లడం నిషిద్ధం. దారిలో ఎక్కడైనా శవయాత్ర ఎదురైతే తలస్నానం ఆచరించి అయ్యప్ప స్వామికి హారతి ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలి.

- వెల్జాల చంద్రశేఖర్ 98499 98097