ఈ వారం స్పెషల్
దక్షాధ్వర హరో హరః
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రపంచానికి ఆధ్యాత్మిక, దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా, మహోన్నతంగా అందించిన భరతభూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతారాల రూపంతో స్వయంగా వసించినది వ్యధరణి మన భారతదేశం. ముల్లోకాల్లోని (కైలాసం, వైకుంఠం, బ్రహ్మ లోకం) దేవుళ్లకూ, భూలోకంలోని మానవులకు ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలను కలిగినది భారతదేశం. అందుకే ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో పండుగలూ, ఆచార వ్యవహారాలూ, సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో భగవంతుని సాన్నిధ్యానికి భక్తుని చేరువ చేసిన మహత్తర ఆధ్యాత్మిక వైభవం భారతదేశం సొంతం.. ఈ పరంపరలో భారతీయ సనాతన పండుగల్లో మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గొప్ప పండుగ. వేద కాలం నుంచి భక్తులు ఎంతో నిగ్రహ నియమ నిష్టలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మహా పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులు శాస్తయ్రుక్తంగా నిర్వహించుకుంటూ పరమశివుని కృపకు పాత్రులవుతున్నారు. మహాశివరాత్రి విశేషాలనూ, శివలీలనూ, శివలింగస్కాంద, బ్రహ్మాండాది పురాణాలు, శివగీత తదితర ఎన్నో ఉద్గ్రంథాలు వివరిస్తున్నాయి.
శివుడు, పార్వతి, విష్ణు, బ్రహ్మల పుట్టుక
సకల సృష్టికి పూర్వం సమస్తం జలమయమై ఉండగా, అందులో నుండి గొప్ప మహోజ్వల తేజస్సు పుట్టింది. ఆ తేజస్సులో.. సగం తేజస్సు నుండి త్రిశూలం, శంఖం, ఢమరుకం, ధరించిన.. ఫాలన (నొసట) అగ్ని నేత్రంతో (మూడవ కన్నుతో) పరమేశ్వరుడు, మిగిలిన సగం తేజస్సు నుండి జగజ్జనని పరమేశ్వరి (పార్వతి) ఉద్భవించారు. ఇలా పార్వతీ పరమేశ్వరులు తొలి ప్రకృతి పురుషులు.. ఆదిదంపతులైనారు. ఈ క్రమంలో వారి అనుగ్రహం చేత విష్ణుమూర్తి ఆవిర్భవించాడు. అనంతర కాలంలో శివుడు.. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువుకు సుదర్శన చక్రాన్ని బహూకరించినట్లు శివపురాణం చెబుతోంది. ఈ నేపథ్యంలో మహా విష్ణువు శేషశయ్యపై ఎన్నో వందల ఏళ్లు యోగ నిద్రలో ఉన్నాడు. ఈ సమయంలో అతని నాభి కమలం నుండి పంచముఖ బ్రహ్మ ఉద్భవించాడు. కాలక్రమంలో శివుడు కైలాసానికి, విష్ణువు వైకుంఠానికి, బ్రహ్మ.. బ్రహ్మలోకానికి అనగా ముల్లోకాలకు ఆ త్రిమూర్తులు అధిపతులై సృష్టి, స్థితి, లయకారులై యావత్ జీవ రాశికి మనుగడ సాగిస్తున్నారు.
మహాశివరాత్రి ఆవిర్భావం
అనేక సందర్భాలను బట్టి తమలో ఎవరు గొప్ప? అనే గర్వం బ్రహ్మ, విష్ణువుల్లో తలెత్తింది. దీంతో శివుడు మహా నిశీధిలో పాతాళం, భూమి, ఆకాశాలను కలుపుతూ జాజ్వల్యమానకోటి సూర్య కాంతులతో ప్రకాశిస్తూ.. ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా.. అనంతమైన జ్వాలాలింగం (అగ్ని స్తంభం) రూపంలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుత లింగం నుంచి ఈశ్వరుడు లింగోద్భవ మూర్తిగా నాలుగు భుజాలతో మహావిష్ణువు, బ్రహ్మదేవుళ్లకు దర్శనమిచ్చాడు. తన మహాలింగం ఆది, అంతాలను కనుగొనాలనీ, అలా మీలో ఎవరు కనుగొంటే వారే గొప్పవారవుతారని వారిరువురికి పరీక్ష పెట్టాడు శివుడు. ఈ క్రమంలో బ్రహ్మ, విష్ణువు లెవరూ ఆ అనంతమైన శివలింగాన్ని ఆది, అంతాలను కనుగొనలేక వైఫల్యం చెందారు. దీంతో వారి గర్వాన్ని అణచిన సందర్భాన్ని.. మహాశివరాత్రిగా.. సదాశివుడు ప్రపంచానికి ప్రకటించాడు. ఇలా తాను జ్వాలాలింగ రూపంలో ఉద్భవించినట్టి మాఘమాస, బహుళ చతుర్దశి, ధనిష్టాన నక్షత్రం, దివ్య (నిశీధి) రాత్రి.. మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదన్నాడు శివుడు.. ఈ మహా పర్వదినాన.. శివలింగాన్ని దర్శించి, అభిషేకించి.. ఉపవాసాలతో ఆరాధించి జాగరణ చేసిన వారు తనకు ప్రీతిపాత్రులై తన కృపను చూరగొని సకల మహా పాపాల నుంచి విముక్తులవుతారు.. శివ సాయుజ్యాన్ని (శివైక్యం) పొందుతారని ఈశ్వరుడు ప్రపంచానికి దివ్య సందేశమిస్తూ మహా శివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకొని పునీతులు కావాలని ప్రజలను ఆదేశించాడు బోళా శంకరుడు. ‘శివ.. రాత్రి’ శివం (శుభం) రాత్రి. శుభం కలిగించే రాత్రి.. రాత్రి తల్లి లాంటిది.. సకల ప్రాణికోటిని తన ఒడిలోకి హాయిగా చేర్చుకొని సేదతీర్చి సుఖనిద్ర నిస్తుంది.
ఓంకార స్వరూపుడు
పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వేదాలు ఘోషిస్తున్నాయి. ఓంకారానికి నామాంతరం ప్రణవం. రోదనలు బాపే వాడైనందున రుద్రుడు అయినాడు. భూత భవిష్యత్ వర్తమానాలనే త్రికాలాలకు అధిపతి శివుడు. ఈశం ఇవ అక్షరాల కలయిక శివం అవుతుంది. మంగళప్రదమూ శివమూ అయినది శివతత్వము. అందుకే శివుడు మంగళప్రదుడు అయినాడు. కోరిన వారికి కొంగు బంగారమూ, బోళాశంకరుడు అయినాడు. ‘శివం’ అంటే శుభం.. ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యమనే పదం వచ్చింది. సర్వసంపద్రూపుడు శివుడు. అభవుడు పుట్టుక లేనివాడు.
మహాదేవుడికి ప్రతీకగా లింగం
లింగం అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీక అని అర్థం. శివలింగం సర్వశుభంకరుడైన మహాదేవుడికి ప్రతీకగా.. శివునిచే మహాశివరాత్రి ఆవిర్భావమైన నాటి నుంచి భక్తకోటితో కొలువబడుతూ విరాజిల్లుతోంది. శివుడు తన పంచముఖాల నుంచి పంచ లింగాలను సృష్టించాడు. శివుని ఐదు ముఖాలు సద్యోజాతా, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానా.. పంచభూత తత్వాలతో ఆ లింగాలు ఐదు విధాలుగా ప్రసిద్ధికెక్కాడు. జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలో భూలింగం, అరుణాచలంలో అగ్ని లింగం, చిదంబరంలో ఆకాశ లింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం.. ఇవి సర్వవ్యాపకుడైన రుద్రుడు కోటానుకోట్ల సూర్యుల కాంతితో అఖండంగా వెలుగొందే మహోజ్వల తేజోమూర్తి మహాశివుని స్వయం సృష్టి లింగాలుగా పౌరాణికులు చెబుతారు. ఈ లింగాలను దర్శించుకుంటే మహాశివుని ఐదు ముఖాల స్వయంగా దర్శించు కున్నట్లేనని శివపురాణం చెబుతోంది. కాగా పంచభూతాల లింగాలు, స్వయంభూ లింగాలు, జ్యోతిర్లింగాలు వెలిశాయి. భూలోకంలో ఈ లింగాలు 12గా వెలిశాయి. లింగాలలో చల, అచల, పార్థివ, మృత్తిక, రస మొదలైనవి ఉన్నాయి.
త్రిమూర్తుల కలయికకు ప్రతీకగా ఆలయాల లింగాలు
శివాలయాల్లోని లింగాలు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కలయికకు ప్రతీకలుగా 3 భాగాలుగా ఉన్నాయి. అడుగు భాగం బ్రహ్మ భాగం, మధ్యభాగం మహావిష్ణువు భాగం, స్తంభాకార భాగం రుద్ర (శివుని) భాగం. ఇదే పూజా భాగం. దీనిపై బ్రహ్మసూత్రాలుగా పేర్కొనే గీతలు ఉంటాయి. ఇలా గీతలు ఉన్న శివలింగాలనే పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాగా వ్యాపకశీలమైన ప్రకృతి తత్వమే యోని. ఉత్పత్తికి ఉపాదాన కారణమైన పరమశివుడే శివలింగం.. లోతుగా పరిశీలిస్తే.. యోని, లింగం కలయిక సృష్టి కార్య స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. (ఇది శివలింగంకు ప్రతీక) యోనిని, మూలకారణ శక్తిగా వేదాలు, ఉపనిషత్తులు స్పష్టపరిచాయి. ఇవే కాకుండా భగవద్గీత కూడా (14వ అధ్యాయం, 4వ శ్లోకం) సకల ప్రాణులందు ఉత్పత్తి అగుచున్న మూర్తులకు (జీవజాలానికి) మహాద్యోని ప్రకృతి. అందు బీజ స్థాపన చేయువాడు శివుడు ప్రకృతి తల్లి. వాటికి తండ్రిని నేను, అని గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ పరంగా, ఈ భావాన్ని శివ పార్వతులకు (ప్రకృతీ పురుషులకు) అన్వయిస్తే సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి. పరమేశ్వరుడే తండ్రి. ఇదే జగజ్జనని, జనక భాగంగా సౌందర్య లహరిలో జగద్గురువు ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు హృద్యంగా, భక్తి ఆధ్యాత్మిక భావనలతో పరమోన్నతంగా చెప్పాడు.
వివిధ నామాలతో శివుడు.. ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు
సౌరాష్టల్రో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, డాకినీ క్షేత్రంలో భీమ శంకరుడు, వారణాసిలో (కాశీ) విశ్వనాథుడు, నాసికంలో త్య్రంబకేశ్వరుడు, ప్రజ్వలం (పర్లి)లో వైద్యనాథేశ్వరుడు, దారుకావనంలో నాగేశ్వరుడు, సేతుబంధంలో రామేశ్వరుడు, ఘృష్ణేశ్వరంలో ఘృష్ణేశ్వరుడుగా ఆయా పేర్లతో క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కగా భక్తకోటి సందర్శిస్తూ తరిస్తున్నారు.
‘శివార్చనతో తరించిన భక్తులెందరో..
ధూర్జటి అనే మహాకవి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం’ అనే శతకాన్ని రచించి శివుని కృపకు పాత్రుడై శివైక్యం చెందాడు. మార్కండేయుడు శివలింగార్చన చేసి చిరాయువును (చిరంజీవి) పొందాడు. అర్జునుడు శివునితో యుద్ధం చేసి అతని ప్రీతిని పొంది అతని నుంచి తిరుగులేని పాశుపతాస్త్రాన్ని సాధించాడు. సత్కీరుడు నూరు పద్యాలతో స్తుతించి శివసాయుజ్యాన్ని పొందాడు. శ్రీకాళహస్తిలో తిన్నడు (్భక్త కన్నప్ప), సాలె పురుగు, పాము, ఏనుగు శివలింగార్చన గావించి శివానుగ్రహాన్ని సాధించగా, వాటి పేరుతోనే శ్రీకాళహస్తిగా వెలసి ప్రసిద్ధి కెక్కింది. బాణాసురుని సహస్ర లింగార్చనకు ఆటంకం కలుగకుండా, అతని వాకిట స్వయంగా శివుడు కాపలాదారుగా ఉన్నాడు. ఇలా శివారాధనలతో భక్తశిఖామణులెందరో శివ సాయుజ్యాన్ని పొంది చరితార్థులైనారు. ఈ నేపథ్యంలో, శివానుగ్రహం పొందడానికి శివరాత్రి కంటే మహా మహిమాన్వితమైన పర్వదినం మరొకటి లేదు. యజ్ఞ యాగాదులు ఒక ఎతె్తైతే శివరాత్రి నాడు శివార్చన ఒక్కటి ఒక ఎత్తు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఈశ్వరుడి లింగోద్భవం జరిగి గొప్ప ‘మహాశివరాత్రి’ ఏర్పడినందున ఆ దినం రాత్రి ‘అతిరాత్ర యాగం’ నిర్వహిస్తారు. ‘అతిరాత్రం’ అంటే రాత్రిని జయించమని అర్థం. చీకటితో పోలుస్తూ చెప్పే అజ్ఞానం, దుఃఖం, బాధ వంటి ప్రతికూల పరిస్థితులను అతిరాత్రం జయిస్తుంది. విశ్వ సామరస్యాన్నీ, సకల జీవరాశి సంక్షేమాన్నీ ఆ యాగం కాంక్షిస్తుంది.
‘తిరుమల క్షేత్రపాలకుడు శివయ్య’
తి.తి.దే ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిల తీర్థం. పరమేశ్వరుడు తిరుమల క్షేత్ర పాలకుడు కావడమే ఇందుకు కారణం.
శివస్తోత్రాలతో మారుమోగే ప్రసిద్ధ దేవాలయాలు
మహాశివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు, కాశీ, రామేశ్వర తదితర ప్రసిద్ధ దేవాలయాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కాళేశ్వరం, వేములవాడ, అమరారామం, కాకతీయుల వేయి స్తంభాల గుడి (హన్మకొండ) రామప్ప దేవాలయం, గణపేశ్వరాలయం (గణపురం కోట గుళ్లు) తదితర శైవ పుణ్యక్షేత్రాలన్నీ జగజ్జేగీయమానంగా, అపర కైలాస శిఖరంగా ప్రకాశిస్తూ.. శివదర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ.. భక్తకోటి ఓం నమః శివాయః.. శంభోశంకర.. హరహర మహాదేవ స్తోత్రాలతో.. శివనామస్మరణలతో.. భజనలతో.. నగర సంకీర్తనలతో.. జయజయ శివశివ.. ఓంకార నాదాలతో... ఆలయాల గంటల ధ్వనులతో మారుమోగుతూ శివభక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ శివైక్య మార్గాన నడిపిస్తున్నాయి.. ఓం నమః శివాయః *