ఈ వారం స్పెషల్

ఇదిగో సేతువు... అదిగో హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హిందువులు పురాణాలలో చెబుతున్నట్లు భారతదేశం-శ్రీలంకలను అనుసంధానం చేస్తున్న ‘సేతువు’ ఉన్నమాట నిజమేనా? పరిశోధకులకు దొరికిన ఆధారాలనుబట్టి అది నిజమే!?’’. అది చెప్పడానికి బోలెడంత కథ ఉంది...
‘ఆ సేతువు సహజసిద్ధంగా ఏర్పడినది కాదు సుమా, మానవులు నిర్మించినది. అక్కడి సముద్రంలో సేతువున్న చోట ఉన్న ఇసుక నాలుగువేల ఏళ్లనాటిది. దానిపై ఉన్న రాళ్లు ఏడువేల ఏళ్లనాటివి’...ఎవరో ఎక్కడినుంచో తెచ్చి రాళ్లను వాడారు.’
ఇవి అల్లాటప్పా మనుషులు చెప్పిన వివరాలు కావు. సాధికారిక సాక్ష్యాలు, ఆధారాలతో శాస్తవ్రేత్తలు, పరిశోధకులు చెప్పిన మాటలు. రామాయణంలోని రామసేతువుగా భావిస్తున్న మన ‘వారథి’కి సంబంధించిన వివరాలు ఇవి. దీంతో ఒక్కసారిగా దేశంలో చర్చ మొదలైంది. రామభక్తులకు ఉత్సాహం... ఈ విశ్వాసాన్ని నమ్మనివారికి ఆశ్చర్యం కలిగించిన పరిణామం ఇది.
రాముడు... దేవుడు..
మనిషన్నవాడు ఎలా బతకాలో, మెలగాలో, నడవాలో ఆచరణలో చూపించినవాడు.. అందుకే హిందువులకు ఆయన ఆదర్శ పురుషుడు.. ఆయన ఓ విశ్వాసం. ఆయన కథ ఓ ఇతిహాసం. కానీ ఆ కల్యాణ రాముడు ఉన్నాడా లేడా.. వాల్మీకి చెప్పిన రామాయణం నిజంగా జరిగినదేనా అన్నది ‘హేతువు’ కోసం వెతికేవారి సందేహం.. అలాంటి వారికి ఇన్నాళ్లూ మనవాళ్లు చూపించిన ‘సేతువు’ ఓ కారణంగా.. ఓ సాక్ష్యంగా కన్పించలేదు. అది సహజసిద్ధంగా ఏర్పడిన ‘కట్ట’గా కొట్టిపారేశారు. కానీ ఆ సేతువు మానవులు నిర్మించినదిగానే గట్టిగా చెప్పే ఓ సాక్ష్యం కొత్తగా దొరికింది. వేల ఏళ్లనాటి విశ్వాసానికి సరికొత్త ఆనవాలు ఇది. భారతావనిని ఎంతవరకూ ఉందంటే.. ‘ఆ సేతు హిమాచలం’ అని చెప్పుకునే వారికి ఇప్పుడు సరికొత్త ఉత్సాహం వచ్చింది. హేతువు కావలసిన వారిపైకి సంధించడానికి ఓ రామబాణం దొరికింది. ఇంతకీ ఇప్పుడు మళ్లీ ఆ వారథి చర్చ ఎందుకు రచ్చకెక్కుతోంది.. అంటే పెద్దకథే ఉంది మరి..
త్రేతాయుగంనాటి రామకథను వాల్మీకి రామాయణంగా వర్ణించాడు. సీతను అపహరించిన రావణుణ్ణి వధించి ఆమెను సురక్షితంగా తీసుకురావడానికి లంకకు వెళ్లాలి. ఆ లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అలా దాటడానికి ఉన్న అన్ని అవకాశాలపై చర్చ జరిగాక సముద్రంలోంచి ఓ వంతెన కట్టాలని అనుకుంటాడు. నలుడి సహాయంతో సముద్రజలాలపై తేలియాడేలా ఓ వంతెనను నిర్మిస్తాడు. లక్షలమంది వానరుల సహాయంతో. అలా కట్టిన వారథే ఇప్పుడు మన దేశానికీ, శ్రీలంకకూ అనుసంధానంగా కనిపిస్తున్న ‘రామసేతువు’ అన్నది అందరి విశ్వాసం. నీటిలో మునిగిపోయి ఉన్న ఆ ‘సేతువు’ ప్రస్తావన భారత పురాణేతిహాసాలు, గ్రంథాల్లో ఉంది. క్రీ.శ. 1480 వరకు అది నీటిపైనే అందరూ వాడే విధంగా అందుబాటులోనే ఉందని, ఆ తరువాత తుపానులు, సముద్ర అలలకు దెబ్బతినిందని, ఆ తరువాత సముద్రమట్టం పెరిగిపోవడంతో నీటమునిగిందని అంటారు. అయితే ఇవన్నీ నమ్మనివారు దానిని సహజసిద్ధంగా ఏర్పడిన కట్టగానే భావించారు. దానిని తొలగించి నౌకల రాకపోకలకు మార్గం ఏర్పాటు చేయాలని కొన్ని పథకాలను ప్రతిపాదించారు. అదిగో అప్పుడు మొదలైంది అసలు కథ. ‘సేతు సముద్రం’ ప్రాజెక్టు ద్వారా చుట్టూతిరిగి రావలసిన అగత్యం లేకుండా, ప్రయాణ సమయాన్ని, దూరాన్ని, ఖర్చును తగ్గించుకునేందుకు అవకాశం ఉందన్నది ఓ ఆలోచన. యుపిఎ-1 హయాంలో ఇది ప్రతిపాదనకు వచ్చినపుడు వివాదం రేగింది. అది హిందువుల విశ్వాసాల సేతువు అని, దానిని తొలగించడం సరికాదని హిందూ సంస్థలు అభ్యంతరం చెప్పాయి. ఈ వివాదం న్యాయస్థానాలకు చేరింది. అనేక పరిశోధనలు మొదలయ్యాయి. ఆర్కియాలజీ, జియోలజీ, చారిత్రక పరిశోధకులు రంగంలోకి దిగారు. ఈలోగా వివాదాల నేపథ్యంలో సేతుసముద్రం ప్రాజెక్టు తాత్కాలికంగా మూలనపడింది.
ఆ సేతువు ఎక్కడ ఉంది?
హిందువుల విశ్వాసం, యుగాల లెక్కల ప్రకారం దాదాపు 1,750,000 ఏళ్లక్రితం రామసేతు నిర్మాణం జరిగిందని అంటారు. భారత్-శ్రీలంకల మధ్య కనిపిస్తున్న సేతువు అదేనన్నది కొందరి నమ్మకం. తమిళనాడులోని పంబన్ దీని నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవికి అనుసంధానంగా ఉన్న రోడ్డువంతెన (కాజ్‌వే) ఇది. పాక్ జలసంధి, మన్నార్ జలసంధిలను విడదీస్తూ ఈ నిర్మాణం ఉంది. మూడు అడుగుల నుంచి కేవలం 30 అడుగుల లోతు మాత్రమే ఇక్కడ సముద్రం అట్టడుగు ఉంటుంది. ఒకటి రెండుచోట్ల ఈ వంతెన నీటి ఉపరితలంపైన కూడా కనిపిస్తుంది. దాదాపు 50 కిలోమీటర్ల పొడవున ఇది ఉంది. ఈ వంతెన కోసం వాడిన రాళ్లు నీటిపై తేలుతుంటాయి. ఇది విశేషం. రామాయణంలో కూడా నలుడు, నీలుడు తాకిన రాళ్లు నీటిలో తేలుతాయని వర్ణించారు. ఇప్పుడు ఆ సేతువులో వాడిన రాళ్లు నీటిపై తేలియాడుతుండటం విశేషం. ఇప్పుడు దొరికిన ఆ రాళ్ల బరువు 2.5 కిలోలు ఉంటోంది. రామాయణంలో పర్వతాల్లాంటి రాళ్లను, ఏనుగంతటి రాళ్లను కూడా వాడినట్లు ఉంది. ఆ సేతువు 15 శతాబ్దం వరకు మామూలుగా వాడుకునేటట్టే ఉందని, ఆ తరువాత జలమయం అయిందని ఆధారాలు ఉన్నాయి. రామన్‌కోవిల్‌లో లభించిన ఆధారాల ప్రకారం ఇది రామసేతువే. పాశ్చాత్యులు దీనిని అడమ్స్ బ్రిడ్జ్‌గా పిలుస్తున్నారు. తుపానువల్ల 1480లో ఈ సేతువు దెబ్బతిన్నట్లు రామన్‌కోవిల్ రికార్డులు చెబుతున్నాయి. భౌగోళిక శాస్తవ్రేత్తల లెక్కల ప్రకారం ఇది భారత్ శ్రీలంక భూభాగాలను కలిపే వంతెన. ఈ వంతెన నిర్మాణంలో వాడిన రాళ్లు అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఏర్పడినవి లేదా లైమ్‌స్టోన్‌కు సంబంధించినవని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అవే నీటిలో తేలుతాయని, రామేశ్వరం చుట్టుపక్కల ఇలాంటి రాళ్లు లభ్యమవుతున్నాయని తేల్చారు. చారిత్రక, పురావస్తు వాదనలకు బలమైన ఆధారాలకోసం అనే్వషణ కొనసాగుతోంది. సముద్రశాస్త్రం ప్రకారం ఇప్పుడున్న ‘సేతువు’ ఏడువేల సంవత్సరాల నాటిది. మన్నార్, ధనుష్కోటి తీరాల్లో ఈ వంతెనపై జరిగిన కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా తేలినదేమిటంటే ఇది రామాయణ కాలం నాటివేనని.
‘నాసా’ ఏం చెప్పింది!
అమెరికాకు చెందిన ‘ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్’ (నాసా) 1960లో ఓ ఉపగ్రహ చిత్రాన్ని విడుదల చేసింది. ‘ఈ వంతెనతో కూడిన శ్రీలంక ‘ఓ కన్నీటి బిందువులా’ కన్పించిదని వ్యాఖ్యానించింది. భారత్-శ్రీలంకలను కలుపుతూ సముద్రంలో మునిగిపోయి ఉన్న వంతెన ఫొటో అది. 1960లో తొలిసారిగా ‘జెమిని 11’ ఉపగ్రహ కెమెరాతో ఈ చిత్రాన్ని తీసింది. ఈ శాటిలైట్ చిత్రంలో ముంబై, ఢిల్లీ, భారత్ -సిలోన్ (నేటి శ్రీలంక) ప్రాంతాలతోపాటు ఈ వంతెన కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఇది మానవ నిర్మితమా, పురాణ కథనాల్లోని వంతెనా, సహజసిద్ధంగా ఏర్పడిందా అన్న విషయాల జోలికి ‘నాసా’ వెళ్లలేదు. మళ్లీ 2000 సంవత్సరం ఫిబ్రవరి 1న ఎండీవర్ షటిల్ రాడార్ టోపోగ్రఫీ మిషన్‌లో భాగంగా తీసిన శాటిలైట్ ఫొటోలో ‘రామసేతు’ మరింత స్పష్టంగా కనిపించింది. అప్పుడు కూడా ‘నాసా’ వివాదాలకు దూరంగానే వ్యవహరించింది. చాలామంది శాస్తవ్రేత్తలు ఇది సహజసిద్ధంగా ఏర్పడిందన్నమాటే చెప్పారు. అయితే విశ్వాసాలు, మరికొందరు శాస్తవ్రేత్తలు చారిత్రక, పురాతత్వ పరిశోధకులు ఊరుకోలేదు. సరైన ఆధారాల కోసం అనే్వషన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆ సేతువు వల్ల లాభాలేమిటి?
సేతుసముద్రం ప్రాజెక్టు వివాదం సందర్భంగా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. రామసేతువు మానవ నిర్మితమా, దైవ నిర్మితమా, సహజసిద్ధమా అన్నది పక్కన పెడితే దానివల్ల భారతదేశానికి ఎనలేని ప్రయోజనాలున్నాయని తేలింది. సముద్ర అలల తాకిడి, సునామీ వంటి ప్రమాదాల నుంచి దేశాన్ని, తీరప్రాంతాన్ని, తీరంలోని ఖనిజ, ప్రకృతి వనరులను ఆ సేతువు రక్షిస్తోంది. ప్రపంచంలో యురేనియంకు దీటుగా పనికొచ్చే అత్యంత విలువైన థోరియం నిల్వలు అపారంగా ఉన్న మన సముద్ర తీరాన్ని ఇది కాపాడుతోంది. ప్రపంచంలో లభ్యమయ్యే థోరియంలో 30 శాతం ఇక్కడే దొరుకుతుంది. అబ్దుల్‌కలామ్ వంటి వారు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం బదులు థోరియం వాడాలన్న సూచనలు అందుకే చేసేవారు. ఆ తరువాత ‘నాసా’, మరికొన్ని సంస్థలు ఈ వంతెన సహజసిద్ధంగా ఏర్పడటానికి అవకాశాలున్నట్లు చెప్పీచెప్పకుండా వాదనలు వినిపించాయి. ఈలోగా సంచలనాత్మక కథనం వచ్చింది. అది మానవ నిర్మితమేనని...
నీటిలో తేలియాడే రాళ్లు అగ్నిపర్వతాలు, లావాల నుంచి లభిస్తాయి. రామేశ్వరం ప్రాంతంలో అలాంటివేమీ లేవు. వీటిని ఎక్కడినుంచో తేవాలి. అలా తెచ్చిన రాళ్లు ఇక్కడ వంతెనకోసం వాడారు. నలుడు వాడిన రాళ్లు నీటిలో తేలియాడే గుణంతో ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని లెక్కలు, విధానాలు పోలినట్టే పోలిక కుదరని అంశాలు ఉన్నాయి. కాలమాన పరిస్థితులు, దూరాలలో తేడాలు ఉన్నాయి. రామాయణంపై ఉన్న చాలా విశ్వాసాలకు ఇప్పుడు కొన్ని ఆధారాలు తోడయ్యాయని మాత్రం చెప్పొచ్చు.
డిస్కవరీ సైన్స్ ఛానల్ ఏం చెబుతోంది?
అమెరికాకు చెందిన డిస్కవరీ కమ్యూనికేషన్ సంస్థ నిర్వహించే డిస్కవరీ సైన్స్ ఛానల్‌లో కొద్దిరోజుల క్రితం ఓ కార్యక్రమ ప్రకటన వచ్చింది. భారత్ -శ్రీలంకల మధ్య ఉన్న ‘రామసేతు’ మానవ నిర్మితమేనని, సాక్ష్యాధారాలతో సహా పలువురు శాస్తవ్రేత్తల వ్యాఖ్యానాలతో ఈ కార్యక్రమం కొనసాగింది. ఇది హిందువులకు ఎంతో సంతోషాన్ని, విశ్వాసాన్ని కలిగించింది. రాజకీయ చర్చలకు తావిచ్చింది. దాదాపు 40 నిమిషాల నిడివితో ఈ కార్యక్రమం రూపొందింది. గతంలో ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ రామసేతుపై పరిశోధనలు చేసింది. ఇది సహజసిద్ధంగా ఏర్పడిందా, మానవ నిర్మితమా అన్న అంశంపై ఇది పరిశోధనలు నిర్వహిస్తోంది. దీనిపై ఎన్నో వాదనలు ఉన్నాయి. చక్కటి ఆధారాలతో పరిశోధనలు పూర్తి చేస్తామని ఆ సంస్థ చైర్మన్ వైఎస్‌రావు చెప్పారు. దాదాపు 20 మంది

శాస్తవ్రేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నారు. వీరంతా మెరైన్ ఆర్కియాలజీలో నిష్ణాతులు. గత మేలో వీరంతా రెండు నెలలపాటు వివిధ శిక్షణలు కూడా తీసుకున్నారు. ఈ పరిశోధకులకు ఏఎస్‌ఐ మాజీ డైరక్టర్, మెరైన్ ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు కూడా. గతంలో ఆయన రామసేతు ప్రాజెక్టులో పనిచేశారు. గుజరాత్‌లోని ద్వారకపై కూడా వీరు గతంలో పరిశోధనలు చేశారు. గతంలో భారతీదాసన్ యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ రిమోట్ సెన్సింగ్ (సిఆర్‌ఎస్) ప్రొఫెసర్ ఎస్.ఎమ్.రామస్వామి నేతృత్వంలో 2003లో ఓ బృందం రామసేతుపై పరిశోధనలు చేసింది. రామనాథపురం, పంబన్‌లలో సేతుపై వీరు పరిశోధనలు చేశారు. ఇక్కడి బీచ్‌లు, భూమి సముద్రపు సుదీర్ఘ అలల తాకిడి వల్ల ఏర్పడ్డాయని, కార్బన్ డేటింగ్ పరీక్షల ద్వారా ఇక్కడి తీరప్రాంతాల వయసు రామాయణ కాలంతో సరిపోతోందని వారు తేల్చారు. కోరల్ రీఫ్స్, వదులుగా ఉండే ఇసుక మధ్య ఇలాంటి వంతెనల ఏర్పాటు సహజసిద్ధంగా జరిగే అవకాశం చాలా తక్కువ అని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరక్టర్ ఎస్.బదరీనారాయణన్ వంటివారు తేల్చారు. ఈ నేపథ్యంలో కోర్టులలో ఇప్పటికీ రామసేతు వివాదం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో డిస్కవరీ సైన్స్ ఛానల్ ప్రసారం చేసిన కథనం ‘రామభక్తుల’ విశ్వాసానికి బలం చేకూర్చింది.
సామాజిక మాధ్యమంలో సంచలనం
‘రామసేతు’ మానవనిర్మితమేనని సాధికారికంగా చెబుతూ ప్రసారం చేయనున్నట్లు డిస్కవరీ సైన్స్ ఛానల్ రూపొందించి ప్రసారం చేసిన ‘ప్రోమో’ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. దీనిని విడుదల చేసిన 24 గంటల్లోగానే 2 లక్షలమంది చూశారు. 16వేల లైక్‌లు, 15వేల రీట్వీట్లు వచ్చిపడ్డాయి. భారత్‌లో రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ వంటి మంత్రులు తమ వాదనలు విన్పిస్తూ ఈ ప్రోమో వీడియోను షేర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు, హేతువాదులు కూడా వీటిని తనివితీరా చూశారు. *
రామాయణంలో ‘సేతువు’ నిర్మాణం ఇలా...

ఇది త్రేతాయుగం నాటి మాట.
శ్రీరామచంద్రుడు, తన భార్య అయిన సీతమ్మను అపహరించుకుపోయిన, లంకాధిపతి రావణుని మీదకు దండెత్తడానికి వానరసేనతో బయలుదేరేడు. లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి! ఆ సందర్భంలో శ్రీరాముడు సముద్రుణ్ణి దారిమ్మని ప్రార్థించగా, అతడు మిన్నకుండేసరికి, కోపగించుకొని అతని మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సంసిద్ధుడవుతాడు.
‘బ్రాహ్మేణాస్త్రేణ సంయోజ్య బ్రహ్మదండనిభం శరమ్‌/ సంయోజ్య ధనుషి శ్రేష్ఠే విచకర్ష మహాబలః॥ (శ్రీరా. యుద్ధ.శ్లో.5)
అప్పుడు సముద్రుడు మానుష రూపంతో బయటకు వచ్చి, తాను ‘అలా ఉండకపోతే స్వభావ విరుద్ధమని, తాను ఉద్ధృతిని తగ్గించుకొని, జలచరాల వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ రాకుండా చేస్తానని’ చెబుతూ,
‘అయం సౌమ్య నళోనామ తనుజో విశ్వకర్మణః/ పిత్రాదత్తవరః శ్రీమాన్ ప్రతిమో విశ్వకర్మణా॥ ఏష సేతుం మహోత్సాహః కరోతు మయి వానరః/ తమహం ధారయిష్యామి తథాహ్యేష యధాపితా॥ ఏవముక్త్వో దధిర్నష్టః సముత్థాయ నళస్తదా/ అబ్రనీ ద్వానరశ్రేష్ఠో వాక్యం రామం మహాబలః॥ (శ్రీరా.యుద్ధ.శ్లో.45,46,47)
‘వానర వీరులలో ప్రముఖుడయిన నలుడు విశ్వకర్మ కుమారుడు, శుభ లక్షణములు కలిగినవాడు. తండ్రి అయిన విశ్వకర్మ ఇతనికి, ‘నువ్వు నా అంతటివాడివి, శిల్పకళా నిపుణుడివి కాగలవు’ అనే వరాన్నిచ్చేడు. అందుచే ఈ నలుడు మిక్కిలి ఉత్సాహవంతుడు కార్యదక్షత కలవాడు. కనుక, ఇతడు నాపై సేతువును నిర్మింపగలడు. దాన్ని నేను భరించగలను’ అన్నాడు సముద్రుడు. ఈ మాటన్నాక తన తండ్రి వలన లభ్యమైన శక్తిసామర్థ్యాలను, సముద్రుడు చెప్పినాక గుర్తుకు వచ్చినట్టు శ్రీరామునికి విన్నవించాడు నలుడు. ‘సేతు నిర్మాణ కౌశలం నాకు తెలుసు! మన వానరసేనతో ఆ కార్యాన్ని నెరవేరుస్తాను’ అంటాడు.
సమర్థశ్చాప్యహం సేతుం కర్తుంవై వరుణాలయే/ కామమ్ అద్వైవ బధ్నంతు సేతుం వానరపుంగవాః॥ (యుద్ధ.53)
అంతట శ్రీరాముడు సేతు నిర్మాణానికై ఆజ్ఞాపించగా.. లక్షల కొలదీ వానర వీరులు అనేకానేక రకాలయిన మహావృక్షాలను, పెద్దపెద్ద పొదళ్లను సముద్ర తీరానికి తీసుకువస్తారు. మదపుటేనుగుల ప్రమాణంలోనున్న బండరాళ్లను, పర్వతాలనూ పెకలించి, యంత్ర సాయంతో సముద్ర తీరానికి చేరవేస్తారు. మరి కొందరు నూరు యోజనాల పొడవున కొలత దారాన్ని చేతబట్టుకొని ఉంటారు.
(‘సూత్రాణ్యనే్య గ్రపృహ్ణంతి వ్యాయతం శతయోజనమ్‌ (యుద్ధ.శ్లో.62)
నలుడు సముద్ర మధ్యమున సేతు నిర్మాణానికై పూనుకొన్నాడు. వానరులంతా సహకరిస్తున్నారు. కొందరు పర్వతాలను తీసుకువచ్చారు. మరి కొందరు కొలత బద్దలు పట్టుకొచ్చారు. ఇంకొందరు దారికిరుప్రక్కలా కర్రలను పాతి వాటిని వరుస క్రమంలో గడ్డిపోచలను పెనవేసి కడుతున్నారు. మహోత్సాహంతో పనిచేస్తున్న వానర వీరులు మొదటి రోజు పదునాలుగు యోజనాల పొడవున సేతు నిర్మాణం కావించేరు. రెండో రోజు అదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, ఇరవై యోజనాల దూరాన్ని నిర్మించేరు. మూడో రోజు రెట్టించిన ఉత్సాహంతో, ఇరవై యొక్క యోజనాల నిర్మాణాన్ని కావించేరు. నాల్గవ రోజున ఇరవై రెండు యోజనాలు చివరగా ఐదు రోజున మిగిలిన ఇరవై మూడు యోజనాల నిర్మాణాన్ని పూర్తి చేసి, సముద్రానికి ఆవల లంకలోనున్న సువేల పర్వతాన్ని చేరుకున్నారట. (శ్రీరా.యుద్ధ.శ్లో.69-73)
ఆ విధంగా వానరోత్తముడు, శిల్పకళా నిపుణుడు, విశ్వకర్మ కుమారుడూ, మహాబలశాలి అయిన నలుడు, తోటి వానర వీరులతో కలిసి తన తండ్రి వలె ఎంతో నైపుణ్యంతో సాగరముపై సేతు నిర్మాణాన్ని కావించేడు. (యుద్ధ.74)
ఈ సేతువు పది యోజనాల వెడల్పు, నూరు యోజనాల దూరము కలిగినట్టు శ్రీరామాయణం చెబుతోంది. ఇటువంటి అద్భుతమైన కట్టడాన్ని దేవతలు గంధర్వాదులు రెప్పలాల్చక కుతూహలంతో చూస్తూండిపోయారట! ఆ విధంగా కోట్లకొలదీ వానర వీరులు సాగరముపై సేతువును నిర్మిస్తూ సముద్రపు ఆవలికి చేరుకొన్నారు. ఆ సేతువు విశాలముగా దృఢముగా మిట్టపల్లములు లేక సమతలముగా ఆ వంతెన శోభ అపూర్వమైనదిగా సముద్రమునకు పాపటవలె ప్రకాశిస్తోందట!
పది యోజనాల వెడల్పు, నూరు యోజనాల దూరం కలిగినది ఆ సేతువు.
యోజనం అంటే నాలుగు క్రోసులు.
నలభై క్రోసుల వెడల్పుతో, నాలుగువందల క్రోసుల పొడవుగా ఈ సేతు నిర్మాణం జరిగింది.
క్రోసు సుమారు రెండు మైళ్లు.
అంటే సుమారుగా ఎనభై మైళ్ల వెడల్పుతో, ఎనిమిది వందల మైళ్ల పొడవున ఈ సేతువు నిర్మింపబడినట్టు వాల్మీకి రామాయణం వల్ల తెలుస్తోంది.
*
‘వాట్ ఆన్ ఎర్త్’ ఏం చెబుతోంది?
అమెరికాకు చెందిన డిస్కవరీ కమ్యూనికేషన్ సంస్థ రూపొందిస్తున్న వాట్ ఆన్ ఎర్త్ కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందినవాటిలో ఒకటి. ఇది కల్పనలు, ఊహలతో కూడిన కార్యక్రమం కాదు. ఒళ్లు గగుర్పొడిచే సత్యశోధనలు, సాక్ష్యాల సమాహారం. 2015 నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. అంతరిక్షంలోంచి భూకక్ష్య చుట్టూ గంటకు 20వేల మైళ్ల వేగంతో పరిభ్రమిస్తూ భూమికి సంబంధించి కృత్రిమ ఉపగ్రహాలు తీసే నాలుగువేల ఫొటోలలో అవసరమైన వాటి ఆధారంగా కథనాలను రూపొందిస్తూ ప్రసారం చేస్తున్నారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, హిస్టరీ, ఆర్కియాలజీ, మెరైన్ సైన్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన వందలాది మంది శాస్తవ్రేత్తలు, నిపుణులు, పరిశోధకుల అభిప్రాయాలు, వాదనలతో ఈ కార్యక్రమం సాధికారిక అంశాలతో రూపొందుతోంది. అలాంటి కార్యక్రమంలో మన ‘రామసేతు’పై తాజాగా ఓ కార్యక్రమం ప్రసారమైంది. సైంటిస్ట్ అలన్ లాస్టర్, మరో సైంటిస్ట్ చెల్లియాకోజ్ వంటి వారి వ్యాఖ్యలతో ఇది రూపొందించబడింది. రామసేతు మానవ నిర్మితమేనని వారు చాలా స్పష్టంగా ఇందులో చెప్పారు.
*

-ఎస్.కె.రామానుజం