ఈ వారం స్పెషల్

తెలుగుకు వెలుగేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం
**

తెలుగు నుడికారంలో మమకారం ఎంత ఉందో వెటకారపు ఘాటూ అంతే ఉంటుంది. మనభాషకే పరిమితమైన ‘అవధానం’లో లభించే భాషామాధుర్యం, ఆనందం ఆస్వాదించి అనుభవిస్తేగానీ తెలియదు. అమ్మ, ఆవు అనే మాటల్లో ఉండే ఆప్యాయత మమీ, డాడీల్లో మరుగున పడిపోయిన రోజులివి. ఆంగ్లభాషా వ్యామోహంలో చిక్కుకుపోయి అమ్మభాష చిన్నబోతున్న కాలమిది. గ్రాంథికభాషా ప్రవాహంలో చిక్కుబడిపోయిన తెలుగునేలను వ్యావహారికభాషా రాజ్యంగా మార్చిన గిడుగువంటి ఉద్దండులు ఉదయిస్తేగానీ మళ్లీ తెలుగు వెలుగు సాధ్యం కానట్టే ఉంది. కన్నడిగులు, తమిళులు, బెంగాలీలు, మరాఠీ ప్రజల్లో ఉన్నంత స్వభాషాభిమానం తెలుగువారిలో లేశమైనా లేదు. స్వభాషపై తెలుగు
వారికి మక్కువ కలిగి, ప్రభుత్వాలు మాతృభాషా పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మరికొంతకాలం మన ప్రాచీన తెలుగు భాషకు ప్రాణం ఉంటుంది. దేశభాషలందు తెలుగులెస్స అని ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలువంటి రారాజులు కీర్తిస్తే.. మనం ఆ పంక్తిని ఉటంకించడమే తప్ప ఊపిరులూదింది లేదు. పైగా తెలుగు అవసరమే లేదన్న సచివులు మనను పాలించడం దౌర్భాగ్యం. పూర్తిగా తెలుగులో మాట్లాడేవారన్నా.. తెలుగును ఇష్టపడేవారన్నా, తెలుగును బోధించేవారన్నా అదోరకంగా చూసే లోకంలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే... అక్కడక్కడ తెలుగు భాషా సౌందర్యాన్ని కాపాడేవారు కనబడుతున్నారు. ప్రసార మాధ్యమాల చొరవ ఉంటే తెలుగు వెలుగు ఖాయమే.
*
‘అయ్యయ్యో! మన భాషయే - మకరంద బిందు బృందరస స్యందన సుందరమగు మాతృభాషయే - మహానంద కందళ సందోహ సంధాన తుందిల మగు మాతృభాషయే - కమ్రతకు గమ్రత, కఠినతకు కఠినత - వదలునకు వదలు, బిగికి బిగి, జోరునకు జోరు, నెదురెక్కున కెదురెక్కు - మందతకు మందత - ధాటికి ధాటియు - నన్ని వనె్నలు, నన్ని చినె్నలు, నన్ని వగలు, నన్ని వద్దికలు, నన్ని తళుకులు, నన్ని బెళుకులు - నన్ని హొయలు, నన్ని యొయ్యారములు గలిగిన మన మాతృభాషయే - వ్యాసమునకు నుపన్యాసమునకు - గవిత్వమునకు - గానమునకు సంపూర్ణార్హత గల భాషయే - పైవారే యా భాషను బట్టుదలతో బ్రయత్నమున నభ్యసించుచుండగా - మనవారే దానినంత యధమాధముగా జూచుట తగునా?’
‘ఆంగ్లేయ భాష యేల చదువుకొంటివని నే నధిక్షేపింపను. ఇంతకన్న నధిక జ్ఞానమును గూడ నీ వా భాషలో సంపాదింపుము. నాకు మరింత యిష్టము కాని నీ యాంగ్లేయ భాషా జ్ఞానమెందులకో నీ వెరుగుదువా? ఆంగ్లేయ భాషయే కాదు, ఇంక ననేక భాషలు కూడ నేర్చుకొనుము. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానమంతయు నీ భాష నభివృద్ధి పఱచుటకే. నీ భాషను భాగ్యవత్తరమును జేయుటకే - నీ భాషను బరభాషా గ్రంథ ప్రశస్త్భాప్రాయములతో వనె్న పెట్టుటకే. అంతకంటె వేరుకాదు’
- ఇప్పుడు కాదు తొంభై ఆరేళ్ల క్రితం 1921 జులై 23 ఆంధ్రపత్రికలో కీ.శే.పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు సాక్షి వ్యాసాలలో ‘స్వభాష’ పేరిట రాసిన వ్యాసంలోని తెలుగు భాషా స్థితిని గూర్చిన ఆర్తి అది. ఈనాడు తెలుగు భాషా స్థితిని గూర్చిన ఆవేదన ఇబ్బడిముబ్బడి అవుతోంది. అంతరించిపోయే భాషల పట్టికలో తెలుగు భాష పేర్కొనబడడం శోచనీయం కాక మరేమిటి?
తెలుగు మాట్లాడే దీపాలు
తెల్లవార్లూ వెలుగుతూంటాయి
-అన్నాడు ఆరుద్ర. అలా తెల్లవార్లూ వెలుగుతూంటే విద్యుత్ శాఖ లోపమనీ, విద్యుత్ దుర్వినియోగమనీ అనుకుంటారని కాబోలు. భాష పేరునే పార్టీలో కలిగి వుండి అధికారంలో వుండి తాము పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే తెలుగు వెలుగులకు కోత విధిస్తున్న వైఖరి బాధాకరంగా ఉంటోంది.
అసలే తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం ఇంకా జీర్ణించుకోలేని దశలో, ఇరు రాష్ట్రాలలో తెలుగు భాష అస్తిత్వం గురించిన తులనాత్మక పరిశీలనం కొందరు విజ్ఞులకు మరింత ఆవేదనాభరితంగా మారిపోయింది.
పక్కనున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో అక్కడి వారు తమ మాతృభాష పట్ల చూపుతున్న శ్రద్ధకీ, పట్టుదలకీ, అభిమానానికి భిన్నంగా అదే మూల ద్రావిడ భాషలలోని మన తెలుగు పట్ల మన రాష్ట్రాలలో మాత్రం పొడచూపుతున్న ఉదాసీనత, నిర్లక్ష్యం బాధాకరంగానే ఉంటోంది.
తెలంగాణలో కనీసం కొంతమేరకు నయం అనిపిస్తోంది. భాష పట్ల, సాహిత్యం పట్ల, తెలుగు భాషా రచయితలు, కవులు, కళాకారుల పట్ల తెలంగాణలో కనబడుతున్నంత ఆదరణ తమదే అయిన మరో రాష్ట్రంలో మసకబారడం, శ్రద్ధాసక్తులు లోపించడం ప్రశ్నార్థకమవుతోంది.
ఉదాసీనత వేరు. పనిగట్టుకుని తెలుగు భాషాభివృద్ధికి అవరోధాలు కల్పించడం, చేజేతులా అణగద్రొక్కడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో-
‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’
అన్న కాళోజీ ఆగ్రహ వాక్యమే నినదించవలసిన పరిణామాలకు అక్కడి పాలక వర్గీయులే పూనుకోవడం శోచనీయం.
ఏ భాష అయినా వికసించాలంటే, అభివృద్ధి చెందాలంటే నాలుగు విధాల పురోగతి జరగాలి. తెలుగులో మాట్లాడటం, తెలుగు చదవటం, తెలుగు రాయటం, తెలుగులో ఆలోచించడం అన్న సమగ్ర పార్శ్వాలలో నేటి తరం, రానున్న తరాలు పొందగలిగితే తప్ప భాషకు -అంతరించిపోయే స్థితికి ప్రమాదఘంటికలు మ్రోగక తప్పదు.
తెలుగు నేలపై, తెలుగు తల్లిదండ్రులకు పుట్టి తెలుగు సంప్రదాయాలు అభ్యసించి, తెలుగు జాతీయ తత్త్వ సంపత్తిచే అభివృద్ధి చెంది, తెలుగు భాషలో పండితులై, తెలుగులో గ్రంథాలు రచించి భాషామతల్లికి అమూల్య అలంకారాలుగా అర్పించి తెలుగు సీమ సేవ నాచరించి తమ అంగములు, అసువులు, ఆత్మలు పవిత్రములుగా చేసుకుని ప్రాణములను బాసి పరమపదాన్ని చేరిన మహనీయులు ఎందరో వున్నారు. వారి జీవికకు గానీ, వృత్తికి గానీ తెలుగు భాష తోడ్పడిందే తప్ప అవరోధం కాలేదు. తెలుగు భాష
ఉపాధి, ఉద్యోగాలకు పనికిరాదని, తెలుగులో చదువుకుంటే అభివృద్ధి శూన్యమనీ అనుకునే, అనే స్థితి దాపురించడానికి కారణం కూడా మనమే కానీ మరెవరో కాజాలరు. భారతదేశం పరదాస్య శృంఖలాలలో నుండి విడివడి స్వతంత్య్ర దేశం అయింది గానీ ఈ డెబ్బై సంవత్సరాలలో భావదాస్యం నుండి ఇంకా విడివడలేదు. ముఖ్యంగా పలు భాషల ఏకత్రిత జాతి అయిన మన దేశంలో తెలుగుకు మునుపెన్నడూ లేనంత పతన స్థితిని చేజేతులా కల్పించుకుంటున్న దౌర్భాగ్యం మనదే అనిపిస్తోంది. అమెరికాలో విద్య, ఉద్యోగాలే పరమావధి అన్న ధోరణిలో మన తెలుగువారు పడిపోయినంతగా దేశంలో మిగతావారెవ్వరూ తమ భాష విషయంలో, ఆలోచనా ధోరణి విషయంలో మునిగిపోలేదు.
తెలుగు మాట్లాడటం నామోషీ అనే దశ విస్తరించడం విచారకరం. ఆంగ్లం నేర్చుకుంటే తప్ప గతి లేదు అనే స్థితికి పతనమయితే మన పరిపాలకుల ప్రయోజనం ఏముంది? క్రమక్రమంగా పాఠశాలల నుండి తెలుగును తొలగిస్తూ, తెలుగు మాధ్యమాన్ని నిర్వీర్యం చేస్తూ అంగన్‌వాడి దశ నుండి ఆంగ్లమే శిరోధార్యం అనే ఆలోచనలు తదనుగుణమైన చర్యలు అశనిపాతాలే! ఇవాళ తెలుగు మాట్లాడటం మటుకే వచ్చిన పిల్లలు పెరిగిపోతున్నారు. వారికి తెలుగు చదవటం మాత్రం రావడంలేదు. తెలుగులో రాయడమూ రాదు. తాము మాట్లాడే, వినే తెలుగుని ఇంగ్లీషు అక్షరాలలో రాసుకుని చదువుతూ, తమ తెలుగును ఇంగ్లీషు లిపిలోనే రాస్తూ అదే తెలుగు భాషోద్ధరణ మనుకునే దశలో పడిపోవటం జరుగుతోంది. కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో తెలుగు లిపి వినియోగించగల సౌకర్యం వున్నా తెలుగులో రాయడం, చదవడం రాక ఇంగ్లీష్ లిపిలోనే తెలుగును కూర్చడం అలవాటుగా మారిపోయిన వారున్నారు. సహజమైన తమ మాతృభాష తెలుగులో ఆలోచించే శక్తి కూడా సన్నగిల్లి అభివ్యక్తీకరణకు కూడా ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇది భాషాభివృద్ధికి గొడ్డలిపెట్టు.
అయ్యయ్యో! తెలుగువాడే. తెలుగు తల్లిదండ్రులకు పుట్టినవాడే. తెలుగునేల గాలి పీల్చినవాడే.. ఇక్కడి నీరు ఇక్కడి ఆహారం పారణమొనర్చిన వాడే... అలాంటి వాడు ఆంగ్ల భాషను అభ్యసించిన మాత్రాన, ఏ అమెరికాకో వలస పోయి వుండవలసినంత మాత్రాన తెలుగును మరిచిపోవాలా? తెలుగు మాట్లాడనక్కరలేదా? తెలుగు చదవడం రాయడం విసర్జించేయాలా? అయిదేళ్లయినా రాకుండానే ప్లేస్కూల్ అంటూ పంపివేసి పిల్లలకు అప్పటి నుండే ఆంగ్లంలోకి నెట్టేస్తున్నది మన వైఖరికాక మరేమిటి? కనీసం పదవ తరగతి వరకు తెలుగులో చదవడం విధాయకంగా వుండాలి. ఆంగ్ల మాధ్యమ బోధనలు వున్నా తెలుగు విధిగా మాట్లాడటం చదవటం, రాయటం అనే నిబంధన ఉండాలి. నేడు అలాంటి నిబంధనలు విధించుకోవాల్సినంత స్థితికి తెలుగు భాషను నెట్టివేసుకున్నది మనం కాదా?! ఇప్పటికయినా కళ్లు తెరవకపోతే తెలుగు బడులు మూతపడితే ఇంక తెలుగు మనుగడే మృతశయ్య నెక్కుతుంది.
ఇలా చేస్తేనే ఫలితం!
అధికార భాషా సంఘం, గ్రంథాలయ వ్యవస్థ, సాహిత్య అకాడెమీ, తెలుగు అకాడెమీ, బాలల అకాడెమీ వంటి సంస్థలకు విశేష అధికారాలు, వనరులు సమకూర్చి, ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకులలో, పరిపాలనలో తెలుగు వినియోగాన్ని విధాయకం చేయాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వారికి మాత్రమే తెలుగు రాష్ట్రాలలో విద్య, ఉద్యోగ, వ్యాపారాలు చేసుకునే వీలుంటుంది అనే నియమాన్ని ఏర్పరచి, ఆ నిబంధనను కఠినంగా అమలు చేయాలి. అలా చేయడం పాలకులకు కష్టమేమీ కాదు. భాష పట్ల నిర్లక్ష్యం పనికిరాదు. పరభాషలు నేర్చుకోవద్దని ఎవరూ అనడం లేదు. కానీ పరభాషా దాస్యం, వ్యామోహం తగదు. అవసరం మేరకే పరభాష. అంటే వృత్తి ఉద్యోగాలలోని అవసరాల మేరకే. అక్కడ కూడా స్వభాష వచ్చిన వారితో పరభాషా వినియోగం పరిహరించాలి. పానుగంటి వారన్నట్లుగానే ‘పరభాషా పదముల కర్థము తెలిసినంత మాత్రమున బరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను బ్రాణమును తత్త్వము నాత్మను గనిపట్టవలయును. అది మీకసాధ్యము’ అసాధ్యమే కాదు ఆ దాస్యమూ అనవసరం. ‘తల్లి స్తన్యముతో గూడ నే భాష మనము త్రావుదుమో యా భాషలోనే మనమెన్నటికైన గఠిన ప్రయత్నమొనర్చిన యెడల నుపజ్ఞా సహితమగు నుత్తమ గ్రంథములను వ్రాయగలము.’
అప్పట్లోనే ఆందోళన
పరభాషా దాస్యం మనకు కంఠగతమై పోతోందన్న ఆవేదన 1921లోనే పానుగంటి వారు ‘స్వభాష’ సాక్షి వ్యాసంలో హెచ్చరికగా వివరించారు.
‘నాయనలారా! మన కింగ్లీషు మాటలతో చెప్పినగాని ఏ అంశము కూడ మనస్సున కెక్కదు. అట్టి అభ్యాసము చిరకాలము నుండి అస్థిగతరోగమై వున్నది. ఆయుర్వేద వైద్యుడు వచ్చి ‘అయ్యా! కరివేపాకు పొడుముతో పథ్యము పుచ్చుకొనుమని నీతో చెప్పగా, నీకు ఆ మాట నచ్చదు. నానె్సన్స్! కరివేపాకు పొడుము ఎందులకయ్యా అని నీవు ఆ ఆయుర్వేద వైద్యుని అధిక్షేపింతువు. ధనియాలు ‘డైజెషన్’కు మంచివి. మిరియాలు ‘లివర్’ మీద ‘ఆక్ట్’ చేయును. కరివేపాకు ‘గాల్‌బ్లాడర్’కు సత్తువనిచ్చును అని ఎవడో ఎల్.ఎం.పి. మనవాడే చెప్పిన యెడల నీకది శ్రుతి ప్రమాణము. నాయనలారా! మనమెంత లక్షాధిపతులమైనను, కోటీశ్వరులమైనను మన బ్రతుకులు ముష్టి బ్రతుకులు కాక మరియొకటి కాదు. ఈ ముష్టి దేవులాటలో ఇంగ్లీషు మాటలు కూడ ఎందులకు? ఆ ఏడుపేదో మాతృభాష తోడనే ఏడ్చిన మంచిది కాదా? మన ఏడుపు సహజముగాను, సాపుగాను స్వతంత్రము గాను ఉండునే. ఏడుపులో కూడ మనకు అస్వతంత్రత ఏమి ఖర్మం? అందుకు సర్వ స్వతంత్రులము సంపూర్ణ్ధాకారులమే కాదా? ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయవారపు బ్రాహ్మణుడనయ్యా యని అరవక ‘బాయ్! రూమ్‌లో నున్న పాట్‌లో రైస్ యేమైన నున్నదేమో కైండ్లీ గెటిట్ హియర్, థాంక్యూ ఇన్ ఆంటిసిపేషన్’ అని నీతో సంభాషింపగా నీవాతనికి ముష్టివేయుదువా?’ మూతి మీద ఈడ్చి ఒక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీషు మాటలు కూడ అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు నమ్ముడు.’
మాట్లాడే తెలుగులో కూడా ఇంగ్లీషు పదాలే ఎక్కువై పోయిన ధోరణి నేడు ప్రబలిపోయింది. టీవీ ఛానల్స్‌లో యాంకర్లు భాషను ఎంత భ్రష్టు పట్టించాలో అంతా పట్టిస్తున్నారు. ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం యువతకు గగనమై పోతోంది. విద్యావ్యవస్థ పటిష్టంగా తెలుగు బోధన పట్ల నిబద్ధమై వుండాలి. అప్పుడే భాషాభివృద్ధి, వికాసం సాధ్యం అవుతాయి. నిజానికి సాంకేతికాభివృద్ధితో తెలుగు వినియోగం సులభతరమైంది. ఇవాళ తెలుగులో మాట్లాడితే స్మార్ట్ఫోన్‌లో, కంప్యూటర్‌లో ఎక్కడైనా అదే తెలుగు రాసేసే లిపి ప్రత్యక్షమవుతోంది. కానయితే స్వయంగా తెలుగు రాయడం అనే దానికి అది విఘాతం కాకూడదు. అలాగే తెలుగు లిపిని చదవడం యువతకు వచ్చి తీరాల్సిందే. మనం ముందే అనుకున్నట్లు బాలబాలికలూ, యువతీ యువకులు తెలుగు చదవడం, రాయడం, మాట్లాడటం, తెలుగులో ఆలోచించడం అనే దిశగా జీవన విధానంలో రూపొంది తీరాలి. అందుకు కుటుంబం, స్నేహితులు, పరిసరాలు, పాలకులు, ప్రభుత్వం అన్నీ సహకరించేవిగా ఉండాలి.
ఏ భాషలోనయినా యాసలు, మాండలీకాలు ఉంటాయి. తెలుగు భాషలో ప్రాంతీయ జీవనాలను బట్టి ఈ వైవిధ్యమూ అనంతంగా ఉంది. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ భాషగా వున్న వైవిధ్యం మళ్లీ ఆయా ప్రాంతాలలోని వివిధ ప్రదేశాలను బట్టి యాసలుగా, మాండలికంగా ప్రతిధ్వనించినా అంతా తెలుగు భాషే! తెలుగు అక్షరాలు అవి అచ్చులైనా, హల్లులైనా తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అక్షరాలు విడిపోవు, విడిపోలేవు. తెలుగు వర్ణమాల ఇరు రాష్ట్రాలకు ఒక్కటిగానే ఉంది, ఉంటుంది. పుట్టుక చేతనే కాక, బుద్ధిచేత, స్వభావము చేత, యోగ్యత చేత తెలుగు వారమనిపించుకునేలా పురోగతి చెందవలసిన అగత్యం నేడు మరింతగా ఉంది.
‘మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి’ అన్న చందాన మన ప్రాచీన తెలుగు వైభవాన్ని కీర్తించుకుంటే సరిపోదు. గత వైభవ స్మరణం, కీర్తనం మంచిదే కానీ అది భవిష్య కార్యాచరణకు స్ఫూర్తిమంతం, ప్రేరకం కాగలగాలి. భాష సజీవ స్రవంతి. తిరుపతి వేంకట కవులన్నట్లు ‘తెలుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది’. వ్యాకరణం అంటే ఏమిటి? అది కచ్చితంగా ప్రయోగ శరణం! ఎప్పటికప్పుడు భాషకు నవీన వ్యాకరణం, నూత్న నిఘంటువులు రూపొందించుకోవాల్సిందే! భాష అనేది ఎప్పుడైనా భావ వినిమయ సాధనమే! కాలానికి అనుగుణంగా భాషలో కొత్త పదాలు చేరుతూంటాయి. అన్య భాషా పదాలను యథాతథంగా స్వీకరించడం కొంత మేరకు సహజమూ, సమంజసమే గానీ వ్యవహారంలోకి వస్తున్న సరికొత్త వాటికి తెలుగులో సమానార్థక పదాలను సృజించుకుని వినియోగంలోకి తెచ్చుకుని ప్రజాబాహుళ్యంలో పరివ్యాప్తమయ్యేలా చూసుకోవడం మన భాష పట్ల శ్రద్ధ, ఆసక్తి, అభిమానం అందరికీ వున్నప్పుడే సాధ్యం కాగలుగుతుంది.
ఎన్నో పదాలు అంతరించిపోతున్నాయి. వ్యవహారంలోంచి చ్యుతమై పోతే వాటి అస్తిత్వమూ, వాటి అర్థాలూ కూడా మనకే అంతుబట్టనివి అయిపోతాయి. ప్రజలు వాడే భాషకు పట్టం గట్టినప్పుడే జనమమేకమై పాలన సాగడం కూడా సాధ్యమవుతుంది. ఇవాళ తెలంగాణ ఒక మాండలికం కాదనీ, తెలంగాణ ఒక భాష అని తెలంగాణ ఒక రాష్ట్రంగా రూపొందడానికి చెలరేగిన భావావేశం ఇక చల్లారిపోకూడదంటే సమగ్ర తెలంగాణ భాషా నిఘంటువు ఇంకా రూపొందాల్సే ఉంది. లక్ష పదాలతో తెలంగాణ నిఘంటువు రూపొందిస్తామని ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఒక ప్రకటన చేశారట! తెలంగాణ సాహిత్య ఆకాడెమీ, తెలంగాణ అధికార భాషా సంఘం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీ, తెలంగాణ గ్రంథాలయ పరిషత్తు సమన్వయ కృషి చేసి ఒక బృహత్ నిఘంటువును రూపొందించడం అత్యవసరమైన పనియే!
నిజానికి కవులకు, సాహితీవేత్తలకు, కళాకారులకు తెలంగాణలో లభిస్తున్న ఆదరం, ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్ఫూర్తిదాయకం కావాల్సి ఉందన్న భావన ప్రచురితంగా కనబడుతోంది. అది యదార్థమే. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యలు ఎంతో వివాదాస్పదమయ్యాయి. తెలుగు భాషాభివృద్ధికి వికాసానికి కాక అక్కడి చర్యలు పరభాషా దాస్యానికే మరింతగా దోహదకారులుగా వున్నాయనీ తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు దొరకవని ప్రచారం చేయడం ఆత్మహత్యా సదృశమని భాషాభిమానులు, మేధావులు అంటున్నారు. ఆంగ్ల విద్య ఆవశ్యకమే కానీ అందుకు తెలుగును పణంగా పెట్టి తెలుగును మృతభాషగా మనమే మార్చుకునే వైఖరి గర్హనీయం. చైనా వంటి దేశం ఇంగ్లీష్‌ను తలకెత్తుకోకుండానే అమెరికా వంటి దేశంలో తలెత్తుకుని తన వ్యాపారాధిపత్యాలను సైతం పెంచగలుగుతోంది. పరారుూకరణం చెందకుండా మన అస్తిత్వాన్ని నిలుపుకోగలగడం అసాధ్యమేమీ కాదు.
తెలుగు వారు ఎక్కడున్నా ఒక్కటే
తెలుగు భాష ఎన్ని వైవిధ్యాలతో కూడినదైనా తెలుగు భాషే
రెండు రాష్ట్రాలకీ తెలుగు వెలుగే ధ్యేయం కావాలి
‘ఇది తెలుగు గడ్డ’ అనే కవితలో విశ్వంభరాకవి కీర్తిశేషులు డా.సి.నారాయణరెడ్డి గారన్నట్లుగా ఇరు రాష్ట్రాలకూ దేనికి దానికిగానే వర్తించుకునేలానే ఒక ఐక్యతా భావన అత్యావశకం. అదే ఇది-
ఇది తెలుగు గడ్డ గాం
డ్రించు పిల్లి కూతొద్దురా
ఇది తెనుగు పలుకు, కురి
సే తేనె చినుకు - ఈ
పలుకెపుడు నీరు గారొద్దురా - తీపి
చిలికితేనే చెవికి ముద్దురా

ఇది తెలుగు తెలివి; రగిలే
నిప్పు కొలిమి - ఇది
ఎప్పుడూ మండుతుండాలిరా - బూది
కప్పినా ఉరుముతూండాలిరా
ఇది తెలుగు కీర్తి; కది
లే రణమూర్తి - ఇది
సాగరాలే దాటిపోయిందిరా -న
యాగరాల్ మీటి వచ్చిందిరా
... ...
... ...
ఇది తెలుగు ప్రతిన! ఒక
టే దీని తపన! ఈ రాష్ట్రం
పురోగమించాలిరా! ప్రజల
రాజ్యం త్రివిక్రమించాలిరా

పలుకులో పదునులో
తెలివిలో కలిమిలో
గీతిలో రీతిలో
కీర్తిలో స్ఫూర్తిలో
కొసకొమ్మలను ఒడిసిపట్టాలిరా
కుళ్లు బుద్ధులు పాతిపెట్టాలిరా!

తెలుగు భాషకు జేజేలు
తెలుగు వెలుగుకు జేజేలు.
**
భాషాస్పృహ అవసరం
అనుక్షణం తెలుగును చంపుతున్నారు. తెలుగులో ఇతర భాషాపదాలు కలియడం ఒక్కటే కారణం కాదు, తెలుగు నుడికారం పట్టణీకరణంతోనూ , అన్యభాషల వారు మనల్ని ఏలడంతోనూ ఇప్పటి ప్రభుత్వాలు పట్టించు కోకపోవడం వల్ల మాయమైపోయింది, కాస్తా భాషా స్పృహ కలిగించుకుంటే అదే ఇప్పుడు కొన ఊపిరితో ఉన్న తెలుగుకు నిండు ప్రాణం పోయడం అవుతుంది. గిడుగు వారు చేసిన కృషిలో లక్షవ వంతు కృషి చేసినా, తెలుగుకు పునర్వైభవం తెచ్చిస్తుంది.
- ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్ళిటీ
**

గిడుగు.. తెలుగునకు గొడుగు

ఇవాళ మనం మాట్లాడుకుంటున్న, వింటున్న తెలుగు గిడుగువారి పుణ్యమే. కొద్దిమంది చేతుల్లో చిక్కిన గ్రాంథిక భాష తెలుగును జనభాషగా విస్తృతం చేసేందుకు, సంపూర్ణంగా వికసించేందుకు అలుపెరగని పోరాటం చేసిన యోధుడు గిడుగు. ఆయనను అగ్గిపిడుగు అనేవారు. గ్రాంథికంలో యోధానుయోధులను ఢీకొని, వారి భాషలో లోటుపాట్లను వారిచేతే ఔననపించి జనభాషనే.. వ్యావహారిక భాషనే రాజభాషగా చేసిన మహానుభావుడు ఆయన. అచ్చతెనుగుతోపాటు మాండలిక భాషనూ మహోన్నతమైనదిగా భావించిన ఆయన సవరభాషకు లిపి, నిఘంటువు కనిపెట్టి, రాసిన అక్షరయోధుడు. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగ క్షేత్రానికి సమీపంలోని పర్వతాలపేటలో పుట్టిన గిడుగు.. గురజాడ, వీరేశలింగంల స్ఫూర్తితో ఉద్యమించారు. పర్లాకిమిడి రాజావారి స్కూల్లో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ సవరభాష సేవలో గడిపాడు. ఊరూరా తిరుగుతూ గ్రాంథికభాషా యోధులతో పోరాడుతూ వ్యావహారిక భాషా ఉద్యమానికి ఊపిరిలూదారు. ఆంధ్రులు ఎక్కువగా ఉన్నప్పటికీ కుట్రతో పర్లాకిమిడి పట్టణాన్ని ఒడిశాలో కలపడాన్ని తీవ్రంగా నిరసించిన ఆయన ఆస్తిపాస్తుల్ని ఉద్యోగాన్ని అలా వదిలేసి తెలుగు వెలుగుకోసం రాజమండ్రికి వచ్చేసిన ధీరుడాయన. బహుభాషా ప్రావీణ్యుడైనప్పటికీ తెలుగుపై మమకారంతో ఆయన ఉద్యమాన్ని నడిపారు. ఆయన జయంతి ఆగస్టు 29 (1863). తుదిశ్వాస విడిచేవరకు ఆయన వ్యావహారిక భాషా వ్యాప్తికే జీవితాన్ని అర్పించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన సేవకు మెచ్చి రావుబహదూర్, కైజర్-ఇ-హింద్ బిరుదు, స్వర్ణపతకంతో సత్కరించింది. తెలుగుభాషా వ్యాప్తికి కృషి చేసిన గిడుగు జయంతినే తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన జీవత చరమాంకంలోనూ వ్యావహారిక భాషా వ్యాప్తికే పరితపించారు.

‘దేశభాష ద్వారా విద్య బోధిస్తేగానీ ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారిక భాష లోకంలో సదా వినబడుతుంది. అది జీవంతో కళకళలాడుతూంటుంది. గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడుతుందేకాని వినబడేదికాదు. ప్రతిమలా ఉంటుంది. ప్రసంగాలలో గ్రాంథిక ప్రయోగాలతో తిట్టుకున్నా, సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదముగా ఉంటుందో చూడండి. గ్రాంథిక భాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీన కావ్యాలు చదువవద్దని, విద్యార్థులకు నేర్పవద్దని నేను అనను. కానీ ఆ భాషలో నేడు గ్రంథరచనకు పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరునూ వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే. వినేవారికి కష్టమే. ...ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏ భాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథ రచన చేయవలసి ఉంటుందో ఆలోచించండి.’ అని గిడుగు రామ్మూర్తి అన్నారు. 1940 జనవరి 15న ‘ప్రజామిత్ర’ కార్యాలయంలో వివిధ పత్రికల సంపాదకులతో ఆయన మాట్లాడారు. అక్కడికి వారం రోజుల తరువాత ఆయన కన్నుమూశారు.
**
ఆంగ్లభాషపై
పిచ్చి వద్దు

అందరికీ ఈ మధ్య ఇంగ్లీషు పిచ్చి పట్టుకుంది. ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగం వస్తుందనే భావనలో ఉన్నారు. కన్నతల్లిని, మాతృభాషను, మాతృభూమిని ఎన్నడూ మరువరాదు. తెలుగుభాష ఎంతో మధురమైనది, ప్రపంచం అంతా తెలుగు భాషను గుర్తిస్తుంటే మనం పరాయి భాష వెంట పడరాదు. తెలుగు నేర్చుకోమని చెబితే ఇంగ్లీషు వద్దని కాదు, వ్యతిరేకం అంతకంటే కాదు, ఇంగ్లీషు నేర్చుకోండి, తెలుగు మరిచిపోకండి, తెలుగు భాషకు గ్రామరే కాదు, గ్లామర్ కూడా ఎంతో ఉంది, తెలుగు మాద్యమంలో తరగతులు నిర్వహించడం తప్పనిసరి చేయండి. అది సాధ్యం కాకపొతే కనీసం తెలుగును ఒక భాషగానైనా నేర్పించాలి. ప్రజలకు అర్ధమయ్యే రీతిలోనే వ్యవహారాలు సాగాలి, పరిపాలన కొనసాగాలి. అందుకు వీలుగా రెండు తెలుగు రాష్ట్రాలూ ముందుకు రావాలి. తెలుగును నిర్బంధం చేయాలి, ఆ మాట కొస్తే తెలుగు వస్తేనే ఉద్యోగం ఇవ్వాలి. అపుడైనా తెలుగు నేర్చుకుంటారు, తెలుగుభాష అభివృద్ధి చెందేందుకు వీలు అవుతుంది.
-ఎం వెంకయ్యనాయుడు
ఉప రాష్టప్రతి

-సుధామ