ఈ వారం స్పెషల్

పరమేశ్వర తత్త్వమే లింగరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుడైన శంకరుని మహిమ అపారమైనది. అద్భుతమైనది. శివుని మహిమ వాక్కులకు, మనస్సునకు అందనిది. వేదత్రయము - సాంఖ్య శాస్తమ్రు - పతంజలి యోగ శాస్తమ్రు, శివాగమములతో ఒప్పారుచున్నది శైవ మతము. మోక్ష ప్రాప్తికి ఉత్తమ మార్గము. సకల జీవులకు, పరమ శాంతికై పలు రీతులలో సాధనలు చేయుటకు పరమ గమ్యుడు శివుడు.
శివుడు ఎలా లింగరూపియైనాడు? అనే ప్రశ్నకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితి కారకుడైన విష్ణువు కారణం. ఈ ఇద్దరిలో ఆధిపత్యం కోసం సాగిన అహంకార ఫలితమే శివలింగోద్భవం. ‘శివ’ శబ్దం మంగళప్రదం. శివుడు మంగళప్రదుడు. ‘లింగం’ అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీకయని అర్థం. సృష్టించబడిన వస్తు సమూహం యావత్తూ విలీనం చెందిన ప్రదేశమే అంటే స్థానమే ‘లింగం’ అని భావం.
శివాలయాలలో పరమశివుని ప్రతిమను గర్భగుడిలో ప్రతిష్ఠించిన మూలమూర్తిగా ఉన్నప్పటికినీ ఎన్నడూ ఆరాధించరు. కేవలం ఉత్సవ మూర్తిగనే ఆరాధిస్తారు. ఈ విధంగా ఎందుకు జరుగుతున్నదో పలు విషయాలను విపులీకరించాలి.
లింగోద్భవం - మహాశివరాత్రి
శివుడిని ఈశ్వరుడంటారు. ‘స ఏ ష భగవానీశః - సర్వతత్త్వాది రవ్యయః’ - ‘సర్వ తత్త్వ విధానజ్ఞః - ప్రధాన పురుషేశ్వరః’ అని శాస్త్ర మర్యాద. శివుడు సాయుజ్య ప్రదాత. భవతారక స్థితిని ప్రసాదించగలవాడు ఈశ్వరుడు. ఈశ్వర శబ్దం నుండి ఐశ్వర్యమనే పదం వచ్చింది. అమరకోశం ఈశ్వర స్వభావ ఐశ్వర్యం అని తెలిపింది. సర్వసంపద్రూపుడు శివుడు. అభవుడు. పుట్టుక లేనివాడు. ఒకసారి పరమశివుని దివ్య దేహోపాధి నుండి బ్రహ్మాండమైన లింగం ఆవిర్భవించి, భూమ్యాకాశములను ఆక్రమించినది. బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచే నిమిత్తము పరమశివుడు అనంతమైన, జాజ్వల్యమానమగు అగ్ని స్తంభ రూపంలో ప్రత్యక్షమైనాడు శంకరుడు. ఆ అద్భుత లింగం నుండి శివుడు లింగోద్భవ మూర్తిగా, నాలుగు భుజాలతో వారికి దర్శనమిచ్చాడు.
బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యంతములను కనుగొనలేక పోయారు. వీరి అహంకారం అణగద్రొక్కుటకు శివుడు నిరాకార ఈశ్వర తత్త్వము సాకారం ధరించిన సుదినమే శివరాత్రి. రూపరహిత ఈశ్వర తత్త్వానికి గుర్తు లింగం. లింగము పరమేశ్వరుని ఆకార చిహ్నము. ‘లీయతే గమ్యతే యితి లింగం’ అని. సర్వమూ దేనియందు లీనవౌనో అదియే లింగం. మానవ శరీరంలోనే లింగం కర్మేంద్రియ - జ్ఞానేంద్రియములు అంతఃకరణములతో చేరినది గనుక సంగమం జరుగుతుంది.
సంగమం వలన సత్యాసత్యములతో కలిసి మిథ్యా జగత్తు ఉద్భవించినది. ప్రతి మాసములో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశికి శివరాత్రి అని వ్యవహార నామం. కానీ లింగోద్భవం అయిన కాలము మాఘమాసం, కృష్ణపక్ష చతుర్దశిని ‘మహాశివరాత్రి’ అంటారు. మంగళకరమైన రాత్రి ఇది. రాత్రి చీకటి, అజ్ఞానమునకు సంకేతం. సకల జగతి ఈ చీకటి, అజ్ఞానమును తొలగించుటకు ఈ దినమున, లింగోద్భవ వేళ వరకు ఉపవాసం - జాగరణ - మహేశ్వర దర్శనం - బిల్వార్చన, నామ సంకీర్తనల వలన మంగళకరమై విలసిల్లును గాన ఇది మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందినది.
‘మహేశ్వరాదిచ్ఛేత్’ అనే శ్రుతి వచనం అనుసరించి శివారాధన వలన, ఆత్మజ్ఞానం కల్గునని ప్రసిద్ధి. ‘చంద్రమా మనసో జాతః’ అను వేద వాక్యం ప్రకారం మనసు యొక్క అధిదేవత చంద్రుడు. కృష్ణ పక్షంలో చంద్రుని కళలు దినదినం క్షీణించి చతుర్దశి నాడు మాత్రం ఒక్క కళే ఉంటుంది. మనసులో చేరిన 16 మాలిన్యాలలో ఒకటే మిగిలి ఉంటుంది. దీని నొక్కదానిని దూరం చేసుకోవడానికి ఆ రోజు శివపూజ, శివచింతన, శివ నామస్మరణ, సంకీర్తన అవసరం. ఆ రోజంతయూ దైవచింతనలో గడపాలి. శివపూజ - చింతన - సంకీర్తన, రుద్రాభిషేకాలతో రాత్రి అంతయూ జాగరణ చేయాలి. లింగమునకు బిల్వార్చన ప్రముఖమైనది. మూడు దళములతో కూడిన బిల్వపత్రమును ఏకత్వానికి ప్రతీకగా శివునికి అర్పించాలి. ‘ఏకబిల్వం శివార్పణం’ ‘అభిషేక ప్రియశ్శివః’ అని శాస్త్రం. మానవులలోని విషయ వాసనలను పదకొండింటిని ప్రసన్నం చేసుకొనుటకు రుద్రాభిషేకం చేయాలి. నీటిని ధారగా, మెల్లగా లింగంపై పోయాలి. జలంలో దివ్యత్వం ఉంటుంది. శివుడిని జలధారో ప్రియః అంటారు.
లింగోద్భవ వేళ బ్రహ్మ విష్ణువులు పశ్చాత్తాపం చెంది తలలు వంచి నిలుచున్నారు. పరమ శివలింగాన్ని ఆరాధిస్తూ చెరోవైపు నిలబడ్డారు. హర్యర్థమూర్తి ఆకృతిలో శివుడు దక్షిణార్థ భాగంలోనూ, విష్ణువు వామార్థ భాగంలోనూ కొలువుదీరి ఉంటారు. ఈ రూపం శైవ, వైష్ణవ మతాల మధ్య ఏర్పడిన వైషమ్యానికి విరుగుడుగా, మిత్రత్వాన్ని కూర్చే యత్నంగా, ఒకే దైవంగా ఈ రెండు ఆకృతుల విలీనత గోచరిస్తుంది.
శైవులే గాక, వైష్ణవులందరూ లింగానికి త్రిపుండ్రములను అలంకరించి ఆరాధిస్తూంటారు. ఈ రోజు శివ పంచాక్షరి, లింగాష్టకం పఠించి తన్మయులౌతారు. శివనామ స్మరణలో పునీతులౌతారు. ‘శివ’యను రెండక్షరాలు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. శివనామం సర్వ వశీకరణ మంత్రం. పరమ శివునికి ‘శివో - మహేశ్వరః - శంభుః - పినాకీ - శశిశేఖరః - వామదేవో - విరూపాక్షః - కపర్దీ - నీలలోహితః’ మొదలుగా గల 108 నామాలు వైభవాన్ని సంతరించుకున్నాయి. వీటితోనే శివారాధన జరుగుతుంది.
శివకేశవులకు అభేదం లేదు. ఆదిశంకరులు శివునిపై ఎన్నో స్తోత్రాలు రచించారు. జగద్గురువులైనారు. స్తుతించిన వారికి జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తాడు ఆ పినాకపాణి. శివనామ వైశిష్ట్యాన్ని మహాకవి ధూర్జటి ఒక పద్యంలో తెల్పుతూ, ఓ శివా నీ నామం వజ్రాయుధాన్ని పూవుగా, నిప్పును మంచుగా, అగాధ జలరాశిని నేలగా, శత్రువును మిత్రునిగా, విషం దివ్యాహారంగా అమృతంగా మారుననీ అంటూ చివరలో ‘శివా.. నీ నామము సర్వవశ్యకరవౌ శ్రీకాళహస్తీశ్వరా’ అని వర్ణించి తరించాడు. తరింపచేశాడు.
శివభక్తులెందరో భక్తి ప్రపత్తులతో శివలింగమునర్చించి తమ జీవితాలను ధ్యనం గావించుకొని శివైక్యము చెందినారు. శివానుగ్రహంతో ఎందరో ముక్తులైనారు.
ఈ పరమ శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా జగత్ ప్రసిద్ధమై ఆరాధించబడుచున్నాయి. ఈ లింగాలు బ్రహ్మమురారి సురార్చిత లింగములనీ, నిర్మలమై భాసించేవనీ, జన్మజ దుఃఖ వినాశకములనీ లింగాష్టకం వర్ణించినది. ఓంకారంతో కూడి నమశ్శివాయ అను పంచాక్షరి స్తోత్రం పావనమై పలురకాలుగా స్తోత్రం చేయబడుతుంది. శివ పంచాక్షరిగా సకల జగతికీ తొలి ప్రార్థనగా విన్పించబడుతుంది. అదే ఓం నమశ్శివాయ. అక్షరాభ్యాస వేళ పలకపై ‘ఓం నమశ్శివాయ’ యని వ్రాస్తారు.
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం - ఆరాధనలు జనులలోని కల్మషాలను దూరం చేస్తాయి. భారతదేశంలో పలు రాష్ట్రాలలో ఈ జ్యోతిర్లింగాలు మహిమోపేతమై అలరారుచున్నాయి. మొదటిది సౌరాష్ట్రంలోని సోమనాథ, శ్రీశైలంలో మల్లికార్జున, ఉజ్జయినిలో మహాకాళేశ్వర - ఓంకారంలో పరమేశ్వర - కేదారంలో హిమాలయ - శ్రీశైలంలో మల్లికార్జునిగా, ఢాకిన్యాంలో భీమశంకరునిగా - రామేశ్వరంలో సేతుబంధేతునిగా, దారుకా వనంలో నాగేశ్వరునిగా - వారణాసిలో విశే్వశ్వరునిగా - గౌతమీతటిలో నిత్య్రంబకేశ్వరునిగా - ఘృష్ణేశంచ - శివాలయేగా వెలసి ఆరాధింపబడుచున్నాడు పరమేశ్వరుడు. శివ మహా
పురాణంలో లింగవిభూతులెన్నో వర్ణింపబడినాయి.
శివారాధకులు చేసే పూజలకు పార్థివ లింగ పూజ శ్రేష్టమైనది. సాధకులు వైశాఖంలో వజ్రలింగాన్ని, శ్రావణంలో ఇంద్రనీల లింగాన్ని, జ్యేష్ఠంలో మరకత లింగాన్ని, ఆషాఢంలో వౌక్తిక లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగ లింగాన్ని, ఆశ్వయుజంలో గోమేధిక, కార్తీకంలో విద్రుమ లింగాన్నీ, మార్గశిరంలో వైఢూర్య లింగాన్ని, మాఘంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణంలో చంద్రకాంత లింగాన్నీ సేవించాలని శివపురాణం చెబుతోంది. ఇంకనూ చల అచల పార్థివ మృత్తిక రస లింగాల ఆరాధన శ్రేష్ఠం.
శివాలయాలలో మూడు భాగాలుంటాయి. అడుగు భాగం బ్రహ్మ భాగం - మధ్యన విష్ణు భాగం ఉంటుంది. రెండు భాగాలు గలది పానవట్టము. లింగపీఠం. ముందుకొచ్చిన స్తంభాకార భాగం రుద్రభాగం. ఇదే పూజాభాగం. దీనిపై బ్రహ్మ సూత్రాలుగా గీతలుంటాయి. దీనినే పూజించాలి అని శాస్త్రం. దేవతలు పలు రకాల లింగాలనర్చించారు. ఉత్తమాంగాలు ధరించి తరించారు. మానవులు స్థూల లింగాలనారాధించాలి.
మహాశివరాత్రి పర్వదినం నాడు శివ ప్రతిష్ఠకూ, శివ కల్యాణానికీ శ్రేష్ఠమైన రోజు. ఆరుద్ర నక్షత్రం కూడిన చతుర్దశి నాడు శివ పంచాక్షరి జపం సత్ఫలితాన్నిస్తుంది. శివారాధనను మించిన పుణ్యం లేదు. శివమూర్తి తత్త్వం కన్నా లింగారాధనే శ్రేష్ఠమైనది. షోడశోపచారాలతో అర్చించి - నమక - చమక - రుద్ర - మహన్యాసములతో అభిషేకించి శివానుగ్రహం పొందాలి. ‘్భక్త్భాష్ట ఫలప్రదం శివలింగం’ బ్రహ్మ విష్ణువులకు శంకరుడు పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించి సాక్షాత్కరించిన రూపం లింగం. అహంకారం అంతరించిన రోజు శివరాత్రి. తనకూ లింగానికీ భేదం లేదని ఉపదేశించిన పవిత్రమైన రాత్రి శివరాత్రి. శివలింగం ప్రతిష్ఠ చేస్తే శివసమానులౌతారు. కైలాసంలో నివసిస్తారని శివుడే తెల్పుట కలియుగ వాసుల భక్తుల అదృష్టం.

-పి.వి.సీతారామమూర్తి, 94903 86015