ఈ వారం స్పెషల్
రైలు బండికీ ఆడదే ఆధారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కట్టుబాట్లు, దురాచారాల మధ్య నలిగిపోతున్న మహిళా లోకాన్ని చైతన్యపరిచి, సభ్య సమాజంలో పురుషులతోపాటు సమాన హక్కులు కల్పించేందుకు ఎందరో సంఘ సంస్కర్తలు దశాబ్దాల కిందట నడుం కట్టుకున్నారు. వారు ఇచ్చిన స్ఫూర్తితో స్ర్తిలు చట్టసభల వరకూ వెళ్లగలిగారు. లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం-అంటూ నాలుగు దశాబ్దాల కిందటే ఓ సినీకవి చెప్పిన మాటను నిజం చేస్తున్నారు నేటి మహిళలు. మగవారితో సమానంగా ఆస్తి హక్కును సంపాదించిన వీరు ఇప్పుడు వారికి ఏమాత్రం తీసిపోని విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకప్పుడు వంటింటి కుందేలనిపించుకున్న మహిళలు తాము వంటింట్లో గరిట తిప్పడమే కాదు, ఎంతటి కష్టతరమైన పనినైనా అవలీలగా చేసేస్తామని నిరూపిస్తున్నారు. విధి నిర్వహణలో మగవారికన్నా ఆడవారే నయం అనిపించుకుంటూ, అవార్డులు, రివార్డులు చేజిక్కించుకుంటున్నారు. సున్నితత్వం కలిగిన మహిళల్లో చాలా మంది నాజూకైన పనులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆడవాళ్లు ఎలాంటి కష్టతరమైన విధులు నిర్వర్తిస్తున్నారో తెలిస్తే- ఔరా..! అని ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.
మనం ఎక్కే రైలు సవ్యంగా నడుస్తోందంటే అందుకు కొద్దిమంది ఆడవాళ్లే కారణమన్న నిజం చాలా మందికి తెలియదు. భారతీయ రైల్వేలో 305 రైలు ఇంజన్లు సుమారు 120 మంది మహిళల కనుసన్నలలోనే నడస్తున్నాయంటే ఆశ్ఛర్యంగా లేదూ! ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, మారుతున్న టెక్నాలజీతో పరుగులు తీస్తూ, ఇంజన్లలో ఎటువంటి లోపం లేకుండా పట్టాలు ఎక్కిస్తున్నది మన తెలుగు మహిళలే కావడం మనకు గర్వకారణం కదూ! రైలు ఇంజన్‌లోని కీలక విభాగాల నిర్వహణ బాధ్యతను రైల్వే ఉన్నతాధికారులు మహిళలకే అప్పగించారు. ఆ విధులను వీరు సక్రమంగా నిర్వహించగలరా? అని ప్రశ్నిస్తే, చిత్తశుద్ధితో, నిర్ణీత సమయానికి ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేస్తున్నారని ఉన్నతాధికారులే ఒప్పుకున్నారంటే, వీరి పనితనం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
కష్టమైన పనిని ఇష్టంగా..
డీజిల్ లోకోషెడ్ భారతీయ రైల్వేలో అత్యంత కీలకమైన విభాగం. భారతీయ రైల్వేలోని 305 ఇంజన్‌లను ఈ లోకోషెడ్‌కు కేటాయించారు. 1956లో కేవలం 120 డీజిల్ లోకోల నిర్వహణ కోసం దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సంఖ్య 305కి చేరుకుంది. ఇక్కడ పనిచేయడం ఏ ఉద్యోగికైనా కష్టమే. ధ్వని, వాయు కాలుష్యంతో పాటు, రైలు ఇంజన్‌లోని భాగాలను బయటకు తీసి, ఓవర్ ఆయిలింగ్ చేసి, తిరిగి అమర్చడం అన్నది చాలా కష్టం. కొన్ని విడి భాగాలైతే, వందల కిలోల బరువుంటాయి. వీటిని అతి కష్టంమీద అటూ ఇటూ మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పని చేయలేక కొంతమంది ఉద్యోగులు వేరే విభాగాల్లోకి వెళ్లిపోయారు. కానీ ఈ బాధ్యతను మేం మోస్తామంటూ, మహిళలు ముందుకు వచ్చారు. ఈ లోకోషెడ్‌లో
డబ్ల్యుడిజి-4 జనరల్ మోటార్స్‌కు చెందిన టూ స్ట్రోక్ టెక్నాలజీతో రూపొందించిన ఇంజన్‌లు, ఆల్కో కంపెనీకి చెందిన ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌లతో కూడిన లోకోలు ఇక్కడికి వస్తుంటాయి. వచ్చిన ఇంజన్‌ను పూర్తిగా ఓవర్ ఆయిలింగ్ చేసి పంపించాల్సిన బాధ్యత ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులది. ముఖ్యంగా ఇంజన్‌లో కీలక విభాగాలైన సిలెండర్ హెడ్, సెంట్రిఫ్యూగల్స్ సపరేటర్స్, ఎయిర్ బ్రేక్ వాల్వ్స్, ఎలక్ట్రికల్ స్విచ్ గేర్, ఫ్లాష్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ సెన్సర్స్ పనితీరును తెలుసుకోవడం, వాటికి మరమ్మతులు చేయాల్సి వస్తే- ఆ బాధ్యతను కేవలం మహిళలకు అప్పగిస్తారు.
ఒక రైలు ఇంజన్‌లో నింపిన లూబ్రికెంట్స్‌లో వ్యర్థాలు చేరుతాయి. అటువంటి లూబ్రికెంట్‌ను శుద్ధి చేసి మళ్లీ ఇంజన్‌లో నింపాల్సిన బాధ్యత మహిళలది. అతి వేగంగా నడుస్తున్న రైలును అత్యవసర సమయాల్లో నిలపాలన్నా, రెడ్ సిగ్నల్‌కు ముందు ఆ రైలు కచ్చితంగా నిలవాలన్నా బ్రేక్‌లు ఎప్పుడూ సక్రమంగా పనిచేస్తుండాలి. అలాంటి బ్రేకుల్లో ఎటువంటి లోపం లేకుండా చూసే బాధ్యత ఇక్కడ పనిచేస్తున్న మహిళలదే. ప్రమాదం సంభవించి రైలు పట్టాలు తప్పితే, ఆ మార్గంలో వచ్చే రైళ్లకు ముందస్తు సమాచారం అందించే ఫ్లాష్‌లైట్ సిగ్నల్ సిస్టమ్ సరిగా పనిచేస్తోందో? లేదో? చూడాల్సిన బాధ్యత కూడా వీరిదే. లోకో క్యాబిన్‌లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేస్తోందో? లేదో? వీరు చూడాలి. ఒకసారి మెయింటెనెన్స్‌కు వచ్చిన ఇంజన్‌ను తిరిగి పట్టాలు ఎక్కడానికి అనువుగా ఉందని సర్ట్ఫికెట్ ఇచ్చే బాధ్యత కూడా మహిళలే తీసుకున్నారు. ఇలా లోకోషెడ్ నుంచి బయటకు వెళ్లిన ఇంజన్‌లలో కొన్ని 14 రోజులకు మరికొన్ని 30 రోజులకు తిరిగి షెడ్‌కు వస్తాయి. వీరు ఓకే చేసి పంపించిన ఇంజన్లకు మార్గమధ్యంలో ఏదైనా సమస్య తలెత్తి నిలిచిపోతే, దానికి ఈ మహిళలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పొరపాటు జరిగితే- శ్రీముఖాలు తీసుకునేందుకు కూడా వీరు సిద్ధపడి ఉండాలి. ఈ విషయంలో మహిళలకు కూడా ఎలాంటి వెసులుబాటు ఉండదు.
గ్యాంగ్ ఉమెన్
ఇక రైల్వే ట్రాక్ నిర్వహణ బాధ్యత కూడా ఇప్పుడు మహిళలే చూసుకుంటున్నారు. మైళ్ల దూరం కాలి నడకన నడిచి, పట్టాల స్థితిగతులను తెలుసుకుంటూ, కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చే పనిలో 192 మంది మహిళలు పనిచేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు వీరు పట్టాలు ఎక్కితే, ఎండావానలను లెక్క చేయకుండా సాయంత్రం ఐదు గంటల వరకూ ట్రాక్‌పై నడవాల్సిందే. ఇటీవల విశాఖ వచ్చిన రైల్వే జీఎం వీరిని ప్రత్యేకంగా అభినందించారు.
*
14 విభాగాల్లో పడతులు
భారతీయ రైల్వేలోని 14 విభాగాల్లో మహిళలు పనిచేస్తున్నారు. వాల్తేరు డివిజన్‌లో సుమారు 1,500 మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు.
స్టేషన్ మేనేజర్లు 11
డీజిల్ లోకోషెడ్ 120
గ్యాంగ్ ఉమెన్ 192
టెక్నికల్ అసిస్టెంట్‌లు 144
కానిస్టేబుళ్లు 27
హెల్పర్స్ 95
టెక్నికల్ ఇన్‌స్పెక్టర్లు 9
గూడ్స్ గార్డ్‌లు 2
సీనియర్ ఇంజనీర్లు 9
లోకో పైలెట్‌లు 23
సిగ్నల్ టెలికం ఆపరేటర్లు 8
స్టేషన్ సూపరింటెండెంట్‌లు 6
*
ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో తొలి మహిళా స్టేషన్ మాస్టర్
అరుణ.. ఈ పేరు వింటే ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో చిత్తశుద్ధి, ఆత్మస్థైర్యం, నిజాయితీ, అంకిత భావం, విధుల్లో అలుపెరగని మహిళ గుర్తుకు వస్తారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో తొలి మహిళా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అరుణ. మొట్టమొదట ఈమెకు స్టీల్ ప్లాంట్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఆ తరువాత మార్షలింగ్ యార్డుల్‌లలో పనిచేశారు. తరువాత విశాఖపట్నం డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. కొంతకాలం డీఆర్‌ఎం కార్యాలయంలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం స్టేషన్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. రైల్వేలో చేరిన కొత్తలో 10 రోజులు కూడా పనిచేయలేవని అందరూ అన్నారు. కానీ, ఇప్పటికి 19 ఏళ్ల సర్వీసు పూర్తి చేశాను. ఎవరిలోనైనా నైపుణ్యం ఉంటే ఎక్కడైనా పనిచేయగలరు. పనిచేసే సంస్థను ప్రతి ఉద్యోగి ప్రేమించాలి. బలహీనతలు లేని ఉద్యోగి ఎక్కడైనా పనిచేయగలడు. సునామీ వచ్చిన సమయంలో అరుణకు ఆరు సంవత్సరాల బిడ్డ ఉన్నాడు. పిల్లాడిని ఇంట్లో వదిలిపెట్టి, రైల్వే స్టేషన్‌కు పరుగులు తీశాను. ఆందోళనతో అటూ, ఇటూ పరుగులు తీస్తున్న ప్రయాణికులకు ధైర్యం చెప్పి, వచ్చిన రైళ్లలో వారిని ఎక్కించి సురక్షితంగా పంపించాను. ఆనాడు ఆమె చూపిన చొరవ అధికారుల దృష్టిని ఆకర్షించింది. విధి నిర్వహణలో అధికారులకు ఎప్పుడూ తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. అలాగే, అధికారులు చెప్పిన పని చేయలేమన్న నెగిటివ్ సంకేతాలు ఇవ్వకూడదు. అప్పుడే ఉద్యోగి ఎదుగుతాడు... అని అరుణ అంటారు.
*
కష్టపడితేనే గుర్తింపు..
ప్రయాణీకు లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వేలో పనిచేయడం గర్వంగా ఉంది. ఇక్కడ కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది. అందుకు నేనే నిదర్శనం. రైల్వేలో కలాసీగా చేరిన నేను టెక్నీషియన్‌గా ఎదగడానికి ఉన్నతాధికారుల గుర్తింపే కారణం. నాకు ఇద్దరు పిల్లలు. వారి ఆలనా పాలనా చూసుకుని లోకో షెడ్‌కు వస్తాను. ఇక్కడికి వచ్చిన తరుపాత పిల్లలపై ధ్యాస ఉండదు. విధులపైనే దృష్టిపెడతాను. సెంట్రల్ ఫ్యూగల్ సెపరేటర్ విభాగంలో పనిచేస్తున్న నేను నాకు ఇచ్చిన పనిని పూర్తిస్థాయిలో పూర్తి చేసిన తరువాతే బయటకు వస్తాను.
-ఎస్.కళావతి
*
సాంకేతికత అందిపుచ్చుకుంటూ..
ఐటీఐ పాసైన నాకు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజి ద్వారా రైల్వే ఉద్యోగానికి సంబంధించి సమాచారం వచ్చింది. విశాఖపట్నంలోనే కలాసీగా చేరాను. ఆ తరువాత టెక్నీషియన్-2గా పనిచేశాను. 2013లో ఎస్‌ఎస్‌ఈగా ప్రమోట్ అయ్యాను. సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతోంది. దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్ విభాగంలో పనిచేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజన్‌కు కావల్సిన పవర్ కచ్చితంగా ఉండడానికి ఎలక్ట్రో మైక్రో ప్రోసెసర్‌ను అడాప్ట్ చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నాం.
-ఆర్.పార్వతి
*
వెరైటీగా ఉంటుందని
నేను బిఎస్సీ బీఈడీ చదివాను. మా ఫ్యామిలో అందరూ టీచర్లే! అందరిలాగా టీచర్ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. వెరైటీగా ఉంటుందని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్ష రాశాను. సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగం సవాలు వంటిది. రాత్రి వేళల్లో కూడా రైళ్లలో ఒంటరిగా రైళ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వేలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను.
-గాయత్రి
*
అంకిత భావానికి
వచ్చిన అవార్డులు
విశాఖ రైల్వే స్టేషన్‌లో 10 మంది మహిళా టిక్కెట్ కలెక్టర్లు పనిచేస్తున్నాం. రాణి లక్ష్మీబాయి గ్రూప్‌గా ఏర్పడి ఆత్మస్థైర్యం తో ముందుకు కదులుతున్నాం. రైళ్లలో టిక్కెట్ చెకింగ్‌కు వెళ్లినప్పుడు కొంతమంది మా పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ వారితో శాంతంగానే మాట్లాడతాం. టిక్కెట్ లేని ప్రయాణికుల పట్ల మాత్రం కఠినంగా ఉంటాం. భారీగా అపరాథ రుసుము వసూలు చేసినందుకు ఉత్తమ ఉద్యోగిగా సంస్థ నన్ను గుర్తించింది. తన సర్వీసులో ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నాను.
-ఆర్.వీ.లక్ష్మి
*
ఏ పనైనా చేయగలనన్న నమ్మకం..
నా భర్త ఉద్యోగం నాకు వచ్చింది. లోకోషెడ్‌లో పనిచేయడం చాలా కష్టమని తెలుసు. కానీ దేన్నైనా సాధించాలన్న ఆశయంతో రైల్వేలో చేరాను. సున్నితమైన పనులకే కాదు, శ్రమతో కూడిన పనులు కూడా చేయగలనన్న ధైర్యం నాకు ఉంది. అందుకే ఇక్కడ సక్సెస్ అయ్యాను.
-ఎం.శారద
*
వారి భద్రతే మా ధ్యేయం
నేను ఇంజన్‌లోని అతి ముఖ్యమైన ఎయిర్ బ్రేక్ విభాగంలో పనిచేస్తున్నాను. బ్రేక్ ఫెయిల్ అయితే ఏమవుతుందో అందరికీ తెలుసు. ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాం. ఆర్‌ఆర్‌బీ పరీక్షలో విజయం సాధించి, రైల్వేలో చేరిన నాకు ఉన్నతాధికారులు నిరంతరం సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు.
-నిర్మల
కుటుంబం కోసం.
రైల్వేలో సున్నితమైన ఉద్యోగాలు చాలా ఉన్నాయి. అందులో పనిచేస్తే అప్పుడప్పుడు బదిలీలు తప్పనిసరిగా ఉంటాయి. కుటుంబానికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో కష్టమైనా లోకోషెడ్‌లో పనిచేస్తున్నాను. లోకోస్ పెరగడం వలన అదనపు సిబ్బంది అవసరమైంది. ఇలాంటి సమయంలో మహిళా ఉద్యోగుల ఆవశ్యకత పెరిగింది. -త్రివేణి
*
ఎలా నడచుకోవాలో ఇక్కడ నేర్చుకున్నా..
మాది శ్రీకాకుళం. నా తండ్రి రైల్వేలో కలాసీగా పనిచేసేవారు. ఆ తరువాత ఆ ఉద్యోగం నాకు వచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వచ్చేసింది. కళాశాలలో నేను నేర్చుకున్నది కేవలం పాఠాలు మాత్రమే. లోకోషెడ్‌లోకి వచ్చాక, ఎవరితో ఎలా మెలగాలో నేర్చుకున్నాను. మగవాళ్లతో సమానంగా పని చేస్తున్నానన్న ఉత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. -ఎం.ఝాన్సీ
*
ఫొటోలు: అబ్దుల్ రఫీ